Ranjit Sinha
-
సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా (68) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కోవిడ్ కారణంగా మరణించి ఉండవచ్చని సీనియర్ అధికారులు తెలిపారు. రంజిత్ సిన్హాకు కరోనా పరీక్షలు చేపట్టగా గురువారం రాత్రి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం వేకువజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు వెల్లడించారు. బిహార్ కేడర్‌కు చెందిన 1974 బ్యాచ్ అధికారి రంజిత్ 21 ఏళ్లకే యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఐటీబీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సిన్హా హయాంలో బొగ్గు కుంభకోణంపై సీబీఐ చేపట్టిన దర్యాప్తు వివాదస్పదమైంది. అప్పటి న్యాయ మంత్రి అశ్వనీ కుమార్, పలువురు ఉన్నతాధికారులు తన నివాసానికి వచ్చి సమావేశాలు జరిపారనీ, వాటి ఫలితంగానే బొగ్గు కుంభకోణం విచారణ నివేదికలో పలు మార్పులు చేపట్టామని ఆయన సుప్రీంకోర్టుకిచ్చిన నివేదికలో వెల్లడించడం గమనార్హం. దీనిపై జస్టిస్ ఆర్ఎం లోథా తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అవి నిజమేనంటూ సిన్హా మీడియా ఎదుట ఒప్పుకోవడం సంచలనమైంది. అనంతరం సీబీఐ 2జీ కుంభకోణంపై చేపట్టిన దర్యాప్తు చుట్టూ కూడా వివాదం ఏర్పడింది. ఈ కుంభకోణంలోని కీలక సూత్రధారులు కొందరు సిన్హా నివాసానికి వెళ్లినట్లు వెల్లడైంది. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ చీఫ్‌గా ఉన్న సిన్హా ఆ కేసు విచారణ నుంచి వైదొలిగారు. చదవండి: కుంభమేళాలో కరోనా.. రెండుగా చీలిన సాధువులు -
సీబీఐ మాజీ చీఫ్‌కు సీబీఐ షాక్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని సీబీఐ విచారించనుండటం, ఆయనపై కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. కొందరు నిందితులను కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు బొగ్గు కుంభకోణం కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సీబీఐ.. రంజిత్‌పై కేసు నమోదు చేసింది. -
సీబీఐ చరిత్రలో తొలిసారిగా..
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు విచారణలో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు సీబీఐని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని, సీబీఐ చీఫ్ విచారించనుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రంజిత్‌ను విచారించే బృందానికి కొత్త సీబీఐ చీఫ్ అలోక్ వర్మ ఇంచార్జీగా వ్యవహరిస్తారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ గతంలో నివేదిక సమర్పించింది. -
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్‌కు ఇక్కట్లు
-
రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు
‘కోల్గేట్’ నిందితులను కలవడాన్ని తప్పుబట్టిన సుప్రీం సీబీఐ మాజీ డెరైక్టర్ తీరుపై ఆక్షేపణ జూలై 6లోగా నివేదిక ఇవ్వాలని సీవీసీకి ఆదేశం న్యూఢిల్లీ: కోల్గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సూచించింది. పలు కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను దర్యాప్తు అధికారుల పరోక్షంలో రంజిత్‌కుమార్ కలవడం ఆక్షేపణీయమని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి జూలై 6లోగా నివేదిక అందించాలని సీవీసీని ఆదేశించింది. ఆ సమావేశాల తర్వాత సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లు, దర్యాప్తు నివేదికల్లో ఏమైనా తేడాలున్నాయా గుర్తించాలని సూచించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇలాంటి సమావేశాలు జరిగినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ భేటీలు అధికారిక రహస్యాల చట్టం పరిధిలోకి రావని, సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను సేకరించడం ప్రజాప్రయోజనాల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. కాగా, తనపై పిటిషన్ వేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్‌భూషణ్ అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై ఆయన్ని విచారించాలని సీబీఐ మాజీ చీఫ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బొగ్గు స్కాంకు సంబంధించిన కేసులను బలహీనపరిచేందుకు రంజిత్‌కుమార్ అధికార దుర్వినియోగం చేశారంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బొగ్గు స్కాంలో నిందితులుగా ఉన్న అప్పటి రాజ్యసభ ఎంపీ విజయ్ దర్దా సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో రంజిత్‌కుమార్ సమావేశమైనట్లు ఆయన నివాసంలో ఉండే సందర్శకుల పుస్తకంలోని పేర్ల ద్వారా తెలుస్తోందని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని కోరారు. -
నిందితులను కలవడం ముమ్మాటికీ తప్పే: సుప్రీం
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గు స్కాంలో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినందుకు ఆయనపై విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ స్కాంలో నిందితులను పలుమార్లు రంజిత్ సిన్హా కలవడం ఏమాత్రం సరికాదని, దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనని, దీనిపై విచారించాలని జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సీబీఐ మాజీ చీఫ్‌పై విచారణ ఎలా జరగాలో నిర్ణయించడంలో సహకరించాలని చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌ను సుప్రీంకోర్టు కోరింది. జూలై ఆరోతేదీ లోగా ఈ విషయమై తన సమాధానం చెప్పాలని తెలిపింది. రంజిత్ సిన్హాపై సిట్‌తో దర్యాప్తు చేయించాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. సిన్హా ఇంటివద్ద ఉన్న అతిథుల జాబితా డైరీని బట్టి చూస్తే.. కోల్గేట్ స్కాంలోని పలువురు నిందితులు ఆయనతో ప్రత్యక్షంగా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోందని, అంటే వాళ్లను రక్షించేందుకు ఆయన ప్రయత్నించినట్లే భావించాలని కూడా సుప్రీం వ్యాఖ్యానించింది. -
పెద్ద గొప్ప పనులేమీ చేయలేదు: రంజిత్ సిన్హా
సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో తాను పెద్ద గొప్ప పనులేమీ చేయలేదని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. రెండేళ్ల పాటు దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధినేతగా ఉన్న ఆయన.. చివర్లో మాత్రం బొగ్గు స్కాం, 2జీ స్కాంల విషయంలో అపవాదు మూటగట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. మంగళవారంతో రంజిత్ సిన్హా పదవీకాలం కూడా ముగిసింది. ఏమీ చెప్పకుండానే తాను వెళ్లిపోతున్నానని, పెద్దగా గొప్ప పనులేమీ చేయలేదని ఆయన అన్నారు. మీరు ఏం కావాలనుకుంటే అది రాసుకొమ్మని కూడా విలేకరులతో అన్నారు. ఇప్పటికే అంతా తనమీద కావల్సినంత బురద జల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ మాజీ అధినేత వినోద్ రాయ్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌ల తరహాలో అనుభవాల సారంతో ఏదైనా పుస్తకం రాసే ఆలోచన ఉందా అని ప్రశ్నించినప్పుడు.. తాను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరినీ అనుసరించేది లేదన్నారు. రైల్వేబోర్డులో ఓ సభ్యుడిని, ప్రభుత్వ రంగ బ్యాంకు సీఎండీ ఒకరిని, సెన్సార్ బోర్డు సీఈవోను.. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న అనేకమంది లంచాల బాగోతాన్ని బయటపెట్టిన ఘనత రంజిత్ సిన్హాకు ఉంది. -
'కోర్టు ఆదేశాలతో ఇబ్బంది పడలేదు'
సుప్రీంకోర్టు తనను 2జీ స్కాం విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆదేశించినందుకు తానేమీ ఇబ్బంది పడలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. ఇందులో ఇబ్బందేమీ లేదని, తాను కోర్టు ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తానని ఆయన చెప్పారు. తనకు తానుగా ఈ కేసు విచారణ, దర్యాప్తు బాధ్యతల నుంచి రంజిత్ సిన్హా తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. డైరెక్టర్ తర్వాత సీనియర్ అధికారి ఎవరైతే వాళ్లు 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టాలని కోర్టు తెలిపింది. -
సీబీఐ డైరెక్టర్‌కు సుప్రీం షాక్!!
సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. 2జీ స్పెక్ట్రం స్కాం విచారణ నుంచి వెంటనే పక్కకు తప్పుకోవాలని ఆయనను ఆదేశించింది. సీబీఐకి ఇన్నాళ్లూ ఉన్న మంచిపేరును చెడగొట్టే ఉద్దేశం తమకు లేదని, అందుకే తాము వివరంగా ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయమూర్తులు తెలిపారు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐకి ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. స్కాంలో ఇరుక్కున్న కొంతమంది పెద్దలను కాపాడేందుకు సిన్హా ప్రయత్నించారన్న ఆరోపణలతో వచ్చిన పిటిషన్ విచారణ అనంతరం న్యాయమూర్తులు ఈ ఉత్తర్వులిచ్చారు. ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన ప్రశాంతభూషణ్ ఈ ఆరోపణలు చేశారు. తమ కంపెనీలకు 2జీ లైసెన్సులు ఇప్పించుకోడానికి నేరపూరిత కుట్రలు చేశారని ఆరోపణలున్న కంపెనీల ఉన్నతాధికారులు రంజిత్ సిన్హాను తరచు ఆయన ఇంట్లో కలుస్తున్నారని ప్రశాంత భూషణ్ ఆరోపించారు. కొన్ని టెలికం కంపెనీలకు అనుకూలంగా టెలికం శాఖ మాజీ మంత్రి రాజా నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టులో చెప్పారు. కేసు విచారణలో ఉన్నప్పుడు కొంతమందిని ఇంట్లో కలవడం ఎలాంటి నేరం కాదని ఆయన వాదించారు. డిసెంబర్ రెండో తేదీన రంజిత్ సిన్హా పదవీ విరమణ చేయాల్సి ఉంది. -
తుది నిర్ణయూలు తీసుకోవద్దు
కోల్గేట్ కేసులపై సీబీఐకి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏ కేసు విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న కొందరిని రక్షించేందుకు ప్రయత్నించారంటూ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. పన్ను చట్టాల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మాంసం ఎగుమతిదారు మెురుున్ ఖురేషీకి సంబంధించిన ఐటీ మదింపు నివేదికను అందజేయూల్సిందిగా చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. ఖురేషీ పలుమార్లు సీబీఐ ఉన్నతాధికారిని ఆయన అధికార నివాసంలో కలుసుకున్నట్టుగా ఆరోపణలున్నారుు. ‘ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దు. తదుపరి విచారణలో బెంచ్ ఈ అంశాన్ని చేపట్టేవరకు ఆగండి. ఏ కేసు విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోకండి..’ అని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ డెరైక్టర్‌పై వచ్చిన ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయూల్సిందిగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 17వ తేదీకి వారుుదా వేసింది. -
ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి
సీబీఐ డెరైక్టర్ ఇంటి గుట్టు వ్యవహారంలో ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్లో సమర్పించాలని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఈ కేసులోని ఆరోపణలు సీబీఐ డెరైక్టర్ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు స్కాం దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడిస్తే, ఈ ఆరోపణల్లో నిజానిజాలెంతో నిర్ధారించవచ్చని పేర్కొంది. దాన్నిబట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామంది. అయితే తనకు వివరాలిచ్చిన వ్యక్తి పేరు బయటపెట్టాలన్న కోర్టు సూచనను ఆయన వ్యతిరేకించారు. సుప్రీంకోర్టుకు తాను సమర్పించిన సందర్శకుల జాబితా రిజిస్టర్ అసలైనదేనని, కావాలంటే దాని ప్రామాణికతను తెలుసుకునేందుకు ఓ కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించుకోవచ్చని నివేదించారు. ‘‘ఆ రిజిస్టర్ ప్రామాణికతపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందులోని వివరాలను మార్చడం అసాధ్యం. ఆ రిజిస్టర్‌ను సీబీఐ డెరైక్టర్ నివాసం గేటు వద్ద నిర్వహించిందే అని పూర్తి ఘంటాపథంగా చెప్పగలను’’ అని ప్రశాంత్ స్పష్టంచేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పేరు సీల్డ్ కవర్లో తెలియజేయాలని ధర్మానసం ఆయనకు సూచించింది. కాగా, సుప్రీంకోర్టుకు భూషణ్ సమర్పించిన తన ఇంటి సందర్శకుల జాబితా రిజిస్టర్ వాస్తవికతపై రంజిత్ సిన్హా అనుమానం వ్యక్తంచేశారు. అందులో పది శాతం వివరాలు సరైనవి అయి ఉండొచ్చని, మిగిలిన 90 శాతం వివరాలను మార్చేశారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలను ఎవరో నియంత్రిస్తున్నారని, లేకుంటే అసలైన సందర్శకుల జాబితాను ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారని మీడియా ముందుగానే కథనాలు ఎలా ప్రచురించిందని రంజిత్ సిన్హా తరఫు న్యాయవాది వికాస్ సింగ్ సందేహం లేవనెత్తారు. వీటి వెనుక ఓ కార్పొరేట్ సంస్థ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. -
సీల్డ్‌కవర్ లో వివరాలివ్వండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హాను కలిసిన వారి వివరాలకు సంబంధించిన ఆధారాలు చూపాలని లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. రంజిత్ సిన్హా నివాసానికి వచ్చి వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితా ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించాలని పేర్కొంది. జాబితా అందజేసిన ‘ప్రజా వేగు’ వివరాలు సీల్డ్ కవర్లో పెట్టి అందజేయాలని సూచించింది. జాబితాలో పేర్కొన్న వివరాలు 90 శాతం బోగస్ అని, పదిశాతం మాత్రమే కచ్చితంగా ఉన్నాయని కోర్టుకు రంజిత్ సిన్హా తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈనెల 22కు వాయిదా వేసింది. 2జీ కేసులో నిందితులు సీబీఐ చీఫ్‌తో ఆయన ఇంట్లో చాలాసార్లు సమావేశమయ్యారని, దీనికి సందర్శకుల జాబితాయే నిదర్శనమని, ఆయన్ను 2జీ కేసు నుంచి తప్పించాలని భూషణ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
వివరణ ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులు
న్యూఢిల్లీ : 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురితో భేటీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. 2జీ కుంభకోణంలో నిందితులను రక్షిస్తున్నారన్న ఆరోపణలతో పాటు, విజిటర్స్ సాక్ష్యాలను పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు. ఇందుకు సంబంధించి పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రంజిత్ సిన్హాను ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది. -
రాతపూర్వక వివరణ ఇవ్వాలి
* 2జీ కేసులో సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాకు సుప్రీం ఆదేశం * నిందితులతో భేటీ అయ్యారనేఆరోపణలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్య * వారంలో అఫిడవిట్ దాఖలు చేయాలి * విచారణ 15కు వాయిదా న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురితో భేటీ అయినట్లుగా వచ్చిన ఆరోపణలపై రాతపూర్వకంగా స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందేనని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని, దీనిపై మౌఖికంగానే వివరణ ఇస్తాననడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వారం రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. ‘2జీ’ కేసులో నిందితులుగా ఉన్న పలు సంస్థలకు చెందిన ప్రముఖులు సీబీఐ డెరైక్టర్ రంజిత్‌ను కలిశారని, ఆ కేసు నుంచి వారిని తప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ మేరకు రంజిత్‌ను ఆయన నివాసంలో కలసిన సందర్శకుల జాబితాను కోర్టుకు సమర్పించారు. వెంటనే రంజిత్‌ను సీబీఐ చీఫ్ పదవి నుంచి తప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా కోర్టును కోరారు. సోమవారం జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం నిపై విచారణ కొనసాగించింది. పిటిషనర్ల ఆరోపణలపై మౌఖిక వివరణ ఇస్తానన్న రంజిత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తాను అఫిడవిట్ దాఖలు చేస్తే.. అది 2జీ కేసుపై ప్రభావం చూపిస్తుందని, అసలు సీబీఐ రహస్య ఫైళ్లు పిటిషనర్లకు ఎలా లభించాయో తేలాల్సి ఉందని రంజిత్ పేర్కొనడాన్ని తప్పుబట్టింది. సీబీఐ చీఫ్‌పై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, 2జీ కేసును సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టు సూచించింది. తనపై ఆరోపణలకు వివరణ ఇస్తూ రంజిత్ వారం రోజుల్లో అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను 15కి వాయిదా వేసింది. కాగా.. రంజిత్ నివాసానికి వచ్చిన సందర్శకుల జాబితా పుస్తకాన్ని విచారణ సందర్భంగా పిటిషనర్ల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు అందజేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి ఆ డాక్యుమెంట్లను తనకిచ్చారన్నారు. మరోవైపు.. ఈ కేసు విచారణలో ఉండగా 2జీ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రంజిత్‌సిన్హాను నిలువరించాలన్న ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ‘ఈడీ శాశ్వత డిప్యూటీ డెరైక్టర్‌గా రాజేశ్వర్’ ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసుల్లో మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్న రాజేశ్వర్సింగ్ను మూడు రోజుల్లోగా ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్) శాశ్వత డిప్యూటీ డెరైక్టర్‌గా చేర్చుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు రాజేశ్వర్‌సింగ్ యూపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. డిప్యుటేషన్‌పై ఈడీలోకి వచ్చిన ఆయన 2జీ, ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్‌పై లోతుగా దర్యాప్తు జరిపి పలు కీలక అంశాలను వెలికితీశారు. అయితే రాజేశ్వర్సింగ్ను తిరిగి యూపీ కేడర్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆయన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఈడీ శాశ్వత డిప్యూటీ డెరైక్టర్‌గా నియమించాలని దాదాపు ఎనిమిది నెలల కింద ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ రాజేశ్వర్సింగ్ను నియమించకపోవడంతో.. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. -
మీడియాను నియంత్రించలేం!
సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: తన ఇంటి సందర్శకుల జాబితాకు సంబంధించి ఎటువంటి సమాచారం వెలువరించకుండా మీడియాను నియంత్రించాలన్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న 2జీ కుంభకోణానికి సంబంధించి నిందితులుగా ఉన్న పలు సంస్థల ప్రతినిధులు సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాను కలిశారని.. నిందితుల్లో కొందరిని రక్షించేందుకు రంజిత్ ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రంజిత్‌ను సీబీఐ డెరైక్టర్ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలని సీపీఐఎల్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కాగా.. తన నివాసానికి వచ్చినవారి జాబితాను వెల్లడించడం తన వ్యక్తిగత జీవితానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుందని రంజిత్ సిన్హా కోర్టుకు విన్నవించారు. ఈ అంశంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తమకు సీల్డ్ కవర్లో వచ్చిన సమాచారం బయటకు పొక్కకున్నా.. ఇతరమార్గాల ద్వారా వెల్లడయ్యే అంశాలను నిలువరించటం సాధ్యం కాదని.. ఈ విషయంలో మీడియాను నియంత్రించటం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాగా, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంతో రంజిత్‌సిన్హాకు సంబంధం ఉందని.. అందువల్ల ఆ కేసు దర్యాప్తు నుంచి రంజిత్‌సిన్హాను దూరంగా ఉంచాలంటూ కామన్‌కాజ్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశిస్తే కోల్‌స్కామ్ దర్యాప్తు నుంచి తప్పుకుంటానని రంజిత్‌సిన్హా తెలిపారు. -
సీబీఐ డైరెక్టర్ ‘ఇంటి’ గుట్టు
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా మరో వివాదంలో చిక్కకున్నారు. 2జీ కేసులో సంచలన విషయాలు బయటపడడానికి కారణమైన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ మంగళవారం సిన్హా ‘ఇంటి’గుట్టు బయటపెట్టింది. సిన్హా ఇంటి ప్రవేశ రిజిస్టర్ వివరాలను సుప్రీంకోర్టుకు అందజేసింది. అందులో ఆందోళనకు గురిచేసే, 2జీ కేసులో న్యాయ పాలనకు అడ్డొచ్చే విధ్వంసకర విషయాలున్నాయంటూ సీపీఐఎల్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో పేర్కొన్నారు. 2జీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ఉన్నతాధికారులు.. గత 15 నెలలుగా సీబీఐ డెరైక్టర్ సిన్హాను ఆయన నివాసంలో కలిసినట్లుగా వచ్చిన వార్తలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ఇంటి రిజిస్టర్‌లోని వివరాలను ఆయన చదవబోతుండగా.. సీబీఐ న్యాయవాది వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ రిజిస్టర్లో వివరాలను బహిరంగంగా వెల్లడించొద్దని, అఫిడవిట్ రూపంలో అందించాలని కోరారు. డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కూడా ఆయనకు మద్దతు పలికారు. తదుపరి విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. 2జీ కేసులో ఎస్‌పీపీగా ఆనంద్ గ్రోవర్ 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (ఎస్పీపీ) సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నియమించింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలు నిర్వహించిన మరో సీనియర్ అడ్వొకేట్ యు.యు. లలిత్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. దీంతో లలిత్ స్థానంలో గ్రోవర్‌ను ఎస్‌పీపీగా నియమించాలంటూ సీనియర్ అడ్వొకేట్, సీబీఐ తరఫు న్యాయవాది కె.కె. వేణుగోపాల్ చేసిన ప్రతిపాదనకు జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది. -
ముందస్తు అనుమతి అక్కర్లేదు
* అవినీతి అధికారుల విచారణపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ * ముందస్తు అనుమతి అంటే రాజ్యాంగ విరుద్ధం * అది ఆర్టికల్ 14 ఉల్లంఘన * డీఎస్‌పీఈఏ సెక్షన్ 6ఏ కొట్టివేత * సుప్రీం తీర్పును స్వాగతించిన సీబీఐ న్యూఢిల్లీ: అవినీతి కేసుల్లోని బ్యూరోక్రాట్ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే సీబీఐ వారిని విచారించవచ్చని తేల్చి చెప్పింది. వారి విచారణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న చట్టపరమైన నిబంధన చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని మంగళవారం తేల్చి చెప్పింది. ఆ నిబంధన అవినీతిపరులకు రక్షణ కవచంలా ఉందని చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వం లోని జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖలీఫుల్లాలతో కూడిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి కేసుల్లో జాయింట్ సెక్రటరీ ర్యాంకు, ఆపై స్థాయి అధికారులను విచారించాలంటే సంబంధిత పైస్థాయి అధికారుల అనుమతి తీసుకోవాలన్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (డీఎస్‌పీఈఏ)లోని సెక్షన్ 6ఏను ధర్మాసనం కొట్టివేసింది. ఆ సెక్షన్ ప్రకారం అవినీతి కేసుల్లో అధికారులను అవినీతి నిరోధక చట్టం-1988 (పీసీఏ) ప్రకారం విచారించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, ఇది రాజ్యాంగంలోని 14వ (చట్టంముందు అందరూ సమానమే) అధికరణను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. ర్యాంకుకు సంబంధం లేకుండా అవినీతికి పాల్పడిన అధికారులందర్నీ ఒకే గూటి పక్షుల్లాగా పరిగణించి, వారందర్నీ ఒకేలా చూడాలని కోర్టు తెలిపింది. ఈ విషయంలో అధికారుల స్థాయిలను వర్గీకరించడం కష్టతరమని, అది పీసీఏ తీర్పునకు వ్యతిరేకమని ధర్మాసనం అభిప్రాయపడింది. 6ఏ ప్రకారం ముందస్తు అనుమతి అంటే పరోక్షంగా విచారణకు ఆటంకం కల్గించడమేనని చెప్పిం ది. ప్రాథమిక దర్యాప్తునకు సీబీఐని అనుమతించకపోతే ఇక విచారణ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించిం ది. అందుకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఎలాంటి మినహాయింపు ఉండదని కోర్టు పేర్కొంది. అంతకుముందు 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. స్వేచ్ఛపై ప్రశ్నలు ఉదయిస్తే, మరింత విస్తృతమైన ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పిస్తుందని చెప్పింది. ఇక కేసుల విచారణ వేగవంతం: సుప్రీం తీర్పును సీబీఐ స్వాగతించింది. ఇక కేసుల విచారణ వేగాన్ని పుంజుకుంటుందని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. ఈ తీర్పు మరింత బాధ్యతను పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ అధికారులను ప్రశ్నించే విషయంలో మరింత శ్రద్ధ పెట్టేందుకు తమ సంస్థను పటిష్టపరుస్తామని తెలిపారు. -
సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ (సీబీఐ)కు ఎట్టకేలకు కేంద్రం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది. దీంతో సీబీఐకి మరిన్ని అధికారాలు లభించినట్లు అయ్యింది. కేంద్రం తాజా నిర్ణయంతో సీబీఐ డైరెక్టర్‌కు కార్యదర్శి స్థాయి అధికారాలు ఉంటాయి. ఈ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మాట్లాడుతూ క్రీడల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా సుప్రీం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
రంజిత్ సిన్హా ‘రేప్’ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చేసిన ‘రేప్’ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. సీబీఐ చీఫ్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆయన తన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన కామెంట్లు వివాదాస్పదం కావడంతో రంజిత్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడంపై మంగళవారం రంజిత్ సిన్హా స్పందిస్తూ.. ‘క్రీడల్లో బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలు చేయలేకపోవడం ఎలాంటిదంటే రేప్‌ను నిరోధించలేకపోతే.. దానిని ఎంజాయ్ చేయండి అనడంలా ఉంటుంది’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టింది. సిన్హా వివరణ అందిన తర్వాత సీబీఐ డెరైక్టర్‌గా ఆయనను తప్పించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి, ఇటువంటి బాధ్యాతారహితమైన ప్రకటన చేయడం తగదని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు నిర్మలా సమంత్ ప్రభావాల్కర్ చెప్పారు. సున్నిత అంశాలపై పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచించారు. బీజేపీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, గడ్కారీ స్పం దిస్తూ సీబీఐ చీఫ్ వంటి అత్యుత్తమ పదవికి సిన్హా తగడని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
స్వయంప్రతిపత్తి ఎండమావేనా?!
సంపాదకీయం: మొత్తానికి కేంద్ర నేరపరిశోధక సంస్థ (సీబీఐ)కి స్వతంత్ర ప్రతిపత్తి ససేమిరా ఇచ్చేది లేదని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. నిజానికి అది పెద్ద మనసు చేసుకుంటుందని, దాన్ని స్వతంత్రంగా పనిచేసుకోనిస్తుందని ఎవరికీ భ్రమలు లేవు. కాకపోతే... వివిధ కుంభకోణాల కేసుల్ని విచారించే సందర్భంగా సీబీఐ పనితీరుపైనా, దాని కుమ్మక్కు వ్యవహారాలపైనా సుప్రీంకోర్టు పలుమార్లు మందలించింది గనుక కేంద్రం ఇక దారికి రాకతప్పదని కొందరనుకున్నారు. విషయం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లింది గనుక సీబీఐ కూడా ఈసారి చాలా ధైర్యం చేసింది. తమకు ఎలాంటి విషయాల్లో స్వయంప్రతిపత్తి అవసరమో పూసగుచ్చినట్టు చెప్పింది. పాలనాపరమైన స్వయంప్రతిపత్తితోపాటు ఆర్ధిక విషయాల్లో కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండాలని... అప్పుడుమాత్రమే తాము ఎవరి ఒత్తిళ్లకూ లోనుకాకుండా పనిచేయడం సాధ్యమవుతుందని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా విన్నవించారు. ఏఏ అంశాల్లో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఆయన సవివరంగా చెప్పారు. ఉదాహరణకు సంస్థకు డెప్యూటేషన్‌పై వచ్చేవారిని ఎంచుకునే స్వేచ్ఛ సీబీఐ డెరైక్టర్‌కు లేదు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ దాన్ని చూస్తుంది. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నా, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలన్నా, కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు కొనుగోలు చేయాలన్నా ఆర్ధిక మంత్రిత్వశాఖలోని అధికారుల దయాదాక్షిణ్యాలపై డెరైక్టర్ ఆధారపడవలసి వస్తున్నది. సంస్థకు ప్రత్యేక బడ్జెట్ ఉంటే ఇలాంటి పరిస్థితి తొలగిపోతుంది. అలాగే, డెరైక్టర్ పదవిని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో సమానం చేస్తే నేరుగా కేంద్ర హోంమంత్రితో సంప్రదించేందుకు వీలుకలుగుతుందని సీబీఐ వివరించింది. అదే గనుక జరిగితే బ్యూరోక్రసీ ఆధిపత్యం అంతమవుతుందని, నిర్ణయాలు వేగిరం తీసుకునే అవకాశం కలుగుతుందని చెప్పింది. అటు కేంద్రం కూడా తాను ఇవ్వదల్చుకున్న స్వయంప్రతిపత్తి ఎలాంటిదో వివరిస్తూ రెండు నెలలక్రితం ఒక అఫిడవిట్ దాఖలుచేసింది. అందులో సీబీఐ డెరైక్టర్ ఎంపిక కోసం అనుసరించదలచిన విధానాలు, ఆ డెరైక్టర్ కాల పరిమితి, బదిలీ...న్యాయస్థానాల్లో సీబీఐ కేసుల్ని చూసేందుకు ప్రాసిక్యూషన్ బోర్డు ఏర్పాటు, పరిమితమైన ఆర్ధిక అధికారాలవంటివి ఉన్నాయి. సీబీఐ అడుగుతున్న ఇతర అంశాల మాటేమిటన్న ప్రశ్న వచ్చాక కేంద్రం తన తాజా వాదనలు వినిపించింది. సీబీఐకి తాము ఇప్పటికే ఎక్కువ అధికారాలు కట్టబెట్టామన్న అభిప్రాయంతో కేంద్రం ఉంది. అయితే, అవి పైపై మెరుగులేనని తరచి చూస్తే తెలుస్తుంది. డెరైక్టర్ నియామకం వరకూ కొలీజియం చేస్తుంది. కానీ, అటు తర్వాత ఆ డెరైక్టర్ తన పరిమితుల్లోనే మెలగవలసి ఉంటుంది. ఏ ప్రతిపాదనైనా యధావిధిగా అంచెలంచెలుగా కేంద్ర హోంశాఖ మంత్రికి చేరుతుంది. ఈలోగా ఎంతో కాలహరణం తప్పదు. ఉదాహరణకు సంస్థ తరఫున 22మంది ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించిన ప్రతిపాదన గత కొన్ని నెలలుగా కేంద్రం వద్దే నానుతోంది. పర్యవసానంగా వివిధ న్యాయస్థానాల్లో సంస్థ నడిపిస్తున్న కేసుల విచారణలో జాప్యం ఏర్పడుతోంది. అయితే సీబీఐకి అయినా, మరో సంస్థకైనా ఇచ్చే స్వయంప్రతిపత్తి దాన్ని మరింత సమర్ధవంతంగా పనిచేయించడానికే తప్ప... కొంతమంది వ్యక్తులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడానికి కాదు. స్వయంప్రతిపత్తి ఇచ్చినప్పుడు అందుకు అవసరమైన జవాబుదారీతనాన్ని కూడా నిర్దేశించవలసిన అవసరం ఉంటుంది. కాగ్‌కి, ఎన్నికల సంఘానికి కూడా స్వయంప్రతిపత్తి ఉంది. ఆ సంస్థలకు అది రాజ్యాంగంద్వారా సంక్రమించింది. అడపా దడపా అధికార పక్షంనుంచి, విపక్షాలనుంచి అవి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నా ప్రజలకు ఆ సంస్థల్లో విశ్వసనీయత ఏర్పడటానికి కారణం వాటి సారథులే. అంతకన్నా ముఖ్యంగా రిటైరైన తర్వాత వారు ప్రభుత్వ పదవులు చేపట్టకూడదన్న నియమమే. సీబీఐకిచ్చే స్వయంప్రతిపత్తి కూడా ఆ స్థాయిలో లేకపోతే రిటైరయ్యాక వచ్చే పదవులను ఆశించి అధికారపక్షం ఎలా ఆడిస్తే అలా ఆడరన్న గ్యారంటీ ఏమీలేదు. గతంలో సీబీఐ డెరైక్టర్లుగా పనిచేసిన కొందరు ఇప్పుడు అధికార పదవుల్లో సేదతీరుతున్న తీరు కనబడుతూనే ఉంది. ఐఎంజీ భూములు కుంభకోణం వ్యవహారంలో దర్యాప్తు జరపాలని అయిదేళ్లక్రితం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినప్పుడు తమకు తగినంతమంది సిబ్బందిలేరని సీబీఐ జవాబిచ్చింది. ఆ జవాబు చడీచప్పుడూ లేకుండా ఫైళ్లలో కూరుకుపోయింది. సమాచార హక్కు చట్టంకింద దాన్ని గురించి ఆరా తీస్తే తప్ప విషయం వెల్లడి కాలేదు. సంస్థ బాధ్యతలను చూస్తున్నవారు చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే స్వయంప్రతిపత్తి ఇలా దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వ్యక్తుల ఇష్టాయిష్టాలు, వారి లోపాయికారీ సంబంధాలు సంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అందువల్లే, స్వయంప్రతిపత్తితో పాటు జవాబుదారీతనాన్ని కూడా నిర్దేశించవలసి ఉంటుంది. కానీ, యూపీఏ ప్రభుత్వం దీన్ని తన సొంత వ్యవహారంగా పరిగణిస్తోంది. ఇందులో కేవలం పాలనాపరమైన ఇబ్బందులను మాత్రమే చూస్తోంది. సీబీఐ డెరైక్టర్ ర్యాంకు... ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సీఆర్పీఎఫ్ డీజీ వంటివారి హోదాలతో సమానమైనదని, ఆయనకు కేంద్ర కార్యదర్శి హోదా ఇస్తే మిగిలినవారికీ ఇవ్వాల్సివస్తుందని చెబుతోంది. అందువల్ల ఆచరణ సాధ్యంకాదని అంటున్నది. స్వయంప్రతిపత్తివంటి విస్తృతమైన అంశాన్ని ఇలా కొన్ని పరిమితులకు లోబడి ఆలోచించే బదులు దానిపై పార్లమెంటులో కూలంకషంగా చర్చించాలి. సీబీఐకి ఇవ్వాల్సిన అధికారాలపైనా, దానికి ఉండాల్సిన జవాబుదారీ తనంపైనా అందరి అభిప్రాయాలనూ తెలుసుకోవాలి. వాటి ప్రాతిపదికగా సీబీఐని తీర్చిదిద్దినప్పుడు దాని పనితీరు మెరుగుపడుతుంది. అది నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది. ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించగలుగుతుంది.