‘ఆమ్‌ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర  | Kejriwal ED custody extended till April 1 | Sakshi
Sakshi News home page

‘ఆమ్‌ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర 

Published Fri, Mar 29 2024 3:13 AM | Last Updated on Fri, Mar 29 2024 3:13 AM

Kejriwal ED custody extended till April 1 - Sakshi

కోర్టులో హాజరుపరిచాక కేజ్రీవాల్‌ను బయటకు తీసుకొస్తున్న దృశ్యం

అప్రూవర్ల ప్రకటనలతో సీఎం స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా?   

నా పేరు చెప్పగానే మాగుంట రాఘవకు బెయిల్‌ ఇచ్చారు  

రూ.100 కోట్లు అంటున్నారు.. అది ఎక్కడా లేదు: కేజ్రీవాల్‌   

రౌజ్‌ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన వైనం  

కేజ్రీవాల్‌ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించిన ప్రత్యేక కోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దోపిడీ రాకెట్‌ నడుపుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అనే పొగతో కప్పేసి ఆప్‌ను అవినీతి పార్టీగా చిత్రీకరించి, అంతమొందించడం ఈడీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. తాను ఈడీ దర్యాప్తును వ్యతిరేకించడం లేదని అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను ఈడీ కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఏడు రోజుల కస్టడీ ముగియడంతో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు.

తొలుత ఈడీ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు, న్యాయవాది జొహెబ్‌హుస్సేన్‌ వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం కేసులో స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతరత్రా డేటాను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనానికి రాజు తెలియజేశారు. ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉందన్నారు. గోవా నుంచి సమన్లు అందుకొన్న కొందరితో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్నారు.

లిక్కర్‌ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని ఆరోపించారు. మరో ఏడు రోజులపాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. అనంతరం స్వయంగా వాదనలు వినిపించుకోవడానికి కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది గుప్తా కోరగా, న్యాయమూర్తి అనుమతించారు. కేజ్రీవాల్‌ తన వాదనలు హిందీలో కొనసాగించారు. 2022లో సీబీఐ కేసు నమోదైందని, తనని ఎవరూ అరెస్టు చేయలేదని, ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించడం గానీ లేదా ఆరోపణలు చేయడం గానీ జరగలేదని స్పష్టం చేశారు.  

ట్రాప్‌ చేయడమే ఈడీ అసలు ఉద్దేశం  
ఈ కేసులో సీబీఐ ఇప్పటిదాకా 31,000 పేజీలను కోర్టులో ఫైల్‌ చేసిందని, 294 మంది సాకు‡్ష్యలను విచారించిందని,  ఈడీ 162 మందిని విచారించిందని, 25,000 పేజీల రిపోర్టును ఫైల్‌ చేసిందని చెప్పారు. తన పేరు కేవలం 4 స్టేట్‌మెంట్లలోనే ఉందని తెలిపారు. తననెందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. అయితే, ఈ వివరాలన్నీ అఫిడవిట్‌ రూపంలో ఇస్తే రికార్డుల్లో చేరుస్తానని న్యాయమూర్తి సూచించారు. దీంతో, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్‌ అభ్యర్ధించారు. తాను ముఖ్యమంత్రినని, తన నివాసానికి మంత్రులు వస్తుంటారని, గుసగుసలాడుతుంటారని, దీని ఆధారంగా సిట్టింగ్‌ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు.

దీనిపై ఎస్‌.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా... ‘‘రాజు గారు, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను మాట్లాడనివ్వండి’’ అని కేజ్రీవాల్‌ కోరారు. ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వగలనని న్యాయమూర్తి చెప్పడంతో కేజ్రీవాల్‌ తన వాదనలు కొనసాగించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చే వరకూ అతడి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకుంటూనే ఉన్నారని, దీన్నిబట్టి తనని ట్రాప్‌ చేయడమే ఈడీ అసలు ఉద్దేశమని అర్థమవుతోందని చెప్పారు. కొంతమంది నిందితులు అప్రూవర్లుగా మారిన అనంతరం ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు.

మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్‌మెంట్లను ప్రస్తావిస్తూ... ఆయన ఐదు స్టేట్‌మెంట్లు ఇచ్చారని తెలియజేశారు. ఈడీ ఏం చెబితే అదే వాంగ్మూలంగా ఇచ్చారని అన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి స్టేట్‌మెంట్‌ మార్చుకోగానే ఆయన కుమారుడు మాగుంట రాఘవ బెయిలు పొందారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. స్టేట్‌మెంట్లలో రాఘవ చెప్పింది ఏదీ కూడా ఈడీ రికార్డుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈడీ కార్యాలయంలో లక్ష పేజీలు ఉన్నప్పటికీ, తనకు అనుకూలంగా ఉన్న ఒక్క అంశాన్ని కూడా రికార్డుల్లోకి తీసుకోలేదన్నారు. రూ.100 కోట్ల కుంభకోణం అంటున్నారని, అయితే ఆ సొమ్ము ఎక్కడా లేదని చెప్పారు. ఈడీ దర్యాప్తు తర్వాతే మద్యం కుంభకోణం అనేది మొదలైందని విమర్శించారు. ఈడీ అంతిమ లక్ష్యం ఆమ్‌ ఆద్మీ పార్టీని అంతమొందించడమేనని పేర్కొన్నారు. దీనిపై ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేయడం తగదన్నారు.  

నా వద్ద ఆధారాలున్నాయి  
బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ రాకెట్‌ నడుస్తోందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈడీ తనని ఎన్నిరోజులు రిమాండ్‌లో ఉంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఈడీపై పదేపదే అవే విమర్శలు చేయడం ద్వారా ప్రజల మద్దతు కూడకట్టుకోవాలని కేజ్రీవాల్‌ ప్రయతి్నస్తున్నారని ఎస్‌.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. ఈడీ కార్యాలయంలో తనకు అనుకూలంగా పేజీలు ఉన్నాయని కేజ్రీవాల్‌ ఎలా భావిస్తున్నారు? ఇదంతా ఊహాజనితం అని అన్నారు.

లంచం ద్వారా వచ్చిన సొమ్ములు గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్‌ వినియోగించారని తెలిపారు. ఈ సొమ్మంతా హవాలా రూపంలో సౌత్‌ గ్రూపు నుంచి వచ్చిందేనని, అదంతా ఒక చైన్‌ లాంటిదని, అందుకే దాని గురించి కేజ్రీవాల్‌ మాట్లాడడం లేదని తెలిపారు. బీజేపీకి శరత్‌చంద్రారెడ్డి విరాళం ఆరోపణలపై రాజు బదులిస్తూ... దీనికి, మద్యం కుంభకోణానికి సంబంధం లేదన్నారు. ఎందుకంటే ఢిల్లీలో మద్యం విధానాన్ని రూపొందించే హక్కు బీజేపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వెంటనే క్లీన్‌చిట్‌ రాదని, దర్యాప్తును ఎదుర్కోవాలని,సామాన్యుడికి, సీఎంకు  అరెస్టు విషయంలో తేడా ఉండదని రాజు పేర్కొన్నారు.

మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించడానికి కేజ్రీవాల్‌కు మరో వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. అనంతరం, రాజు వాదనలకు తాను స్పందించవచ్చా? అని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది గుప్తా కోరగా.. ఇప్పటివరకూ స్పందించారుగా ఇక అప్రస్తుతం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది అప్రస్తుతం, అసందర్భం అని ఎలా అంటారని గుప్తా ప్రశ్నించగా... గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరిస్తూ అందరి వాదనలు విన్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.  

4 రోజులపాటు ఈడీ కస్టడీకి 
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీని రౌజ్‌ అవెన్యూ కోర్టు మరో 4 రోజులపాటు పొడిగించింది. ఆయనను ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరుపర్చాలని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఈడీ అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్‌ను ఏడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. కేవలం 4 రోజలుపాటు కస్టడీకి అనుమతించారు. గత ఐదు రోజులపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించామని, తప్పించుకొనేలా ఆయన సమాధానాలిచ్చారని రిమాండ్‌ పిటిషన్‌లో ఈడీ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement