సీబీఐ మాజీ చీఫ్‌కు సీబీఐ షాక్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తిని సీబీఐ విచారించనుండటం, ఆయనపై కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్‌గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. కొందరు నిందితులను కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు బొగ్గు కుంభకోణం కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సీబీఐ.. రంజిత్‌పై కేసు నమోదు చేసింది.