బొగ్గు స్కాం: మాజీ ఉన్నతాధికారికి రెండేళ్ల జైలు
బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కాంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ శిక్ష విధించినా, వెంటనే బెయిల్ మంజూరు చేసింది. కేఎస్ క్రోఫా, కేసీ సమారియా అనే ఇద్దరు అధికారులకు లక్ష రూపాయల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరుచేశారు. మధ్యప్రదేశ్‌లోని తెస్గోరా బి/ రుద్రపురి బొగ్గు క్షేత్రాలను కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (కేఎస్ఎస్‌పీఎల్)కు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది.
2005 డిసెంబర్ 31 నుంచి 2008 నవంబర్ వరకు బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న హెచ్‌సీ గుప్తా, నాటి జాయింట్ సెక్రటరీ కేఎస్ క్రోఫా, డైరెక్టర్ కేసీ సమారియా ముగ్గురూ నేరం చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. వీళ్లతో పాటు కేఎస్ఎస్‌పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కమార్ అహ్లువాలియా కూడా నేరం చేసినట్లు తెలిపింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్టర్డ్ అకౌంటెంటు అమిత్ గోయల్ మీద మాత్రం ఆరోపణలు రుజువు కాలేదు. ఈ కేసులో 2012 అక్టోబర్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సీబీఐ.. 2014 మార్చి 27న క్లోజర్ రిపోర్టు దాఖలుచేసింది. అయితే దాన్ని కోర్టు తిరస్కరించి, గుప్తా, ఇతరులను నిందితులుగా విచారణకు పిలిచింది. సుదీర్ఘ విచారణ అనంతరం గుప్తా, మరో ఇద్దరు అధికారులకు రెండేసి సంవత్సరాల జైలుశిక్ష విధించింది.