Mannem Nageswara Rao
-
పచ్చవన్నె మేధావులు
ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు నిత్యం సీఎం వైఎస్ జగన్ పైనా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా కక్ష పూరితమైన ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య భక్షకులుగా మారడం మేధావులను నివ్వెరపరుస్తోంది. వీళ్లు నిజంగా సివిల్ సర్వీసుల్లో పనిచేసిన అధికారులేనా అని అనుమానం వచ్చేలా వారి వ్యవహారశైలి ఉంటోంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా, వైఎస్ జగన్‌పై మితిమీరిన అక్కసుతో వారు చేస్తున్న ఆరోపణలు సమాజాన్నే తప్పుదోవ పట్టించడానికేనన్నది స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులు, గల్లీ లీడర్ల మాదిరిగా ఎల్లో మీడియాలో వారు చేస్తున్న రచ్చను చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకాలం తాము కలిసి పనిచేసింది ఇంతలా దిగజారిన మనుషులతోనా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతున్న వీరి నిజస్వరూపం తెలుసుకోండి. – సాక్షి, అమరావతి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ 2021 వరకు మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు సిఫార్స్ చేశారు. అప్పట్లో పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనని నిమ్మగడ్డ అప్పట్లో వాటిని నిర్వహించలేదు. ఇక 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఒకే విడతలో నిర్వహించాలని 2020 ఫిబ్రవరి–మార్చి నెలల్లో నోటిఫికేషన్ జారీచేయగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి అధికారిక వైఎస్సార్సీపీకే దాదాపు సగం స్థానాలు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వానికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కరోనా పేరుతో వాటిని అర్ధంతరంగా వాయిదా వేసి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్లు–గ్రామ సచివాలయాల వ్యవస్థల ద్వారా నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే తీసుకొస్తే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరున వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేశారు. ఈయన ఫిర్యాదు కారణంగా అవ్వాతాతల పింఛన్లను ఇంటివద్దే పంపిణీ చేసే ప్రక్రియకు బేకులు పడ్డాయి. మన్నెం నాగేశ్వరరావు ఈయన అత్యంత అవినీతిపరుడు.. వాదాస్పద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా చేసిన ఈయన యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. బీహార్‌లో ఓ ప్రభుత్వ వసతి గృహంలో బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడం ద్వారా నిందితులకు ఈయన కొమ్ముకాశారన్నది తేలింది. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ఈయన దర్యాప్తు అధికారిని బదిలీ చేయడం గమనార్హం. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసెస్, హోంగార్డు విభాగానికి బదిలీ చేసింది. నిజానికి.. ♦ నాగేశ్వరరావు ఎక్కడ ఏ పోస్టులో ఉన్నా యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ♦ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ ‘ద వైర్’తోపాటు జాతీయ మీడియా ఆయన అవినీతి బాగోతాలను ఎన్నోసార్లు బయటపెట్టింది. ♦ అప్పట్లో సీబీఐ డీజీగా ఉన్న అలోక్ శర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్తానా మధ్య విభేదాలు ఏర్పడటంతో మధ్యేమార్గంగా ఎం.నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు. అప్పట్లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ఉన్న కేవీ చౌదరి అండదండలతోనే ఈయనకు ఆ పదవి దక్కిందని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. ♦ ఇక ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పటి నుంచే ఈయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. పీవీ రమేష్ తాను ఆశించిన విధంగా సర్వీసు పొడిగింపు ఇవ్వలేదని అక్కసుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సీఎం జగన్‌పై కక్ష పెంచుకుని నిమ్మగడ్డ బృందంతో చేతులు కలిపారు. తనను తాను మేధావిగా ఊహించుకునే ఈయన రిటైరైన వెంటనే సిగ్గూఎగ్గూ లేకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే ఒక కార్పొరేట్ కంపెనీలో చేరాడు. తన పలుకుబడిని ఆ కంపెనీ కోసం ఉపయోగిస్తానని చెప్పి ఉద్యోగం దక్కించుకున్న ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చిలక పలుకులు చెబుతున్నారు. ♦ అలాగే, 2018లో సీబీఐ చెన్నై జోన్ డైరెక్టర్‌గా ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న 70మంది ఐఆర్ఎస్ అధికారుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరించారనే తీవ్రమైన ఆరోపణలు ఈయనపై వచ్చాయి. దీంతో ఆయన్ని అప్పట్లోనే హఠాత్తుగా బదిలీచేశారు. ♦ ఇక నాగేశ్వరరావు తన భార్య పేరుతో ఏకంగా ఓ షెల్ కంపెనీలో భాగస్వామిగా భారీగా అక్రమ నిధులు తరలించారు. వాటితో ఆమె గుంటూరు జిల్లాలో భూములు కొనుగోలు చేశారన్నది వెలుగులోకి రావడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆమె ఆ షెల్ కంపెనీలోని 100 షేర్లను కేవలం రూ.వెయ్యికి కొనుగోలు చేసి వాటిని వెంటనే భారీ విలువకు విక్రయించడం గమనార్హం. ఆ షెల్ కంపెనీ షేర్ల ముసుగులోనే భారీ అవినీతికి పాల్పడినట్టు వెల్లడైంది. ♦ అంతేకాదు.. ఒడిశాలోని ఖుర్దాలో ఫోర్జరీ పత్రాలతో ఓ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు చూపించి భూకబ్జాకు తెగబడ్డారు. ♦ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కూడా నిందితులకు అనుకూలంగా నాగేశ్వరరావు వ్యవహరించడంతోనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ♦ సీబీఐ డైరెక్టర్ పోస్టుకు నాగేశ్వరరావు అనర్హుడని కోర్టు తేల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించింది. ♦ ఇలా తన పదవిని దుర్వినియోగం చేశాడని కోర్టు ఛీవాట్లు పెట్టిన ఆ అధికారి రిటైర్ అయ్యాక ప్రజాస్వామ్య పరిక్షరణ ఉద్ధారకుడి అవతారమెత్తి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తుండడం, అది కూడా చంద్రబాబుకి మద్దతుగా చేస్తుండడాన్ని ఎలా చూడాలి? వీళ్ల నినాదం సేవ్ ఫర్ డెమోక్రసీ.. కానీ, వీరు సేవ్ ఫర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. -
మరోసారి వివాదాల్లో నాగేశ్వరరావు
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మతసామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అత్యంత దారుణమైన రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన రావుపై ఢిల్లీ పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. (సీబీఐ అదనపు డైరెక్టర్ తొలగింపు..!) హిందువుల అణచివేత ముస్లింలకు అనుకూలంగా భారత చరిత్రను వక్రీకరించారనే అర్థం వచ్చేలా నాగేశ్వరరావు ట్విటర్లో పోస్ట్‌లు పెట్టారు. భారత నాగరికతను కుట్ర ప్రకారం ఇస్లామీకరణ(అబ్రహమైజేషన్) చేశారని ఆయన ఆరోపించారు. హిందువులను అన్ని రకాలుగా అణచివేశారని పలు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష అనుకూల విద్యావేత్తలను నెత్తిన పెట్టుకుని, హిందూ అనుకూల జాతీయవాద పండితులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. 1947-77 మధ్య 30 ఏళ్లలో దేశానికి విద్యాశాఖ మంత్రులుగా 20 ఏళ్లు ముస్లింలు, మిగతా పదేళ్లు వామపక్షవాదులు ఉన్నారని.. హిందువుల పతనానికి ఇది మొదటి దశగా అని వర్ణించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 11 ఏళ్ల పాటు(1947-58) విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. విద్యతో పాటు మీడియా, వినోద రంగాలను ఇస్లామీకరణ చేశారని.. హిందువుల ఉనికి ముప్పు వాటిల్లేలా కుట్రలు చేశారని నాగేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు. రావుపై చర్యలు తీసుకోండి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బృందా కారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం సమాజానికి చెందిన ఇతర ప్రముఖ విద్యావేత్తలను అవమానించి రెండు వర్గాల మధ్య శత్రుత్వ భావనలను ప్రేరేపించడానికి నాగేశ్వరరావు ప్రయత్నించారని కారత్ తన లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనలు ఉల్లఘించి బహిరంగంగా రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు వ్యాఖ్యలను పలువురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు తప్పుబట్టారు. వివాదాలకు చిరునామా మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం నాగేశ్వరరావుకు కొత్త కాదని ఆయన గతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. తొంభై దశకం చివరలో ఒడిశాలోని బెర్హంపూర్ డెవలప్మెంట్ అథారిటీలో అధికారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని విషపూరిత మత ప్రకటనలు చేశారు. రెండు అధికారిక విచారణలు ఆయనను దోషిగా గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాయి. 2018లో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రావును నియమించినప్పుడు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోమ్గార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. -
సీబీఐ ఏడీ మన్నెం నాగేశ్వరరావుకు డిమోషన్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ బాధ్యతల నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 1986 ఒడిశా కేడర్‌కు చెందిన ఆయనను అగ్నిమాపక దళ, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నియామకాల కమిటీ సమావేశం జరిగిన కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీబీఐతో పోలిస్తే ఫైర్ సర్వీసెస్‌ను తక్కువ కేటగిరీ డిపార్ట్మెంట్గా భావిస్తారు. సీబీఐ అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఆయనను అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గించినట్లవుతుంది. అంటే ఫైర్ సర్వీసెస్ డీజీ పోస్టు.. సీబీఐలో అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయికి సమానమైంది. ఒక రకంగా ఆయనకు ఇది డిమోషన్ లాంటిది. తాజా బదిలీతో ఆయన తన పదవీకాలం ముగిసే(జూలై 31, 2020) వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఇదే కేడర్‌లో కొనసాగాల్సి ఉంది. ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం గత సీబీఐ చీఫ్ అలోక్ వర్మను సైతం ఇదే విధంగా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన ఆ పదవిని తీసుకునేందుకు అప్పట్లో తిరస్కరించారు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండు సార్లు నియమితులయ్యారు. కాగా నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. -
సీబీఐ అదనపు డైరెక్టర్ తొలగింపు..!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ పదవి నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆయనను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీలతో సంబంధాలన్నాయంటూ నాగేశ్వరరావుపై పలు ఆరోపణలున్నాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులోనూ ఆయన వైఖరిని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన అధికారులను బదిలీ చేశారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. (చదవండి : సీబీఐ డైరెక్టర్‌గా తెలుగువాడెలా అయ్యారు?) -
సీబీఐ డైరెక్టర్‌గా తెలుగువాడెలా అయ్యారు?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సంక్షోభ పరిస్థితులను సకాలంలో చక్కదిద్దే సమర్థుడు’గా పలు బిరుదులతోపాటు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద పోలీసు అధికారి మన్నెం నాగేశ్వరరావును కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. అంతుచిక్కని ఆయన నియామకం వెనకనున్న అంశాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తెలుగువాడైన మన్నెం నాగేశ్వర రావు 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 1994లో ఒడిశాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మత మార్పిడులకు వ్యతిరేకంగ, ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించవద్దంటూ కరపత్రాలు పంచారట. 1998లో ఆయన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ముస్లింలు, క్రైస్తవులు సహనం ఏమాత్రంలేని హింసోన్మాదులు. మెజారిటి హిందువుల పన్నుల చెల్లింపులతో ఈ మైనారిటీలు బతుకుతున్నారు. ఇదీ మానవ హక్కులను ఉల్లంఘించడమే. అసలు భారత రాజ్యాంగ నిర్మాతలే మైనారిటీ పక్షపాతులు’ అని ప్రసంగించారు. ఆయన ప్రసంగంపై అప్పటి ఒడిశా సీపీఎం కార్యదర్శి అలీ కిశోర్ పట్నాయక్ హైకోర్టులో కేసు వేయడంతో బరంపురం నుంచి నాగేశ్వరరావును బదిలీ చేశారు. 2008లో కాందమల్ అల్లర్లు చెలరేగినప్పుడు ఒడిశాలో నాగేశ్వరారావు సీఆర్పీఎఫ్ ఇనిస్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. క్రైస్తవుల సెటిల్మెంట్లపై కాషాయ దళాలు దాడులు జరిపి మారణ కాండను సష్టిస్తుంటే సీఆర్పిఎఫ్ దళాలను అటు వెళ్లకుండా నివారించారని పట్నాయక్ ఆరోపించారు. పైగా ఆ అల్లర్ల సందర్భంగా ‘క్రైసెస్ మేనేజర్’గా పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. ఒడిశాలో నేరప్రదేశంలో నేరస్థుల డీఎన్ఏను సేకరించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఆయన కాస్త మంచి పేరు తెచ్చుకున్నారు. 2015లో అగ్నిమాపక సిబ్బంది యూనిఫామ్‌ల కొనుగోళ్లలో మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒడిశా ఆర్థిక శాఖ విచారణ చేపట్టింది. ఓపక్క విచారణ కొనసాగుతుండగానే అదే ఏడాది ఆయన సీబీఐ కేంద్ర కేడర్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన నియామకానికి వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ ఇంటలెజెన్స్ విభాగం పూర్తి ప్రతికూల నివేదికను ఇచ్చినా కేంద్ర పాలకులు పట్టించుకోలేదు. అందుకు హిందూత్వ వాదే కాకుండా ఆరెస్సెస్ ప్రచారక్, ప్రస్తుత బీజేపీ వ్యూహకర్త రామ్‌మాధవ్‌కు ఆయన మంచి మిత్రుడవడం కూడా కారణం కావచ్చు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులుకాగానే గుజరాత్ క్యాడర్‌కు చెందిన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు సహా మొత్తం 13 మంది అధికారులను ఏకపక్షంగా బదిలీ చేశారు. నిజాయితీకి నిలువుటద్దం, అవినీతికి మారుపేరుగా ముద్ర పడిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను కేంద్ర ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించిన విషయం తెల్సిందే. -
అలోక్ వర్మ ఇంటిపై ఇంటెలిజెన్స్ నిఘా
న్యూఢిల్లీ: ప్రభుత్వం సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివాసం బయట నలుగురు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు తచ్చాడుతూ కనిపించడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే వారక్కడ రోజువారీ రహస్య విధులు నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోం శాఖ పేర్కొంది. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు అలోక్ వర్మ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు తమ సిబ్బందే అని ఐబీ ధ్రువీకరించింది. సున్నిత ప్రాంతాల్లో ఐబీ బృందాలు రహస్యంగా నిఘా విధులు నిర్వర్తించడం సాధారణ విషయమేనని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్నిసార్లు స్థానిక పోలీసుల సహకారంతోనే ఇలా చేస్తామని, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేపడతామని చెప్పారు. ‘ఐడీ కార్డులు, ఇతర సరంజామా లేకుండా జరిపే సాధారణ నిఘాకు ఇది పూర్తిగా భిన్నమైనది. అలోక్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు నివాసముండే జన్‌పథ్ రోడ్డులో కొందరు అసాధారణంగా గుమిగూడి ఉండటాన్ని గమనించి, ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఐబీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సదరు అధికారి వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లు కూడా అలోక్ వర్మ నివాసం సమీపంలోనే నివసిస్తున్నారు. ఐబీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పగా, అలాంటిదేం లేదని స్థానిక డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ నివాసం వద్ద ఏదో గొడవ జరిగినట్లు సమాచారం అందిందని, ఆ నలుగురి గుర్తింపును ధ్రువీకరించుకున్న తరువాత వారిని వదిలిపెట్టినట్లు చెప్పారు. భయాందోళనలో ప్రధాని: రాహుల్ ఫ్రాన్స్‌తో కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సన్నద్ధమవుతున్నందనే, భయంతో మోదీ రాత్రికి రాత్రే అలోక్ ను విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా వాచ్‌మన్‌గా ఉంటానని మోదీ చేసిన వ్యాఖ్యల్ని హేళనచేశారు. ‘రెండు రోజుల క్రితం వాచ్‌మన్ ఓ కొత్త పనిచేశారు. అది మధ్యాహ్నం కాదు. ప్రజలంతా నిద్రిస్తుండగా అర్ధరాత్రి జరిగింది’ అని సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, అలోక్ వర్మ అధికారాలను పునరుద్ధరించాలని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీబీఐ జగడంపై విచారణ నేడే సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రభుత్వం తన అధికారాలు తొలగిస్తూ, సెలవుపై పంపడాన్ని సవాలుచేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు తాత్కాలికంగా డైరెక్టర్ పదవి కల్పించడంపై స్టే ఇవ్వాలని కూడా ఆయన పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. రాజకీయంగా కూడా కీలకం.. సీబీఐ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట కోర్టు నిర్ణయం సీబీఐకే కాకుండా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లకు కూడా కీలకం కానుంది. ‘సీబీఐ పంజరంలోని చిలక’ అని లోగడ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ డైరెక్టర్ పదవికి చట్టం నిర్దేశించిన రెండేళ్ల పదవీకాలాన్ని కేంద్రం ఏకపక్షంగా తగ్గించిందని, కాబట్టి కేసు తమ వైపే నిలుస్తుందని అలోక్ వర్మ లాయర్ల బృందం గట్టి విశ్వాసంతో ఉంది. రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణంపై విచారణకు ఆసక్తి చూపుతున్నందుకే కాకుండా, ప్రధాని మోదీకి సన్నిహితుడైన రాకేశ్ అస్థానాను కాపాడటానికే వర్మను కేంద్రం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. సీబీఐ అధికార వర్గంలో మార్పుపై బీజేపీ వాదన మరోలా ఉంది. అవినీతిని అసలు సహించబోమనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణగా ఆ పార్టీ సమర్థించుకుంది. అలోక్ వర్మనే డైరెక్టర్..అస్థానానే స్పెషల్ డైరెక్టర్ అవినీతి ఆరోపణలతో అధికారాలు కోల్పోయిన అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు ఇంకా తమ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని సీబీఐ స్పష్టం చేసింది. నాగేశ్వరరావుకు అప్పగించిన డైరెక్టర్ బాధ్యతలు తాత్కాలికమేనని తెలిపింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే వర్మ, అస్థానాలను సెలవుపై పంపి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలపై సీవీసీ విచారణ ముగిసే వరకు సీబీఐ బాధ్యతల్ని నాగేశ్వరరావు చూస్తారని వెల్లడించింది. సీబీఐకి సంబంధించిన ఏడు దస్త్రాలను తొలగించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. సీబీఐలో ప్రతి దశలోని అన్ని కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయని, ఇలాంటి బూటకపు వార్తలు సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అన్నారు. అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన సమయంలో రఫేల్ ఒప్పందం సహా పలు కీలక కేసులు ఆయన పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తల్ని తోసిపుచ్చారు. -
నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావుపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించడాన్ని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు. జాయింట్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సిఫార్సు చేసినా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆయన్ని కాపాడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేస్తానని తెలిపారు. ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం రాకేష్ అస్థానాపై 6 కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాకేష్ అస్థానాను కాపాడేం దుకు, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు జరగకుండా ఉండేందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. అయినా ఆయన్నే తాత్కాలిక డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. నాగేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదులను విచారించిన అలోక్ వర్మ.. ఆయన్ని సీబీఐ నుంచి తొలగించి ప్రాసిక్యూట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సిఫారసు చేశారు. కానీ నాగేశ్వరరావును సీవీసీ కాపాడారు’ అని ఆయన అన్నారు. -
ఏజెన్సీ నుంచి రెండో డైరెక్టర్
మంగపేట: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వర రావు తెలుగువాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపూర్ గ్రామానికి చెందిన మన్నెం పిచ్చయ్య, శేషమ్మల రెండో కుమారుడు. మన్నెం పిచ్చయ్య చిన్నవయస్సులోనే తన తండ్రితో పాటు గుంటూరు జిల్లా పెదకోరుపాడు నుంచి అప్పటి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తాలూకా తిమ్మాపూర్ గ్రామానికి, అక్కడ పదేళ్లు ఉన్న తరువాత బోరు నర్సాపూర్‌కు వలస వచ్చారు. నాగేశ్వర రావు పాఠశాల విద్య మంగపేట, తిమ్మంపేటల్లో, డిగ్రీ వరంగల్‌లో చదువుకున్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. ఆ తరువాత సివిల్స్ రాసి ఐపీఎస్ సాధించారు. ఒడిశా క్యాడర్ ఐపీఎస్: ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారిగా రూర్కెలా జిల్లా ఏఎస్సీగా, కటక్‌లో ఎస్పీగా, అనంతరం సీఆర్పీఎఫ్ ఐజీ, డీఐజీగా విధులు నిర్వర్తించారు. తరువాత ఒడిశా అడిషనల్ డీజీగా కొంత కాలం పనిచేసి చెన్నై జోన్ సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నాగేశ్వర రావు భార్య సంధ్య. వీరికి కొడుకు వాసుకీనందన్, కూతురు ఆమని ఉన్నారు. ఆమని ప్రస్తుతం ఎల్ఎల్బీ పూర్తిచేసి లా ప్రాక్టీస్ చేస్తొంది. కుమారుడు వాసుకీనందన్ ఢిల్లీలో పీహెచ్డీ చేస్తున్నాడు. విజయరామారావు కూడా.. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కాకులమర్రి విజయరామారావు 1996లో మొదటి సారిగా సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇద్దరు సీబీఐ డైరెక్టర్లుగా ఇప్పటివరకు నియమితులయ్యారు. -
మోదీ, బాబు మధ్య యుద్ధం ఉత్తుత్తిదే.. ఇదిగో రుజువు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్‌గా నాగేశ్వర రావు నియామకం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సీబీఐలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాల మధ్య విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ సెలవుపై పంపిన ప్రభుత్వం.. సీబీఐ కొత్త డైరెక్టర్‌గా జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఎం నాగేశ్వర రావును నియమించింది. సీనియారిటీలో తనకన్నా ముందున్న అధికారి ఏకే శర్మను కాదని, నలుగురు జాయింట్ డైరక్టర్లలో ఒకరైన, చెన్నై జోన్ బాధ్యతలు చూస్తున్న నాగేశ్వర రావుకు కీలక బాధ్యతలు అప్పగించడంపై న్యూఢిల్లీ రాజకీయ వర్గాల్లో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నాగేశ్వర రావుపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయని.. ఇప్పటికే అలోక్‌వర్మ, అస్థానాలపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతిన్న సీబీఐ చీఫ్‌గా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారిని అధిపతిగా నియమించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కూడా ఇవే అంశాలను లేవనెత్తుతూ.. ‘నాగేశ్వర రావుపై వచ్చి న అవినీతి ఆరోపణలపై డైరెక్టర్ హోదాలో విచారణ జరిపిన అలోక్ వర్మ.. నాగేశ్వర రావును సీబీఐ నుంచి తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలని చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు సిఫారసు చేశారు. కానీ సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు’ అని వ్యాఖ్యానించారు. ఎలాంటి అంతర్గత విచారణ, వ్యక్తిత్వ మదింపు జరపకుండానే నాగేశ్వర రావును నియమించడాన్ని సీబీఐలోనే కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది పక్కా రాజకీయ నియామకమేనని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, నాగేశ్వర రావు నియామకం వెనుక రాజకీయ కోణం ఒకటి బయటపడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు, పార్టీలోని కొందరు కీలక నేతలకు నాగేశ్వర రావు అత్యంత సన్నిహితుడని పేరు. టీడీపీలోని కొందరు నేతలపై అవినీతి ఆరోపణలున్నాయి. విచారణ దశలో పలు ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి సన్నిహితుడైన అధికారిని అత్యున్నత దర్యాప్తు సంస్థకు చీఫ్‌గా కేంద్రం నియమించడంలో లోగుట్టేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్రంపై, ప్రధాని మోదీపై అవకాశం లభించిన ప్రతీసారి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టడం వెనక మతలబేంటనే చర్చ జరుగుతోంది. ‘మోదీ– బాబు వార్ ఉత్తుత్తి యుద్ధమే.. పై పై ప్రచారమే.. అవసరమైతే, అవకాశం లభిస్తే మోదీతో కలిసి నడిచేందుకు బాబు సిద్దంగానే ఉంటారు. పట్టువిడుపులకు మోదీ కూడా రెడీనే. సీబీఐ చీఫ్‌గా నాగేశ్వర రావు నియామకం దీన్నే రుజువు చేస్తోంది’ అని ఢిల్లీ– అమరా వతి రాజకీయాలపై పట్టున్న ఓ రాజకీయ విశ్లేషకు డు అన్నారు. ‘మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు లభించే ఏ అవకాశాన్ని చంద్రబాబు వదులుకోడని, నాగేశ్వర రావు నియామకంపై విపక్షాలు పెద్దగా రాద్ధాంతం చేస్తున్నా.. చంద్రబాబు మాత్రం నోరెత్తకపోవడం అందులో భాగమేనని, సయోధ్య కోసం బీజేపీ ఒక అడుగేస్తే.. బాబు నాలుగడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని బీజేపీ సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్య గమనార్హం. చదవండి: ఆపరేషన్ ‘ఎల్లో’.. సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో తిష్టకు టీడీపీ కుట్ర! -
సీబీఐలో మిడ్నైట్ డ్రామా
వర్గపోరు, అత్యున్నతాధికారులపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అర్ధరాత్రి ఆ సంస్థలో అనూహ్య మార్పులు చేపట్టింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జేడీగా ఉన్న తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. విచారణకు సహకరించకపోవడంతో సీవీసీ సిఫారసుల మేరకే అలోక్ వర్మను పదవి నుంచి తొలగించామంది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఇలా డైరెక్టర్‌ను మార్చడం ఇదే తొలిసారి. నాగేశ్వరరావు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12 మంది అధికారులను బదిలీ చేశారు. అస్థానా, అలోక్‌ల పరస్పర అవినీతి ఆరోపణలపై విచారణకు కొత్త బృందాన్ని నియమించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు కాగా అంతకుముందే తనను తొలగించడం ద్వారా సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశంలో కేంద్రం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. రఫేల్ స్కాం పత్రాలను అలోక్ వర్మ సేకరిస్తున్నందునే ఆయన్ను ప్రధాని తప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యూఢిల్లీ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గపోరుతో మొదలైన ముసలం కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావును ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది. కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) సిఫారసుల మేరకే అలోక్, అస్థానాలను సెలవుపై పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీవీసీ విచారణకు అలోక్ సహకరించకపోవడం వల్లే ఆయనను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కేసుల విచారణల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కక్షతోనే తనను పదవి నుంచి తప్పించారని అలోక్ ఆరోపించారు. ఇటు సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే విధుల్లో చేరి చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయ భవనంలోని రెండు అంతస్తులను సీజ్ చేసి, అలోక్ వర్మకు సన్నిహితులుగా పేరున్న మొత్తం 12 మంది అధికారులను ఉన్నపళంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపేందుకు అలోక్ ఆసక్తిగా ఉన్నందునే ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే సీబీఐ గౌరవాన్ని, నిబద్ధతను కాపాడేందుకు ఈ బదిలీలు కచ్చితంగా అత్యవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. వివిధ ప్రాంతాలకు బదిలీలు నాగేశ్వర రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలోక్ వర్మకు సన్నిహితులుగా ఉన్న 12 మంది అధికారులను ఉన్నపళంగా అండమాన్ నికోబార్ దీవులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు నాగేశ్వర రావు బదిలీ చేశారు. అస్థానాపై నమోదైన కేసులను విచారిస్తున్న పాత బృందంలోని సభ్యులను పూర్తిగా తొలగించి, మొత్తం కొత్త వారితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. అస్థానాపై కేసు విచారణకు సీబీఐ జేడీ మురుగేశన్ పర్యవేక్షణలో డీఐజీ తరుణ్ గౌబా, ఎస్పీ సతీశ్ దగర్‌లతో నాగేశ్వర రావు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ కేసును సతీశ్ విచారించగా, తరుణ్ గౌబా మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం దర్యాప్తులో పాలుపంచుకున్నారు. మురుగేశన్ బొగ్గు కుంభకోణం కేసును విచారించారు. అటు అస్థానాపై నమోదైన కేసును విచారిస్తున్న ఏకే బస్సీని అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు, ఆయన పై అధికారి, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్‌ను జబల్పూర్కు, అస్థానా కేసు విచారణను పర్యవేక్షిస్తున్న డీఐజీ ఎంకే సిన్హాను నాగ్‌పూర్‌కు నాగేశ్వర రావు బదిలీపై పంపారు. జేడీ (పాలసీ)గా ఉన్న అరుణ్ కుమార్ శర్మను.. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారిస్తున్న ఎండీఎంఏకు జేడీగా, సీనియర్ అధికారి సాయి మనోహర్‌ను చండీగఢ్ జోన్ జేడీగా బదిలీ చేశారు. కాగా విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు బ్యాంకులను మోసగించడం తదితర సున్నితమైన కేసులను అస్థానా నేతృత్వంలోని బృందాలే ఇన్నాళ్లూ విచారించగా, తాజా పరిణామాలతో ఆ కేసుల విచారణ తీవ్రంగా ప్రభావితం అవ్వొచ్చని సీబీఐ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణకు కొత్త బృందం మంగళవారం అర్ధరాత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, అలోక్, అస్థానాలను సెలవుపై పంపుతున్నట్లు అత్యవసరంగా ఆదేశాలు జారీచేసింది. మంత్రివర్గ సమావేశ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇరువురు అధికారులు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుందని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అలోక్, అస్థానాలు సెలవుపైనే ఉంటారని జైట్లీ తెలిపారు. సీవీసీ సిఫారసుల ఆధారంగానే ఇరువురు అధికారులను విధుల నుంచి తప్పించామని చెప్పారు. ‘దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలోని ఇద్దరు అత్యున్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో విపరీత, దురదృష్టకర పరిస్థితులకు దారితీసింది’ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఆయన ఖండించారు. సీబీఐలోని సీనియర్ అధికారులపై ఇంతటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం అత్యంత అసాధారణ విషయమనీ, విచారణకు కూడా సహకరించకపోతుండటంతోనే అలోక్‌ను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అటు అలోక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ.. తనను ఉన్నపళంగా విధుల నుంచి తప్పించడం ద్వారా సీబీఐకి ఉన్న స్వతంత్ర అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించనుంది. హెడ్‌క్వార్టర్స్‌లో హంగామా సాధారణంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రయితే సీఐఎస్ఎఫ్కు చెందిన కాపలాదారులు తప్ప ఎవరూ ఉండరు. కానీ మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7.30 గంటలకు అలోక్ వర్మ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా ఆ కార్యాలయం వద్ద అలజడి ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 10 గంటలకు 15 మంది అధికారులు కార్లలో అక్కడికి వచ్చారు. తర్వాత నాగేశ్వర రావు కూడా తన కారులో అక్కడకు చేరుకున్నారు. 11.30 గంటల సమయంలో ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అలోక్, అస్థానాల కార్యాలయాలకు సీల్ వేయించారు. ఆ తర్వాత అలోక్ వర్మ బృందంలోని అధికారులు ఏకే శర్మ, మనీశ్ సిన్హాలను కూడా సెలవుపై పంపుతూ ఆదేశాలిచ్చారు. వారి డ్రైవర్లు, ఇతర సిబ్బందిని తన కార్యాలయ పరిసరాల్లోకి కూడా రాకుండా నిలువరించారు. అంతకుముందు రాత్రి 8–8.30 సమయంలోనే అలోక్, అస్థానాలను తొలగించాల్సిందిగా సిఫారసు చేస్తూ సీవీసీ కేంద్రానికి సమాచారం పంపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నియామకాల విభాగం అధికారులను అర్ధరాత్రి కార్యాలయానికి పిలిపించి వారిచేత అలోక్, అస్థానాలకు ఉత్తర్వులు ఇప్పించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉండేలా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అలోక్ వర్మను నియమించి రెండేళ్లు కాకముందే సీవీసీ సిఫారసును కారణంగా చూపి ఆయనను పదవి నుంచి తొలగించింది. ఇంత ఉత్కంఠ నడుమ సీబీఐ డైరెక్టర్‌ను మార్చడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ, రవిశంకర్ -
సీబీఐ వివాదంపై స్పందించిన జీవీఎల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో నెలకొన్న వివాదంపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ట్విటర్ వేదికగా స్పందించారు. సీబీఐలో నెలకొన్న సంక్షోభం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉన్నట్టు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తమ పార్టీ నాయకులను కేసుల నుంచి తప్పించటానికి సంస్థని టార్గెట చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పంచన చేరిన టీడీపీ అదే తరహా వంచన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సీవీసీ(సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) సలహా మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని ప్రక్షాళన చేయటం జరుగుతోందని అన్నారు. సీవీసీ సూచనల ప్రకారమే సీబీఐలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. సీబీఐ తాత్కాతిక డైరక్టర్ మన్నెం నాగేశ్వర్రావు తెలుగువారేనని తెలిపారు. టీడీపీ చేసే విమర్శలు కాంగ్రెస్‌తో పొత్తు కోసం టీడీపీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు ఉందని అన్నారు. దీని ద్వారా ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అభిప్రాయపడ్డారు. -
నాగేశ్వర్ రావు ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కలిక డైరెక్టర్‌గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986వ బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారైన ఆయన ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మను తొలగిస్తూ ఆ స్థానంలో నాగేశ్వర రావును ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించిన విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ పీజీ పట్టా అందుకున్న నాగేశ్వరరావు ఐపీఎస్ అధికారి కాకముందు ఐఐటీ మద్రాస్‌లో పరిశోధకుడిగా పనిచేశారు. ( చదవండి: అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?) ఒడిశా కేడర్ ఐపీఎస్‌గా ఎంపికైన అనంతరం ఆయన తన తొలి పోస్టింగ్‌ను ఒడిశా తాల్చెర్ సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీవో)గా అందుకున్నారు. అనంతరం ఒడిశాలోని నాలుగు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. అలాగే రూర్కెలా రైల్వేస్ ఎస్పీగా, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఒడిశాలో డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఉపయోగించిన తొలి పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. 1996 జగస్తింగ్‌పూర్‌లోని ఓ రేప్ కేసులో ఫింగర్ ప్రింట్స్ ద్వారా నేరస్థులను పట్టుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా ఉన్నప్పుడు కటక్‌లో 200 మందిని చంపిన నేరస్థుడు బెలుదాస్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఒడిశా ఫైర్ సర్వీస్ ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఫైలిన్(2013) హుదూద్ (2014) తుఫానుల్లో చేపట్టిన సహయక చర్యలకుగాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అవార్డులందుకున్నారు. ఆయనందించిన విశేష సేవలకుగాను రాష్ట్రపతి, ఒడిశా గవర్నర్ల చేతుల మీదుగా మెడల్స్ కూడా లభించాయి. ఆయన సీఆర్పీఎఫ్ మణిపూర్ డీఐజీగా కూడా పనిచేశారు. (చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి) -
అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారైన నాగేశ్వరావుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నాగేశ్వరావు నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్పమెయిలీ వ్యతిరేకించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలో నాగేశ్వరావు ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పుడు ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. సీబీఐని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, అనుకూలమైన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. నాగేశ్వరరావు నియామకంపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను రక్షించేందుకే అలోక్ వర్మ తొలిగించారని ఆయన ఆరోపించారు. నాగేశ్వర రావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులున్నాయని, అతన్ని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గతంలో నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ తాజా మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి సిఫార్సు కూడా చేశారని గుర్తు చేశారు. అప్పుడు నాగేశ్వరరావుపై సీవీసీ చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్‌ను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి -
సీబీఐ అధికారుల ఛాంబర్లు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలో రాత్రికి రాత్రే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావుని సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే నూతన డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీబీఐ ఆఫీసులో సోదాలు మొదలయ్యాయి. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో వారిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలోని అలోక్ వర్మ, అస్థానా, సస్పెండైన డీఎస్పీ దేవేందర్ ఆఫీసుల్లో నాగేశ్వరరావు తనిఖీలు చేపట్టారు. వారి ఛాంబర్లను సీజ్ చేశారు. ఇతరులెవరూ సీబీఐ కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. (చదవండి : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి) -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నతాధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కాస్త ఛీబీఐగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో కేంద్రం స్పందించింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తప్పిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సెలవుపై పంపినట్టు సమాచారం. (కోర్టుకు చేరిన సీబీఐ పోరు) నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లాలోని బోరె నర్సాపూర్. ప్రస్తుతం ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో జాయింట్‌డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిషా కేడర్‌లో డీజీపీగా పనిచేశారు. ఇదిలాఉండగా.. కేసుల నుంచి బయటపడేందుకు అస్థానాకు తాను రూ. 3 కోట్ల లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్ చెప్పడంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేయగా, సతీశ్ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై దేవేంద్ర అరెస్టవ్వడం విదితమే. (చదవండి : సీబీఐ కోటలో ‘దేశం’ ఆటలు)