సీబీఐ డైరెక్టర్‌గా తెలుగువాడెలా అయ్యారు? | Why Mannem Nageswararao chosen as CBI Director | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 5:34 PM | Last Updated on Thu, Nov 1 2018 8:16 PM

Why Mannem Nageswararao chosen as CBI Director - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘సంక్షోభ పరిస్థితులను సకాలంలో చక్కదిద్దే సమర్థుడు’గా పలు బిరుదులతోపాటు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద పోలీసు అధికారి మన్నెం నాగేశ్వరరావును కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. అంతుచిక్కని ఆయన నియామకం వెనకనున్న అంశాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.

తెలుగువాడైన మన్నెం నాగేశ్వర రావు 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన 1994లో ఒడిశాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మత మార్పిడులకు వ్యతిరేకంగ, ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించవద్దంటూ కరపత్రాలు పంచారట. 1998లో ఆయన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ముస్లింలు, క్రైస్తవులు సహనం ఏమాత్రంలేని హింసోన్మాదులు. మెజారిటి హిందువుల పన్నుల చెల్లింపులతో ఈ మైనారిటీలు బతుకుతున్నారు. ఇదీ మానవ హక్కులను ఉల్లంఘించడమే. అసలు భారత రాజ్యాంగ నిర్మాతలే మైనారిటీ పక్షపాతులు’ అని ప్రసంగించారు. ఆయన ప్రసంగంపై అప్పటి ఒడిశా సీపీఎం కార్యదర్శి అలీ కిశోర్‌ పట్నాయక్‌ హైకోర్టులో కేసు వేయడంతో బరంపురం నుంచి నాగేశ్వరరావును బదిలీ చేశారు.

2008లో కాందమల్‌ అల్లర్లు చెలరేగినప్పుడు ఒడిశాలో నాగేశ్వరారావు సీఆర్‌పీఎఫ్‌ ఇనిస్పెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. క్రైస్తవుల సెటిల్‌మెంట్లపై కాషాయ దళాలు దాడులు జరిపి మారణ కాండను సష్టిస్తుంటే సీఆర్‌పిఎఫ్‌ దళాలను అటు వెళ్లకుండా నివారించారని పట్నాయక్‌ ఆరోపించారు. పైగా ఆ అల్లర్ల సందర్భంగా ‘క్రైసెస్‌ మేనేజర్‌’గా పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. ఒడిశాలో నేరప్రదేశంలో నేరస్థుల డీఎన్‌ఏను సేకరించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఆయన కాస్త మంచి పేరు తెచ్చుకున్నారు. 2015లో  అగ్నిమాపక సిబ్బంది యూనిఫామ్‌ల కొనుగోళ్లలో మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒడిశా ఆర్థిక శాఖ విచారణ చేపట్టింది. ఓపక్క విచారణ కొనసాగుతుండగానే అదే ఏడాది ఆయన సీబీఐ కేంద్ర కేడర్‌కు బదిలీపై వెళ్లారు.

ఆయన నియామకానికి వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్‌ ఇంటలెజెన్స్‌ విభాగం పూర్తి ప్రతికూల నివేదికను ఇచ్చినా కేంద్ర పాలకులు పట్టించుకోలేదు. అందుకు హిందూత్వ వాదే కాకుండా ఆరెస్సెస్‌ ప్రచారక్, ప్రస్తుత బీజేపీ వ్యూహకర్త రామ్‌మాధవ్‌కు ఆయన మంచి మిత్రుడవడం కూడా కారణం కావచ్చు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులుకాగానే గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు సహా మొత్తం 13 మంది అధికారులను ఏకపక్షంగా బదిలీ చేశారు. నిజాయితీకి నిలువుటద్దం, అవినీతికి మారుపేరుగా ముద్ర పడిన సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలను కేంద్ర ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించిన విషయం తెల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement