జ్యుడీషియల్‌ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత | No relief for K Kavitha as Delhi court sends her to judicial custody until April 9 | Sakshi
Sakshi News home page

జ్యుడీషియల్‌ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

Published Wed, Mar 27 2024 6:21 AM | Last Updated on Wed, Mar 27 2024 6:21 AM

No relief for K Kavitha as Delhi court sends her to judicial custody until April 9 - Sakshi

14 రోజుల కస్టడీకి ప్రత్యేక కోర్టు ఆదేశం

ఢిల్లీ మద్యం పాలసీ స్కాంలో కవితది కీలకపాత్ర: ఈడీ

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు లో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీంతో కవితను ఈడీ అధికా రులు తీహార్‌ జైలుకు తరలించారు. ఏప్రిల్‌ 9 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగనుంది. రెండోసారి ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు.

ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌ ద్వారా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కవిత కీలక కుట్రదారు, లబ్ధిదారు అని ఆరోపించారు. ఇప్పటివరకు ఈడీ జరిపిన విచారణ ఆధారంగా సౌత్‌ గ్రూప్‌ లాబీలో కీలకంగా వ్యవహరించిన ఆమె... ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లోని అగ్రనేతలతో కలసి మద్యం కుంభకోణానికి కుట్రపన్నారని తేలిందన్నారు. రూ. 100 కోట్ల లావాదేవీలు, మద్యం విధానంలో మార్పులు, అమల్లో కవిత కీలకపాత్ర పోషించారన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని.. ఆమెను బెయి ల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని తద్వారా విచారణకు ఆటంకం కల గొచ్చని వాదించారు.

కవిత పాత్రపై ఇంకా పరిశోధించా ల్సిన అవసరం ఉందని... నేరంలో చేతులు మారిన మిగి లిన సొమ్ము గురించిన ఆధారాలు వెలికితీస్తున్నట్లు వివ రించారు. నేరం ద్వారా వచ్చిన రాబడితో ప్రమేయం ఉన్న లేదా సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించనున్నా మని, ఆర్థిక నేరాలపై దర్యాప్తు సాధారణ నేరాల దర్యాప్తు కంటే క్లిష్టంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు 15 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోరుతున్నామని చెప్పారు.

కుమారుడికి పరీక్షలున్నాయి.. మధ్యంతర బెయిలివ్వండి: కవిత లాయర్‌
కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా వాదనలు వినిపిస్తూ బెయిల్‌ పిటిషన్‌ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. మంగళవారం నుంచి కవిత కుమారుడికి వార్షిక పరీక్షలు మొదలుకానున్నందున మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరారు. అలాగే ఈడీ కస్టడీలో నిర్వహించిన వైద్య పరీక్షల వివరా లను అందించాలన్నారు. దీనికి ఈడీ తరఫు న్యాయవాది అంగీకరించారు. అయితే బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయడానికి వారం సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. 

వాదనల అనంతరం కవితను 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి 
కావేరి బవేజా అదేశాలు ఇచ్చారు. ఏప్రిల్‌ 9న ఉదయం 11 గంటలకు కవితను తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారిస్తామని, ఈలోగా ఈడీ కౌంటర్‌ దాఖలు చేయాలన్నారు. కవితకు ఇంటి భోజనం, పరుపు, దుప్పటి, చెప్పులు, బట్టలు, పుస్తకాలు, కలం, కాగితాలు, అవసరమైన మందులను నిబంధనల మేరకు అనుమతించాలని తిహార్‌ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కవితకు మద్దతుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, భర్త అనిల్, కొందరు జాగృతి నేతలు కార్యకర్తలు రౌస్‌ అవెన్యూ కోర్టుకు వచ్చారు.

ఇది పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు: కవిత
కోర్టు హాల్లోకి వెళ్లే సమయంలో కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ‘ఇది తప్పుడు కేసు. మనీలాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు. తాత్కాలికంగా నన్ను జైలులో పెట్టొచ్చు కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఈ కేసు నిందితుల్లో ఒకరు ఇప్పటికే బీజేపీలో చేరితే మరొకరికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది. మరొకరు బీజేపీకి రూ. 50 కోట్ల నిధులు ఇచ్చారు. జై తెలంగాణ’ అని కవిత వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement