కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు | Delhi Court Extends Judicial Custody of BRS MLC Kavitha in Corruption Case | Sakshi
Sakshi News home page

కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Published Wed, Apr 24 2024 6:27 AM | Last Updated on Wed, Apr 24 2024 6:27 AM

Delhi Court Extends Judicial Custody of BRS MLC Kavitha in Corruption Case - Sakshi

ఈడీ కేసులో 14 రోజులు పొడిగించిన ప్రత్యేక కోర్టు 

కవితను అరెస్టు చేయబోమని చెప్పలేదన్న ఈడీ 

పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిది 

బెయిల్‌ పిటిషన్‌పై నేడు కొనసాగనున్న వాదనలు 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్‌ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది.

కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు.  

సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం..  
ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్‌ హొస్సేన్‌ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్‌ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.

ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్‌ ఆర్డర్‌ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు.   

అరుణ్‌ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు..  
ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్‌ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్‌ హొస్సేన్‌ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్‌ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్‌ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్‌ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్‌ చాట్‌లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement