Coal scam
-
బొగ్గు స్కామ్‌లో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు బుధవారం(డిసెంబర్11) కీలక తీర్పిచ్చింది. యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలున్నాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.ఈ కేసులో విచారణ అనంతరం నవభారత్ పవర్ ఎండీ హరిశ్చంద్రప్రసాద్, నవభారత్ పవర్ చైర్మన్ త్రివిక్రమప్రసాద్, హరిశ్చంద్ర గుప్తా,సమారియా సహా మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.ఈ మేరకు 341 పేజీల తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించడం గమనార్హం. -
బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం మహిళా ఐఏఎస్ అధికారి రానూ సాహూను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్‌గా ఉన్న రానూ సాహూకు అదనపు జిల్లా జడ్జి అజయ్ సింగ్ రాజ్‌పుత్ మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. బొగ్గు కుంభకోణం కేసులో అరెస్టయిన రెండో ఐఏఎస్ అధికారి సాహు. రాయ్‌గఢ్, కోర్బా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ లాయర్ సౌరభ పాండే తెలిపారు. ఆమె రూ.5.52 కోట్ల విలువైన చరాస్తులను పోగేశారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను సాహూ లాయర్ ఖండించారు. ఆమెను కల్పితమైన కారణాలతోనే అధికారులు అరెస్ట్ చేశారన్నారు. -
సింగరేణిలో భారీ అవినీతి.. కేసీఆర్, కేటీఆర్‌లపై కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, యాదాద్రి: ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ దొంగలే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం యాదాద్రి భువనగిరిలో బొమ్మల రామారం మండలం రామలింగపల్లిలో జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇద్దరూ అదానీలకే దోచిపెడతారని, దానికి తానే సాక్ష్యమని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. సింగరేణిలో భారీ అవినీతిని త్వరలో బయటపెడతానన్న ఎంపీ కోమటిరెడ్డి.. సుప్రీం కోర్టుకు వెళ్లైనా సరే రూ.40 వేల కోట్ల ప్రజాధనం కాపాడతానని చెప్పుకొచ్చారు. సింగరేణిలో అవినీతిని ప్రజలకు వివరిస్తానని, ఆధారాలతో సహా బయటపెడతానని ఆయన అన్నారు. అహ్మదాబాద్ ను ఆదానీబాద్ గా మార్చుకోండని కేటీఆర్ అంటున్నారని, మరి కేటీఆర్ చేసేదేంటని కోమటిరెడ్డి నిలదీశారు. ఒడిషాలోని కోల్ మైన్ ను సింగరేణికి అప్పగిస్తే దాన్ని ఆదానీ, ప్రతిమ శ్రీనివాస రావుకు అప్పగించి స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని, పోరాటం చేస్తానని చెప్పారు. పార్లమెంట్‌లోనూ ఈ విషయమై గళం విప్పుతానని ఆయన అన్నారు. ‘‘యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కి వస్తే యాభై కోట్ల ప్రజా ధనం వృధా చేశారు. దళిత బంధు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల వరకే ఇస్తుంది. ఈ తొమ్మిదేళ్లలో ఊరికి తొమ్మిది ఇళ్లను కూడా నిర్మించలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదు’’ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. -
ఈడీ సమన్లు: దీదీ తాజా సవాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో ఆమె కేంద్రంపై మండిపడ్డారు. దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో టీఎంసీని వేలెత్తి చూపినందువల్ల ప్రయోజనం లేదని, అది కేంద్ర పరిధిలోనిదన్నారు. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్ విసిరారు. చదవండి : Coal scam: అభిషేక్, భార్య రుజీరాకు ఈడీ సమన్లు బొగ్గు స్కాం వ్యవహారంలో తమ పార్టీపై దాడిచేయడాన్ని ప్రశ్నించిన మమతా అది కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నారు. మరి బొగ్గు గనుల స్వాహాలో బీజేపీ మంత్రుల సంగతేంటి? బెంగాల్, అసన్సోల్ ప్రాంతంలోని కోల్ బెల్ట్‌ను దోచుకున్న బీజేపీ నాయకుల సంగతేంటని ప్రశ్నించారు. గుజరాత్ చర్రిత ఏంటో తెలుసు.. తమపై ఒక కేసు పెడితే, తాము మరిన్ని కేసులను వెలుగులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా దీదీ హెచ్చరించారు. దీనిపై తిరిగి ఎలా పోరాడాలో తమకు తెలుసని ఆమె పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా ఈడీని ఎందుకు వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు వంటి సహజ వనరుల హక్కుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మమతా గుర్తు చేశారు. -
బొగ్గు స్కాంలో సీబీఐ దూకుడు
సాక్షి, హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో సీబీఐ దూకుడు పెంచింది. తెలంగాణ కేంద్రంగా ఉన్న సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్ (ఎస్‌సీఎమ్‌ఎల్) నాగ్‌పూర్‌లో పాల్పడ్డ బొగ్గు కుంభకోణంపై సీబీఐ ఆధారాల సేకరణలో దూసుకుపోతోంది. తమ కాటన్ మిల్లుకు ఇంధన సరఫరా అన్న కారణంతో ప్రభుత్వం నుంచి పొందిన బొగ్గును బయట మార్కెట్లో విక్రయించారన్న ఆరోపణలపై సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు గత గురువారం సికింద్రాబాద్‌లోని సూర్యలక్ష్మీ కాటన్‌మిల్స్ ప్రధాన కార్యాలయం, నాగ్‌పూర్ రాంతెక్‌లోని శాఖ ఆఫీస్‌పై ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలి సిందే. సూర్యలక్ష్మీ కాటన్‌మిల్స్ చైర్మన్ ఎల్.ఎన్ అగర్వాల్, ఎండీ పరితోశ్ అగర్వాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో ఇందులో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు మాజీ ఎంపీల సమాచారం సేకరించిందని తెలిసింది. బహిరంగ మార్కెట్‌కు..: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన కాటన్‌మిల్లు, మరో పవర్ ప్లాంటుకు బొగ్గు కోసమని సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌తో ఒప్పందం చేసుకుంది. 2008లో 4,968 టన్నులకు ఒప్పందం కుదిరింది. అప్పుడెలాంటి అవకతవకలు లేవు. కానీ, 2014లో 1,30,000 టన్నులకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 1,13,000 టన్నుల సరఫరాలో అక్రమలు జరిగాయని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ అంతర్గత విచారణలో తేలింది. 2014–15లో 21,598.77, 2015–16లో 50,321.77 టన్నులు, 2016–17లో 58194.73 టన్నుల బొగ్గు వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ నుంచి సరఫరా అయింది. ఈ మొత్తం బొగ్గులో అధిక శాతాన్ని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ తన అవసరాలకు కాకుండా బయట మార్కెట్లో అక్రమంగా విక్రయించారన్నది వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ అంతర్గత విచారణతోపాటు, దానిపై నియమించిన ప్రత్యేక కమిటీ కూడా తేల్చింది. దీంతో వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని నివేదిక తేల్చినట్లు సమాచారం. ఆ సమయంలో వీరికి రాజకీయంగా పలువురు సహకరించారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఇద్దరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఉండటమే ఇందుకు కారణం. ఇద్దరూ ఉత్తర తెలంగాణ ఎంపీలే..! బొగ్గు కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు కేంద్రానికి నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ కుంభకోణంలో రాజకీయ జోక్యంపైనా సీబీఐ నజర్ పెట్టిందని తెలిసింది. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చైర్మన్, ఎండీతో కలిపి మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు మాజీ ఎంపీలు కావడం గమనార్హం. అందులో ఒకరు ఉమ్మడి కరీంనగర్, మరొకరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పారిశ్రామికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నవారు. వీరిలో ఒకరికి పలు పరిశ్రమలతోపాటు మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. మరొకరు రాజధానిలోని ఒక రేస్‌క్లబ్‌తోపాటు, ఓ బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారు. వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులపైనా..! వేల టన్నుల బొగ్గును సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్‌కు తరలించడంలో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి దాకా పలువురు ఉద్యోగులు సహకరించారని సీబీఐ గుర్తించింది. ఈ జాబితా చాంతాడంత ఉండటంతో ప్రస్తుతానికి గుర్తు తెలియని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులు అని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు 2014 నుంచి 2017 వరకు పలువురు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి సీబీఐ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ఎవరి ఆదేశాలు, ప్రలోభాలతో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులు ఇలా చేసారన్నది సీబీఐ ఆరా తీస్తోంది. -
బొగ్గు కుంభకోణంలో సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: నాగ్‌పూర్‌లో వెలుగుచూసిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి సికింద్రాబాద్‌లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఎస్డీ రోడ్‌లోని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ ప్రధాన కార్యాలయంలో, నాగ్‌పూర్‌లోని రాంతెక్ శాఖ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ (ఎస్‌సీఎమ్‌ఎల్)యార్న్, డెనిమ్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఎస్‌సీఎమ్‌ఎల్ నాగ్‌పూర్‌లోని రాంతెక్ కాటన్ మిల్లు కోసం 2008లో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. 2014 వరకు 4,968 టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ముగియగానే 2014 సెప్టెంబర్‌లో మరోసారి వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌తో 1,13,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా కోసం ఒప్పందం చేసుకుంది. సూర్యలక్ష్మి కంపెనీకి ఈ సమయంలో తాము సరఫరా చేసిన బొగ్గును బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ అంతర్గత విచారణలో తేలింది. ఈ మేరకు ఎస్‌సీఎమ్‌ఎల్ కంపెనీ, చైర్మన్ ఎల్.ఎన్ అగర్వాల్, ఎండీ పరితోష్ అగర్వాల్, గుర్తు తెలియని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఉద్యోగులపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలో తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎంపీ, ఆంధ్రాకు చెందిన ఓ మాజీ ఎంపీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. -
మధుకోడా ‘బొగ్గు’ దోషే!
న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, కేంద్ర మాజీ బొగ్గు గనుల శాఖ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాలను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదైంది. ఈ కేసులో మధు కోడా, గుప్తాలతో పాటు జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసు, విసు హస్తముందని సీబీఐ జడ్జి తీర్పుచెప్పారు. వీరికి శిక్ష విధించే విషయంలో నేడు వాదనలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అయిన గుప్తా ఈ విషయంలో నిజాలను అప్పటి ప్రధాని, బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన మన్మోహన్ సింగ్ వద్ద దాచిపెట్టారని సీబీఐ ఆరోపించింది. కేటాయింపుల విషయంలో మధు కోడా, బసు, మరో ఇద్దరు అధికారులు విసుల్‌కి కేటాయింపులు జరగడంలో సాయపడ్డారంది. -
‘కింది కోర్టు తీర్పుపై సుప్రీంకే రావాలి’
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల అక్రమాలపై నమోదైన కేసుల్లో ట్రయల్ కోర్టుల మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టుల మధ్యంతర ఉత్తర్వులపై ఏదైనా విజ్ఞప్తి లేదా స్టే కోసం సుప్రీంకోర్టుకే రావాలని జూలై 25, 2014న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పులు చేయబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ కేసులు భారీ అవినీతికి సంబంధించినవి, బొగ్గు గనుల కేటాయింపు విధానాల్ని కలుషితం చేశారని, అందువల్ల ఇతర సాధారణ కేసుల్లాగా కాకుండా ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరముందని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని జస్టిస్ జోసఫ్ కురియన్, జస్టిస్ కేకే సిక్రీల త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అక్రమాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అప్పటి సీబీఐ డైరక్టర్ రాజీపడినట్లు ప్రాథమికంగా తేలిందని, అందువల్ల ఆయన ప్రవర్తనపై కూడా విచారణకు ఆదేశించామని సుప్రీంకోర్టు తెలిపింది. -
బొగ్గు స్కాం: మాజీ అధికారికి రెండేళ్ల జైలు
-
బొగ్గు స్కాం: మాజీ ఉన్నతాధికారికి రెండేళ్ల జైలు
బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కాంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ శిక్ష విధించినా, వెంటనే బెయిల్ మంజూరు చేసింది. కేఎస్ క్రోఫా, కేసీ సమారియా అనే ఇద్దరు అధికారులకు లక్ష రూపాయల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరుచేశారు. మధ్యప్రదేశ్‌లోని తెస్గోరా బి/ రుద్రపురి బొగ్గు క్షేత్రాలను కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (కేఎస్ఎస్పీఎల్)కు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. 2005 డిసెంబర్ 31 నుంచి 2008 నవంబర్ వరకు బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న హెచ్‌సీ గుప్తా, నాటి జాయింట్ సెక్రటరీ కేఎస్ క్రోఫా, డైరెక్టర్ కేసీ సమారియా ముగ్గురూ నేరం చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. వీళ్లతో పాటు కేఎస్ఎస్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కమార్ అహ్లువాలియా కూడా నేరం చేసినట్లు తెలిపింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్టర్డ్ అకౌంటెంటు అమిత్ గోయల్ మీద మాత్రం ఆరోపణలు రుజువు కాలేదు. ఈ కేసులో 2012 అక్టోబర్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సీబీఐ.. 2014 మార్చి 27న క్లోజర్ రిపోర్టు దాఖలుచేసింది. అయితే దాన్ని కోర్టు తిరస్కరించి, గుప్తా, ఇతరులను నిందితులుగా విచారణకు పిలిచింది. సుదీర్ఘ విచారణ అనంతరం గుప్తా, మరో ఇద్దరు అధికారులకు రెండేసి సంవత్సరాల జైలుశిక్ష విధించింది. -
సీబీఐ మాజీ చీఫ్‌కు సీబీఐ షాక్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని సీబీఐ విచారించనుండటం, ఆయనపై కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. కొందరు నిందితులను కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు బొగ్గు కుంభకోణం కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సీబీఐ.. రంజిత్‌పై కేసు నమోదు చేసింది. -
సీబీఐ చరిత్రలో తొలిసారిగా..
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు విచారణలో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు సీబీఐని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని, సీబీఐ చీఫ్ విచారించనుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రంజిత్‌ను విచారించే బృందానికి కొత్త సీబీఐ చీఫ్ అలోక్ వర్మ ఇంచార్జీగా వ్యవహరిస్తారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ గతంలో నివేదిక సమర్పించింది. -
నివేదిక ఇలాగేనా?
