తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో నాగేశ్వరరావు (వృత్తంలో)
మంగపేట: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వర రావు తెలుగువాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపూర్ గ్రామానికి చెందిన మన్నెం పిచ్చయ్య, శేషమ్మల రెండో కుమారుడు. మన్నెం పిచ్చయ్య చిన్నవయస్సులోనే తన తండ్రితో పాటు గుంటూరు జిల్లా పెదకోరుపాడు నుంచి అప్పటి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తాలూకా తిమ్మాపూర్ గ్రామానికి, అక్కడ పదేళ్లు ఉన్న తరువాత బోరు నర్సాపూర్‌కు వలస వచ్చారు. నాగేశ్వర రావు పాఠశాల విద్య మంగపేట, తిమ్మంపేటల్లో, డిగ్రీ వరంగల్‌లో చదువుకున్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. ఆ తరువాత సివిల్స్ రాసి ఐపీఎస్ సాధించారు.
ఒడిశా క్యాడర్ ఐపీఎస్: ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారిగా రూర్కెలా జిల్లా ఏఎస్సీగా, కటక్‌లో ఎస్పీగా, అనంతరం సీఆర్‌పీఎఫ్ ఐజీ, డీఐజీగా విధులు నిర్వర్తించారు. తరువాత ఒడిశా అడిషనల్ డీజీగా కొంత కాలం పనిచేసి చెన్నై జోన్ సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నాగేశ్వర రావు భార్య సంధ్య. వీరికి కొడుకు వాసుకీనందన్, కూతురు ఆమని ఉన్నారు. ఆమని ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి లా ప్రాక్టీస్ చేస్తొంది. కుమారుడు వాసుకీనందన్ ఢిల్లీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
విజయరామారావు కూడా..
ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కాకులమర్రి విజయరామారావు 1996లో మొదటి సారిగా సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇద్దరు సీబీఐ డైరెక్టర్లుగా ఇప్పటివరకు నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment