cbi director
-
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
-
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి రాంసింగ్ పక్షపాతంగా వ్యవహరించారంటూ.. గతంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లను విశ్లేషిస్తూ ఆయన లేఖ రాశారు. సీబీఐ విచారణను పున:సమీక్షించుకోవాలని అవినాష్‌రెడ్డి కోరారు. ‘‘విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే రాంసింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా విచారణ జరిపారు. నాతో పాటు మా తండ్రి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని ఇరికించేందుకు సాక్ష్యులను రాంసింగ్ బెదిరించారు. నా పేరు చెప్పమని పీఏ కృష్ణారెడ్డిని థర్డ్ డిగ్రీతో రాంసింగ్ టార్చర్ చేశారు. రాంసింగ్ వేధింపులు భరించలేక పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్లను రాసింగ్ పూర్తిగా మార్చేశారు.’’ అని అవినాష్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చదవండి: నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబుతున్నది తప్పు: వివేకా పీఏ కృష్ణారెడ్డి ‘‘వరుసగా అబద్ధాలు చెప్పిన ఏ4 దస్తగిరి మాటల ఆధారంగా సీబీఐ విచారణ చేసింది. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఆలస్యం చేసింది. వివేకాను హత్య చేసిన దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కానీ, సునీత కానీ వ్యతిరేకించలేదు’’ అని అవినాష్ లేఖలో తెలిపారు. ‘‘సీఐ శంకరయ్య చెప్పని మాటలను రాంసింగ్ సాక్ష్యాలుగా చూపారు. సీఐ శంకరయ్య దీనిపై కడప జిల్లా ఎస్పీ, కడప కోర్టులో ఫిర్యాదు చేశారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను చిత్రహింసలకు గురి చేశారని ఉదయ్ కుమార్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రాంసింగ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. వివేకా హత్య కేసులో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని రాంసింగ్ వక్రీకరించారని డాక్టర్ అభిషేక్‌రెడ్డి మీడియా ముందు చెప్పారు. హత్య జరిగిన రోజు మా నాన్న భాస్కర్‌రెడ్డి ఇంటికి ఏ2 సునీల్ యాదవ్ వచ్చారని సీబీఐ చెప్పింది అబద్ధం’’ అని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు' ‘‘గూగుల్ టేక్ అవుట్‌కు సంబంధించి తొలి చార్జిషీట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. రాంసింగ్ వచ్చిన తర్వాతనే కావాలనే ఈ అబద్ధాన్ని సృష్టించారు. వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కనపెట్టింది. తన భర్త హత్యకు ఆయన మొదటి భార్య కుటుంబ సభ్యులే కారణమని వివేకా రెండో భార్య షమీమ్ అనుమానం వ్యక్తం చేశారు. అయినా సీబీఐ ఈ విషయంలో ఎటువంటి విచారణ జరపలేదు. వివేకా హత్య కేసులో గత విచారణ అధికారి రాంసింగ్ చేసిన తప్పులను సవరించాలి’’ అని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. -
సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్ గురించి మరిన్ని విషయాలు ► 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్, నిన్నటివరకు కర్ణాటక డీజీపీగా సేవలందించారు. ► సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ► ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. ► కర్ణాటక పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. ► 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు, అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా, ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా పని చేశారు. ► 1999లో డిప్యుటేషన్ మీద మారిషస్ లో మూడేళ్ల పాటు పనిచేశారు. ► 2004-2007 మధ్య మైసూరు కమిషనర్ గా పని చేశారు. ► ఆ తర్వాత కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు. ► ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద CBI (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఏర్పాటు అయింది కాబట్టి ఆ చట్టం 4A కింద డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ► ప్రవీణ్ సూద్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూద్ అల్లుడే టీం ఇండియా క్రికెట్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్. ► ప్రవీణ్ సూద్ పలు విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. సంవత్సరం పురస్కారం 1996 చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ 2002 పోలీస్ మెడల్ 2006 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ 2011 ప్రిన్స్ మైఖైల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు 2011 నేషనల్ e-గవర్నెన్స్ గోల్డ్ మెడల్ -
సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. ఈయన రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్ సూద్.. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవికాలం పూర్తయిన తర్వాత ఆయన నుంచి సూద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ పలవురు పేర్లను పరిశీలించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసింది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఈ కమిటీ శనివారం సాయంత్రం సమావేశమై తదుపరి సీబీఐ డైరెక్టర్ పదవికి కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్య ప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఎంపిక చేసింది. వీరిలో కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఖరారయ్యారు. కాగా సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైనవారి పదవీ కాలం రెండేళ్లు. అయితే ఈ పదవీ కాలన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్ సభ్యుడు పదవుల కోసం అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న జైశ్వాల్.. 1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్. గతంలో ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2021 మే 26న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబోధ్ కుమార్ రెండేళ్ల పదవీకాలం మే 25తో పూర్తికానుంది. చదవండి: సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్.. -
సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
-
సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ
న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారని అందులో పేర్కొన్నారు. తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ జైశ్వాల్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్‌పోల్ ప్రొటోకాల్ డివిజన్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్ గుప్తా, అంకుర్ కుమార్, ప్రదీప్ రాణా, అకాశ్ అహ్లావత్లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ ఇటీవలే వివాదాస్పద ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం... దీనికి అనుగుణంగానే ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని బుధవారం మరో ఏడాదిపాటు పెంచింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2020లో ఆయన పదవీకాలాన్ని పెంచుతూ... రెండేళ్ల బదులు మూడేళ్లకు గాను ఆయన్ను ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర నియామక ఉత్తర్వులను సవరించింది. కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఆ ఒక్కసారికి పొడిగింపునకు సమ్మతించిన కోర్టు తదుపరి మాత్రం సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది. గురువారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా ఆయన పదవిలో కొనసాగుతారని బుధవారం ఆదేశాలు జారీచేసింది. జాబితాలోకి విదేశాంగ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు అర్హుల జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేరుస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను సవరించింది. రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి, సీబీఐ, ఈడీల డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేలా ఆదివారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేర్చింది. -
సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు
ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్‌ట్యాపింగ్, డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ–మెయిల్ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచి్చనట్లు సైబర్ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. -
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైశ్వాల్
-
కోర్టులో ఓ మూలన కూర్చోండి
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఓ అధికారిని బదిలీ చేసిన ఘటనలో కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అంతేకాదు సాయంత్రం కోర్టు సమయం ముగియక ముందే మరోసారి వెళ్లేందుకు అనుమతి అడగ్గా.. రేపటి వరకూ కోర్టులోనే ఉంటారా.. అంటూ ఆగ్రహించింది. బిహార్‌లోని వసతిగృహాల్లో బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను అప్పటి సీబీఐ డైరెక్టర్ అయిన ఎం.నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమి తులైన సమయంలోనే ఎటువంటి బదిలీలు చేయడానికి వీల్లేదని కోర్టు అప్పట్లో పేర్కొంది. అయితే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఆయన బదిలీ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టులో సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తమ ఉత్తర్వులను ధిక్కరించారని, ఇందుకు గాను ఆయనకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. నాగేశ్వరరావుతోపాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని పేర్కొంటూ ఆయనకూ జరిమానా విధించింది. అలాగే కోర్టు సమయం పూర్తయ్యే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్ఎన్ రావు, సంజీవ్ కన్నాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు వారిరువురు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సైతం న్యాయస్ధానం తోసిపుచ్చింది. కోర్టుకు ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తామని, అయితే దీనికోసం వారు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చని అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఏమైనా చెబుతారా అంటూ వారిద్దరిని ప్రశ్నించింది. ఈ సమయంలో సీబీఐ తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయలేదని, ఇందుకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని బదిలీ చేయకూడదని నాగేశ్వరరావుకి తెలుసని, తాను ఏది అనుకున్నానో అదే చేశాను అనేలా ఆయన ధోరణి ఉందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాయంత్రం వరకూ కోర్టులోనే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరామ్‌లు సాయంత్రం కోర్టు వేళలు ముగిసే వరకు కోర్టులోనే గడిపారు. అనంతరం కోర్టు నుంచి వెళ్లి పోయారు. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా చేసిన నాగేశ్వారరావుకు కోర్టు నోటీసులు
-
సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన శుక్లా
-
సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన శుక్లా
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైన 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ పోలీస్ మాజీ చీఫ్ శుక్లాను శనివారం నూతన సీబీఐ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్‌గా శుక్లా రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. మధ్యప్రదేశ్ డీజీపీగా వ్యవహరిస్తున్న శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ సీబీఐ చీఫ్‌గా ఎంపిక చేసింది. కాగా ఈ ఏడాది జనవరి 10న సీబీఐ చీఫ్‌గా తొలగించబడిన అలోక్ వర్మ స్ధానంలో శుక్లా నూతన బాధ్యతలు చేపట్టారు. సీబీఐలో ఉన్నతాధికారులు అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల మధ్య విభేదాల పర్వంతో ఇరువురు అధికారులపై కేంద్రం వేటువేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులతో సీబీఐ చీఫ్‌గా తిరిగి నియమించబడిన అలోక్ వర్మను ప్రభుత్వం ఫైర్ సర్వీసుల డీజీగా బదిలీ చేయడంతో ఆయన ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేశారు. మరోవైపు రాకేష్ ఆస్ధానాను సీబీఐ నుంచి తప్పించిన ప్రభుత్వం వేరే మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. -
సీబీఐ కొత్త బాస్‌గా రిషికుమార్ శుక్లా
-
ఎట్టకేలకు సీబీఐకు కొత్త బాస్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రిషికుమార్ శుక్లా గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేస్తున్నారు. రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్ పదవిలో ఆయన కొనసాగనున్నారు. తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్. నాగేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. (అలోక్ వర్మపై అన్ని నిరాధార ఆరోపణలే!) విపక్ష కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిషికుమార్‌ను సీబీఐ బాస్‌గా ప్రభుత్వం నియమించింది. శుక్రవారం మోదీ నేతృత్వంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున్ ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిషికుమార్ పేరును ఖర్గే వ్యతిరేకించారు. అయితే ప్రధాని, సీజేఐ ఆమోదంతో 2-1 మెజారిటీతో రిషికుమార్‌ను సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. గత నెల 24న ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్ కమిటీ మొదటి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. దీంతో రెండో సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే. రాకేశ్ ఆస్థానాతో విభేదాల కారణంగా అలోక్ వర్మ పదవి కోల్పోయారు. (అలోక్ వర్మ ఉద్వాసనలో అసలు ప్రశ్న!) -
సీజేఐ బాటలో జస్టిస్ ఏకే సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్. నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ గురువారం ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్‌ను శుక్రవారం ఈ మరో బెంచ్ విచారించనుంది. ‘ఈ పిటిషన్‌ను విచారించలేను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవాల’ని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్ దవేతో జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు. (‘సీబీఐ’ కేసు నుంచి తప్పుకున్న సీజేఐ) సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించాలని జనవరి 10న నిర్ణయం తీసుకున్న ఉన్నతస్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. బెంచ్ నుంచి జస్టిస్ సిక్రీ తప్పుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఇప్పటికే బెంచ్ నుంచి తప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు జస్టిస్ సిక్రీ కూడా వైదొలగడంతో ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా లేదన్న భావన ప్రజల్లో కలిగే అవకాశముందన్నారు. -
ఆ డాక్యుమెంట్లు బయటపెట్టండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్‌గా ఆలోక్‌వర్మను తొలగించడానికి కీలకంగా మారిన అన్ని పత్రాలు, నివేదికలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. సీబీఐతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ‘సీఐసీ నియామకాల నుంచే పారదర్శకత అన్నది ప్రారంభం కావాలి. సీఐసీ, సీబీఐతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలోక్ వర్మను తొలగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్ కమిటీ, సమాచార కమిషనర్ల నియామకం సహా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి’ అని శ్రీధర్ కోరారు. గతేడాది కేంద్ర సమాచార కమిషన్ వార్షిక సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధిక సమాచారం అంటూ ఏదీ ఉండదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీవీసీతో పాటు సీబీఐలో జరుగుతున్న నియామకాలకు సంబంధించి తీవ్రమైన సమాచార లోటు ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను సీఐసీ దృష్టికి నమ్మకంగా, ధైర్యంతో తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. ఆలోక్ వర్మ తొలగింపుపై సీవీసీ నివేదికను, కీలక పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని సెక్షన్ 4 కింద అన్ని నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేసినప్పుడే కేంద్రం సీవీసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోందనీ, అయినా ప్రజలకు సమాచారమివ్వడం లేదన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న హైలెవల్ కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా 2–1 మెజారిటీతో తొలగించడం తెల్సిందే. -
రాకేష్ ఆస్ధానాపై బదిలీ వేటు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలోక్ వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించిన ప్రభుత్వం ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్ధాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐలో నెంబర్ టూగా ఉన్నరాకేష్ ఆస్థానాను దర్యాప్తు ఏజెన్సీ నుంచి ప్రభుత్వం తప్పించింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేసింది. కాగా తనపై నమోదైన అవినీతి కేసుపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లినా ఆయనకు ఊరట లభించలేదు.ఆలోక్ వర్మ పదవీ విరమణ చేసిన నాలుగు రోజులకే ఆస్ధానాపై బదిలీ వేటు పడింది. -
భయంతోనే ఆలోక్‌వర్మ బదిలీ: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ కొనసాగితే రఫేల్ కుంభకోణం మొత్తం బయటపడుతుందనే ఆందోళనతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అగ్నిమాపక శాఖకు మార్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రధాని స్థాయిలోనే చట్టా ల ధిక్కరణ జరిగితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. సీబీఐపై ఇలాంటి ప్రత్యక్షచర్య 55 ఏళ్లలో ఎప్పు డూ జరగలేదన్నారు. ఆలోక్‌వర్మను సీబీఐ డైర్టెకర్‌గా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శాలు తట్టుకోలేక ప్రధాని నిరాశ, నిస్పృహలతో అత్యున్నతస్థాయి కమిటీ పేరుతో వర్మను ఫైర్ సర్వీస్‌కు బదిలీచేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని వెక్కిరించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మతపరంగా విభజిం చే కుట్ర చేస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. అస్సాం పౌరసత్వం బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. -
ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ఓ అవినీతి కేసులో ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ వ్యాపారి సతీశ్ సానా ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆస్థానా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆస్థానాపై క్రిమినల్ విచారణ జరపకుండా, అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వజీరీ మాట్లాడుతూ.. ఆస్థానా, కుమార్‌లను విచారించేందుకు, అరెస్ట్ చేసేందుకు ఇకపై కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కేసు విచారణను 10 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీబీఐ అప్పటి డైరెక్టర్ ఆలోక్ వర్మపై చేసిన అభియోగాలకు తగిన ఆధారాల్లే్లవని అభిప్రాయపడ్డారు. ఓ కేసులో తనకు ఊరట కల్పించేందుకు ఆస్థానా లంచం తీసుకున్నారని సతీశ్ సానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ హోదాను దుర్వినియోగం చేస్తూ తనను వేధించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. దీంతో ఆస్థానాపై అవినీతి నిరోధక చట్టంలోని నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ తీర్పును ఆస్థానా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశముంది. -
ఆలోక్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్‌వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు. సీబీఐ డైరెక్టర్ పదవికి ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి. సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్‌ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్ సిక్రీ కలిసి ఆలోక్‌ను బదిలీ చేశారు. మళ్లీ బదిలీలన్నీ రద్దు గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌లో నాగేశ్వరరావు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు. -
వర్మ అవినీతిపై ఆధారాలున్నాయనే!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో విపక్ష నేత ఖర్గేల అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒక ఆసక్తికర అంశాన్ని ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. వర్మను తొలగించే ప్రతిపాదనకు ఎందుకు మద్దతిచ్చావని శుక్రవారం ఉదయమే ఫోన్ చేసి జస్టిస్ సిక్రీని తాను ప్రశ్నించానని, అందుకు ఆయన సమాధానమిచ్చారని కట్జూ చెప్పారు. వర్మపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని, అవి చూశాకే.. విచారణ ముగిసేవరకు సీబీఐ డైరెక్టర్ పదవిలో వర్మ కొనసాగడం సరికాదని తాను భావించినట్లు జస్టిస్ సిక్రీ వివరించారని కట్జూ వెల్లడించారు వర్మ వివరణ తీసుకున్నాకే సీవీసీ ఆ నివేదిక రూపొందించిన విషయాన్ని జస్టిస్ సిక్రీ చెప్పారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఆయన నుంచి తాను అనుమతి తీసుకున్నానన్నారు. అయితే, సీబీఐ చీఫ్‌గా వర్మను తప్పించిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని జస్టిస్ కట్జూ స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌గా తొలగించే ముందు వర్మ వివరణ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘సాధారణంగా, సస్పెండ్ చేసే ముందు కూడా సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నాకే చర్య తీసుకుంటారు. వర్మను సస్పెండ్ చేయలేదు.. డిస్మిస్ చేయలేదు. కేవలం సమాన హోదా కలిగిన పోస్ట్‌కు బదిలీ చేశారు’ అని జస్టిస్ కట్జూ గుర్తు చేశారు. వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను ఖర్గే వ్యతిరేకించారు. -
ఆలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను బలవంతపు సెలవుపై పంపించడం చెల్లదని, ఆయన్ని ఆ పదవిలో పునర్నియమిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మరునాడే అంటే, గురువారం సాయంత్రం ఆయన్ని ఆ పదవి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలోక్ వర్మను ఆ పదవిలో కొనసాగించడం సీబీఐ ప్రతిష్టకే భంగకరం కనుక ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి అగ్నిమాపక సర్వీసుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయంతో సీబీఐ ప్రతిష్ట మరింత మసకబారింది. ఆలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ రహస్య నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలతో కూడిన ఎంపిక కమిటీ వర్మపై వేటు వేసింది. ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ మోదీ, జస్టిస్ సిక్రీలు నిర్ణయం తీసుకోగా ఖర్గే వ్యతిరేకించారు. మెజారిటీ నిర్ణయం కనుక ఆలోక్ వర్మను బదిలీ చేశారు. సీబీఐ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన మోదీ ప్రభుత్వం అలా చేయకుండా బదిలీ ఎందుకు చేసింది? ఆయన అవినీతికి పాల్పడితే శిక్షించడం ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచవచ్చుగదా! అదే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి అలోక్ వర్మ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటి నుంచే ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పరిణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి ? అసలు సీబీఐకి స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? రాకేశ్ అస్థాన నియమకం నుంచే అనుమానాలు 1984, గుజరాత్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాకేశ్ అస్థానను 2017, అక్టోబర్ 22వ తేదీన సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ దాడులకు ఉపయోగించుకోవడం కోసమే అస్థానను మోదీ ప్రభుత్వం నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల కేసులను దర్యాప్తు జరపడం ద్వారా ‘సూపర్‌కాప్’గా ముద్రపడిన రాకేశ్ అస్థాన, మోదీకి మంచి విశ్వాసపాత్రుడన్న ప్రచారం ఉంది. హవాలా కేసులో ముడుపులు ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కేసు దాఖలు చేసి సీబీఐలోని ఆయన కార్యాలయంపై స్వయంగా దాడులు జరపడం తెల్సిందే. అదే రోజు రాత్రి కేంద్రం ఆదేశాల మేరకు కేంద్ర విజిలెన్స్ అధికారులు సీబీఐ కార్యాలయంలోని ఆలోక్ వర్మ కార్యాలయంపై దాడులు జరిపారు. పరస్పర ఆరోపలు చేసుకుంటున్న అస్థాన, వర్మలను అదే రోజు బలవంతపు సెలవులపై కేంద్రం పంపించింది. ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండా తనను ఎలా తొలగిస్తారంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అన్ని సమాధానం లేని ప్రశ్నలే అప్పటి నుంచి అన్ని ప్రశ్నలు, అనుమానాలు తప్ప, ఏ ఒక్కదానికి సరైన జవాబు దొరకడం లేదు. ఎంపిక కమిటీ నిర్ణయం లేకుండా వర్మపై చర్య చెల్లదని అప్పుడే తేల్చి చెప్పాల్సిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నాయకత్వంలోని బెంచీ అలా చేయకుండా వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది ? ఎందుకు రహస్య నివేదిక అడిగింది ? అస్థానపై అదే దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు? సీవీసీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తప్పని ఎందుకు పేర్కొంది? మళ్లీ మోదీ నాయకత్వంలోని ఎంపిక సమీక్షించే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వర్మను సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది? తాను తెప్పించుకున్న సీవీసీ రహస్య నివేదికను మోదీకి ఎందుకు పంపించింది? అలోక్ వర్మపై చర్య తీసుకున్న మోదీ కమిటీ రాకేశ్ అస్థానపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఆయన ఎందుకు ఇప్పుడు స్వచ్ఛంద సెలవుపై వెళ్లారు? హిందూత్వ వాదిగా ముద్రపడిన నాగేశ్వర రావునే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు? ఇదంతా ఓ స్క్రిప్టు ప్రకారం ఎందుకు జరుగుతోంది? ‘సీబీఐ యజమాని మాటలు పలికే పంజరంలో రామ చిలక’గా అభివర్ణించిన సుప్రీం కోర్టే ఎందుకు ప్రభుత్వం వైపు మొగ్గు చూపిస్తోంది? ఈ ప్రశ్నలన్నింటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. అప్పుడే ప్రభుత్వం సచ్చీలతగానీ, సీబీఐ ప్రతిష్టగానీ తేలేది. -
ఆలోక్ వర్మపై వేటు
ఆలోక్ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. మోదీ కక్షగట్టి ఆయనను తప్పించారని విపక్షాలతోపాటు న్యాయనిపుణులు కూడా పేర్కొన్నారు. విమర్శలకు జడవకుండా మోదీ ఆయనపై వేటు వేయడం కలకలం రేపింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్‌స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై మరోసారి వేటుపడింది. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపగా ఈసారి ఏకంగా బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2–1 తేడాతో నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత భేటీ అనంతరం వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం బదిలీ చేసింది. ఆ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్‌రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్‌పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను డైరెక్టర్‌గా కొనసాగనివ్వాలని ఆదేశించింది. పలు బదిలీలు చేపట్టిన వర్మ సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్కే సిన్హాను 2018 అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్ ఆదేశాలిచ్చారు. భేటీలో ఏమయింది? ఆలోక్ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ... వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అందజేసిన నివేదికను పరిశీలించింది. దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం.. సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ విభాగంలోని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి బయటపడుతుందనే.. రఫేల్ కుంభకోణం కేసును ఆలోక్ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. ‘సీబీఐ చీఫ్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వివరణ కోరి ఉండాల్సింది బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ..సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి వర్మను తొలగించడం ఏకపక్ష నిర్ణయమైతే అది దురదృష్టకరం. ఆయనపై మోపిన ఆరోపణలపై వివరణ కోరి ఉండాల్సింది’ అని అన్నారు. ఆలోక్ వర్మ తొలగింపును అధికార ఉల్లంఘనగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ అన్నారు. విశ్వసనీయత లేని సీవీసీ ఆరోపణలే ప్రాతిపదికగా వర్మను బాధ్యతల నుంచి తప్పించడం దురదృష్టకరమని లాయర్ అభిషేక్ సింఘ్వి అన్నారు. ఖర్గే అసమ్మతి నోట్ ఆలోక్‌ను తొలగించాలన్న అత్యున్నత ఎంపిక కమిటీ నిర్ణయంపై లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసమ్మతి నోట్ ఇచ్చారు. ముందుగా ఆలోక్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వాదనలు కమిటీ వినాలని ఖర్గే తెలిపినట్లు తెలిపారు. ‘సీవీసీ, సిబ్బంది శిక్షణ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన చట్ట విరుద్ధమైన ఉత్తర్వుల ఆధారంగా కోల్పోయిన 77 రోజుల పదవీ కాలాన్ని పూర్తిగా అధికారంలో కొనసాగకుండా వర్మను పదవి నుంచి తొలగించడం అన్యాయం’ అని ఖర్గే తన నోట్లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘సీవీసీ చేసిన పది ఆరోపణల్లో ఆరింటికి ఎలాంటి ఆధారాలు లేవు, అవి అసత్యాలు. మిగతా నాలుగు ఆరోపణలపై ఒక నిర్ధారణకు రావడానికి మరింత దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. నాగేశ్వర్‌రావుకే మళ్లీ పగ్గాలు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్రావుకు కేంద్రం గురువారం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా మరొకరిని నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వర్మ సెలవులో ఉన్నకాలంలో నాగేశ్వర్రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఉన్నారు. నాగేశ్వర్రావు 1986 బ్యాచ్ ఒరిస్సా కేడర్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వర్మ 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, లాయర్ ప్రశాంత్ భూషణ్‌లు రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2018 అక్టోబర్ 15వ తేదీన సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్ వర్మకు వినతిపత్రం అందజేయడం గమనార్హం. ఆలోక్ వర్మ తొలగింపు వెనక.. న్యూఢిల్లీ: 50 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఉద్వాసనకు గురైన తొలి డైరెక్టర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆలోక్ వర్మ..అవినీతి, విధుల నిర్వహణలో నిర్లిప్తతతో మూల్యం చెల్లించుకున్నారు. సీబీఐ అంతర్గత సంక్షోభం దరిమిలా విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) చేసిన పలు రకాల ఆరోపణలే ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వర్మపై వేటు వేసింది. వర్మను తొలగించడానికి సీవీసీ పేర్కొన్న కారణాల్ని పరిశీలిస్తే.. 1. మాంస వ్యాపారి మొయిన్ ఖురేషి మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త సతీశ్‌బాబు సానాను నిందితుడిగా చేర్చాలని సీబీఐ భావించినా, అందుకు ఆలోక్ వర్మ అనుమతివ్వలేదు. 2. ‘సీబీఐలో నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి’తో మధ్యవర్తులకు సంబంధం ఉందని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 3. గుర్గావ్లో సుమారు రూ.36 కోట్లు చేతులు మారిన భూమి కొనుగోలు కేసులో ఆలోక్ వర్మ పేరు ఉంది. 4. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఓ అధికారిని కాపాడేందుకు ప్రయత్నించారని ఆలోక్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. 5. అవినీతి, కళంకిత అధికారుల్ని సీబీఐలోకి తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నించారు. 6. సీవీసీకి సహకరించడానికి నిరాకరించిన వర్మ ఉద్దేశపూర్వకంగా కీలక ఫైల్స్‌ను దాచిపెట్టారు. 7. ఎంపిక కమిటీకి నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి ఆలోక్ వర్మ సీబీఐ విశ్వసనీయత, సమగ్రతను దెబ్బతీశారు. 8. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది. 9. కేబినెట్ కార్యదర్శి ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులోని విషయాలు చాలా వరకు నిజమని నిరూపితమయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రమైనవని, అవి సీబీఐ, దాని ఉన్నతాధికారులపై పెను ప్రభావం చూపాయి. 10. కొన్ని ఆరోపణల్లో నిజం తేలాలంటే లోతైన విచారణ చేయాలి. ఆలోక్ డైరెక్టర్‌గా ఉండగా నిష్పక్షపాత విచారణ జరగదు. ఎన్నో మలుపులు.. 2017, ఫిబ్రవరి 1: సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ 2018 జులై 12: సీబీఐలో ప్రమోషన్ల సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా ఆస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ఆగస్ట్ 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి ఆలోక్, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీష్ సానా రూ.2కోట్లు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రెటరీకి ఆస్థానా లేఖ. అక్టోబర్ 4: ఆస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పిన సానా. అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. అక్టోబర్ 23: రాకేశ్ ఆస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్‌కు ఏడురోజుల సీబీఐ రిమాండ్‌కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో ఆలోక్, ఆస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్‌ను నియమించిన సుప్రీంకోర్టు. నవంబర్ 12: కోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. 2019, జనవరి 8: ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.∙ జనవరి 9: బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ. తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బదిలీలను రద్దుచేస్తూ నిర్ణయం. వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హైపవర్డ్ కమిటీలో జస్టిస్ ఏకే సిక్రికి చోటు కల్పించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ జనవరి 10: ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు సహా మొత్తం ఐదుగురు అధికారులను బదిలీచేసిన వర్మ. ∙ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే, జస్టిస్ సిక్రిలతో కూడిన హైపవర్డ్ కమిటీ భేటీ. ఆలోక్ వర్మకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం. ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ కేబినెట్ నియామకాల కార్యదర్శి త్రిపాఠి జారీ చేసిన ఉత్తర్వులు -
‘సీబీఐ చీఫ్’ కమిటీలో జస్టిస్ సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఆ స్థానంలో కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. తన స్థానంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీని ప్రతిపాదించారు. ఆలోక్ వర్మ కేసులో తీర్పును వెలువరించే బెంచ్‌లో సీజేఐ కూడా భాగమై ఉన్న కారణంగా కమిటీ నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నేతృత్వంలోని ఈ అత్యున్నత కమిటీ ఆలోక్‌పై నిర్ణయం తీసుకోనుంది. -
నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నీ రద్దు
న్యూఢిల్లీ: గత 77 రోజులుగా సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలు ఒకరిపై మరొకరి ప్రత్యారోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపి నాగేశ్వరరావును అక్టోబర్ 23న సీబీఐకి కొత్త డైరెక్టర్(ఇన్చార్జ్)గా నియమించడం తెల్సిందే. సీబీఐ డైరెక్టర్ హోదాలో నాగేశ్వరరావు.. భారీస్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టారు. ఆస్థానా అవినీతి ఆరోపణల కేసును దర్యాప్తుచేస్తున్న డీఎస్పీ ఏకే బస్సీ, డీఐజీ ఎంకే సిన్హా, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా ముఖ్యమైన ఉన్నతాధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు.. మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ తీర్పుచెప్పడం తెల్సిందే. దీంతో బుధవారం సీబీఐ డైరెక్టర్ హోదాలో విధులకు హాజరైన ఆలోక్ వర్మ.. నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దుచేశారు. -
సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నా రు. సుప్రీంకోర్టు ఆక్షేపణలకు ప్రధాని నరేంద్ర మోదీ, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దేశానికి క్షమాపణ చెప్పి, నైతిక బాధ్యత వహించాలన్నారు. మఖ్దూంభవన్‌లో పార్టీ నేత చాడ వెంకటరెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 20 కోట్ల మంది కార్మికులు రెండు రోజు ల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేశారన్నా రు. అయితే ఈ సందర్భంలోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో కొన్ని కార్మిక వ్యతిరేక చట్టాలతో సిటిజన్ రిజిస్ట్రేషన్ బిల్లును తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలన్నారు. -
సీబీఐ వివాదం : సుప్రీం తీర్పుపై జైట్లీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సూచన మేరకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపాలనే నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థను పరిరక్షించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సీబీఐ ఉన్నతాధికారులు అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల పరస్పర ఆరోపణల నేపథ్యంలో సీవీసీ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జైట్లీ చెప్పుకొచ్చారు. సీబీఐ విశ్వసనీయత, నిష్పాక్షిక విచారణను కొనసాగించే క్రమంలో దర్యాప్తు సంస్థ విస్తృత ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని వ్యవహరించిందన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి అలోక్ వర్మను నియమించాలని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసిన క్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఎం నాగేశ్వరరావును నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల మధ్య విభేదాల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం వీరిని సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. -
రెండేళ్లకు ముందే తొలగించలేరు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా తనను రెండేళ్ల నిర్దిష్ట కాలానికి నియమించారనీ, అంతకుముందే విధుల నుంచి తప్పించే లేదా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని ఆ సంస్థ చీఫ్ అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత నెలలో డైరెక్టర్ అలోక్ వర్మను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించడం, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ కేసు విచారణను కోర్టు గురువారం కొనసాగించింది. అలోక్‌వర్మ తరపున ఆయన న్యాయవాది ఫాలీ నారిమన్, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ తదితరులు వాదనలు వినిపించారు. సీబీఐ డైరెక్టర్‌ను విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశాలిచ్చే అధికారం కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేదని నారిమన్ అన్నారు. ‘1997లోనే వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల నిర్దిష్ట పదవీకాలం ఉంటుంది’ అని అన్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం – 1946 ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ను తొలగించాలంటే ఆ అధికారం ఆయనను ఆ పదవికి ఎంపిక చేసిన ప్యానెల్ (ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ)కే ఉంటుందనీ, సీవీసీ ఆదేశాలపై అలోక్ వర్మను తొలగించడం చట్ట విరుద్ధమని నారిమన్ కోర్టుకు తెలిపారు. కేంద్రం చేసిన పనితో వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా పోయిందన్నారు. బదిలీ చేయలేదు, వర్మనే డైరెక్టర్: ఏజీ నారిమన్ వ్యాఖ్యలతో ఏజీ వేణుగోపాల్ విభేదించారు. అలోక్ వర్మ తన అధికారిక బంగ్లాలోనే నివసిస్తున్నారనీ, కాబట్టి ఆయనను కేంద్రం బదిలీ చేసిందని అనుకోవడానికి వీల్లేదన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్ కలగజేసుకుని.. అలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. డీఎస్పీఈ చట్టంలోని నిబంధనలను సీవీసీ, ప్రభుత్వం ఉల్లంఘించజాలవనీ, సీబీఐ డైరెక్టర్‌ను పదవీకాలం మధ్యలో బదిలీ చేయాలన్నా, తీసేయాలన్నా ఆయనను నియమించిన కమిటీకే ఆ అధికారం ఉంటుందని వివరించారు. విజిలెన్స్ చట్టం కింద అధికారాల్లేకుండానే, నిబంధనలను ఉల్లంఘించి వర్మను విధుల నుంచి కేంద్రం తప్పించిందని ఆయన ఆరోపించారు. ఈరోజు సీబీఐ డైరెక్టర్‌కు జరిగినట్లుగానే రేపు కాగ్‌కు, సీవీసీకి జరగదని భరోసా ఏంటనీ, ఈ ప్రభుత్వానికి చట్టాలపై ఏం గౌరవం ఉందనీ, చట్టబద్ధ సంస్థల స్వతంత్రత ఏమవుతుందని సిబల్ ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తులు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ తాము ఈ కేసులో అలోక్, అస్థానా వర్గాల ఆరోపణల జోలికి పోమనీ, ముందుగా కేంద్రం చట్టాన్ని ఉల్లంఘించిందా, లేదా అన్న దానిపైనే విచారిస్తామని స్పష్టం చేశారు. సీబీఐలో ఓఎస్డీ నియామకం? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో ప్రస్తుతం డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేడీ నాగేశ్వరరావు ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలువరించడం తెలిసిందే. ఈ కారణంగా సీబీఐలో పాలన సరిగా సాగడం లేదనీ, కాబట్టి సీబీఐలో డైరెక్టర్ జనరల్ ర్యాంక్‌లో ఓఎస్డీ (ప్రత్యేక విధులపై నియమితులైన అధికారి)ని నియమించాలని కేంద్రం అనుకుంటున్నట్లు సమాచారం. ఓఎస్డీ నియామకానికి అయితే∙ప్యానెల్ అనుమతి అవసరం లేదనీ, కాబట్టి ఓఎస్డీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సీవీసీ నివేదికపై సుప్రీంకు వర్మ వివరణ
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ప్రాథమిక నివేదికలోని అంశాలపై సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సోమవారం సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. దీనిపై నేడు కోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాల మేరకు అలోక్ వర్మ మధ్యాహ్నం ఒంటిగంటకు సీల్డు కవర్లో సమాధానం అందజేశారు. అంతకుముందు ఆయన.. సమాధానం ఇచ్చేందుకు మరికాస్త సమయం కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ద్వారా కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. ‘విచారణ తేదీని మేం మార్చట్లేదు. సాధ్యమైనంత తొందరగా మీరు సమాధానమిస్తే, రేపు చేపట్టే విచారణ కోసం దానిని చదవాల్సింది ఉంటుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వర్మ లాయర్‌కు తెలిపింది. దీంతో వర్మ..సరిగ్గా ఒంటి గంట సమయానికి తనపై ఆరోపణలకు సంబంధించి వివరణలున్న సీల్డు కవర్‌ను కోర్టుకు అందజేశారు. -
అసమగ్రంగా సీవీసీ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతికి సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సమర్పించిన భారీ ప్రాథమిక నివేదిక అసమగ్రంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అభియోగాల్లో కొన్నింటిలో సీవీసీ విచారణ అభినందించదగ్గ స్థాయిలో ఉందని, మరికొన్నింటి విషయంలో దర్యాప్తు అసమగ్రంగా ఉందని పేర్కొంది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం దర్యాప్తు జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘సీవీసీ సుదీర్ఘమైన ప్రాథమిక నివేదికను సమర్పించింది. అభియోగాల్లో కొన్ని ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అభియోగాలపై విచారణ జరిపేందుకు మరికొంత సమయం కావాలని సీవీసీ కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నాం’ అని తెలిపింది. సీబీఐ సంస్థ గౌరవం దృష్ట్యా ఈ నివేదికను గోప్యంగా ఉంచాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రతిని తనకు అందజేయాలని సీవీసీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో నివేదికను అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు అలోక్ వర్మకు సీల్డ్ కవర్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ పట్నాయక్‌కు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సీవీసీ నివేదికపై ప్రతిస్పందనను ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని అలోక్‌వర్మను ఆదేశించింది. ఈ సందర్భంగా తమ క్లయింట్, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు కూడా నివేదిక ప్రతిని అందజేయాలన్న ఆయన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్టీవో సంస్థ కామన్‌కాజ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే దాఖలుచేసిన పిటిషన్లను నవంబర్ 20న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
సుప్రీంకు ‘సీబీఐ’ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ఉన్నత ధర్మాసనం ఈ నివేదికను స్వీకరించి తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి శనివారమే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. కాగా, ఆదివారం రిజిస్టర్ కార్యాలయం తెరిచే ఉన్నా ఎందుకు నివేదించలేదని సీవీసీని ప్రశ్నిస్తూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సీవీసీ తరఫున కోర్టుకు హాజరైనా సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా కోర్టును క్షమాపణలు కోరుతూ.. నివేదిక తయారీ, స్పైరల్ బైండింగ్ వల్ల ఆలస్యమైందని, తాము కోర్టుకు వచ్చే వరకు సమయం మించిపోవడంతో రిజిస్ట్రర్ కార్యాలయం మూసేసి ఉందని వివరించారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 23 నుంచి 26 మధ్య తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు సీల్డ్కవర్లో కోర్టుకు అందించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి జస్టిస్ పట్నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని గతనెల 26న సీవీసీని సుప్రీం ఆదేశించింది. మరోవైపు, సీబీఐ అధికారులు అస్థానా, వర్మ, నాగేశ్వర్రావ్కు వ్యతిరేకంగా ఎన్జీవో దాఖలు చేసిన కామన్‌కాజ్ అనే పిల్‌ను సుప్రీం కొట్టేసింది. -
సీవీసీని కలిసిన సీబీఐ డైరెక్టర్ వర్మ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ గురువారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. విజిలెన్స్ కమిషనర్ శరద్ కుమార్‌తో వర్మ భేటీ అయ్యారని సీవీసీ వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం సీవీసీ కార్యాలయానికి వెళ్లిన అలోక్ వర్మ దాదాపు రెండు గంటలపాటు అక్కడ ఉన్నారు. వర్మపై అస్తానా చేసిన లంచం ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణను చేపట్టి రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సీవీసీని గత నెల 26వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. -
‘సీబీఐ వార్’లోకి కాంగ్రెస్
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని తొలగించడం చట్టవిరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడిందని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ చట్టబద్ధ అధికారాలు తొలిగించి, ఆయన్ని సెలవుపై పంపుతూ అక్టోబర్ 23 అర్ధరాత్రి దాటిన తరువాత కేంద్ర విజలెన్స్ కమిషన్(సీవీసీ), సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) జారీచేసిన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే శనివారం కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలుచేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం(డీఎస్‌పీఈఏ) ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణ ఉందని, హైపవర్డ్ కమిటీ ఆమోదం లేనిదే ఆయన్ని బదిలీ కూడా చేయరాదని గుర్తుచేశారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపికచేసే హైపవర్డ్ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ఆదేశాలు జారీచేసే ముందు కమిటీ సభ్యుడినైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీవీసీ, డీఓపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కమిటీ సమావేశం లేకుండానే కానిచ్చేశారు అలోక్ వర్మ అధికారాలు, విధులు తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు..సీబీఐ స్వతంత్రతను దెబ్బతీసేందుకు నేరుగా జరిగిన మూకుమ్మడి ప్రయత్నాలు అని ఖర్గే అభివర్ణించారు. సీబీఐలో ముదిరిన వివాదంపై చర్చించడానికి కమిటీ సమావేశం కాలేదని అక్టోబర్ 25నే లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ‘సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడి యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘించిన సంగతిని సంబంధిత భాగస్వామిగా కోర్టు దృష్టికి తెస్తున్నా. డైరెక్టర్ అధికారాల్ని తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు చట్టవిరుద్ధం. సీబీఐ డైరెక్టర్‌పై చర్య తీసుకునే అధికారాలు సీవీసీకి లేవని చట్టాలు చెబుతున్నాయి. ఎంపిక కమిటీని తక్కువచేసేలా డీఎస్పీఈ చట్టం కింద కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టరాదు’ అని ఖర్గే పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణనిస్తున్న డీఎస్పీఈ చట్టం ప్రకారం హైపవర్డ్ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా డీఓపీటీ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యవర్తికి బెయిల్ నిరాకరణ సీబీఐ అవినీతి కేసులో అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ ప్రసాద్ పెట్టుకున్న అర్జీని జడ్జి శనివారం తోసిపుచ్చారు. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరుచేయడం సరికాదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి ఎంతో పలుకుబడి ఉందని, బెయిల్‌పై విడుదల అయితే విచారణను ప్రభావితం చేయగలడని సీబీఐ వాదించింది. తనను కస్టడీలో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్న ప్రసాద్ పిటిషన్‌తో కోర్టు విభేదించింది. అక్టోబర్ 17న అరెస్టయిన ప్రసాద్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన సహ నిందితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్‌కు అక్టోబర్ 31నే బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ డైరెక్టర్‌గా తెలుగువాడెలా అయ్యారు?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సంక్షోభ పరిస్థితులను సకాలంలో చక్కదిద్దే సమర్థుడు’గా పలు బిరుదులతోపాటు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద పోలీసు అధికారి మన్నెం నాగేశ్వరరావును కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. అంతుచిక్కని ఆయన నియామకం వెనకనున్న అంశాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తెలుగువాడైన మన్నెం నాగేశ్వర రావు 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 1994లో ఒడిశాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మత మార్పిడులకు వ్యతిరేకంగ, ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించవద్దంటూ కరపత్రాలు పంచారట. 1998లో ఆయన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ముస్లింలు, క్రైస్తవులు సహనం ఏమాత్రంలేని హింసోన్మాదులు. మెజారిటి హిందువుల పన్నుల చెల్లింపులతో ఈ మైనారిటీలు బతుకుతున్నారు. ఇదీ మానవ హక్కులను ఉల్లంఘించడమే. అసలు భారత రాజ్యాంగ నిర్మాతలే మైనారిటీ పక్షపాతులు’ అని ప్రసంగించారు. ఆయన ప్రసంగంపై అప్పటి ఒడిశా సీపీఎం కార్యదర్శి అలీ కిశోర్ పట్నాయక్ హైకోర్టులో కేసు వేయడంతో బరంపురం నుంచి నాగేశ్వరరావును బదిలీ చేశారు. 2008లో కాందమల్ అల్లర్లు చెలరేగినప్పుడు ఒడిశాలో నాగేశ్వరారావు సీఆర్పీఎఫ్ ఇనిస్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. క్రైస్తవుల సెటిల్మెంట్లపై కాషాయ దళాలు దాడులు జరిపి మారణ కాండను సష్టిస్తుంటే సీఆర్పిఎఫ్ దళాలను అటు వెళ్లకుండా నివారించారని పట్నాయక్ ఆరోపించారు. పైగా ఆ అల్లర్ల సందర్భంగా ‘క్రైసెస్ మేనేజర్’గా పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. ఒడిశాలో నేరప్రదేశంలో నేరస్థుల డీఎన్ఏను సేకరించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఆయన కాస్త మంచి పేరు తెచ్చుకున్నారు. 2015లో అగ్నిమాపక సిబ్బంది యూనిఫామ్‌ల కొనుగోళ్లలో మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒడిశా ఆర్థిక శాఖ విచారణ చేపట్టింది. ఓపక్క విచారణ కొనసాగుతుండగానే అదే ఏడాది ఆయన సీబీఐ కేంద్ర కేడర్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన నియామకానికి వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ ఇంటలెజెన్స్ విభాగం పూర్తి ప్రతికూల నివేదికను ఇచ్చినా కేంద్ర పాలకులు పట్టించుకోలేదు. అందుకు హిందూత్వ వాదే కాకుండా ఆరెస్సెస్ ప్రచారక్, ప్రస్తుత బీజేపీ వ్యూహకర్త రామ్‌మాధవ్‌కు ఆయన మంచి మిత్రుడవడం కూడా కారణం కావచ్చు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులుకాగానే గుజరాత్ క్యాడర్‌కు చెందిన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు సహా మొత్తం 13 మంది అధికారులను ఏకపక్షంగా బదిలీ చేశారు. నిజాయితీకి నిలువుటద్దం, అవినీతికి మారుపేరుగా ముద్ర పడిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను కేంద్ర ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించిన విషయం తెల్సిందే. -
పోలీసు రక్షణ కల్పించండి: సాన సతీశ్
న్యూఢిల్లీ: సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు కారణమైన ఫిర్యాదు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని, విచారణకు రావాలని సీబీఐ జారీ చేసిన నోటీసులపై స్టే విధించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో ఓ నిందితుడైన సతీశ్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ అక్టోబర్ 15న అస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల తనకు పోలీసు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సతీశ్ కోరారు. ఎప్పుడు కోరితే అప్పుడు వచ్చి విచారణకు సహకరిస్తానని మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌కు లేఖ రాసిన విషయాన్ని సతీశ్ వెల్లడించారు. సీబీఐ చీఫ్ అలోక్‌వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణను ముగించేందుకు సీవీసీకి 2 వారాల గడవిచ్చి, పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ను సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో రాహుల్ అరెస్టు, విడుదల
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఢిల్లీ లోధి రోడ్‌లోని దయాళ్‌సింగ్ కళాశాల నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయం వరకు అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించింది. పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు సుమారు 130 మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, భూపిందర్‌సింగ్ హూడా, అహ్మద్ పటేల్, మోతిలాల్ వోహ్రా, వీరప్ప మెయిలీ, ఆనంద్ శర్మలతో పాటు శరద్ యాదవ్(లోక్తాంత్రిక్ జనతాదళ్), డి.రాజా(సీపీఐ), నదిముల్ హక్(టీఎంసీ) తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సీబీఐలో అనూహ్యంగా జరిగిన అధికార మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పట్నా, హైదరాబాద్, గాంధీనగర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్ తదితర పట్టణాల్లోని సీబీఐ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగారు. చండీగఢ్‌లో ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. నిజం దాగదు.. అంతకుముందు, లోధిరోడ్‌లో ర్యాలీకి హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న అన్ని సంస్థల్ని ఎన్డీయే నాశనం చేస్తోందని మండిపడ్డారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పేరిట ప్రధాని నరేంద్ర మోదీ..రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీ జేబులో రూ.30 వేల కోట్లు వేశారని ఆరోపించారు. మోదీ విచారణ నుంచి పారిపోతున్నా, సీబీఐ డైరెక్టర్‌ను పదవి నుంచి తొలగించినా నిజం మాత్రం దాగదని తేల్చిచెప్పారు. ‘చౌకీదార్(మోదీని ఉద్దేశించి) దొంగతనానికి పాల్పడటాన్ని అనుమతించం. వైమానిక దళం, యువత నుంచి ఆయన డబ్బు దొంగిలించిన సంగతి దేశం మొత్తానికి తెలుసు. మోదీ విచారణ నుంచి పారిపోయినా, నిజం బయటకు వస్తుంది’ అని పేర్కొన్నారు. నిజమేంటో ప్రధానికి చూపడానికే ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం నిజాన్ని బంధించలేదని పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన, తాను జైలులో కూర్చున్నప్పటి ఫొటోలను రాహుల్ ట్వీట్ చేశారు. -
సీబీఐ డైరెక్టర్ నాగేశ్వర రావుపై ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారంది. అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల మధ్య వర్గపోరు నేపథ్యంలో వారిద్దరినీ కేంద్రం విధుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. దీంతో తనను ప్రభుత్వం అక్రమంగా విధుల నుంచి తప్పించిందనీ, సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీబీఐలో జేడీగా ఉన్న, ప్రస్తుతం డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన, కీలక నిర్ణయాలూ తీసుకోకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. డైరెక్టర్ విధులను తాత్కాలికంగా నాగేశ్వర రావుకు కట్టబెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏయే అధికారులను బదిలీ చేశారు, ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ఎవరి నుంచి ఎవరికి అప్పగించారు తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నాగేశ్వర రావు నిర్ణయాలకు సంబంధించిన వివరాలను అందించాలని స్పష్టం చేసింది. తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ అస్థానా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ కేసును తర్వాత విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వంపై పైచేయి కాదు.. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ జరగాలని తాము చెప్పడాన్ని ప్రభుత్వంపై ఆధిపత్యంలా చూడకూడదని జడ్జీలు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఉన్న విపరీత ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందన్నారు. నాగేశ్వర రావు నిర్ణయాలను అమలు చేయకూడదని తొలుత చెప్పిన కోర్టు.. తర్వాత మాత్రం ఇకపై ఆయన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోకుండా నిలువరిస్తూ, ఇప్పటికే చేపట్టిన చర్యలను సమీక్షించిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తామంది. అలోక్ పిటిషన్‌పై కేంద్రం, సీవీసీల స్పందనలను కోరింది. సీబీఐ అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ లాయరు ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్‌నూ ఇదే బెంచ్ విచారించింది. ఈ పిటిషన్‌పై నవంబర్ 12లోగా స్పందించాల్సిందిగా కేంద్రం, సీబీఐ, సీవీసీ, అలోక్, అస్థానా, నాగేశ్వర రావులను ఆదేశించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, సీవీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్, అలోక్ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు. సీవీసీ విచారణను పది రోజుల్లోనే పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకాస్త ఎక్కువ సమయం ఇవ్వాలని తుషార్ మెహతా కోరడంతో గడువును రెండు వారాలకు పెంచింది. సీవీసీకి చిత్తశుద్ధి లేదని కాదు: అధికారి అలోక్ వర్మపై సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్‌ను కేంద్రం నియమించిందంటే సీవీసీకి చిత్తశుద్ధి లేనట్లేమీ కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘అలోక్, అస్థానాలను బాధ్యతల నుంచి తప్పిస్తూ, డైరెక్టర్ విధులను నాగేశ్వర రావుకు అప్పగిస్తూ సీవీసీ, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు. విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పినంత మాత్రాన సీవీసీ చిత్తశుద్ధిని శంకించినట్లు కాదు. విచారణను సీవీసీయే చేస్తుంది కదా. ఈ కేసులో ఉన్న కొన్ని అసాధారణ అంశాల వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారి వివరించారు. సానుకూల పరిణామం: జైట్లీ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు గొప్ప సానుకూలాంశమని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఈ ఆదేశాలతో నిజాలు బయటకొచ్చి దేశ ప్రయోజనాలు నిలబడతాయని అన్నారు. సీబీఐ సమగ్రత, నిబద్ధతను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఒక నిర్దిష్ట వ్యక్తికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తమకు లేదన్నారు. నిజం నిలిచింది: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ నిజం నిలబడిందని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘తమ చెప్పుచేతల్లో ఉండే మనుషులను నియమించుకుని సీబీఐని చేజిక్కించుకోవాలన్న మోదీ ప్రభుత్వ దుష్ట ప్రయత్నం విఫలమైంది. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా నిజం నిలబడుతుంది. సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూసిన నిరంకుశ పాలకుల చెంప చెళ్లుమనేలా ఈ తీర్పు ఉంది. మోదీ ప్రభుత్వ పావుగా సీవీసీ ఇక వ్యవహరించలేదు. జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ పారదర్శకంగా జరుగుతుంది’ అని అన్నారు. ‘పంజరం చిలుక’కు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ అనంగ కుమార్ పట్నాయక్ గతంలో సీబీఐకి సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. సంయుక్త కార్యదర్శి లేదా ఆపై స్థాయి అధికారులపై సీబీఐ విచారణ ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ నిబంధనలను 2014లో కొట్టేసి, సీబీఐకి స్వేచ్ఛనిచ్చిన ఐదుగురు జడ్జీల్లో జస్టిస్ పట్నాయక్ ఒకరు. 1949లో ఒడిశాలో జన్మించిన ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉండి పలు కీలక తీర్పులను ఇచ్చారు. కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్‌పై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారులు అఫ్తాబ్ అన్సారీ, జములుద్దీన్ నజీర్లకు ఉరిశిక్షను రద్దు చేసిన ద్విసభ్య ధర్మాసనంలో ఈయన ఒకరు. అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసులోనూ ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన బెంచ్‌లో పట్నాయక్ సభ్యుడు. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి శ్రీనివాసన్ దిగిపోవాలని ఆదేశించిన కోర్టు, 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులనూ విచారించేందుకు నియమితమైన ద్విసభ్య బెంచ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏవైనా కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ, పై కోర్టుల్లో వారు అప్పీల్ చేసుకున్నప్పుడు ఆయా ప్రజాప్రతినిధులకు లాభం కలిగించేలా ప్రజాప్రతిధుల చట్టంలో ఉన్న సెక్షన్ 8(4)ను రద్దు చేసిన ధర్మాసనాల్లోనూ పట్నాయక్ సభ్యుడే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ వివాదం పూర్వాపరాలు.. 2017 జనవరి 19: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ నియామకం. అక్టోబర్ 22: సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం. నవంబర్ 2: అస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన లాయర్ ప్రశాంత్ భూషణ్. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు. 2018 జూలై 12: పదోన్నతులు, కొత్త నియామకాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన సీవీసీ. అప్పటికే అలోక్ విదేశాలకు వెళ్లారనీ, ఆయన స్థానంలో ఈ భేటీకి హాజరయ్యే అధికారం అస్థానాకు లేదని చెప్పిన సీబీఐ. ఆగస్టు 24: అలోక్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన అస్థానా. విషయాన్ని సీవీసీకి అప్పగించిన కేంద్రం. సెప్టెంబర్ 21: అస్థానానే 6 అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని సీవీసీకి వివరణ ఇచ్చిన సీబీఐ. అక్టోబర్ 15: అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, మధ్యవర్తులు మనోజ్ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. అక్టోబర్ 22: సోదాల అనంతరం అస్థానా బృందంలోని డీఎస్పీ దేవేంద్ర కుమార్ అరెస్ట్. అక్టోబర్ 23: అస్థానాపై చర్యల విషయంలో యథాతథ స్థితి విధించిన ఢిల్లీ హైకోర్టు. దేవేంద్రకు కస్టడీ విధించిన సీబీఐ కోర్టు. అలోక్, అస్థానాలను విధుల నుంచి తప్పించి నాగేశ్వర రావుకు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించిన కేంద్రం. అక్టోబర్ 24: సీబీఐ స్వతంత్రాధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందంటూ కోర్టుకెళ్లిన అలోక్. అక్టోబర్ 26: విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సీవీసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ‘సీబీఐ.. పంజరంలో చిలక’ అని చూపుతూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రదర్శన -
‘రఫేల్’ను తొక్కిపట్టేందుకే సీబీఐ డైరెక్టర్ తొలగింపు
హైదరాబాద్: రఫేల్ స్కాంపై దర్యాప్తు చేస్తున్నారనే అక్కసుతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించిన మోదీకి అధికారంలో కొనసాగే హక్కులేదని స్పష్టం చేశారు. అలోక్ వర్మ తొలగింపును నిరసిస్తూ శుక్రవారం ఇక్కడ కోఠిలోని సీబీఐ కార్యాలయం ముందు వందలాది మంది మహాకుటమి కార్యకర్తలు, నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు సీబీఐ కార్యాలయ గేట్లను మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అక్కడికి రావడంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కుంతియా, ఉత్తమ్, వీహెచ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్‌యాదవ్‌లను అరెస్టు చేసి మలక్‌పేట్ పోలీసుస్టేషన్‌కు, మిగతావారిని కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కుంతియా, ఉత్తమ్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థను, సెక్యులరిజాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందనీ, ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఉండటం ప్రమాదకరమన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్‌కు అధికారంలో కొనసాగే హక్కులేదన్నారు. రఫేల్ కుంభకోణాన్ని తొక్కి పట్టేందుకే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ముఖేశ్‌గౌడ్ డుమ్మా గోషామహాల్ నియోజకవర్గంలోని కోఠి ప్రాంతంలో కుంతియాలాంటి జాతీయ నేతల సమక్షంలో జరుగుతున్న ధర్నాకు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్‌గౌడ్ డుమ్మా కొట్టడం గమనార్హం. ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా, లేదా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. అని స్థానిక నాయకులకు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
అలోక్ వర్మ ఇంటిపై ఇంటెలిజెన్స్ నిఘా
న్యూఢిల్లీ: ప్రభుత్వం సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివాసం బయట నలుగురు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు తచ్చాడుతూ కనిపించడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే వారక్కడ రోజువారీ రహస్య విధులు నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోం శాఖ పేర్కొంది. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు అలోక్ వర్మ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు తమ సిబ్బందే అని ఐబీ ధ్రువీకరించింది. సున్నిత ప్రాంతాల్లో ఐబీ బృందాలు రహస్యంగా నిఘా విధులు నిర్వర్తించడం సాధారణ విషయమేనని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్నిసార్లు స్థానిక పోలీసుల సహకారంతోనే ఇలా చేస్తామని, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేపడతామని చెప్పారు. ‘ఐడీ కార్డులు, ఇతర సరంజామా లేకుండా జరిపే సాధారణ నిఘాకు ఇది పూర్తిగా భిన్నమైనది. అలోక్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు నివాసముండే జన్‌పథ్ రోడ్డులో కొందరు అసాధారణంగా గుమిగూడి ఉండటాన్ని గమనించి, ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఐబీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సదరు అధికారి వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లు కూడా అలోక్ వర్మ నివాసం సమీపంలోనే నివసిస్తున్నారు. ఐబీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పగా, అలాంటిదేం లేదని స్థానిక డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ నివాసం వద్ద ఏదో గొడవ జరిగినట్లు సమాచారం అందిందని, ఆ నలుగురి గుర్తింపును ధ్రువీకరించుకున్న తరువాత వారిని వదిలిపెట్టినట్లు చెప్పారు. భయాందోళనలో ప్రధాని: రాహుల్ ఫ్రాన్స్‌తో కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సన్నద్ధమవుతున్నందనే, భయంతో మోదీ రాత్రికి రాత్రే అలోక్ ను విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా వాచ్‌మన్‌గా ఉంటానని మోదీ చేసిన వ్యాఖ్యల్ని హేళనచేశారు. ‘రెండు రోజుల క్రితం వాచ్‌మన్ ఓ కొత్త పనిచేశారు. అది మధ్యాహ్నం కాదు. ప్రజలంతా నిద్రిస్తుండగా అర్ధరాత్రి జరిగింది’ అని సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, అలోక్ వర్మ అధికారాలను పునరుద్ధరించాలని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీబీఐ జగడంపై విచారణ నేడే సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రభుత్వం తన అధికారాలు తొలగిస్తూ, సెలవుపై పంపడాన్ని సవాలుచేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు తాత్కాలికంగా డైరెక్టర్ పదవి కల్పించడంపై స్టే ఇవ్వాలని కూడా ఆయన పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. రాజకీయంగా కూడా కీలకం.. సీబీఐ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట కోర్టు నిర్ణయం సీబీఐకే కాకుండా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లకు కూడా కీలకం కానుంది. ‘సీబీఐ పంజరంలోని చిలక’ అని లోగడ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ డైరెక్టర్ పదవికి చట్టం నిర్దేశించిన రెండేళ్ల పదవీకాలాన్ని కేంద్రం ఏకపక్షంగా తగ్గించిందని, కాబట్టి కేసు తమ వైపే నిలుస్తుందని అలోక్ వర్మ లాయర్ల బృందం గట్టి విశ్వాసంతో ఉంది. రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణంపై విచారణకు ఆసక్తి చూపుతున్నందుకే కాకుండా, ప్రధాని మోదీకి సన్నిహితుడైన రాకేశ్ అస్థానాను కాపాడటానికే వర్మను కేంద్రం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. సీబీఐ అధికార వర్గంలో మార్పుపై బీజేపీ వాదన మరోలా ఉంది. అవినీతిని అసలు సహించబోమనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణగా ఆ పార్టీ సమర్థించుకుంది. అలోక్ వర్మనే డైరెక్టర్..అస్థానానే స్పెషల్ డైరెక్టర్ అవినీతి ఆరోపణలతో అధికారాలు కోల్పోయిన అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు ఇంకా తమ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని సీబీఐ స్పష్టం చేసింది. నాగేశ్వరరావుకు అప్పగించిన డైరెక్టర్ బాధ్యతలు తాత్కాలికమేనని తెలిపింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే వర్మ, అస్థానాలను సెలవుపై పంపి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలపై సీవీసీ విచారణ ముగిసే వరకు సీబీఐ బాధ్యతల్ని నాగేశ్వరరావు చూస్తారని వెల్లడించింది. సీబీఐకి సంబంధించిన ఏడు దస్త్రాలను తొలగించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. సీబీఐలో ప్రతి దశలోని అన్ని కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయని, ఇలాంటి బూటకపు వార్తలు సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అన్నారు. అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన సమయంలో రఫేల్ ఒప్పందం సహా పలు కీలక కేసులు ఆయన పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తల్ని తోసిపుచ్చారు. -
సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ : సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తిరిగి సీబీఐ చీఫ్‌గా నియమించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ప్రముఖ కాంగ్రెస్ నేతలు నిరసనల్లో పాల్గొంటారు. రాష్ట్ర రాజధానుల్లోని సీబీఐ కార్యాలయాల ఎదుట పార్టీ రాష్ట్ర చీఫ్‌లతో పాటు, రాష్ట్రస్ధాయి నేతలు ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గంటారు. సీబీఐ డైరెక్టర్‌ను అక్రమంగా, రాజ్యాంగవిరుద్ధంగా సెలవుపై పంపడం పట్ల ప్రధాని మోదీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిష్ట్మాతక దర్యాప్తు ఏజెన్సీలో వివాదాలతో కీచులాడుకుంటున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను ప్రభుత్వం రాత్రికి రాత్రి సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. వర్మ స్ధానంలో తెలుగు వ్యక్తి ఎం నాగేశ్వరరావును నూతన సీబీఐ చీఫ్‌గా కేంద్రం నియమించింది. మరోవైపు తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. -
ఆస్తానా కేసు పూర్వాపరాలు..
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై ఆ సంస్థే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజా పరిణామం నేపథ్యంలో ప్రధాని కార్యాలయం సోమవారం సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలకు సమన్లు జారీ చేసింది. సీబీఐ అత్యున్నత అధికారులిద్దరి మధ్య ఏడాది కాలంగా జరుగుతున్న అంతర్గత పోరాటం ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదుతో తీవ్రరూపం దాల్చింది. దీన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిననున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్ 22న ఆస్తానాను సిబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా స్వయంగా నియమించారు. గుజరాత్ కేడర్‌కు చెందిన ఆస్తానాపై అప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయన నియామకాన్ని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. (సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై కేసు) కేసు ఏమిటి? మాసం ఎగుమతి వ్యాపారవేత్త అయిన ఖురేషి సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని చెప్పి డైరెక్టర్ల తరఫున పలువురి నుంచి లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ తాను ఖురేషికి 3 కోట్లు లంచంగా ఇచ్చినట్టు మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు నుంచి తనను బయటపడేయడానికి గత పది నెలల్లో దఫదఫాలుగా ఈ సొమ్ము ఇచ్చానని, తాజాగా అక్టోబర్ 9వ తేదీన 25 లక్షలు ఇచ్చానని సతీష్ చెప్పారు. సతీష్ తన వాగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, ప్రసాద్ బంధువు సోమేశ్‌ల పేర్లు ప్రస్తావించారు. ఆస్తానా కోసమే ఈ సొమ్ము తీసుకుంటున్నట్టు ఖురేషి చెప్పారని కూడా సతీష్ పేర్కొన్నారు. అయితే, ఆస్తానాను తాను ప్రత్యక్షంగా కలవలేదని స్పష్టం చేశారు. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై కేసు నమోదు చేసింది. (సీబీఐ డీఎస్పీ అరెస్ట్) ఎవరీ ఖురేషీ? ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మొయిన్ అక్తర్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూలు విద్యార్ధి. చదువయిపోయాకా 1993లో ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో చిన్న పశువధశాల ప్రారంభించాడు. అక్కడ నుంచి మాంసం ఎగుమతిదారుగా మారాడు. అనతి కాలంలోనే ఈ వ్యాపారంలో పేరు సంపాదించాడు. ఏళ్లు గడిచేకొద్ది నిర్మాణం, ఫ్యాషన్ వంటి వివిధ రంగాలకు విస్తరించాడు.పాతిక కంపెనీలకు పైగా నెలకొల్పాడు. ఆయనపై అనేక పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి. హవాలా వ్యాపారం ద్వారా కోట్లు గడించాడు. సీబీఐ మాజీ డైరెక్టర్లు రంజిత్ సింగ్, ఏపీ సింగ్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. వారి తరఫున సీబీఐ కేసుల్లో నిందితుల నుంచి ముడుపులు తీసుకునేవాడని ఈడీ ఆరోపించింది. ఖురేషీకి రాజకీయ ప్రముఖులతో కూడా సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయం పన్ను శాఖలు ఖురేషీపై పలు కేసులు నమోదు చేశాయి. ఖురేషీపై ఉన్న కేసుల్లో దర్యాప్తు సాగకుండా సోనియా గాంధీ అడ్డుపడుతున్నారని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దేశం నుంచి అక్రమంగా 200 కోట్లను విదేశాలకు తరలించాడని ఖురేషీపై ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖల అధికారులు ఖురేషీ నివాసాల్లో చేపట్టిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, సేకరించిన ఫోన్ సంభాషణల ఆధారంగా ఖురేషీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ కేసుల దర్యాప్తునకు ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సతీష్‌ను కేసు నుంచి తప్పించడం కోసం ఆస్తానా తరఫున ఖురేషీ 5.75 కోట్లు తీసుకున్నట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. సతీష్ వాంగ్మూలం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ వాంగ్మూలం ఆస్తానాపై కేసుకు ప్రాతిపదికగా మారింది. ఖురేషీ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ అక్టోబర్ 4న స్థానిక మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇస్తూ ఆస్తానా కోసం తాను ఖురేషీకి ఇంత వరకు 3 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఖురేషీ కేసులో విచారించడానికి సీబీఐ సెప్టెంబర్‌లో సతీష్‌కు సమన్లు పంపింది. ఆస్తానా ద్వారా ఈ సంగతి తెలుసుకున్న సతీష్ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు.అయితే,అప్పటికే సతీష్‌పై లుక్ ఔట్ నోటీసు జారీ కావడంతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముంద సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కేసుల దర్యాప్తుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తన విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. వర్మపై 10 అవినీతిఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. ఆస్తానా పై కేసుకు దారి తీసిన పరిణామాలు: కేసులోంచి తప్పించేందుకు లంచం ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారంటూ హైదరాబాద్ వ్యాపారి సతీష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో సీబీఐ అధికారి దేవేంద్ర కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌ల పేర్లు, మరికొందరు ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం... మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీష్‌ను కలుసుకున్నారు. సీబీఐ అధికారి సహాయంతో సతీష్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సోమేశ్ తనతో సీబీఐ అధికారితో ఫోన్లో మాట్లాడించాడని, ఐదు కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తానని ఆ అధికారి చెప్పారని, ముందుగా 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలన్నారని సతీష్ ఆరోపించాడు. తనతో మాట్లాడింది రాకేశ్ ఆస్తానా అని సోమేశ్ చెప్పాడని కూడా సతీష్ పేర్కొన్నాడు. వాట్సాప్‌లో ఆస్తానా ఫోటో కూడా చూపించాడని తెలిపాడు. వారి మాటలు నమ్మి, కేసు నుంచి బయటపడాలన్న కోరికతో దుబాయ్‌లో మనోజ్ ప్రసాద్‌కు కోటి రూపాయలు ఇచ్చానని సతీష్ పేర్కొన్నాడు. తర్వాత సోమేశ్ చెప్పిన మేరకు ఢిల్లీలో సునీల్ మిట్టల్ అనే వ్యక్తికి 1.95 కోట్లు ఇచ్చానని సతీష్ వివరించాడు. అధికారులకు 2.95 కోట్లు లంచం ఇచ్చినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సతీష్‌కు నోటిసు పంపింది. దాంతో సతీష్ మనోజ్‌ను క లిసి లంచం ఇచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా 2 కోట్లు ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. గత నెల్లో సతీష్ హైదరాబాద్ నుంచి ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం అధికారులు అతనిని వెళ్లకుండా ఆపారు. సెప్టెంబర్ 26న తమ ముందు హాజరు కావలసిందిగా సీబీఐ సతీష్‌ను ఆదేశించింది. అక్టోబర్ 1న సతీష్ ఢిల్లీలో సీబీఐ ముందు హాజరయ్యాడు. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, ఎస్పి జాగ్రూప్లను కలుసుకున్నాడు. జరిగిందంతా సతీష్ మనోజ్‌కు చెప్పాడు.2 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని మనోజ్ చెప్పడంతో త్వరలోనే ఇస్తానని చెప్పాడు. అక్టోబర్ 9వ తేదీన 2 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు.అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పెట్టాడు. తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలు రాలేదు. సతీష్ అక్టోబర్ 10న 25 లక్షలు మనోజ్‌కు ఇచ్చాడని, మిగతా సొమ్ము అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే అక్టోబర్ 16న సొమ్ము తీసుకోవడానికి భారత్ వచ్చిన మనోజ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
సీబీఐ డీఎస్పీ అరెస్ట్
న్యూఢిల్లీ: సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో అరెస్టు చేశామని సీబీఐ అధికారులు సోమవారం చెప్పారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో సతీశ్ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా, శని, ఆదివారాల్లో దేవేంద్ర కుమార్ కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని ఫోన్లు, ఐపాడ్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, వాటిలోని సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే అవినీతి కేసులోనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం ఆదివారం వెలుగులోకి రావడం తెలిసిందే. మరోవైపు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నోటీసులు పంపింది. ఆదివారమే అలోక్ వర్మ పీఎంవోలోని సీనియర్ అధికారులను కలిశారు. సతీశ్ నిందితుడిగా ఉన్న కేసును ఆస్తానా నేతృత్వంలోని సీబీఐ బృందం విచారిస్తుండగా, ఆ బృందంలో దేవేంద్ర ఒకరు. సతీశ్ నుంచి ఆస్తానా రూ. 5 కోట్ల లంచాన్ని మనోజ్ ప్రసాద్ అనే మధ్యవర్తి ద్వారా తీసుకుని సతీశ్‌కు అనుకూలంగా విచారణను ప్రభావితం చేశారనేది ఆస్తానాపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో దేవేంద్ర ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల 26న సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆస్తానా బృందం చెబుతోందనీ, అయితే ఆ రోజున సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు తమ విచారణలో తెలిసింది కాబట్టి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని తేలిందని సీబీఐ అధికారులు చెప్పారు. సీఎం రమేశ్‌తో మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తన పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో ఈ ఏడాది జూన్‌లో తాను మాట్లాడానని సతీశ్ పేర్కొనట్లు దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ‘‘నాపై ఉన్న కేసుకు సంబంధించి సీఎం రమేశ్‌తో నేను మాట్లాడాను. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో తాను మాట్లాడతానని రమేశ్ నాకు అభయమిచ్చారు. ఆ తర్వాత కలిసినప్పుడు సీబీఐ డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాననీ, ఇకపై సీబీఐ నన్ను విచారణకు పిలవదని రమేశ్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జూన్ నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. దీంతో నాపై విచారణ ముగిసిందని నేను అనుకున్నా’ అని సతీశ్ దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అలోక్ వర్మపై ఆస్తానా సీవీసీ వద్ద చేసిన ఆరోపణలను బలపరిచేందుకే సతీశ్ వాంగ్మూలాన్ని దేవేంద్ర ఇలా ఫోర్జరీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆస్తానా బృందంలోని ఇతర సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీబీఐ చెప్పింది. సతీశ్ నుంచి అలోక్ వర్మ రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని ఈ ఏడాది ఆగస్టు 24నే ఆస్తానా ఆరోపించారు. పూర్తి వివరాలు విచారణలోనే తెలియాల్సి ఉంది. అసలు ఏమిటీ కేసు? మొయిన్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్ విద్యార్థి. ఆ తరువాత యూపీలో మాంసం ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనేక ఇతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. ఆయనపై పన్ను ఎగవేతలు, హవాలా కార్యకలాపాలు తదితర కేసులున్నాయి. వాటిపై పలు కేసులను సీబీఐ విచారిస్తోంది. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా దేశం నుంచి తరలించారనే కేసును ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణల్లో భాగంగా జరిపిన సోదాల్లో ఖురేషీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు, సహచరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ తనకున్న పరిచయాలతో సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఓ కేసు విచారణలో ఉంది. అలా ఖురేషీకి సంబంధించిన కేసులో ఒక నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్. కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డైరెక్టర్ అస్తానాకు ఇవ్వాలని చెప్పి తన వద్ద ఖురేషీ రూ. 3 కోట్లు తీసుకున్నాడని మెజిస్ట్రేట్ కోర్టులో సతీశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్‌ల పేర్లను సతీష్ ప్రస్తావించారు. ఈ వాంగ్మూలమే ఆస్తానాపై కేసు నమోదుకు ప్రాతిపదికగా మారింది. ఎఫ్ఐఆర్లో ఏముంది? సతీశ్ వాంగ్మూలం, ఫిర్యాదుల ఆధారంగానే ఆస్తానాపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాల ప్రకారం.. ‘మధ్యవర్తులు మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీశ్‌ను కలుసుకున్నారు. సీబీఐ కీలక అధికారి సహాయంతో సతీశ్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు సోమేశ్ ఫోన్ చేసి సతీశ్‌తో మాట్లాడించారు. రూ. 5 కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తాననీ, 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారు. దీంతో మనోజ్‌కు దుబాయ్‌లోనే సతీశ్ కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత సునీల్ మిత్తల్‌కు ఢిల్లీలో రూ.1.95 కోట్లు ఇచ్చాడు. అయినా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ నుంచి సతీశ్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో సతీష్ మనోజ్‌ను కలిసి డబ్బలిచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా రూ. 2.05 కోట్లు కూడా ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. అక్టోబర్ 9న 2 కోట్లు ఇస్తానని సతీశ్ హామీ ఇచ్చాడు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పంపాడు. ఆ తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలూ రాలేదు. అక్టోబర్ 10న రూ. 25 లక్షలను సతీశ్ మనోజ్‌కు ఇచ్చాడు. మిగతా సొమ్మును అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉండగా తీసుకునేందుకు మనోజ్ భారత్ వచ్చి అరెస్టయ్యాడు’. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఆస్తానాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముందు సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కుంభకోణాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. అలోక్ వర్మపై 10 అవినీతి ఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. -
సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై కేసు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానాపై అదే సంస్థ కేసు నమోదుచేసింది. సీబీఐలో రెండో అత్యున్నతాధికారిపై సీబీఐనే కేసు పెట్టడం ఇదే తొలిసారి. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాంస వ్యాపారి మొయిన్ ఖురేషికి సాయం చేసేందుకు మధ్యవర్తి నుంచి అస్తానా లంచం తీసుకున్నారన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ అని అధికారులు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఖురేషి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు రూ. 24 కోట్లు చెల్లించాడని అస్తానా ఆగస్టు 24న కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుపుతోంది. అప్పటి నుంచి అలోక్, అస్తానా వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రతరమైన నేపథ్యంలో సీబీఐ అస్తానాపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేర దుష్ప్రవర్తన తదితర ఆరోపణలపై కేసు నమోదుచేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీశ్‌బాబు సనా ఫిర్యాదు మేరకు సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం పలు సెక్షన్ల కింద అస్తానాతో పాటు మరికొందరిపై తాజా కేసు నమోదుచేసింది. -
శ్రీవారి సేవలో సీబీఐ డైరెక్టర్
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శనం కోసం వచ్చారు. టీటీడీ అధికారులు ఆయనకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం రంగానాయకుల మండపం వద్ద వేద పండితులు అలోక్ కుమార్ వర్మకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. -
సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్
-
సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్
న్యూఢిల్లీ: ఉత్కంఠకు తెరదించుతూ... సీబీఐ డైరెక్టర్‌గా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ(59)ను కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలచేసింది. వర్మ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన త్రిసభ్య ఎంపిక కమిటీ అనుమతినిచ్చింది. అయితే సీబీఐలో వర్మ ఎన్నడూ పనిచేయలేదని అభ్యంతరం తెలుపుతూ జనవరి 16న జరిగిన కమిటీ సమావేశంలో ఖర్గే అసమ్మతి తెలియచేసినట్లు సమాచారం. తీహార్ జైలు డీజీగా పనిచేసిన వర్మ: అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం రాష్ట్రాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్ 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వర్మ ఢిల్లీ పోలీస్ శాఖతో పాటు, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, మిజోరం రాష్ట్రాలతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. తీహార్ జైలు డీజీగా కూడా కొన్నాళ్లు వ్యవహరించారు. ఫిబ్రవరి 29, 2016 నుంచి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ 2న అనిల్ సిన్హా పదవీ విరమణ చేయడంతో అప్పటి సీబీఐ డైరెక్టర్ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ ఆస్థానా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ డెరైక్టర్ పదవి కోసం 45 మంది ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ డీజీ కృష్ణ చౌదరి, మహారాష్ట్ర డీజీపీ ఎస్సీ మా«థుర్, హైదరాబాద్‌లోని lనేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) డైరెక్టర్ అరుణా బహుగుణ పేర్లు వినిపించాయి. -
గ్రేటర్లో టీడీపీకి మరో షాక్
-
గ్రేటర్లో టీడీపీకి మరో షాక్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి విజయ రామారావు రాజీనామా చేశారు. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్‌రెడ్డి(పీజేఆర్) పై గెలిచి మంత్రి అయిన సంగతి తెలిసిందే. అంతేకాక గతంలో సీబీఐ డైరెక్టర్‌గా విజయరామారావు పనిచేశారు. ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్లో విజయ రామారావు చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ విజయ రామారావు టీఆర్ఎస్ పార్టీ లో చేరితే ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ఊపందుకున్నట్లే. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ లోకి భారీ వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. -
శ్రీవారికి రెండు అంబులెన్స్‌లు గిఫ్ట్
తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆదివారం రూ.30 లక్షల విలువైన రెండు అంబులెన్స్‌లు వితరణగా అందాయి. కోల్‌కతాకు చెందిన ప్రకాష్ చౌదరి వీటిని బహూకరించారు. శ్రీవారి ఆలయంలో రెండు దశాబ్దాలకు పైగా పోటు విధులు నిర్వహించి, ఇటీవల గుండెపోటుతో మతిచెందిన రమేష్ జ్ఞాపకార్థం వీటిని కానుకగా ఇచ్చినట్టు ప్రకాష్ చౌదరి తెలిపారు. అంబులెన్స్ తాళాలను జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డికి అందజేశారు. కాగా.. సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనీల్ సిన్హా కు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా
-
సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా
న్యూఢిల్లీ: నూతన సీబీఐ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ స్పెషల్ డెరైక్టర్ అనిల్ కుమార్ సిన్హాను ప్రభుత్వం ఎంపిక చేసింది. కొత్త సీబీఐ చీఫ్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం ప్రధాని నివాసంలో సమావేశమైంది. ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తులతో కూడిన కొలీజియం 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏకే సిన్హా పేరును సిఫారసు చేసింది. సీబీఐ డెరైక్టర్‌గా మంగళవారం పదవీ విరమణ చేసిన రంజిత్ సిన్హా వలె.. కొత్త సీబీఐ చీఫ్ కూడా బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారే కావడం విశేషం. సీబీఐలో రెండో అత్యున్నత హోదాలో(స్పెషల్ డెరైక్టర్)లో ఇప్పటివరకు ఉన్న ఏకే సిన్హా.. పలు అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో పాలు పంచుకున్నారు. ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)లో డీఐజీ, ఐజీ హోదాల్లో పనిచేశారు. విజిలెన్స్ కమిషన్‌లో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించారు. లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత సీబీఐ డెరైక్టర్‌గా నియమితుడైన మొదటి అధికారి సిన్హానే కావడం విశేషం. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఈ ముగ్గురు ఉన్న కమిటీ సిఫారసు చేసిన వారినే సీబీఐ చీఫ్‌గా నియమించాలని లోక్‌పాల్ చట్టంలో పొందుపర్చారు. అంతకుముందు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ ఆ సిఫారసు చేసేది. హెడ్లైన్లలో నిలిపిన మీడియాకు థ్యాంక్స్! వీడ్కోలు కార్యక్రమంలో రంజిత సిన్హా సీబీఐ డెరైక్టర్‌గా పదవీవిరమణ న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్‌గా 1974 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి రంజిత్ సిన్హా మంగళవారం రిటైర్ అయ్యారు. పదవీవిరమణ సందర్భంగా సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ సంస్థ ప్రయోజనాల కోసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇంత వివాదాస్పద పరిస్థితుల్లో పదవీవిరమణ చేయాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యానించారు. ‘నా విజయాల ఆధారంగా కాదు.. ఎన్ని సార్లు పడిలేచానో చూసి నన్ను జడ్జ్ చేయండి’ అన్న నెల్సన్మండేలా వ్యాఖ్యను ఉద్ఘాటించారు. తనను డార్లింగ్ లీడర్‌గా ప్రశంసించిన జూనియర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీడియాలో నాపై విమర్శలనే చూస్తుండటంతో నేను చేసిన ఇతర పనులను నేను కూడా మర్చిపోయాన’న్నారు. రోజుల తరబడి పతాక శీర్షికల్లో తనను నిలిపినందుకు కృతజ్ఙతలంటూ మీడియాపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అధికారులకు ఏమైనా సందేశమిస్తారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ.. సందేశాలిచ్చేందుకు తాను సాధువునో, రాజకీయ నేతనో కాదన్నారు. -
సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఇద్దరు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఇద్దరు నిలిచారు. ఈ పదవి కోసం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఈ జాబితాను పరిశీలించిన కమిటీ.. కుదించిన జాబితాలో సీనియర్లు శరత్ కుమార్, అనిల్ సిన్హా పేర్లను చేర్చింది. వీరిద్దరిలో ఒకరిని సీబీఐ డెరెక్టర్‌గా నియమించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కమిటీ ఎంపిక చేయనుంది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీకాలం ముగియడంతో కొత్త డెరెక్టర్ పేరును త్వరలోనే ప్రకటించనున్నారు. -
సీబీఐ డైరెక్టర్ నియామకానికి.. ఇద్దరు చాలు!
సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణల బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. తాజా బిల్లు ప్రకారం, సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్షనేత కలిసి నిర్ణయిస్తారు. అయితే, ఇందులో ఏ ఒక్కరు గైర్హాజరైనా.. మిగిలిన ఇద్దరు కలిసి నియామకం చేయొచ్చని కేంద్రం తెలిపింది. అయితే, ఈ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవులు ఎప్పుడూ ఖాళీగా ఉండబోవని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఈ నిబంధన పెట్టారని ఆయన విమర్శించారు. ఇప్పటీకీ ప్రతిపక్ష నేతను ప్రభుత్వం గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన అన్నారు. -
'కోర్టు ఆదేశాలతో ఇబ్బంది పడలేదు'
సుప్రీంకోర్టు తనను 2జీ స్కాం విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆదేశించినందుకు తానేమీ ఇబ్బంది పడలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. ఇందులో ఇబ్బందేమీ లేదని, తాను కోర్టు ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తానని ఆయన చెప్పారు. తనకు తానుగా ఈ కేసు విచారణ, దర్యాప్తు బాధ్యతల నుంచి రంజిత్ సిన్హా తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. డైరెక్టర్ తర్వాత సీనియర్ అధికారి ఎవరైతే వాళ్లు 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టాలని కోర్టు తెలిపింది. -
సీబీఐ డైరెక్టర్‌కు సుప్రీం షాక్!!
సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. 2జీ స్పెక్ట్రం స్కాం విచారణ నుంచి వెంటనే పక్కకు తప్పుకోవాలని ఆయనను ఆదేశించింది. సీబీఐకి ఇన్నాళ్లూ ఉన్న మంచిపేరును చెడగొట్టే ఉద్దేశం తమకు లేదని, అందుకే తాము వివరంగా ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయమూర్తులు తెలిపారు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐకి ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. స్కాంలో ఇరుక్కున్న కొంతమంది పెద్దలను కాపాడేందుకు సిన్హా ప్రయత్నించారన్న ఆరోపణలతో వచ్చిన పిటిషన్ విచారణ అనంతరం న్యాయమూర్తులు ఈ ఉత్తర్వులిచ్చారు. ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన ప్రశాంతభూషణ్ ఈ ఆరోపణలు చేశారు. తమ కంపెనీలకు 2జీ లైసెన్సులు ఇప్పించుకోడానికి నేరపూరిత కుట్రలు చేశారని ఆరోపణలున్న కంపెనీల ఉన్నతాధికారులు రంజిత్ సిన్హాను తరచు ఆయన ఇంట్లో కలుస్తున్నారని ప్రశాంత భూషణ్ ఆరోపించారు. కొన్ని టెలికం కంపెనీలకు అనుకూలంగా టెలికం శాఖ మాజీ మంత్రి రాజా నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టులో చెప్పారు. కేసు విచారణలో ఉన్నప్పుడు కొంతమందిని ఇంట్లో కలవడం ఎలాంటి నేరం కాదని ఆయన వాదించారు. డిసెంబర్ రెండో తేదీన రంజిత్ సిన్హా పదవీ విరమణ చేయాల్సి ఉంది. -
'నిందితులతో సీబీఐ డైరెక్టర్ భేటీ సరికాదు'
సీబీఐ డైరెక్టర్ ఇంటికి సందర్శకుల పేర్ల వెల్లడి వ్యవహారంలో గతంలో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుప్రీంకోర్టును కోరారు. పేర్లు వెల్లడించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండబోదని ఆయన వాదించారు. అయితే, సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత పరిచయస్తులు కానివాళ్లు ఎవరైనా ఉంటే వారెవరో తెలుసుకునే హక్కు ఉంటుందని ఆయన చెప్పారు. 2జీ కేసుల్లో నిందితులతో సీబీఐ డైరెక్టర్ సమావేశం కావడం సరైంది కాదని అన్నారు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందా.. కాదా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారం సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత అంశం కాదు కాబట్టి, అధికారిక హోదాలో ఆయన ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకునే హక్కు మాత్రం ప్రజలకు ఉంటుందన్నారు. -
ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి
సీబీఐ డెరైక్టర్ ఇంటి గుట్టు వ్యవహారంలో ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్లో సమర్పించాలని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఈ కేసులోని ఆరోపణలు సీబీఐ డెరైక్టర్ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు స్కాం దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడిస్తే, ఈ ఆరోపణల్లో నిజానిజాలెంతో నిర్ధారించవచ్చని పేర్కొంది. దాన్నిబట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామంది. అయితే తనకు వివరాలిచ్చిన వ్యక్తి పేరు బయటపెట్టాలన్న కోర్టు సూచనను ఆయన వ్యతిరేకించారు. సుప్రీంకోర్టుకు తాను సమర్పించిన సందర్శకుల జాబితా రిజిస్టర్ అసలైనదేనని, కావాలంటే దాని ప్రామాణికతను తెలుసుకునేందుకు ఓ కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించుకోవచ్చని నివేదించారు. ‘‘ఆ రిజిస్టర్ ప్రామాణికతపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందులోని వివరాలను మార్చడం అసాధ్యం. ఆ రిజిస్టర్‌ను సీబీఐ డెరైక్టర్ నివాసం గేటు వద్ద నిర్వహించిందే అని పూర్తి ఘంటాపథంగా చెప్పగలను’’ అని ప్రశాంత్ స్పష్టంచేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పేరు సీల్డ్ కవర్లో తెలియజేయాలని ధర్మానసం ఆయనకు సూచించింది. కాగా, సుప్రీంకోర్టుకు భూషణ్ సమర్పించిన తన ఇంటి సందర్శకుల జాబితా రిజిస్టర్ వాస్తవికతపై రంజిత్ సిన్హా అనుమానం వ్యక్తంచేశారు. అందులో పది శాతం వివరాలు సరైనవి అయి ఉండొచ్చని, మిగిలిన 90 శాతం వివరాలను మార్చేశారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలను ఎవరో నియంత్రిస్తున్నారని, లేకుంటే అసలైన సందర్శకుల జాబితాను ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారని మీడియా ముందుగానే కథనాలు ఎలా ప్రచురించిందని రంజిత్ సిన్హా తరఫు న్యాయవాది వికాస్ సింగ్ సందేహం లేవనెత్తారు. వీటి వెనుక ఓ కార్పొరేట్ సంస్థ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. -
మీడియాను నియంత్రించలేం!
సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: తన ఇంటి సందర్శకుల జాబితాకు సంబంధించి ఎటువంటి సమాచారం వెలువరించకుండా మీడియాను నియంత్రించాలన్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న 2జీ కుంభకోణానికి సంబంధించి నిందితులుగా ఉన్న పలు సంస్థల ప్రతినిధులు సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాను కలిశారని.. నిందితుల్లో కొందరిని రక్షించేందుకు రంజిత్ ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రంజిత్‌ను సీబీఐ డెరైక్టర్ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలని సీపీఐఎల్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కాగా.. తన నివాసానికి వచ్చినవారి జాబితాను వెల్లడించడం తన వ్యక్తిగత జీవితానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుందని రంజిత్ సిన్హా కోర్టుకు విన్నవించారు. ఈ అంశంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తమకు సీల్డ్ కవర్లో వచ్చిన సమాచారం బయటకు పొక్కకున్నా.. ఇతరమార్గాల ద్వారా వెల్లడయ్యే అంశాలను నిలువరించటం సాధ్యం కాదని.. ఈ విషయంలో మీడియాను నియంత్రించటం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాగా, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంతో రంజిత్‌సిన్హాకు సంబంధం ఉందని.. అందువల్ల ఆ కేసు దర్యాప్తు నుంచి రంజిత్‌సిన్హాను దూరంగా ఉంచాలంటూ కామన్‌కాజ్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశిస్తే కోల్‌స్కామ్ దర్యాప్తు నుంచి తప్పుకుంటానని రంజిత్‌సిన్హా తెలిపారు. -
సీబీఐ డైరెక్టర్ ‘ఇంటి’ గుట్టు
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా మరో వివాదంలో చిక్కకున్నారు. 2జీ కేసులో సంచలన విషయాలు బయటపడడానికి కారణమైన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ మంగళవారం సిన్హా ‘ఇంటి’గుట్టు బయటపెట్టింది. సిన్హా ఇంటి ప్రవేశ రిజిస్టర్ వివరాలను సుప్రీంకోర్టుకు అందజేసింది. అందులో ఆందోళనకు గురిచేసే, 2జీ కేసులో న్యాయ పాలనకు అడ్డొచ్చే విధ్వంసకర విషయాలున్నాయంటూ సీపీఐఎల్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో పేర్కొన్నారు. 2జీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ఉన్నతాధికారులు.. గత 15 నెలలుగా సీబీఐ డెరైక్టర్ సిన్హాను ఆయన నివాసంలో కలిసినట్లుగా వచ్చిన వార్తలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ఇంటి రిజిస్టర్‌లోని వివరాలను ఆయన చదవబోతుండగా.. సీబీఐ న్యాయవాది వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ రిజిస్టర్లో వివరాలను బహిరంగంగా వెల్లడించొద్దని, అఫిడవిట్ రూపంలో అందించాలని కోరారు. డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కూడా ఆయనకు మద్దతు పలికారు. తదుపరి విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. 2జీ కేసులో ఎస్‌పీపీగా ఆనంద్ గ్రోవర్ 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (ఎస్పీపీ) సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నియమించింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలు నిర్వహించిన మరో సీనియర్ అడ్వొకేట్ యు.యు. లలిత్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. దీంతో లలిత్ స్థానంలో గ్రోవర్‌ను ఎస్‌పీపీగా నియమించాలంటూ సీనియర్ అడ్వొకేట్, సీబీఐ తరఫు న్యాయవాది కె.కె. వేణుగోపాల్ చేసిన ప్రతిపాదనకు జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది.