సీబీఐ డైరెక్టర్కు సుప్రీం షాక్!!
సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. 2జీ స్పెక్ట్రం స్కాం విచారణ నుంచి వెంటనే పక్కకు తప్పుకోవాలని ఆయనను ఆదేశించింది. సీబీఐకి ఇన్నాళ్లూ ఉన్న మంచిపేరును చెడగొట్టే ఉద్దేశం తమకు లేదని, అందుకే తాము వివరంగా ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయమూర్తులు తెలిపారు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐకి ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. స్కాంలో ఇరుక్కున్న కొంతమంది పెద్దలను కాపాడేందుకు సిన్హా ప్రయత్నించారన్న ఆరోపణలతో వచ్చిన పిటిషన్ విచారణ అనంతరం న్యాయమూర్తులు ఈ ఉత్తర్వులిచ్చారు.
ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన ప్రశాంతభూషణ్ ఈ ఆరోపణలు చేశారు. తమ కంపెనీలకు 2జీ లైసెన్సులు ఇప్పించుకోడానికి నేరపూరిత కుట్రలు చేశారని ఆరోపణలున్న కంపెనీల ఉన్నతాధికారులు రంజిత్ సిన్హాను తరచు ఆయన ఇంట్లో కలుస్తున్నారని ప్రశాంత భూషణ్ ఆరోపించారు. కొన్ని టెలికం కంపెనీలకు అనుకూలంగా టెలికం శాఖ మాజీ మంత్రి రాజా నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టులో చెప్పారు. కేసు విచారణలో ఉన్నప్పుడు కొంతమందిని ఇంట్లో కలవడం ఎలాంటి నేరం కాదని ఆయన వాదించారు. డిసెంబర్ రెండో తేదీన రంజిత్ సిన్హా పదవీ విరమణ చేయాల్సి ఉంది.