బొగ్గు స్కాంలో సీబీఐపై ప్రత్యేక న్యాయస్థానం ఆగ్రహం న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల కుంభ కోణానికి సంబంధించిన కేసులో తుది నివేదికను సీబీఐ సరైన పద్ధతిలో సమర్పించక పోవడంపై ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ నవీన్‌జిందాల్ తదితరులు నిందితులుగా ఉన్న ఈ కేసుకు సంబంధించి సీబీఐపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి కోర్టులో నివేదికను ఎలా సమర్పించాలో తెలియదా? అని ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి భరత్ పరాష్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది నివేదికను తన ముందు దాఖలు చేసిన తీరును ఆయన తప్పుపట్టారు. నివేదికను సమర్పించిన సీబీఐ ఇన్స్పెక్టర్ను ఉద్దేశించి న్యాయమూర్తి.. జూనియర్ అధికారి మాదిరిగా వ్యవహరించొద్దని సూచించారు. సరైన ఫార్మాట్లో తుది నివేదికను సమర్పించనట్లయితే దానిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తొలుత ఈ నివేదికను సరైన ఫార్మాట్లో సమర్పించేందుకు న్యాయస్థానం సదరు అధికారికి మూడు రోజుల సమయం ఇచ్చింది. అయితే దానికి అతను నిస్సహాయత తెలియజేయడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. -
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్‌కు ఇక్కట్లు
-
కష్టాల్లో సీబీఐ మాజీ బాస్
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన బొగ్గు గనుల స్కాం వ్యవహారం సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ తన నివేదికలో పేర్కొంది. రంజిత్ సిన్హాను సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనను ఈ స్కాం నిందితులు కలిశారని దర్యాప్తు కమిటీ తేల్చింది. 2004-2009 మధ్యకాలంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతుండగా.. అప్పటి సీబీఐ బాస్ అయిన రంజిత్ సిన్హా అధికారిక నివాసానికి పలువురు నిందితులు వచ్చి కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆయన నివాసం సందర్శకుల రిజిస్టర్లో నిందితుల పేర్లు నమోదయ్యాయని వెలుగుచూడటంతో ఈ వివాదంపై దర్యాప్తునకు 2015లో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ నియమించింది. సందర్శకుల రిజిస్టర్ నిజమైనదేనని, అందులో ఎలాంటి తప్పులు లేవని విచారణ కమిటీ తేల్చింది. ఈ రిజిస్టర్ ప్రకారం బొగ్గు స్కాం నిందితులు రంజిత్ సిన్హాను కలిసినట్టు తెలుస్తోందని పేర్కొంది. అయితే, ఈ కమిటీ నివేదికపై మంగళవారం సుప్రీంకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కమిటీ నివేదిక ఆధారంగా రంజిత్ సిన్హాపై చర్యలు తీసుకోలేమని, ఆయన దర్యాప్తును ప్రభావితం చేసినట్టు కచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. అయితే, పిటిషనర్ మాత్రం కమిటీ నివేదికలోని వివరాలు సమగ్రంగా ఉన్నాయని, వీటి ఆధారంగా రంజిత్ సిన్హాను కేసును ముందుకు తీసుకెళ్లవచ్చునని కోర్టుకు నివేదించారు. -
అధికారంలో ఉన్నప్పుడు కాపు జాతి గుర్తుకు రాలేదా?
ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు(బృందావనం): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి, పళ్లంరాజు, రామచంద్రయ్యలకు అధికారంలో ఉన్నప్పుడువారి కాపుజాతి కోసం ఏం చేశారని ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పదవులు అనుభవించి, అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం ఎన్నడూ మాట్లాడని నాయకులు నేడు కాపులపై ఒలకబోస్తున్న ప్రేమ చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎందరో రాష్ట్రాన్ని పరిపాలించారని వారెవరూ కాపుల సంక్షేమం కోసం పాటుపడలేద న్నారు. అయితే కాపుల అభివృద్ధిని కాంక్షించి కమిషన్, కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. బొగ్గు కుంభకోణంలో చిక్కుకున్న దాసరి నారాయణరావు, కేంద్ర మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టిన చిరంజీవి, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన పళ్లంరాజు, సి.రామచంద్రయ్య, బొత్ససత్యనారాయణ, కాపుల అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న నాడు ఏమి చేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ముద్రగడ పద్మనాభం దీక్షను పావుగా వాడుకుంటూ ఆ నాయకులు కాపులపై కపట ప్రేమను చాటుతున్నారని ఆరోపించారు. తుని ఘటనలో 24 రైలు బోగీలను దహనం చేసిన వారిపై కేసులు పెడితే, వారిని విడిపించాలంటూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం సరికాదన్నారు. -
కోల్‌గేట్‌లో దాసరిపై అభియోగాలు
♦ మరో 14 మందిపైనా నమోదుకు సీబీఐ కోర్టు ఆదేశం ♦ ఈ అక్రమాలకు నవీన్ జిందాల్ సూత్రధారి అని వ్యాఖ్య న్యూఢిల్లీ: బొగ్గు స్కాంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా సహా 15 మందిపై నేరాభియోగాలు నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ గని కేటాయింపులో అవకతవకల కేసులో శుక్రవారం విచారణ కొనసాగింది. కేటాయింపులో అక్రమాలు జరిగాయని, జిందాల్, గగన్ ఇన్ఫ్రా ఎనర్జీ సంస్థలకు మేలు చేసేలా మాజీ సీఎం కోడా వ్యవహరించారని కోర్టుకు సీబీఐ విన్నవించింది. ఇరు వర్గాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. బ్లాకు కేటాయింపు మెరిట్ ప్రకారమే జరిగిందని, సీబీఐ ఆరోపణలన్నీ వాస్తవ దూరమని దాసరి, జిందాల్, కోడా న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న జడ్జి భరత్ పరాశర్.. ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా ఈ అవకతవకల వ్యవహారంలో నవీన్ జిందాల్ సూత్రధారి అని తేల్చారు. అప్పటి కేంద్ర మంత్రి దాసరికి రూ.2కోట్లు ఇచ్చినవిషయాన్ని కప్పి పుచ్చేందుకు జిందాల్ కంపెనీలను అడ్డుపెట్టుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో అంతిమంగా ప్రయోజనం పొందే అవకాశమున్నదీ ఆయనకేనన్నారు. దాసరి, జిందాల్ సహా 15 మంది నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 409, 420లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1సీ), 13(1డీ) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ... 136 పేజీల ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ కేసులో న్యూఢిల్లీ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ సురేశ్ సింఘాల్ అఫ్రూవర్‌గా మారుతూ.. తనకు క్షమాభిక్ష కోసం పిటిషన్ వేశారు. దీనిని ఇప్పటికే కోర్టు ఇప్పటికే వాంగ్మూలం కూడా నమోదు చేసింది. ఆ వాంగ్మూలాన్ని పరిశీలించి, పిటిషన్‌ను పరిష్కరించిన తర్వాత... ప్రధాన కేసులో విచారణ చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మిగతా 14 మంది నిందితులతోపాటు సీబీఐకి నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీలోగా అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. తమపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని జిందాల్ స్టీల్, విద్యుత్ లిమిటెడ్ తెలిపింది. -
కోల్ స్కాం: వారి పేర్లను చార్జీషీటులో చేర్చండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో అప్పటి బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ లతో పాటు మరో 13 మంది పేర్లను కుట్ర, మోసం తదితర నేరాల కింద చార్జీ షీట్లలో చేర్చాలని ప్రత్యేక కోర్టు సీబీఐకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్డి భరత్ పరాషార్ మాట్లాడుతూ అమర్ కొండ బొగ్గు క్షేత్రాన్ని జిందాల్ గ్రూప్, గగన్ ఇన్ ఫ్రా ఎనర్జీ లిమిటెడ్, సౌభాగ్య మీడియా లిమిటెడ్, న్యూఢిల్లీ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ లకు ఇవ్వడంలో జరిగిన అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కొడా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తాల పేర్లను కూడా చార్జీషీట్లో చేర్చాలని ఆదేశించారు. నిందితుల పేర్లపై చార్జీషీట్లను చేర్చేందుకు వాదనలు వినిపించిన సీబీఐ... మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కొడా జేఎస్పీఎల్, జీఎస్ఐపీఎల్ లకు బొగ్గు గనులను కేటాయించడంలో కీలక పాత్ర వహించారని ఆరోపించింది. దీనిపై ప్రతివాదనలు వినిపించిన నిందితుల తరఫు న్యాయవాది అవన్నీ నిరాధారమని, చార్జీ షీట్లలో పేర్లను నమోదు చేయడం కుట్రపూరితమని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో దోషిగా ఉన్న సురేశ్ సింఘాల్ ఏప్రిల్ 21న కోర్టును క్షమాభిక్ష కోరుతూ అప్రూవర్ గా మారారు. దీంతో ఏసీబీ, 14 మంది దోషులకు కోర్టు నోటీసులు జారీచేసింది. మేజిస్ర్టేట్ ఆయన వాంగ్మూలాన్ని స్వీకరించి సీల్డ్ కవర్ ప్రత్యేకకోర్టుకు అందజేశారు. మే 11న తదుపరి విచారణను వాయిదా వేస్తూ సింఘాల్ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. -
బొగ్గు కుంభకోణం వెనుక ఉన్న అధికారులను శిక్షించాలి
ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని : మేడిపల్లి ఓసీపీ నుంచి సీఎస్పీ-1కు తరలించే బొగ్గు దారిమళ్లించిన కుంభకోణం వెనుక ఉన్న అధికారులను శిక్షించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ బృందం సభ్యులు సీఎస్పీ-1ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఓసీపీలో వేమెంట్ అయిన తర్వాత సీఎస్పీ-1లో వేమెంట్ కాకుండానే అన్‌లోడింగ్‌కు పంపించారని తెలిపారు. సింగరేణిలో ఉన్న అవినీతి, అలసత్వం ఉపయోగించుకుని కొందరు అక్రమార్కులు కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులు కిందిస్థాయి కార్మికుల్ని బాధ్యుల్ని చేయకుండా కుంభకోణానికి కారణమైన అధికారులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఓసీపీ నుంచి హైవే మార్గంలో గంగానగర్ వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని, ఎన్ని డంప్‌యార్డ్‌లు ఉంటే అంత మంది లారీ మొకద్దామ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ వద్ద వేసే స్టాంపులను ఎవరు తయారు చేశారనే విషయాన్ని అధికారులు తెలుపాలన్నారు. యూనియన్ గేట్మీటింగ్ పెడితే సెకన్లలో సమాచారం ఇచ్చే వారు ఈ కుంభకోణాన్ని ఎందుకు అరికట్టలేదో తెలుపాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన బొగ్గు కుంభకోణాలపై తీసుకున్న చర్యలను వివరించాలని, ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని సీఎండీని కోరారు. కార్యక్రమంలో ఆర్జీ-1 అధ్యక్ష, కార్యదర్శులు టి.నరహరిరావు, మెండె శ్రీనివాస్, యు.కనకయ్య, పానుగంటి కష్ణ, సురేందర్, జి.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ కుంభకోణంలో తొలి తీర్పు
న్యూఢిల్లీ ఎట్టకేలకు బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తొలి తీర్పు వెలువరించింది. నకిలీ ధృవ పత్రాలు సమర్పించి బొగ్గు గనులు దక్కించుకున్న జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఇద్దరు డైరెక్టర్లకు శిక్షలను ఖరారు చేస్తూ సీబీఐ జడ్జ్ భరత్ పరాశర్ తీర్పును వెలువరించారు. కోల్ మైనింగ్ అనుమతి కోసం జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తా లు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసగించారన్న ఆరోపణలను కోర్టు సమర్ధించింది. ఈ నేపథ్యంలో వారికి కోర్టునాలుగేళ్ల జైలుశిక్షతోపాటు ,రూ .5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతోపాటుగా కంపెనీ 25 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. గత నెలలు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇద్దరిని దోషులుగా నిర్దారించిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని గత వారం పోలీసు అధికారులను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇరువురు ఇస్సాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు నేర పూరిత కుట్ర, మోసానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది.. గత యేడాది మార్చి 21న వివిధ సెక్షన్ల కింద సీబీఐ అధికారులు వీరిపై కేసు నమోదు చేయగా కోర్టు విచారణ జరిపి ఇవాళ తీర్పు వెలువరించింది. -
బొగ్గు స్కాంలో తొలి తీర్పు
జేఐపీఎల్, ఆ సంస్థ ఇద్దరు డెరైక్టర్లను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు ♦ నేరపూరిత ఉద్దేశంతో భారత ప్రభుత్వాన్ని మోసం చేశారని స్పష్టీకరణ ♦ ఈ నెల 31న శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు న్యూఢిల్లీ: ఒకరకంగా యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైన బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు వెలువడింది. మోసపూరితంగా, నేరపూరిత కుట్రతో, అక్రమంగా బొగ్గు క్షేత్రం కేటాయింపును పొందారని జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్(జేఐపీఎల్) సంస్థను, ఆ సంస్థ డెరైక్టర్లు ఆర్సీ రుంగ్తా, ఆర్ఎస్ రుంగ్తాలను సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. తీర్పు వెలువరించే సమయంలో కోర్టుహాల్లోనే ఉన్న దోషులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు వినేందుకు జడ్జి భరత్ పరాశర్ విచారణను మార్చి 31కి వాయిదా వేశారు. జార్ఖండ్‌లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను పొందేందుకు జేఐపీఎల్, ఆ సంస్థ డెరైక్టర్లు భారత ప్రభుత్వాన్ని మోసం చేసినట్లుగా రుజువైందని ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన 132 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 420 సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ఫోర్జరీ ఆరోపణల సెక్షన్లను మాత్రం మినహాయించింది. ‘నిందితులు ఉద్దేశపూర్వకంగా, నేరపూరిత కుట్రతో తప్పుడు పత్రాలను.. సంస్థ అర్హతలు, సామర్ధ్యాలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి స్క్రీనింగ్ కమిటీని, బొగ్గుమంత్రిత్వ శాఖను తద్వారా భారత ప్రభుత్వాన్ని మోసం చేశారు. తప్పు అని తెలిసీ, నిజాలుగా ఆ వివరాలను స్క్రీనింగ్ కమిటీ ముందుంచారు’ అని కోర్టు తేల్చిచెప్పింది. ‘నిందితులు తమ ముందుంచిన సమాచారాన్ని వాస్తవమని నమ్మడం వల్ల జేఐపీఎల్‌కు బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలంటూ స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసు ఆధారంగా బొగ్గు శాఖ జార్ఖండ్‌లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను మరో మూడు సంస్థలతో పాటు జేఐపీఎల్‌కు కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టు నమ్ముతోంద’ని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాము సేకరించిన భూమికి సంబంధించిన వివరాలను కూడా నిందితులు సమయానుకూలంగా మార్చినట్లుగా తేలిందన్నారు. భూ సేకరణకు సంబంధించిన ఒప్పంద పత్రం కూడా నకిలీదేనని గట్టి అనుమానాలున్నాయన్నారు. పరిమితంగా లభ్యమయ్యే సహజ వనరైన బొగ్గు విలువను దృష్టిలో పెట్టుకుని.. నిందితులు తమ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన బొగ్గును ఎక్కువగా చూపారన్నారు. తమ దరఖాస్తుకు అధిక ప్రాధాన్యం లభించేందుకు వారు అన్ని రకాలుగా ప్రయత్నించారన్నారు. ఈ కేసులో బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులను నిందితులుగా చేర్చకపోయినంత మాత్రాన, వీరి నేర తీవ్రత తగ్గదని స్పష్టం చేశారు. ఈ కేసు కాకుండా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ దర్యాప్తు చేసిన మరో 19 కేసులు, ఈడీ పరిథిలో ఉన్న మరో రెండు కేసులు ప్రస్తుతం ప్రత్యేక కోర్టు విచారణలో ఉన్నాయి. -
బొగ్గు కుంభకోణం కేసులో దోషుల గుర్తింపు..
ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సోమవారం డిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తొలి తీర్పు వెలువరించింది. ఈ కేసులో జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్(జేఐపీఎల్), ఆ సంస్థ ఇద్దరు డైరెక్టర్లు ఆర్ఎస్ రంగ్తా, ఆర్సీ రంగ్తాలను కోర్టు దోషులుగా తేల్చింది. తప్పుడు ద్రువపత్రాలను సమర్పించి వీరు విలువైన గనులను దక్కించుకున్నట్లు కోర్టు నిర్థారించింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వీరిని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మార్చి 31న వెలువరించనున్న తుది తీర్పులో వీరికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. -
మన్మోహన్ సింగ్‌కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఊరట లభించింది. మన్మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్‌ను నిందితుడిగా చేర్చరాదని, సమన్లు జారీ చేయబోమని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో మాజీ పీఎం ప్రమేయం ఉందని, ఆయనకు సమన్లు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సీబీఐ మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. కోల్ గేట్ స్కాంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్‌పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. -
మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాల్సిందే
బొగ్గు స్కామ్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి పిటిషన్ న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కామ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. స్కామ్‌కు సంబంధించిన ఓ కేసులో మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాలని అదే కేసులో నిందితుడైన కేంద్ర బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీలకు జార్ఖండ్‌లోని అమర్‌కొండా ముర్గాదంగల్ గనిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారన్న కేసులో మన్మోహన్‌ను అదనపు నిందితుడిగా చేర్చి సమన్లు జారీ చేయాలంటూ జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా వేసిన పిటిషన్‌ను దాసరి సమర్థించారు. అప్పటి బొగ్గు మంత్రి కూడా అయిన మన్మోహన్ రెండు పర్యాయాలు పరిశీలించాకే జిందాల్ సంస్థలకు బొగ్గు క్షేత్రాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు దాసరి న్యాయవాది సతీశ్ మనేషిండే.. జడ్జి భరత్ పరాశర్ ఎదుట వాదనలు వినిపించారు. కాగా, కోడా పిటిషన్‌ను తాము సమర్థించట్లేదని అదే సమయంలో దానికి వ్యతిరేకమూ కాదని నవీన్ జిందాల్ న్యాయవాది ఎస్.వి. రాజు చెప్పారు. అయితే కోడా పిటిషన్‌పై వెలువరించే తీర్పు ఈ కేసులో జిందాల్ డిశ్చార్జ్ పిటిషన్ హక్కు సహా ఇతర హక్కులకు విఘాతం కలిగించేలా ఉండరాదన్నారు. సహ నిందితుల్లో చాలా మంది ఇదే వాదన వినిపించారు. కాగా, ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వతంగా మినహాయింపు ఇవ్వాలన్న జిందాల్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కోడా పిటిషన్‌పై మంగళవారం వాదనలు వినిపిస్తానని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.ఎస్. చీమా కోర్టుకు తెలిపారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అక్రమంగా గనిని కేటాయించారని ఆరోపిస్తూ దాసరి, మధుకోడా, జిందాల్ సహా 15 మందిని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ వేసింది. అయితే మన్మోహన్తోపాటు అప్పటి ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ స్వరూప్, నాటి గనులు, భూగర్భశాఖ కార్యదర్శి జైశంకర్ తివారీలను ఈ కేసులో అదనపు నిందితులుగా చేర్చాలని మధుకోడా పిటిషన్ వేశారు. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోర్టు నిందితులకు సూచించింది. -
’మన్మోహనే జిందాల్‌కు బొగ్గు గనులను కేటాయించారు’
-
మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు
బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా బురద చల్లారు. జిందాల్ గ్రూప్ వాళ్లకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు విషయం సహా.. కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలూ నాటి ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలిసే జరిగాయని ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టులో వెల్లడించారు. ఒకవేళ అందులో ఏదైనా కుట్రకోణం ఉంటే.. అది ప్రధానమంత్రికి తెలియకుండా జరిగే అవకాశమే లేదన్నారు. అందువల్ల ఈ కేసులో అదనపు నిందితునిగా మన్మోహన్ సింగ్‌ను కోర్టుకు పిలిచి విచారించాలని మధుకోడా కోర్టును కోరారు. అయితే, ఈ విషయమై సీబీఐ గురువారం నాడు స్పందించనుంది. -
మధుకోడాపై అభియోగాలు నమోదుచేయండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిపై అభియోగాలు ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విచారణలో బొగ్గుశాఖ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసును కూడా చేర్చాలని స్పష్టం చేసింది. దేశంలో సంచనలం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో గతంలోనే మధుకోడాకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. -
నా ప్రమేయం లేదు.. అంతా ప్రధానే: దాసరి
-
నవీన్ జిందాల్ విదేశీ యానానికి అనుమతి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ విదేశీ పర్యటనకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు జూన్ 14 నుంచి 29 వరకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, నవీన్ జిందాల్, మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సహా పలువురి పేర్లను సీబీఐ చార్జిషీటులో చేర్చిన సంగతి తెలిసిందే. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో పెట్టారు. -
బొగ్గు కుంభకోణంలో దాసరికి బెయిల్
-
బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావుకు ముందస్తు బెయిల్ లభించింది. విచారణ పూర్తయినందున పాటియాల సీబీఐ ప్రత్యేక కోర్టు దాసరి సహా నిందితులందరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్, మధు కోడా హాజరయ్యారు. నిందితులు లక్ష రూపాయల పూచీకత్తు జమచేయడంతో పాటు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదంటూ న్యాయమూర్తి షరతు విధించారు. అలాగే సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించారు. -
బొగ్గుస్కాంలో రాఠీ స్టీల్‌పై కేసులు
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల అక్రమ కేటాయింపు కేసులో ఢిల్లీకి చెందిన ఆర్ఎస్పిఎల్ (రాఠి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ) పై , చీటింగ్ కుట్ర కేసులు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశించింది. స్పెషల్ జడ్జ్ భరత్ పరాశర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కంపెనీ, కంపెనీ సీఈవో ఉదిత్ రాఠి, ఎండీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తదితరుల మీద చీటింగ్, కుట్ర కేసు నమోదు అయ్యాయి. కేసు తదుపరి విచారణను జూన్ 2 కు వాయిదా పడింది. కాగా బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కామ్‌లో రాఠి స్టీల్ అండ్ పవర్ ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, జేఎల్డీ యూవత్మాల్, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్, జేఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్, వికాస్ మెటల్స్, గ్రేస్ ఇండస్ట్రీస్, గగన్ స్పాంజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జార్ఖండ్ ఇస్పాత్, గ్రీన్ ఇన్ఫ్రా, కవుల్ స్పాంజ్, పుష్ప్ స్టీల్, హిందాల్కో, బీఎల్ఏ ఇండస్ట్రీస్, కాస్ట్రాన్ టెక్నాలజీస్, కాస్ట్రాన్ మైనింగ్ కంపెనీలపై సీబీఐ 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. -
రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరి
హైదరాబాద్: రాజకీయాల్లోకి రావటమే జీవితంలో తాను చేసిన తప్పు అని కేంద్ర మాజీమంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు 71వ జన్మదినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి నారాయణరావు స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు ప్రదానం చేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ ‘ 50 సంవత్సరాలు తెల్లటి దుస్తులతో తెల్లగా జీవించాను. కానీ ఒక మచ్చ వేశారు. అది కూడా తారుతో వేశారు. ఒకరిని కాపాడేందుకు బొగ్గు స్కాంలో నన్ను ఉపయోగించుకొన్నారు. ఆ మచ్చలు తారుతో వేసినవైనా, బురదతో వేసినవైనా సరే తెల్లగా మళ్లీ మీ ముందు కన్పిస్తాను.’ అని దాసరి చెప్పారు. -
'నాపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటా'
హైదరాబాద్ : తనపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటానని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. ఎవరినో కాపాడుకునేందుకు తనను బలి చేశారని ఆయన సోమవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కుంభకోణానికి సంబంధించి అప్పట్లో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోల్గేట్ స్కామ్‌లో ఈ నెల 22న దాసరి కోర్టుకు హాజరు కానున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
బొగ్గు స్కాంలో దాసరికి కోర్టు సమన్లు
-
బొగ్గు స్కాంలో దాసరి, జిందాల్, మధుకోడాకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కోల్ గేట్ కుంభకోణానికి సంబంధించి బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా సహా 14 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. వారిని ఈ నెల 22వ తేదీన కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి భారత్ పరాశర్ ఆదేశించారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపునకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ... కేంద్ర మాజీ మంత్రి దాసరితో పాటు 15 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా పేర్కొంటూ ఏప్రిల్ 29న చార్జిషీటు దాఖలు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420, 409 కింద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
జిందాల్ పాస్ పోర్టు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ తీరుపట్ల స్పెషల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్ జిందాల్ పాస్ పోర్ట్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. బొగ్గు కుంభకోణంపై గురువారం విచారణ సందర్భంగా ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, విచారణ జరుగుతున్నందున పాస్ పోర్టును సీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో పాస్ పోర్టులను స్వాధీనం చేసుకొనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధానం అనుసరించకూడదని సీబీఐకి కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో అందరికీ ఒకే సూత్రం వర్తించేలా విధానాన్ని రూపొందించాలని సీబీఐ డైరెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు కుంభకోణంపై మే 6న అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రత్యేక కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. దీంతో జిందాల్‌తో సహా 14మందిపై దాఖలైన ఛార్జ్షీటుపై మే 6న కోర్టు వాదనలు విననుంది. -
దాసరిని వెంటాడుతున్న కోల్ స్కామ్
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును కోల్ స్కామ్ వెంటాడుతోంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో దాసరి నారాయణరావుపై సీబీఐ బుధవారం మరో ఛార్జిషీటు దాఖలు చేసింది. అమరకొండ ముర్గాదంగల్(జార్ఖండ్) బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో ఆయన పాటు 14 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాలపై అభియోగాలు మోపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో పెట్టారు. నేరపూరిత కుట్ర, ఛీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. ఈ ఛార్జిషీట్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం పరిశీలించనుంది. -
సుప్రీంకోర్టులో సీఎంకు ఊరట
బొగ్గుక్షేత్రాల కేటాయింపు కేసులో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను విచారణకు పిలిపించాలంటూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతోపాటు.. పిటిషనర్‌కు జస్టిస్ వి.గోపాల్ గౌడ, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. పిటిషన్ దాఖలుచేయడానికి అతడికి అర్హత లేదని, అందుకే కోర్టు జరిమానా విధించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ త్రిపాఠీ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్లను సీబీఐ విచారించింది గానీ, పట్నాయక్‌ను పిలిపించలేదని సాహు తన పిటిషన్లో తెలిపారు. ఆయన లేఖ రాయడం వల్లే కేంద్రం బిర్లాలకు చెందిన హిందాల్కో కంపెనీకి బొగ్గు క్షేత్రాలు కేటాయించిందని అన్నారు. ఈ వాదనను సుప్రీం కొట్టేసింది. -
బొగ్గు కేసులో మన్మోహన్‌కు ఊరట
- సబీఐ కోర్టు సమన్లపై సుప్రీంకోర్టు స్టే - నేరపూరిత కుట్ర ఎక్కడ ఉందని ప్రశ్నించిన సిబల్ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న కోర్టుకు హాజరవ్వాలంటూ మన్మోహన్‌సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు విచారణను కూడా నిలిపివేస్తూ జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అలాగే, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డీ)(3) చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలంటూ కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధానిగా ఉన్న సమయంలో ఒడిశాలోని తలబిర 2 బొగ్గు గనులను హిందాల్కో కంపెనీకి అక్రమంగా కేటాయించిన కేసులో మన్మోహన్ సింగ్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ ఈ మాజీ ప్రధానిని కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు విధించిన స్టే ఆ కేసులో ఇతర నిందితులు హిందాల్కో యజమాని కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖ్, హిందాల్కో సంస్థ, ఆ కంపెనీ ఉన్నతాధికారులు భట్టాచార్య, శుభేందు అమితాబ్‌లకు కూడా వర్తిస్తుంది. మాజీ ప్రధాని తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల సమయంలో మన్మో హన్‌సింగ్ కుమార్తెలు ఉపీందర్ సింగ్, దామన్ సింగ్ కోర్టుహాల్లోనే ఉన్నారు. హిందాల్కోకు బొగ్గు గనిని కేటాయించడం పరిపాలనాపరంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ)కి అన్వయించడాన్ని తప్పుబడుతూ.. మన్మోహన్‌సింగ్‌కు జారీ చేసిన సమన్ల న్యాయబద్ధతను తన వాదన సందర్భంగా సిబల్ ప్రశ్నించారు. సిబల్ వాదనలోని ముఖ్యాంశాలు.. - స్కీనింగ్ కమిటీ విధివిధానాలు చట్టబద్ధంగా లేవంటూ.. గతంలో జరిగిన అన్ని బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు అదే స్క్రీనింగ్ కమిటీ విధివిధానాలను పాటించలేదంటూ నా క్లయింట్ మన్మో హన్‌కు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇది హేతుబద్ధంగా లేదు. - సీఆర్పీసీ ప్రకారం నేర నిర్ధారణకు అవసరమైన వాటిలో.. నిందితులంతా కలసి నేరం చేయడానికి కుట్ర పన్ని ఉండాలి. ఈ కేసులో అలాంటిదేమీ జరగలేదు. తలబిర గనులను ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించడంలో నేరపూరిత కుట్ర కనిపిస్తోందా? ఒక బొగ్గుగనిని ప్రైవేటు కంపెనీకి కేటాయించడం నేరమవుతుందా? - సమాఖ్య స్ఫూర్తితో ఒడిశా ప్రభుత్వ వినతిని గౌరవిస్తూ ప్రధాని మన్మోహన్ బొగ్గుశాఖ మంత్రి హోదాలో ఆ నిర్ణయం తీసుకున్నారు. - చట్టపరంగా, సాక్ష్యాలను అర్థం చేసుకునే పరంగా మాజీ ప్రధాని మన్మోహన్‌కు సమన్లు జారీ చేయడం ట్రయల్ కోర్టు చేసిన దారుణమైన తప్పు. - నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 197 కింద పబ్లిక్ సర్వెంట్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ముందస్తు అనుమతి అవసరమన్న విషయాన్ని ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను విచారించాలంటూ 2014, డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు సీబీఐని ఆదేశించడం కూ డా తప్పు. ఒక న్యాయమూర్తి అలా ఆదేశించకూడదు. సీబీఐ అందించిన క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించవచ్చు కానీ దర్యా ప్తు తీరును జడ్జి నిర్ణయించకూడదు. -
మన్మోహన్‌కు సుప్రీంలో తాత్కాలిక ఊరట
-
మన్మోహన్‌కు సుప్రీంలో తాత్కాలిక ఊరట
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్‌కు... సీబీఐ జారీ చేసిన సమస్లపై న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ గోపాల గౌడ, నాగప్ప బెంచ్ ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లో సమాధానం ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. కాగా బొగ్గు స్కాం కేసులో నిందితుడిగా విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మన్మోహన్‌తో పాటు కుమారమంగళం బిర్లా, పీసీ పరేఖ్, డి.భట్టాచార్య, హిందాల్కో సంస్థకు ఊరట లభించింది. కాగా ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కోకు కేటాయించడంపై దాఖలైన కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా కోర్టు పేర్కొంటూ ఏప్రిల్ 8న నిందితుడిగా విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు ఇచ్చింది. తనకు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని మన్మోహన్ పిటిషన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
రెండు కోట్ల దాసరి ఆస్తులు జప్తు!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు సంబంధించిన రూ. రెండు కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూపీఏ హయాంలో 2004 నుంచి 2008 దాకా బొగ్గుశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి బొగ్గుగనుల కేటాయింపులో జిందాల్ గ్రూపునకు అనుచిత లబ్ధి చేకూర్చారని సీబీఐ కేసు పెట్టడం తెలిసిందే. ఈ సాయానికి ప్రతిగా ఆయనకు చెందిన సౌభాగ్య మీడియాలోకి జిందాల్ సంస్థ రూ. 2.25 కోట్లను మళ్లించిందనేది అభియోగం. అయితే సౌభాగ్య లో 2008-11 మధ్య మాత్రమే డెరైక్టర్‌గా ఉన్నానని, జిందాల్ నుంచి సొమ్ము 2011 తర్వాత వచ్చింది కాబట్టి అది అవినీతి కాదని దాసరి వాదన. ఈడీ అటాచ్ చేసిన వాటిలో రెండు వాహనాలు, 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, దాసరి ఇల్లు ఉన్నాయి. అటాచ్ చేసినప్పటికీ ఇవన్నీ దాసరి స్వాధీనంలోనే ఉంటాయి... అయితే వీటిపై ఎలాంటి క్రయవిక్రయాలకు అవకాశం ఉండదు. ఈడీ అటాచ్మెంట్ ఆర్డర్‌ను 180 రోజుల్లోగా పీఎంఎల్ఏ ప్రాధికార సంస్థ ముందు ఆయన సవాల్ చేయవచ్చు. -
మన్మోహన్ ఎలాంటి తప్పు చేయలేదు
-
మన్మోహన్ కు సోనియా మద్దతు!
-
మన్మోహన్ కు మద్దతుగా సోనియా ర్యాలీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో 83 ఏళ్ల మన్మోహన్ సింగ్ ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. -
మన్మోహన్సింగ్ నిందితుడే!
‘బొగ్గు’ కేసులో మాజీ ప్రధానికి సమన్లు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ‘బొగ్గు’ భూతం వెంటాడుతోంది. యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం వల్ల 83 ఏళ్ల మన్మోహన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్కామ్‌కు సంబంధించిన ఒక కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఒడిశాలోని తలబిర-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించడం ద్వారా కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి భారీ స్థాయిలో అనుచిత లబ్ధి చేకూరేలా మన్మోహన్ వ్యవహరించారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ మాజీ ప్రధానిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 120బీ(నేరపూరిత కుట్ర), 409(నేరపూరిత విశ్వాస ఘాతుకం) సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు నిబంధనల కింద శిక్షకు అవకాశమున్న నేరారోపణలు నమోదు చేశారు. ఇవి రుజువైతే పదేళ్ల పాటు భారత ప్రధానిగా ఉన్న మన్మోహన్‌కు యావజ్జీవ శిక్ష కూడా పడే అవకాశముంది. ఒక క్రిమినల్ కేసులో కోర్టు సమన్లు అందుకున్న రెండో ప్రధానిగా మన్మోహన్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అంతకుముందు, జేఎంఎం ఎంపీలకు ముడుపుల కేసు సహా మూడు వేర్వేరు కేసుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కోర్టు సమన్లు అందుకున్నారు. సమన్లు జారీ కావడంపై ఆవేదన వ్యక్తం చేసిన మన్మోహన్.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తన నిర్దోషిత్వం రుజువవుతుందన్న విశ్వాసముందని అన్నారు. పరేఖ్, కేఎం బిర్లాలకు కూడా: 2005లో తలబిర-2ను హిందాల్కోకు అక్రమంగా కేటాయించడానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి భరత్ పరాశర్ పై ఆదేశాలిచ్చారు. ఆ సమయంలో బొగ్గు శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న మన్మోహన్‌తో పాటు హిందాల్కో, ఆ కంపెనీ యజమాని కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, ఆ కంపెనీలోని ఇద్దరు ఉన్నతాధికారులు శుభేందు అమితాబ్, డీ భట్టాచార్యలను కూడా కోర్టు నిందితులుగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. వీరిపైనా ఐపీసీ 120బీ, 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసును మూసేయాలన్న సీబీఐ.. మొదట, తన ఎఫ్ఐఆర్లో హిందాల్కో, పరేఖ్, కేఎం బిర్లా, మరి కొందరి పేర్లను చేర్చిన సీబీఐ.. అనంతరం పలు కారణాలు చూపుతూ ఈ కేసును మూసేయాలని క్లోజర్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించింది. అయితే, ఆ అభ్యర్థనపై ఆగ్రహించిన కోర్టు ఈ కేసులో మన్మోహన్, అప్పటి పీఎంఓలోని ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాల్సిందిగా గత డిసెంబర్ 16న సీబీఐని ఆదేశించింది. తప్పేం చేయలేదు: హిందాల్కో కేఎం బిర్లా సహా తమ అధికారులెవరూ అక్రమంగా బొగ్గు క్షేత్రాన్ని పొందేందుకు ప్రయత్నించలేదని హిందాల్కో పేర్కొంది. సమన్లపై ఆశ్చర్యపోయానని పరేఖ్ అన్నారు. కోర్టు ఉత్తర్వులు న్యాయ ప్రక్రియలో భాగమేనని, మన్మోహన్ నిజాయితీ, నిష్పక్షపాతం, పారదర్శకతలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరని కాంగ్రెస్ పేర్కొంది. భూ సేకరణ బిల్లు నుంచి దృష్టిని మళ్లించేందుకు బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. కాంగ్రెస్ పాపాల మూల్యం మన్మోహన్ చెల్లిస్తున్నారని బీజేపీ పేర్కొంది. కోర్టు ఏమంది..! 73 పేజీల ఉత్తర్వుల్లో కోర్టు ఏమందంటే..‘హిందాల్కో, కేఎం బిర్లా, శుభేందు అమితాబ్, భట్టాచార్యలు మొదట ప్రారంభించిన ఈ నేరపూరిత కుట్రలో తరువాత నాటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్, నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ కూడా భాగస్వాములయ్యారనడానికి ప్రాథమిక సాక్ష్యాలున్నాయి. తలబిర 2ను హిందాల్కోకు కేటాయించేందుకు మన్మోహన్, పరేఖ్లు కలసికట్టుగా ప్రయత్నించారనడానికీ ఆధారాలున్నాయి. తనకున్న రాజ కీయ, అధికార మార్గాలతో తలబిరను అక్రమంగా పొందేం దుకు బిర్లా ప్రయత్నించారనేందుకు సాక్ష్యాలున్నాయి. అందువల్ల నిందితులపై ఐపీసీలోని 120బీ, 409, అవినీతి నిరోధక చట్టం కింద నేరారోపణలకు అనుమతిస్తున్నాం. 2జీ స్కామ్ విచారణలో మన్మోహన్ పాత్రపై సుప్రీంకోర్టు అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించాం. అయితే, ఈ కేసు విచారణలో వాటిని పరిగణనలోకి తీసుకోలేం.. తలబిరను హిందాల్కోకు కేటాయించేలా బొగ్గు శాఖకు పదేపదే లేఖలు రాస్తూ, ఫోన్లు చేస్తూ మన్మోహన్ఒత్తిడి తెచ్చారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘అనవసర అదనపు ఆసక్తి’ చూపింది. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ)కు తలబిర 2ను కేటాయించాలన్న స్క్రీనింగ్ కమిటీ సిఫారసుకు ఆమోదం తెలిపిన మన్మోహన్ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, నిబంధనలను ఉల్లంఘించి, కావాలనే హిందాల్కోను తెరపైకి తెచ్చారు. దీంతో ఎన్ఎల్సీ భారీగా నష్టపోయింది. హిందాల్కో భారీ లాభాలార్జించింది. అప్పుడు బొగ్గు శాఖనూ ఆయనే నిర్వహిస్తున్నందున ప్రధానిగా ప్రతీదాన్నీ అధ్యయనం చేయలేను అనడానికి ఆయనకవకాశం లేదు. మన్మోహన్ ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అయినా ఈ నేరం జరిగిన(2005) నాటికి ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో ఆయనపై విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో ఆయన పాత్ర ఉందనడానికి అవకాశముందని నమ్ముతున్నాం. దీనివల్ల దేశ నైతిక స్థైర్యంపై పడే ప్రభావం గురించి పూర్తి అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. -
మాజీ ప్రధానికి సమన్లు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పటియాల హౌజ్ ప్రత్యేక కోర్టు మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చుతూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న విచారణకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని గతంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్‌ను సీబీఐ ఇంతకు ముందే ప్రశ్నించింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్న సమయంలో హిండాల్కో సంస్థకు అక్రమంగా గనులు కేటాయించారని ఆరోపణలున్నాయి. ఈ కేటాయింపులకు సంబంధించి బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరేఖ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. -
బొగ్గు గనుల వేలంలో 176 బిడ్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు గనుల ఈ-వేలానికి కంపెనీలు పోటాపోటీగా బిడ్లు జారీచేస్తున్నాయి. తొలివిడతలో 23 గనులకు జరుగుతున్న వేలంలో మంగళవారం 176 ప్రాథమిక(టెక్నికల్) బిడ్లు దాఖలయ్యాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) మోనెట్ ఇస్పాత్ వంటి పలు సంస్థలు బిడ్లు వేసిన వాటిలో ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్-2 కింద ప్రైవేటు రంగానికి కేటాయించిన ఈ బ్లాక్‌ల వేలంలో స్పందన తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని... చాలావరకూ ప్రధాన కంపెనీలు పాల్గొంటున్నాయని బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయితే, బిడ్ల విలువ ఎంతనేది వెల్లడికాలేదు. బొగ్గు స్కామ్‌లో సుప్రీం కోర్టు మొత్తం 204 గనులను రద్దు చేయడం.. వీటిని వేలం ద్వారా తిరిగి కేటాయించేందుకు మోదీ సర్కారు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీవీకే పిటీషన్‌పై కేంద్రానికి నోటీసులు: కోల్ ఆర్డినెన్స్ 2014లో ‘పరిహారం’ నిబంధనల రూపకల్పన విధానాన్ని సవాలుచేస్తూ, జీవీకే పవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు ఈ పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. జీవీకే దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి తోకిసూడ్ నార్త్ కోల్ బ్లాక్ వేలం ఉంటుందని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. -
బొగ్గు కుంభకోణం కేసులో నివేదిక సమర్పణ
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో పాత్రకు సంబంధించి సీబీఐ తన దర్యాప్తు నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. దర్యాప్తు ద్వారా సేకరించిన వాంగ్మూల్మాన్ని మంగళవారం కోర్టుకు అందజేసింది. ఈ నివేదిను సీల్డ్ కవర్ కోర్టుకు అప్పగించిన సీబీఐ.. దర్యాప్తు పూర్తయ్యే వరకూ నివేదికను బహిర్గతం చేయరాదని కోరింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 19వ తేదీన జరుగనుంది. -
మన్మోహన్‌ను ప్రశ్నించిన సీబీఐ?
-
మన్మోహన్‌ను ప్రశ్నించిన సీబీఐ?
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల స్కాం కేసుకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను సీబీఐ ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు చెప్తున్నాయి. హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించి మన్మోహన్‌ను రెండు రోజుల కిందట ఆయన నివాసంలో ప్రశ్నించినట్లు ఆ వర్గాల సమాచారం. మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆయన పర్యవేక్షణలో ఉన్నపుడు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని హిందాల్కోకు కేటాయించటంపై ఆయనను విచారించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తలపై సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ప్రసాద్ను సంప్రదించగా ఆయన ధ్రువీకరించటానికి కానీ, తిరస్కరించటానికి కానీ నిరాకరించారు. మన్మోహన్సింగ్ సహాయకులు మాత్రం అటువంటిదేమీ లేదని తిరస్కరించారు. ఈ కేసులో వివిధ కోణాలపై అప్పటి బొగ్గు శాఖ మంత్రి (మన్మోహన్సింగ్)ను విచారించకుండా.. కేసులో తుది నివేదికను అంగీకరించబోమని ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ పేర్కొన్న విషయం తెలిసిందే. బొగ్గు స్కాంపై దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదికను సీబీఐ ఈ నెల 27వ తేదీన ప్రత్యేక కోర్టుకు సమర్పించాల్సి ఉంది. -
కోల్ స్కామ్‌లో కంపెనీ డైరెక్టర్లకు బెయిల్
ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు మూడు కంపెనీల డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్‌కు చెందిన మూడు కంపెనీల డైరెక్టర్లు ఇస్సాత్, ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తాలకు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. కాగా 2006-09 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. -
సీబీఐకి మరో మొట్టికాయ
బొగ్గు కుంభకోణాన్ని తవ్వి తవ్వి అలసిపోయిన సీబీఐకి మళ్లీ పనిబడింది. సుదీర్ఘకాలం దర్యాప్తు తతంగాన్ని సాగించి ఒడిశాలోని తలబిరా-2 బొగ్గుగని కేటాయింపు కేసులో ప్రత్యేక న్యాయస్థానానికి నాలుగునెలలనాడు ముగింపు నివేది క సమర్పించిన సీబీఐకి ఇది నిజంగా షాక్. తలబిరా గని కేటాయింపు విషయంలో ఎవరూ నేరానికి పాల్పడలేదని ముక్తాయిస్తూ ఇచ్చిన ఆ నివేదికలోని లొసుగులను ప్రత్యేక న్యాయస్థానం ఎత్తిచూపడమే కాక మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కూడా విచారించాలని ఆదేశాలివ్వాల్సివచ్చింది. దర్యాప్తు చేసినప్పుడే తెలియ వలసిన అనేక అంశాలు కనీసం నివేదిక రూపొందించినప్పుడైనా గుర్తుకొచ్చి ఉంటే సీబీఐకి ఈ భంగపాటు తప్పేది. ఎందుకంటే, సీబీఐ మామూలు సంస్థ కాదు. అది దేశంలోనే అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ. ఏదైనా వ్యవహారాన్ని దర్యాప్తు చేసేటపుడు తనకు తారసపడిన అంశాల్లోని సత్యాసత్యాలను అవగాహన చేసుకుని...అందులో మరింత లోతుగా, క్షుణ్ణంగా తెలుసుకోవలసినవి ఏమున్నాయో, అందుకు ఎవరె వరిని ప్రశ్నించాలో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత సీబీఐపై ఉంటుంది. ఆ నిర్ధార ణకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులను ప్రశ్నించవలసివస్తుంది. ఇవన్నీ సీబీఐకి తెలియనివేమీ కాదు. కానీ ఎవరూ అడగబోరన్న భరోసానో...అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చునన్న ధైర్యమో సీబీఐకి పుష్కలంగా ఉన్నట్టుంది. ఈ కేసులో కుమార మంగళం బిర్లా ప్రధానితో సమావేశం కావడంతోపాటు ఆయనకు రెండు లేఖలు రాశారని దర్యాప్తు సమయంలో వెల్లడైంది. పారిశ్రామికవేత్తలెవరైనా ప్రధానిని కలవడం, ఆయనకు ఉత్తరాలు రాయడం వింతేమీ కాదు. అయితే, ఆయన లేఖలు రాశాక పీఎంఓనుంచి హిండాల్కో ఫైలు విషయంలో బొగ్గు శాఖపై ఒత్తిళ్లు రావడంలోని మర్మమేమిటన్న సందేహం తలెత్తినప్పుడు దాన్ని తీర్చు కోవాల్సిన బాధ్యత సీబీఐపై ఉంటుంది. అందులో భాగంగా అవసరమనుకుంటే మన్మోహన్సింగ్ను ప్రశ్నించవలసి రావొచ్చు. అందువల్ల తన సచ్ఛీలతను నిరూ పించుకునే అవకాశం ఆయనకు ఇచ్చినట్టవుతుంది. ఆ దర్యాప్తులో తేలే అంశా ల్లోని తప్పొప్పుల్ని న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఇందుకు భిన్నంగా అసలు ఆ విష యం దర్యాప్తునకు అర్హమే కాదన్నట్టు వ్యవహరిస్తే సంస్థపై నీలినీడలు పడే అవ కాశం ఉండదా? ప్రధాని పదవిలో ఉన్నవారు ఇంతక్రితం ఏ స్కాంలోనూ దర్యాప్తు ను ఎదుర్కొనకపోయి ఉండొచ్చు. కానీ, బొగ్గు క్షేత్రాల కేటాయింపు సందర్భంలో ఆయన ఆ శాఖను చూశారు గనుక ఇది తప్పనిసరని సీబీఐ తనకుతానే నిర్ణయాని కొచ్చి ఉంటే బాగుండేది. చట్టం ముందు అందరూ సమానులేనంటుంది మన రాజ్యాంగం. కానీ సీబీఐ తీరు చూస్తుంటే కొందరు ‘ఎక్కువ సమానుల’న్న అభిప్రాయమేదో దానికి ఉన్నద నిపిస్తున్నది. లేనట్టయితే బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు చేస్తూ అదే సమయంలో ఆ మంత్రిత్వశాఖ వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రధాని కార్యాలయం(పీఎంఓ) జోలికెళ్లకపోవడంలోని ఆంతర్యం ఏమై ఉంటుంది? అలా గని పీఎంఓను అది పూర్తిగా వదిలేయలేదు. ఒకరిద్దరిని ప్రశ్నించింది. వారిని కూ డా లోతుగా అడగలేదు. బొగ్గు మంత్రిత్వశాఖ సహాయమంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావును సైతం ప్రశ్నించినవారికి పీఎంఓ అధికారులను అడగాలని ఎందుకు తోచలేదో అంతుబట్టదు. పీఎంఓ అధికారుల విషయంలోనే ఇంతగా మొహమాటపడినవారికి ఇక ప్రధానిగా ఆ మంత్రిత్వ శాఖను కూడా చూసిన మన్మోహన్‌ను ప్రశ్నించే సాహసం ఉంటుందని ఎవరూ అనుకోలేరు. సీబీఐ పనితీరు మొదటినుంచీ విమర్శలకు గురవుతోంది. అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలొచ్చిన పక్షంలో వారికి ఏదో రకంగా క్లీన్చిట్ ఇవ్వడానికి లేదా దర్యాప్తును నీరుగార్చడానికి తహతహలాడే సీబీఐ...వారి ప్రత్యర్థులను వేధించడంలో మాత్రం ఎక్కడలేని ఉత్సాహాన్నీ ప్రదర్శిస్తుందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఎన్నోసార్లు ఈ విషయంలో సీబీఐకి చీవాట్లు పెట్టడమే కాక, అది ‘పంజరంలో చిలుక’వలే తయారైందని వ్యాఖ్యానిం చింది. ఇలాంటి సందర్భాలు ఎన్ని ఎదురైనా ఆ సంస్థ తన పనితీరును మార్చు కోలేదు. బొగ్గు కుంభకోణం కేసు చరిత్రను తిరగదోడితే అడుగడుగునా దాన్ని దాచి పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు వెల్లడవుతాయి. 195 బొగ్గు క్షేత్రాల కేటాయింపులో లక్షా 86 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని 2012లో తొలిసారి కాగ్ వెల్లడించినప్పుడు ఇదంతా ఉత్తదేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఊహాజనిత గణాంకాలతో ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపించింది. తీరా ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదికలో కేవలం 60 బొగ్గు క్షేత్రాల కేటా యింపులు మాత్రమే సవ్యంగా ఉన్నాయని అంగీకరించింది. అలాగే ఉన్నట్టుండి కొన్ని కీలక ఫైళ్లు మాయమయ్యాయి. తాము ఎంత అడిగినా ఆ ఫైళ్లు లేవని చెబుతున్నారని సీబీఐ ఫిర్యాదు చేసినమీదట సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరిం చాల్సివచ్చింది. ఆ తర్వాతే ఫైళ్లన్నీ బయటికొచ్చాయి. ఇలా ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడలేదు. ఎప్పటికప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఇంతగా పర్యవేక్షిస్తున్న కేసు విషయంలోనే సీబీఐ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల దోషులను కాపాడటానికి అది ప్రయత్నిస్తు న్నదన్న అభిప్రాయం కలుగుతున్నది. సీబీఐ ఈ సంగతిని గ్రహిస్తున్నట్టుగానీ, తన వ్యవహారశైలిని సరిదిద్దుకున్నట్టుగానీ కనబడదు. ఇప్పుడు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పువల్ల మన్మోహన్‌ను ప్రశ్నించడంతోపాటు పీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులనుంచి కూడా కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టడం వీలవుతుంది. కుంభకోణం జరిగి దాదాపు పదేళ్లవుతుండగా, దర్యాప్తు ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్నది. ఇప్పటికైనా ఎలాంటి లోటుపాట్లకూ తావీయకుండా దీన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తే ప్రజలు సంతోషిస్తారు. -
మన్మోహన్ అమాయకుడు : రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమాయకుడని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో రేణుకాచౌదరి మాట్లాడుతూ... బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో కేటాయింపుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాగ్మూలం నమోదు చేయాలని ప్రత్యేక న్యాయస్థానం సీబీఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేణుకాచౌదరిపై విధంగా స్పందించారు. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిల్లాతోపాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ పాత్రపై దర్యాప్తు కొనసాగించాలని సూచించింది. జనవరి 27 నాటికి దర్యాప్తు పురోగతిపై నివేదిక అందజేయాలని ప్రత్యేక కోర్టు సీబీఐను ఆదేశించింది. -
బొగ్గు స్కామ్‌లో కోడాపై చార్జిషీట్
మరో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులపైనా.. న్యూఢిల్లీ: బోగ్గు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అధికారులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. కోల్‌కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి ఈ చార్జిషీట్ దాఖలైంది. కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఐదుగురిపైనా అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. వీరందరిపైనా నేరపూరిత కుట్ర, మోసం అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. డిసెంబర్ 22న ఈ చార్జిషీట్‌ను పరిశీలనలోకి తీసుకుంటామని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి భరత్ పరాసర్ స్పష్టం చేశారు. కాగా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి చార్జిషీట్లు, ముగింపు నివేదికలను సీబీఐ దాఖలు చేసేందుకు ఈ నెల 8న సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో సీబీఐ తాజా చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హాపై ఆరోపణల నేపథ్యంలో గతంలో చార్జిషీట్లు, ముగింపు నివేదికలు దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. -
‘బొగ్గు’లో దాసరిని ప్రశ్నించిన ఈడీ
మనీల్యాండరింగ్ కేసులో 6గంటలకుపైగా ప్రశ్నల వర్షం తనపై ఆరోపణలు నిరాధారమన్న దాసరి న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సోమవారం ఢిల్లీలో ప్రశ్నించింది. బొగ్గు స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఆరు గంటలకుపైగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో దాసరిని ఈడీ ప్రశ్నించడం ఇదే తొలిసారి. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ విచారణ అనంతరం దాసరి విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్థిక అవకతవకలకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, తన పాత్రపై అధికారులకు వివరించానని చెప్పారు. అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చానన్నారు. వాస్తవాలు చెప్పానని, విచారణలో అన్ని విధాలా సహకరిస్తానన్నారు. కాగా ఈడీ దర్యాప్తు సందర్భంగా దాసరి బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో బొగ్గు కేటాయింపులు, జిందాల్ గ్రూప్‌నకు బ్లాకుల కేటాయింపుపై ప్రశ్నించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారమే తన శాఖ కేటాయింపులు జరిపిందని, దీనికి సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రధాని కార్యాలయాని(పీఎంవో)కి పంపగా సంబంధిత అధికారులు ఆమోదం తెలిపారని దాసరి చెప్పారన్నాయి. కాగా, దాసరి వాంగ్మూలంపై మరింత స్పష్టత కోసం ఆయనను ఈ నెల 18న మరోసారి ప్రశ్నించనున్నట్టు ఈడీ పేర్కొంది. దాసరి ఆర్థిక వ్యవహారాలపై అదనపు పత్రాలు, ఆయన హయాంనాటి కీలక నిర్ణయాల పత్రాలతో హాజరు కావాలని ఈడీ ఆయనను ఆదేశించింది.దాసరి 2004-2006లో తొలిసారి, 2006-2008 వరకూ రెండోసారి బొగ్గు సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే జిందాల్ గ్రూప్‌కు చెందిన ఎన్డీ ఎగ్జిమ్ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలోకి రూ.2.25 కోట్లు వచ్చాయి. ఈ నిధులు మనీ లాండరింగ్ ద్వారా ప్రవేశించినట్టు ఈడీ భావిస్తోంది. ఈ ఏడాది మేలో దాసరితో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ, వ్యాపారవేత్త నవీన్ జిందాల్‌పై ఈడీ పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది. అయితే సదరు సంస్థకు తాను 2008-11 వరకూ డెరైక్టర్‌గా ఉన్నానని, ఆ తర్వాతే ఆ సంస్థలోకి నిధులు వచ్చాయని దాసరి ఈడీకి చెప్పినట్టు తెలిసింది. తీర్పుపై పునఃపరిశీలనకు సుప్రీం నిరాకరణ సుప్రీంకోర్టు 214 బ్లాకులను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని, తమను కక్షిదారులుగా చేరాలని కోరుతూ టాటా స్టీల్ తదితర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. -
నా పాత్ర ఏమీలేదు: దాసరి నారాయణరావు
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసుతో తనకు ఏమీ సంబంధంలేదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఆయనను ప్రశ్నించింది. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని దాసరి పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణంలో తన పాత్ర ఏమీలేదని ఆయన 9 పేజీల వాంగ్మూలం ఇచ్చారు. సిరి మీడియాలో తనకు ఎటువంటి షేర్లు లేవని తెలిపారు. ఈ నెల 18న దాసరిని మరోసారి ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించుకుంది. దాసరికి ఆరోగ్యం బాగోలేనందున మరోసారి విచారణకు పిలుస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. సిరి మీడియా డైరెక్టర్లను కూడా ఈడీ విచారించనుంది. ** -
దాసరి నారాయణరావును ప్రశ్నించిన ఈడీ
-
బొగ్గు స్కాం: దాసరిని ప్రశ్నించిన ఈడీ
బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. కొన్నాళ్ల పాటు దాసరి నారాయణరావు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దాంతో.. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో జరిగిన కుంభకోణాన్ని విచారిస్తున్న ఈడీ... తాజాగా ఆయనను ప్రశ్నించినట్లు పీటీఐ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. మరోవైపు బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ సీబీఐ దర్యాప్తు తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. కేసు దర్యాప్తులో సీబీఐ బాగా వెనకబడినట్లు సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2015 ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ కేసుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. -
పెద్ద గొప్ప పనులేమీ చేయలేదు: రంజిత్ సిన్హా
సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో తాను పెద్ద గొప్ప పనులేమీ చేయలేదని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. రెండేళ్ల పాటు దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధినేతగా ఉన్న ఆయన.. చివర్లో మాత్రం బొగ్గు స్కాం, 2జీ స్కాంల విషయంలో అపవాదు మూటగట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. మంగళవారంతో రంజిత్ సిన్హా పదవీకాలం కూడా ముగిసింది. ఏమీ చెప్పకుండానే తాను వెళ్లిపోతున్నానని, పెద్దగా గొప్ప పనులేమీ చేయలేదని ఆయన అన్నారు. మీరు ఏం కావాలనుకుంటే అది రాసుకొమ్మని కూడా విలేకరులతో అన్నారు. ఇప్పటికే అంతా తనమీద కావల్సినంత బురద జల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ మాజీ అధినేత వినోద్ రాయ్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌ల తరహాలో అనుభవాల సారంతో ఏదైనా పుస్తకం రాసే ఆలోచన ఉందా అని ప్రశ్నించినప్పుడు.. తాను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరినీ అనుసరించేది లేదన్నారు. రైల్వేబోర్డులో ఓ సభ్యుడిని, ప్రభుత్వ రంగ బ్యాంకు సీఎండీ ఒకరిని, సెన్సార్ బోర్డు సీఈవోను.. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న అనేకమంది లంచాల బాగోతాన్ని బయటపెట్టిన ఘనత రంజిత్ సిన్హాకు ఉంది. -
బొగ్గు కుంభకోణం...డిసెంబర్ 12కు వాయిదా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక కోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. కుంభకోణంలో కుమార మంగళం బిర్లా, ఇతరుల పాత్రపై విచారణ చేపట్టింది. అనంతరం సీబీఐ...హిందాల్కొ, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌కు సంబంధించిన కేసు డైరీని కోర్టుకు సమర్పించింది. విచారణకు డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఈ కుంభకోణంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, బొగ్గు శాఖ మంత్రిని ఎందుకు ప్రశ్నించ లేదని కోర్టు మంగళవారం సీబీఐను ప్రశ్నించింది. అందుకు సంబంధించిన కేసు వివరాలను సమర్పించాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు గురువారం సీబీఐ సమర్పించింది. -
'మన్మోహన్ సింగ్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?'
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. అప్పటి ప్రధానితో పాటు, బొగ్గుశాఖ మంత్రిని, ఎందుకు ప్రశ్నించలేదని ప్రత్యేక కోర్టు సీబీఐని సూటిగా ప్రశ్నించింది. కేసు వివరాలను సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అప్పటి బొగ్గు శాఖ మంత్రి వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నలపై స్పందించిన సీబీఐ పీఎంఓ అధికారులను ప్రశ్నించామని తెలిపింది. అయితే అప్పటి బొగ్గు శాఖ మంత్రిని ప్రశ్నించేందుకు అనుమతి రాలేదని వెల్లడించింది. దీనిపై స్పందించిన కోర్టు విచారణ డైరీని సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కాగా యూపీఏ హయాంలో బొగ్గు శాఖ మొదట్లో మన్మోహన్సింగ్ వద్ద ఉండేది. ఆ సమయంలోనే కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
‘నిందితులను కాపాడే చర్య!’
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కవుల్ స్పాంజ్ స్టీల్ సంస్థపై కేసును వుుగిస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు గందరగోళంగా ఉందని, మూసివేత నిర్ణయం సరికాదని పేర్కొంది. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి గుప్తాతో పాటు మరో ఐదుగురికి సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కమల్ సంస్థతో పాటు ఆ సంస్థ ఉద్యోగులు, పలువురు బొగ్గు శాఖ అధికారులపై పెట్టిన కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయించి కోర్టుకు నివేదిక అందజేసింది. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి భరత్ పరాశర్.. కేసు మూసివేత సరికాదంటూ నివేదికను తిరస్కరించారు. ఈ కేసులో నిందితులను కాపాడే తరహాలో సీబీఐ చర్యలు ఉన్నాయన్నారు. సరైన మానవ వనరులు లేని కారణంగా బొగ్గు శాఖ అధికారులు కమల్ దరఖాస్తుపై స్క్రూటినీ నిర్వహించలేకపోయారనడం సరికాదన్నారు. -
ఆర్ధిక వ్యవస్థకు షాక్!
ఏళ్లతరబడి అడ్డూ ఆపూ లేకుండా సాగిన ఒక అరాచకం ఎలాంటి సమస్యలు సృష్టించగలదో, ఏ పర్యవసానాలకు దారితీయగలదో బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన తీర్పు తేటతెల్లం చేస్తున్నది. 1993 మొదలుకొని 2012 వరకూ వివిధ ప్రైవేటు సంస్థలకు బొగ్గు క్షేత్రాలు ధారాదత్తం చేసిన తీరు చట్టవిరుద్ధమైనదని, ఈ కాలమంతా కట్టబెట్టిన 218 బొగ్గు క్షేత్రాల్లో నాలుగు మినహా మిగిలినవాటిని రద్దు చేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. రెండేళ్లక్రితం కాగ్ ఆరా తీయడంతో వెల్లడై ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కుంభకోణంవల్ల ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లింది. అవసరమైన సంస్థలకు కావలసిన బొగ్గు అందుబాటులో లేకపోగా తమ పలుకుబడితో బొగ్గు క్షేత్రాలు పొందినవారు వాటిని వేరేవారికి అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఆఖరికి ప్రభుత్వరంగ సంస్థలతో కొందరు జాయింట్ వెంచర్లకు దిగి వాటి బొగ్గు క్షేత్రాల్లో కూడా లాభాల పంట పండించుకున్నారు. చేష్టలుడిగిన యూపీఏ సర్కారు ఈ స్కాం విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కి బొగ్గు క్షేత్రాలన్నిటా ఈ రెండేళ్లనుంచీ పనులన్నీ స్తంభించిపోయాయి. ఫలితంగా సిమెంటు, ఉక్కు వగైరా పరిశ్రమల్లో ఉత్పత్తి మందగించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. తాజా తీర్పు వల్ల ఈ అనిశ్చితి తొలగిందనీ, సహజవనరుల కేటాయింపులో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో స్పష్టత వచ్చిందనీ కొందరు సంతోషిస్తుంటే...అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింతగా దెబ్బతినడం ఖాయమని మరికొందరు వాపోతున్నారు. ఈ రెండు అభిప్రాయాల్లోనూ నిజముంది. ఈ బొగ్గు క్షేత్రాల చుట్టూ ఎన్నో సంస్థలూ, వాటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, ఆ సంస్థలకు భారీయెత్తున రుణాలు మంజూరుచేసిన బ్యాంకులున్నాయి. బొగ్గు క్షేత్రాలను హామీగా చూపి రుణాలు తీసుకున్నవారెందరో ఉన్నారు. చాలా సంస్థలు అనిశ్చితిలో పడి ఇప్పటికే వడ్డీ కూడా కట్టలేకపోతున్నాయి. ఆయా సంస్థలకిచ్చిన బొగ్గు క్షేత్రాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కిపోయాయి గనుక ఈ బాపతు రుణాలు లక్ష కోట్ల రూపాయలూ ఎలా రాబట్టుకోవాలో అర్థంకాని అయోమయంలో బ్యాంకులు పడ్డాయి. ఇక రద్దయినవాటిలో 42 బొగ్గు క్షేత్రాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ క్షేత్రాలనుంచి వచ్చే బొగ్గుపై ఆధారపడి ఎన్నో పరిశ్రమలు పనిచేస్తున్నాయి. వీటిలో కొన్నింట ఉత్పత్తి నిలిచిపోవడం లేదా అవి విదేశాల నుంచి బొగ్గు దిగుమతికి సిద్ధపడటం తప్పనిసరవుతుంది. తీర్పువల్ల ఏతావాతా లాభపడింది ప్రభుత్వమే. బొగ్గు క్షేత్రాలు పొంది వాటిల్లో పనులు ప్రారంభించని సంస్థలకు ఆ క్షేత్రాల్లో ఎన్ని టన్నుల బొగ్గు ఉండగలదో లెక్కేసి టన్నుకు రూ. 295 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రకంగా సర్కారుకు రూ. 10,000 కోట్ల వరకూ రావొచ్చని అంచనా. సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టత వచ్చింది గనుక ఆరునెలల్లో అంతా సరిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. చురుగ్గా వ్యవహరించి పారదర్శకమైన విధానాలు రూపొందించి బొగ్గు క్షేత్రాల వేలానికి చర్యలు తీసుకుంటామంటున్నది. కానీ అదంత సులభంకాదు. ఇప్పుడు రద్దయిన సంస్థల్లో ఎన్నింటికి తాజా వేలంలో మళ్లీ బొగ్గు క్షేత్రాలు లభిస్తాయో చెప్పడం కష్టమే. అలా లభించకపోతే అధిక ధర చెల్లించి అవి బయటినుంచి కొనుగోలు చేసుకోవాలి. అందువల్ల వాటిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. ఆ భారం చివరకు జనంపైనే పడుతుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందించాల్సిన ప్రభుత్వాలు బాధ్యత మరచి వ్యవహరించిన పర్యవసానమిది. స్కాం బయటపడినప్పుడు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్డీయే హయాంలో పాటించిన విధానాన్నే తామూ కొనసాగిస్తున్నామని యూపీఏ ప్రభుత్వం దబాయించింది. అవసరాలను తీర్చే స్థాయిలో బొగ్గు క్షేత్రాలు లేనప్పుడు వాటి కోసం తీవ్ర పోటీ ఏర్పడుతుందని...కేటాయింపులకు పారదర్శకమైన విధానాన్ని అనుసరించకపోతే అవకతవకలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నదని ఆనాటి వాజపేయి ప్రభుత్వం అనుకోలేదు. ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ కూడా భావించలేదు. సరిగదా పోటీ వేలం విధానాన్ని అనుసరించాలని సీనియర్ అధికారి పీసీ పరేఖ్ చేసిన సూచనను బుట్టదాఖలా చేశారు. పర్యవసానంగా ఏం జరిగిందో కాగ్ లెక్కలుగట్టి చెప్పినప్పుడైనా సరిచేసుకుని ఉంటే నష్ట తీవ్రత తగ్గేది. ఇక్కడి ప్రభుత్వాలు న్యాయ సమీక్షకు నిలబడగల విధానాలను రూపొందించలేవని, ఇక్కడ పెట్టే పెట్టుబడులు గాలిలో దీపమవుతాయని విదేశీ ఇన్వెస్టర్లు భావించడానికి తాజా పరిణామాలు ఆస్కారమిచ్చాయి. ఒకపక్క ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండగా ఇలాంటి స్థితి ఏర్పడటం ఏ సంకేతాలనిస్తుందో సులభంగానే అంచనావేయొచ్చు. బొగ్గు క్షేత్రాలు పొంది నిర్వహిస్తున్న సంస్థలన్నీ ఆరు నెలల్లోగా వాటిని కోల్ ఇండియాకు అప్పజెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. కొత్త విధానం రూపొందేవరకూ వాటిని ఆ సంస్థే నిర్వహిస్తుందని తెలిపింది. అయితే, కోల్ ఇండియాకు అంతటి శక్తిసామర్థ్యాలే ఉంటే, అది సజావుగా బొగ్గు సరఫరా చేయగలిగివుంటే పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపే అవసరం ఉండేది కాదు. మొత్తానికి ఒక అనిశ్చితిని అంతమొందించే క్రమంలో మరో సంక్షోభానికి బీజం పడింది. ఇది బాధ్యత మరచిన పాలకులు చేసిన పాపం. విధాన రూపకల్పనలో ఎంత జాగ్రత్తగా మెలగాలో ఇప్పటికైనా మన నేతలు అర్థం చేసుకుంటే మంచిదే. -
మెటల్, మైనింగ్‌పై అధిక ప్రభావం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు బొగ్గు బ్లాకుల రద్దు వల్ల దేశంలో ప్రధానంగా మెటల్, మైనింగ్, విద్యుత్ రంగాల సంస్థలపై అత్యంత ప్రతికూల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అందులోనూ బొగ్గు స్కామ్ కేసులో పేర్లున్న నవీన్ జిందాల్ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్), ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కోలపై మరింత ఎఫెక్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. జేఎస్‌పీఎల్‌కు 1993 నుంచి మొత్తం ఆరు బొగ్గు బ్లాకులను కేటాయించారు. స్పాంజ్ ఐరన్ ప్లాంట్లతో పాటు 1,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల కోసం బ్లాకులను తీసుకుంది. కంపెనీ వీటి ద్వారా మొత్తం 12 మిలియన్ల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఈ బ్లాకులను వెనక్కితీసుకోవడం వల్ల ఒడిశాలో ఉత్కల్ బీ-1 బొగ్గు గని లెసైన్సులను చేజిక్కించుకునే పక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి. అంగుల్‌లో నిర్మించతలపెట్టిన ఉక్కు-విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఈ మైన్ చాలా కీలకమని ఒక బ్రోకరేజి సంస్థ పేర్కొంది. ఇక ఒడిశాలోనే హిందాల్కోకు చెందిన తాలబిరా-1 బొగ్గు గని లెసైన్స్ కూడా ఇప్పుడు రద్దయ్యే వాటిలో ఉంది. కంపెనీ బొగ్గు అవసరాల్లో మూడోవంతు(ఏటా 2.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి) ఇక్కడి నుంచే లభిస్తోంది. అంతేకాకుండా, మాహన్లో కొత్తగా నిర్మించతలపెట్టిన 3.59 లక్షల టన్నుల సామర్థ్యంగల సెల్టర్పైనా నీలినీడలు అలముకోనున్నాయి. ఎస్సార్ పవర్ భాగస్వామ్యంతో హిందాల్కోకు దీనికోసం ప్రభుత్వం సొంత బొగ్గుగనిని కేటాయించింది. ఇది కూడా రద్దుకానుంది. -
ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు లెసైన్సులను మూకుమ్మడిగా రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. బొగ్గు సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంవల్ల విద్యుత్ సంక్షోభానికి దారితీయొచ్చని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది. బొగ్గు స్కామ్ కేసులో 1993 నుంచి గత ప్రభుత్వాల హయాంలో కేటాయించిన మొత్తం 218 బొగ్గు బ్లాకులకుగాను 4 మినహా మిగతా 214 బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీం బుధవారం తీర్పునివ్వడం తెలిసిందే. తీర్పువల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులకు విఘాతం కలగడంతోపాటు ఇన్వెస్టర్లలో విశ్వాసం కూడా సన్నగిల్లుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ పేర్కొన్నారు. బొగ్గు కొరత తీవ్రతరం... రద్దయిన బొగ్గు బ్లాకుల్లో 42 వరకూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నవే. దేశంలో సరఫరా అవుతున్న మొత్తం బొగ్గులో 10 శాతం(53 మిలియన్ టన్నులు) వీటిద్వారానే లభిస్తోంది. ఇప్పుడు సుప్రీం తీర్పు కారణంగా ఈ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయి.. సరఫరాలకు బ్రేక్ పడుతుందని శ్రీరామ్ చెప్పారు. దిగుమతులు భారీగా పెరిగిపోయి.. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకేందుకు దారితీస్తుందన్నారు. కోర్టు ఆదేశాలతో అనిశ్చితి నెలకొందని.. కీలకమైన విద్యుత్, స్టీల్, మైనింగ్ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రభుత్వ పాలసీల్లో విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో మూడింట రెండోవంతు బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల నుంచే వస్తోంది. బొగ్గు సరఫరా చాలకపోవడంతో 80 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఇంధన కొరత మరింత తీవ్రతరమవుతుంది. ప్రభుత్వం మళ్లీ వేగంగా గనులను కేటాయించడం ద్వారా విద్యుదుత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి’ అని శ్రీరామ్ పేర్కొన్నారు. కాస్త కఠిన తీర్పు ఇది: అసోచామ్ ఈ తీర్పు కాస్త కఠినమైనదేనని, దీనివల్ల దేశంలోకి బొగ్గు దిగుమతులు పెరుగుతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. రద్దయిన బ్లాకులతో భారీస్థాయి పెట్టుబడులు ముడిపడిఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థ, ఇన్వెస్ట్మెంట్ వాతావరణం దెబ్బతింటుందని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగానికి బొగ్గు మైనింగ్‌లో ప్రవేశం కల్పించేవిధంగా ఈ రంగానికి సంబంధించిన చట్టాల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలన్నారు. కాగా, బ్లాకుల రద్దు కారణంగా దేశ బొగ్గు దిగుమతుల బిల్లు దాదాపు రూ.18,000 కోట్ల మేర ఎగబాకవచ్చని మెక్వారీ తాజా నివేదిక పేర్కొంది. గతేడాది(2013-14) భారత్ 168.4 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. దీని విలువ రూ.95,000 కోట్లు. బ్యాంకులకు రూ. లక్ష కోట్ల గండం.. సుప్రీం కోర్టు బొగ్గు బ్లాకుల రద్దు... బ్యాంకులను కూడా వణికిస్తోంది. రద్దయిన బ్లాకులపై ఆధారపడిన విద్యుత్ ప్లాంట్లకు దేశీ బ్యాంకులు రూ. లక్ష కోట్లకు పైగా రుణాలివ్వడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్లు గనుక సమస్యల్లో చిక్కుకుంటే బ్యాంకులిచ్చిన రుణాల వసూళ్లలోనూ తిప్పలుతప్పవు. ప్రధానంగా దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అత్యధికంగా రుణాలిచ్చిన వాటిలో ఉన్నాయి. కాగా, తామిచ్చిన రుణాల విలువను లెక్కగట్టే పనిలో ఉన్నట్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వర్గాలు పేర్కొన్నాయి. ‘సుప్రీం తీర్పును మేం గౌరవిస్తున్నాం. రద్దయిన బ్లాకులను మళ్లీ కేటాయించేందుకు ప్రభుత్వం పారదర్శకతతోకూడిన తక్షణ ప్రణాళికలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. తద్వారా బొగ్గు సరఫరాలకు ఆటంకాలు తప్పుతాయి’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ బ్లాకులతో సంబంధం ఉన్న విద్యుత్ ప్లాంట్లకు తామిచ్చిన రుణాలు రూ.4,000 కోట్ల వరకూ మాత్రమే ఉండొచ్చని గతంలో ఆమె చెప్పారు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ రూ.2,000 కోట్ల రుణాలిచ్చినట్లు అంచనా. -
సీబీఐ దర్యాప్తునకు అనుమతించండి!
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం, హ్యాకింగ్ సహా ఐటీ చట్టంలోని నేరాలకు సంబంధించిన దర్యాప్తుల్లో సీబీఐకి వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాల్సిందిగా సంబంధిత రాష్ట్రాలను సోమవారం కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై సిబ్బంది, శిక్షణ విభాగం మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రాష్ట్రాల అనుమతి పొందిన తరువాతే ఆయా రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, బొగ్గు స్కాం, హ్యాకింగ్ తదితర కేసుల అనుమతిని ఇచ్చే విషయంలో రాష్ట్రాలు భిన్న విధాలుగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా, తమకు మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టులను ప్రారంభించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు కోరుతున్నాయి. విశాఖపట్నంలో సీబీఐ ప్రత్యేక కోర్టు మంజూరైంది. -
కోల్ స్కాంలో సీబీఐ మరో ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో సీబీఐ తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నాగ్‌పూర్‌కు చెందిన జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్‌తోపాటు మరో అధికారిపై ఈ కేసు పెట్టింది. దీంతో ఈ స్కాంలో ఇప్పటివరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల సంఖ్య 20కి చేరింది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ కంపెనీ ఛత్తీస్‌గఢ్‌లోని మంద్ రాయ్‌గఢ్‌లో గారే పల్మా-4 బొగ్గు క్షేత్రం నుంచి అనుమతికి మించి తవ్వకాలు జరిపిందన్నాయి. 2007-08 మధ్య 5.6 లక్షల టన్నుల బొగ్గును కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా తవ్విందని వివరించింది. నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాయ్గఢ్లలోని ఈ కంపెనీ ఆఫీసుల్లో సీబీఐ సోదాలూ చేపట్టింది. -
బొగ్గు దందాలో అధికారుల అరెస్టు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి ఏరియాలో జరిగిన బొగ్గు కుంభకోణంలో ఇద్దరు సింగరేణి ఉన్నతాధికారులపై వేటు పడింది. ఏరియాలోని డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేశ్వర్రావు, ఏరియా కోల్‌బ్రాంచి మేనేజర్ శేషసాయిబాబాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులను మంచిర్యాలలోని బెల్లంపల్లి ఇన్చార్జి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు బెల్లంపల్లి డీఎస్పీ కె.ఈశ్వర్రావు తెలిపారు. బొగ్గు అక్రమ దందాలో ఇంత వరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో బొగ్గు టిప్పర్ల యజమానులు, మధ్యవర్తులు, దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కమర్షియల్ మేనేజర్ అవదేశ్‌కుమార్‌సింగ్, మహారాష్ట్రలోని వాయునందన పవర్‌ప్లాంట్ ము ఖ్య అధికారి ఉన్నారు. బొగ్గు అక్రమ రవాణాలో సింగరేణి అధికారుల ప్రమేయం ఉన్న వైనాన్ని కూడా ‘సాక్షి’ తేటతెల్లం చేసింది. సింగరేణి అధికారులు నిర్దోషులేనా? అనే శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది. అప్పటి వరకు సింగరేణి అధికారులపై ఎలాంటి విచారణ జరపని పోలీసులు ఆలస్యంగానైనా ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి బొగ్గు అక్రమ రవాణా జరగడానికి సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. దీంతో డోర్లి-2 ఓసీ మేనేజర్, కోల్‌బ్రాంచి మేనేజర్లను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. బొగ్గు అక్రమ రవాణా దందాలో ఇద్దరు సింగరేణి ఏరియా అధికారులు అరెస్ట్ కావడం కోల్‌బెల్ట్‌లో కలకలం రేపింది. సర్వత్రా చర్చనీయాంశమైంది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ఏరియాలో తప్పుడు వే బిల్లులు, నకిలీ స్టాంపులు సృష్టించి డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ నుంచి టిప్పర్ల యజమానులు భారీ ఎత్తున బొగ్గు అక్రమ రవాణా చేశారు. ఈ వైనాన్ని ‘సాక్షి’ దినపత్రికలో 2013 డిసెంబర్ 27న ‘బొగ్గు దొంగలు’, ఈ ఏడాది జనవరి 7వ తేదీన ‘ఆగని దందా’ శీర్షికలతో వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో సింగరేణి యాజమాన్యం ఒక్కసారిగా తేరుకొని జరిగిన బొగ్గు అక్రమ రవాణా దందాపై విచారణ జరిపి వాస్తవమేనని నిర్ధారించింది. ఈ మేరకు జనవరి 19వ తేదీన ఏరియా ఎస్అండ్పీసీ జూనియర్ ఇన్స్పెక్టర్ వి. రాజయ్య తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణం కేసును బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ ఈశ్వర్రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు సాగించారు. ఈ దర్యాప్తులో ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. బొగ్గు టిప్పర్ల యజమానులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆ తర్వాత క్రమక్రమంగా నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. నిందితుల నుంచి రూ.70 లక్షల నగదు, 19 బొగ్గు టిప్పర్లు, ఒక ఇండికా కారు, 3.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. తప్పుడు మార్గాన బొగ్గు కొనుగోలు చేసిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సింగరేణికి రూ.4.36 కోట్లు పరిహారం అందించింది. వాయునందన పవర్‌ప్లాంట్ యాజమాన్యం రూ.89 లక్షలు చెల్లించింది. మంచిర్యాలకు చెందిన ముగ్గురు బడా కోల్‌ట్రాన్స్‌పోర్టు యజమానులు కొన్నాళ్లు అజ్ఞాతవాసం ఉండి ఆతర్వాత హైకోర్టులో ముందస్తు బేయిల్ తీసుకున్నారు. వీరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రకంగా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేసి బొగ్గు అక్రమ దందా చేధించారు. -
నేను తప్పు చేస్తే ప్రధాని విసిరికొట్టేవారు: దాసరి
న్యూఢిల్లీ: తాను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రధాని మన్మోహన్ సింగ్ తనపై కఠిన చర్య తీసుకునే వారని మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని తలబిరా-II కోల్ బ్లాక్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ.. ఇటీవల దాసరిని ప్రశ్నించింది. బొగ్గుశాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కేబినెట్ మంత్రి శిబు సోరెన్, ప్రధాని మన్మోహన్ సింగ్ లదే తుది నిర్ణయం అని ఆయన అన్నారు. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ చేసిన ఆరోపణల్ని దాసరి ఖండించారు. ఆయన ప్రతిపాదించిన బిడ్డింగ్ ను తాను తిరస్కరించాను అని దాసరి అన్నారు. పరేఖ్ ప్రతిపాదనలకు తాను సహకరించలేదని ఆయన తెలిపారు. బొగ్గుశాఖకు సంబంధించిన ప్రధాని, కేబినెట్ మంత్రి ఉండగా ఆయనకు సహకరించడానికి తానెవ్వరిని అని ఘాటుగా స్పందించారు. తాను తప్పు చేసిఉంటే ప్రధాని తనను అక్కడి నుంచి విసిరికొట్టేవారని దాసరి తీవ్రంగా స్పందించారు. -
కోల్ స్కామ్ లో దాసరిపై పరేఖ్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బొగ్గుశాఖలో సంస్కరణలు ప్రవేశపట్టాలనుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రులపై నియంత్రణ కోల్పోయారని ఆ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గుశాఖ మంత్రులుగా పనిచేసిన శిబు సోరేన్, దాసరి నారాయణ రావులతోపాటు ఇతర ఎంపీలపై నిప్పులు చెరిగారు. ఎంపీలందరూ బ్లాక్ మెయిలర్స్, డబ్బులు దండుకునే వారేనని పరేఖ్ అన్నారు. బొగ్గు కేటాయింపులను బహిరంగ వేలంలో పెట్టాలని తాను సూచిస్తే మంత్రులు సోరెన్, దాసరి లు వ్యతిరేకించారని పరేఖ్ తెలిపారు. 2004లో తాను చేసిన ప్రతిపాదన వ్యవహారంలో మంత్రులను కట్టడి చేయడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. డైరెక్టర్లు, సీఈఓల నియామాకంలో బహిరంగంగానే లంచం అడిగారని, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని పరేఖ్ ఆరోపించారు. మంత్రులిద్దరూ అధికారులను, సీఈఓలను బ్లాక్ మెయిల్ చేశారని పరేఖ్ అన్నారు. ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రులు ఇంటర్నెట్ లో వేలం వేశారని 'క్రుసేడర్ ఆర్ కాన్సిపిరేటర్? కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్ అనే పుస్తకంలో పరేఖ్ వెల్లడించారు. లోకసభ ఎన్నికలకు ముందు పరేఖ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు కూడా ప్రధానిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
సాయుధ దళాలను వంచిస్తోంది
కాంగ్రెస్‌పై మోడీ ధ్వజం ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’పై 2004 నుంచి ఏం చేసింది అవినీతిపై రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదం అధికారమిస్తే దేశాన్ని అభివృద్ధి చేస్తా లూధియానా: సాయుధ దళాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. మాజీ సైనికోద్యోగులకు ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను అమలు చేయడంలో కాంగ్రెస్ జాప్యాన్ని ఆయన తూర్పారబట్టారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయకుండా ఎన్నికల వేళ హడావుడిగా ప్రకటన చేయడంలోని ఆంతర్యాన్ని గుర్తించాలని కోరారు. ఆదివారం పంజాబ్‌లోని లూధియానా, మాల్వాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మిత్రపక్షమైన శిరోమణి-అకాలీదళ్ నేతలతో కలసి మోడీ మాట్లాడారు. సంప్రదాయ సిక్కు తలపాగా ధరించిన మోడీ సుమారు అరగంటపాటు చేపట్టిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపట్ల కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే 2004 నుంచీ అధికారంలో ఉన్నా ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను ఎందుకు అమలు చేయలేదు? ఈ అంశంపై నేను తరచూ మాట్లాడుతుండటంతో ఈసారి బడ్జెట్లో ప్రకటన చేసింది. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చి ఉంటే దీన్ని వెంటనే అమలు చేసేది. ‘ఏబీసీ’లకు కొత్త నిర్వచనం (ఏ-ఆదర్శ్ హౌసింగ్ స్కాం, బీ-బోఫోర్స్ కుంభకోణం, సీ-కోల్ స్కాం) ఇస్తూ ఓవైపు కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోతుంటే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవినీతి విషయంలో విపక్షాలపై వేలెత్తి చూపడం హాస్యాస్పదంగా ఉంది. కేంద్రం నుంచి రూపాయి పంపితే 15 పైసలే గ్రామానికి చేరుతోందంటూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పేర్కొనడమే కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం. అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని దేశానికి కాపాలాదారుగా స్వీకరిస్తా. ప్రభుత్వ ఖజానాపై ‘చెయ్యి’ పడకుండా చూస్తా. కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రజల కళ్లలో మట్టి కొట్టి మోసం చేయగా తాజాగా పెప్పర్ స్ప్రే చల్లడం మొదలు పెట్టింది (తెలంగాణ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ విజయవాడ ఎంపీ (ప్రస్తుతం మాజీ) లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడాన్ని ఉదహరిస్తూ...) గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి సిక్కు రైతులు వలస వెళ్తున్నారంటూ సాగుతున్న ప్రచారమంతా బూటకం. పంజాబ్‌లో బీజేపీ-ఎస్ఏడీ కూటమి హిందువులు-సిక్కుల ఐక్యతకు చిహ్నం. సుపరిపాలన ఎలా అందించాలో బన్సీలాల్, ప్రకాశ్‌సింగ్ బాదల్ (ఎస్ఏడీ నేత), ఓం ప్రకాశ్ చౌతాలా (ఐఎన్ఎల్డీ అధినేత), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్) నుంచి నేర్చుకున్నా. అధికారం అందిస్తే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా. రైతులకు మేలు చేకూరాలంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పెరగాలి. నష్టాల ఊబిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని మూడు విభాగాలుగా చేయాలి. మొదటి విభాగం ఉత్పత్తులను సేకరిస్తే రెండో విభాగం వాటిని నిల్వ చేసే బాధ్యతను, మూడో విభాగం వాటిని సమర్థంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. గిడ్డంగుల్లో నిల్వ ఉన్న గోధుమలను రైతుల మధ్య పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రం మాత్రం గోధుమ నిల్వలు కుళ్లిపోయే వరకూ నిరీక్షించి ఆ తర్వాత లిక్కర్ తయారీ బెవరేజీలకు అమ్ముకుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. సంక్షిప్తంగా... 2011లో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ లక్ష్యంగా అమర్చిన పైపు బాంబు ఉదంతంలో ప్రధాన నిందితుడిని కేరళలో ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 21 మంది అఫ్ఘానిస్థాన్ సైనికులను తాలిబాన్లు ఆదివారం కాల్చి చంపి, మరో ఏడుగురిని అపహరించిన ఘటనపై అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఏరివేయడంలో ఆ దేశ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. {పపంచవ్యాప్తంగా అడవుల నాశనాన్ని ఎప్పటికప్పుడు కళ్లకు కట్టినట్లు చూపే వెబ్‌సైట్‌ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రారంభించింది. ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ పేరుతో ప్రారంభించిన ఈ సైట్లో అటవీప్రాంత నిర్మూలన సమాచారం, నివేదికలు, మ్యాపులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక నక్సల్ మృతి చెందాడు. జిల్లాలోని ధాదాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడవుల్లో ఆదివారం ఉదయం కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు చెప్పారు. -
బొగ్గు స్కామ్‌లో ఎఫ్ఐఆర్లపై సీబీఐ దర్యాప్తు పూర్తి
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి ఆరు ఎఫ్ఐఆర్లపై విచారణను సీబీఐ పూర్తి చేసింది. వచ్చే సోవువారం సుప్రీం కోర్టుకు సమర్పించనున్న నివేదికలో ఈ విషయూన్ని తెలిపే అవకాశముంది. దర్యాప్తు ముగిసిన కేసులేంటన్నది మాత్రం బయటకు వెల్లడికాలేదు. తుది దశ తనిఖీని, సాంకేతిక లాంఛనాలను పూర్తిచేసిన తర్వాత కోర్టుకు తుది నివేదికను సీబీఐ అందిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కామ్‌లో ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, జేఎల్డీ యూవత్మాల్, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్, జేఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్, వికాస్ మెటల్స్, గ్రేస్ ఇండస్ట్రీస్, గగన్ స్పాంజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రాఠి స్టీల్ అండ్ పవర్, జార్ఖండ్ ఇస్పాత్, గ్రీన్ ఇన్ఫ్రా, కవుల్ స్పాంజ్, పుష్ప్ స్టీల్, హిందాల్కో, బీఎల్ఏ ఇండస్ట్రీస్, కాస్ట్రాన్ టెక్నాలజీస్, కాస్ట్రాన్ మైనింగ్ కంపెనీలపై సీబీఐ 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. -
సీబీఐ విచారణకు సిద్ధం: ప్రధాని
ప్రధాని ప్రత్యేక విమానం నుంచి:నీడలా తనను వెన్నాడుతున్న బొగ్గు కుంభకోణంపై సీబీఐ సహా మరే ఇతర విచారణకైనా సిద్ధమని ప్రధాని మన్మో హన్‌సింగ్ ప్రకటించారు. ఈ విషయంలో దాచేందుకు తన వద్ద ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో 10 రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్‌లపై ఎఫ్ఐఆర్ దాఖలయ్యాక ఈ ఉదంతంపై ఆయన తొలిసారిగా స్పందించారు. ఐదు రోజుల రష్యా, చైనా పర్యటన ముగించుకుని గురువారం భారత్ తిరిగి వస్తూ తన ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం విషయంలో తనపై విమర్శల దాడిని విపక్షాలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా బదులిచ్చారు. ‘‘నేనేమీ దేశ చట్టాలకు అతీతుడ్ని కాను. ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ గానీ, మరెవరైనా గానీ నన్నేమైనా అడగదలిస్తే దాయడానికి నా దగ్గరేమీ లేదు’’ అన్నారు. సీబీఐ కేసులు, కుంభకోణాలు ప్రధానిగా మీ వారసత్వానికి మచ్చలుగా మిగిలిపోనున్నాయా అని ప్రశ్నించగా, దాన్ని నిర్ణయించాల్సింది చరిత్రేనన్నారు. ‘నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇకపైనా నిర్వర్తిస్తూ సాగుతాను. ప్రధానిగా నా పదేళ్ల పాలన తాలూకు ప్రభావం ఏమిటన్న దానిపై తీర్పు చెప్పాల్సింది చరిత్రకారులే’ అన్నారు. బిర్లా నేతృత్వంలోని హిందాల్కోకు ఒడిశాలో బొగ్గు క్షేత్రం కేటాయింపు సరైందేనంటూ ఇటీవల ప్రధాని కార్యాలయం ఇచ్చిన వివరణ తదితరాలపై విలేకరులు మన్మోహన్‌ను ప్రశ్నించారు. ఇన్స్పెక్టర్ స్థాయి సీబీఐ అధికారి కూడా నేరుగా ప్రధానిని ప్రశ్నించేంతగా ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వవచ్చా అన్న ప్రశ్నకు, ‘కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై నేనేమీ వ్యాఖ్యానించదలచలేదు’ అంటూ ఆయన సరిపెట్టారు. బొగ్గుతో సహా పలు కుంభకోణాలపై దర్యాప్తును సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షిస్తున్న వైనం ప్రభుత్వ విధాన నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయడం లేదా అన్న ప్రశ్నకు కూడా అదే సమాధానమిచ్చారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఏం చేయదన్న దానిపై తానేమీ వ్యాఖ్యానించదలచలేదన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, పాక్‌తో సంబంధాలు, రష్యా-చైనా పర్యటన తదితరాలపై మన్మోహన్ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... షరీఫ్ తీరు నిరాశాకరం: కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తున్న వైనం బాధాకరం. ఈ విషయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీరుతో నేనెంతో అసంతృప్తి చెందాను. ఎందుకంటే ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలంటూ ఇటీవల న్యూయార్క్‌లో మేము అంగీకారానికి వచ్చాం. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరుగుతున్న కాల్పులు ఇద్దరికీ మంచివి కావు. ఇప్పటికైనా షరీఫ్ అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలి. రాహుల్‌కు ఏ హానీ జరగనీయం: ‘‘రాహుల్‌గాంధీ ప్రాణాలకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండావీలైనన్ని అన్ని జాగ్రత్తలనూ కేంద్రం తీసుకుంటుంది (తన నానమ్మ ఇందిర, నాన్న రాజీవ్ ఇద్దరూ హత్యకు గురయ్యారని, తననూ అలాగే అంతమొందిస్తారేమోనని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా ఇలా స్పందించారు). కానీ దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందరూ ఆందోళన చెందాల్సిన పరిణామమిది’’ మోడీది ఆరంభశూరత్వమే: ‘‘నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మాకంటే ముందు మొదలు పెట్టి ఉండొచ్చు గాక. కానీ వారిది ఆరంభ శూరత్వం మాత్రమే. ఎన్నికలు సమీపించేకొద్దీ వారు చతికిలపడతారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ ఫలితాలను చూసి దేశమంతా ఆశ్చర్యపోవడం ఖాయం. నాకు ఆ నమ్మకముంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగడం లేదనడం సరికాదు. నిదానమే ప్రధానమన్నది కొన్నిసార్లు ప్రజా జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు (విలేకరులు) ప్రస్తావిస్తున్న కుంభకోణాలన్నీ యూపీఏ-2లో కాకుండా యూపీఏ-1 హయాంలో జరిగాయి. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు రావడం, వాటిలో కాంగ్రెస్ గెలవడం జరిగిపోయాయి. 2014లోనూ అదే పునరావృతం కానుంది’’ చైనాతో సంబంధాలపై... చైనా, భారత్ మధ్య సంబంధాల్లో సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ నదీ వివాదాలు అడ్డంకిగా పరిణమించవచ్చని ప్రధాని హెచ్చరించారు. ఇప్పటిదాకా ఇరు దేశాల సంబంధాల్లో సాధించిన ప్రగతి కూడా సరిహద్దులను ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లే సాధ్యమైందని చైనా కమ్యూనిస్ట్ పార్టీ తాలూకు సెంట్రల్ పార్టీ స్కూల్లో చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ‘టీ’ సమస్యకు జీవోఎంపరిష్కారం చూపుతుంది సంక్లిష్టమైన ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యకు.. తెలంగాణ అంశంపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) పరిష్కారం సూచిస్తుందని ప్రధాని మన్మోహన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ‘హైదరాబాద్ వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014కు ముందే సాధ్యమవుతుందని మీరు విశ్వసిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా ఈ విధంగా స్పందించారు. ‘‘ఈ అంశం మంత్రుల బృందం ఎదుట ఉంది. సమస్య అన్ని కోణాలనూ వారు పరిశీలిస్తున్నారు. సంక్లిష్టమైన ఈ సమస్యకు వారు ఆచరణీయమైన పరిష్కారం చూపుతారని నాకు నమ్మకముంది’’ అని పేర్కొన్నారు. -
హిందాల్కో ఫైళ్ల కోసం ప్రధాని కార్యాలయానికి సీబీఐ లేఖ
బొగ్గు కుంభకోణం రాజుకుంటోంది. ప్రధానమంత్రి కార్యాలయానికి సీబీఐ లేఖ రాసింది. హిందాల్కో సంస్థకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తమకు అప్పగించాలని అందులో కోరింది. ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించడానికి ముందుగానే ఒకసారి ఆ ఫైళ్లన్నింటినీ సమీక్షించాల్సి ఉందని, అందువల్ల మొత్తం ఫైళ్లు తమకు అందజేయాలని సీబీఐ కోరినట్లు సమాచారం. హిందాల్కో సంస్థకు బొగ్గు గనుల కేటాయింపును ఇంతకుముందే ప్రధానమంత్రి కార్యాలయం సమర్థించుకున్న విషయం తెలిసిందే. కాగా.. బొగ్గు స్కాంపై సుప్రీంకోర్టుకు సీబీఐ ఓ స్థాయీ నివేదికను మంగళవారం సమర్పించింది. ఇటీవల కుమార మంగళం బిర్లాపైన, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్‌లపై దాఖలుచేసిన 14వ ఎఫ్ఐఆర్ వివరాలను కూడా సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. -
కార్టూన్
ఆరోపణలు వచ్చిన ప్రతీసారి విదేశీ పర్యటనలకు వెళితే.. విపక్షాలకు అనుమానం వస్తుంది సార్! -
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రశ్నించనున్న సీబీఐ!
హిండాల్కో కంపెనీకి బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను సీబీఐ ప్రశ్నించనుంది. 2005 లో ఆదిత్య బిర్లా కంపెనీని తిరస్కరించిన తర్వాత బొగ్గు శాఖ కు నవీన్ పట్నాయక్ లేఖ రాసిన అంశపై సీబీఐ విచారించే అవకాశం ఉంది. ఒడిశాలోని తలబిరా రెండవ బ్లాక్ కోసం దరఖాస్తు చేసుకున్న హిండాల్కో కంపెనీ తిరస్కారానికి గురైన తర్వాత పున: పరిశీలించాలని పట్నాయక్ లేఖ రాశారని సీబీఐ అధికారి తెలిపారు. పట్నాయక్ రాసిన లేఖలు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిని విచారించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం జరుగలేదని తెలిసింది. -
ఇదేనా దర్యాప్తు తీరు?!
సంపాదకీయం: మొదలైన నాటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతున్న బొగ్గు కుంభకోణంలో ఇప్పుడు మరో అంకానికి తెరలేచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ తదితరులు అవినీతికీ, నేరపూరిత కుట్రకూ పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఆ మేరకు ఎఫ్ఐఆర్ దాఖలుచేయడంతోపాటు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని ఆరుచోట్ల సోదాలు చేసింది. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు కేటాయించాల్సిన ఒడిశాలోని తలబిరా బొగ్గు గనుల్ని బిర్లా గ్రూపునకు చెందిన హిండాల్కోకు కూడా పంచారని ఇందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టంవాటిల్లిందన్నది సీబీఐ ఆరోపణ. కుమార మంగళం బిర్లా దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గనుక ఈ చర్యపై పారిశ్రామికవర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది పరిశ్రమల విశ్వాసాన్ని, పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆ వర్గాలు ప్రకటించాయి. చిత్రమేమంటే, వీరితో ఇద్దరు కేంద్రమంత్రులు...వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్లు గొంతు కలిపారు. ‘గట్టి సాక్ష్యాధారాలు’ ఉంటే తప్ప ఈ తరహా చర్యలకు దిగకూడదని హితవు చెప్పారు. ఈ స్కాంలో ఇప్పటికే సీబీఐ 14 ఎఫ్ఐఆర్లు నమోదుచేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీని, మరో కేంద్ర మాజీ మంత్రిని కూడా నిందితులుగా చేర్చింది. దేశంలో చట్టమనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. వర్తించాలి. అందులో రెండోమాట లేదు. ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్తగనుక వారి జోలికి వెళ్లరాదని, మరొకరు కాకలు తీరిన రాజకీయ యోధుడు గనుక వారిని అసలు తాకరాదని ఎవరూ అనరు. అలాంటి విచక్షణో, పక్షపాతమో నిజానికి సీబీఐకే ఉంది. అనేక కేసుల్లో ఆ సంగతి నిరూపణ అవుతూనే ఉంది. బొగ్గు కుంభకోణం సామాన్యమైంది కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 194 బొగ్గు క్షేత్రాలను వేలం విధానంలో కాక, నచ్చినవారికి కట్టబెట్టారన్నది ప్రధానమైన ఆరోపణ. ఇలా చేసినందువల్ల దేశ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టంవాటిల్లిందని కాగ్ సంస్థ ఆరోపించింది. ఆరోపణలొచ్చాయి గనుక తనంత తానే స్వచ్ఛందంగా సీబీఐ దర్యాప్తునకు సిద్ధపడదామని కేంద్ర ప్రభుత్వం అనుకోలేదు. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సివచ్చింది. అటు తర్వాతనైనా ఆ దర్యాప్తునకు అవసరమైన సహాయసహకారాలను అందించివుంటే కేంద్రం నిజాయితీ వెల్లడయ్యేది. అలా చేయలేదు సరిగదా...దానికి అవసరమైన ఫైళ్లను అందుబాటులో ఉంచడంలో కూడా విఫలమైంది. సుప్రీంకోర్టు ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేసి రెండువారాల్లో వాటిని పట్టి తేవాలని గత నెలలో ఆదేశించింది. అయినా, ఇప్పటికీ దాదాపు 18 ఫైళ్లు ఏమయ్యాయో తెలియడంలేదు. ఈ ప్రహసనానికి ముందు సుప్రీంకోర్టుకు సీబీఐ అంద జేయాల్సిన నివేదికను అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి తెప్పించుకుని, దానికి సవరణలు చేయడం... ఆ ఉదంతంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడం ఇవన్నీ అయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే సీబీఐ ‘పంజరంలో చిలుక’ మాదిరిగా వ్యవహరిస్తున్నదని సుప్రీంకోర్టు పరుషంగా వ్యాఖ్యానించింది. ఇన్ని జరిగాక ఇప్పుడు కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్‌లపై కేసులు నమోదుచేయడంపై సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి. నిజానికి తలబిరా బొగ్గు క్షేత్రాలు కావాలని అభ్యర్థన చేసింది హిండాల్కో సంస్థ కాదు. ఆ సంస్థకు మాతృక అయిన ఇండాల్ సంస్థ. ఆ సంస్థ 1996లో అలాంటి విజ్ఞప్తిచేసింది. అటు తర్వాత కాలంలో ఇండాల్ను బిర్లాలు కొనుగోలుచేయగా, 1996నాటి అభ్యర్థనపై 2005లో కేంద్రం నిర్ణయం తీసుకుని తలబిరా గనుల్ని కేటాయించింది. దర్యాప్తు ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా, ఇన్నాళ్ల వరకూ బిర్లా జోలికి ఎందుకు వెళ్లలేదు? తొలుత అభ్యర్థన చేసిన ఇండాల్ సంస్థ నిర్వాహకుల్ని ఏమైనా ప్రశ్నించారా? అన్నవి సమాధానంలేని ప్రశ్నలు. అసలు ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తే లోపభూయిష్టంగా ఉంది. ప్రధాని మన్మోహన్సింగ్ బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కుంభకోణం ప్రారంభమైంది గనుక దర్యాప్తు ప్రధాని కార్యాలయం నుంచి మొదలుకావాలి. అటు తర్వాత వరసగా ఏ దశలో ఏం జరిగిందనేది క్రమేపీ బయటికొస్తుంది. కేటాయింపుల క్రమంలో లబ్ధిదారు లెవరైనా అధికారులతోగానీ, అధినేతలతోగానీ కుమ్మక్కయ్యారా అనేది స్పష్టం అవుతుంది. దర్యాప్తు క్రమం అలా ఉంటే ఎవరూ సీబీఐని వేలెత్తి చూపే అవకాశం ఉండదు. బొగ్గు క్షేత్రం పొందిన బిర్లా కుట్రదారు అయినప్పుడు, ఆయనకు అలా కేటాయించవచ్చని చెప్పిన తాను కుట్రదారు అయినప్పుడు, తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని ఎందుకు కారని పరేఖ్ చేస్తున్న తర్కంలో హేతుబద్ధత ఉన్నది. చేసే పనిలో చిత్తశుద్ధి కొరవడితే, నిష్పాక్షికత ఆవిరైతే...దర్యాప్తు తలకిందులుగా సాగితే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు సీబీఐ వద్ద జవాబు లుండవు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా అందరినీ నిందితులుగా చేరిస్తే తాను నిష్పాక్షికంగా ఉన్నట్టు చాటుకోవచ్చని సీబీఐ భావించినట్టుంది. ఇవన్నీ వదిలిపెట్టి స్వయంగా ప్రధానే జరిగిందేమిటో చెబితే, బొగ్గు క్షేత్రాల కేటాయింపు ఎలా సబబో చెబితే ఇంతమందిని నిందితులుగా చేయాల్సిన పనే ఉండదు. కానీ, ఆయన మాట్లాడరు. సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయదు. కేంద్ర మంత్రులు మాత్రం ప్రముఖ పారిశ్రామికవేత్తలను నిందితులుగా చేర్చడం అభ్యంతరకర మంటారు. ఇంతకూ ఇలాంటి కప్పదాటు వైఖరులతో, అయోమయ చర్యలతో కేంద్ర ప్రభుత్వంగానీ, సీబీఐగానీ ఏం సాధించదల్చుకున్నాయి? తమ చర్యలతో తాము నగుబాటుపాలవడమే కాదు... దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటున్నదని ఎప్పటికి గ్రహిస్తారు? -
కుమార మంగళం బిర్లాను విచారించనున్న సీబీఐ!
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై దేశ సహజ సంపదను దోపిడీ చేసిన సంఘటనలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. భారతీయ పారిశ్రామిక రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన కుమార మంగళం బిర్లా పేరును సీబీఐ.. బొగ్గు కుంభకోణం నిందితుల జాబితాలో చేర్చింది. 14వ ఎఫ్ఐఆర్లో బిర్లాతో పాటు ఆయనకు చెందిన హిందాల్కో కంపెనీ పేరును, ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాల్కో పేరును కూడా చేర్చింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ, కోల్‌కతా, భువనేశ్వర్, ముంబాయి, హైదరాబాద్‌ల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కుమార్ మంగళం బిర్లా కంపెనీకి 2005లో బొగ్గు గనులు కేటాయించడంలో అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. 46 ఏళ్ల బిర్లా.. ఈ కేసులో కుట్ర, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కుమార మంగళం బిర్లాను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఇదే కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. పారదర్శకంగా వేలం పాట నిర్వహించకుండా ఇష్టానుసారం బొగ్గు గనులు కేటాయించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరితగతిన విచారణ జరపాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.