సీబీఐలో మిడ్‌నైట్‌ డ్రామా | Alok Verma, Rakesh Asthana sent on leave nageshwar rao is new director | Sakshi
Sakshi News home page

సీబీఐలో మిడ్‌నైట్‌ డ్రామా

Published Thu, Oct 25 2018 2:24 AM | Last Updated on Thu, Oct 25 2018 11:08 AM

Alok Verma, Rakesh Asthana sent on leave nageshwar rao is new director - Sakshi

నాగేశ్వరరావు, అలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానా,

వర్గపోరు, అత్యున్నతాధికారులపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అర్ధరాత్రి ఆ సంస్థలో అనూహ్య మార్పులు చేపట్టింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జేడీగా ఉన్న తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. విచారణకు సహకరించకపోవడంతో సీవీసీ సిఫారసుల మేరకే అలోక్‌ వర్మను పదవి నుంచి తొలగించామంది.

55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఇలా డైరెక్టర్‌ను మార్చడం ఇదే తొలిసారి. నాగేశ్వరరావు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12 మంది అధికారులను బదిలీ చేశారు. అస్థానా, అలోక్‌ల పరస్పర అవినీతి ఆరోపణలపై విచారణకు కొత్త బృందాన్ని నియమించారు. సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలం రెండేళ్లు కాగా అంతకుముందే తనను తొలగించడం ద్వారా సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్‌ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశంలో కేంద్రం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. రఫేల్‌ స్కాం పత్రాలను అలోక్‌ వర్మ సేకరిస్తున్నందునే ఆయన్ను ప్రధాని తప్పించారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

 న్యూఢిల్లీ
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గపోరుతో మొదలైన ముసలం కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న వరంగల్‌ జిల్లాకు చెందిన 1986 బ్యాచ్‌ ఒడిశా కేడర్‌ ఐపీఎస్‌ అధికారి నాగేశ్వరరావును ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది.

కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) సిఫారసుల మేరకే అలోక్, అస్థానాలను సెలవుపై పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీవీసీ విచారణకు అలోక్‌ సహకరించకపోవడం వల్లే ఆయనను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కేసుల విచారణల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కక్షతోనే తనను పదవి నుంచి తప్పించారని అలోక్‌ ఆరోపించారు. ఇటు సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే విధుల్లో చేరి చర్యలు ప్రారంభించారు.

ఢిల్లీలోని సీబీఐ కార్యాలయ భవనంలోని రెండు అంతస్తులను సీజ్‌ చేసి, అలోక్‌ వర్మకు సన్నిహితులుగా పేరున్న మొత్తం 12 మంది అధికారులను ఉన్నపళంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సహా విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపేందుకు అలోక్‌ ఆసక్తిగా ఉన్నందునే ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. అయితే సీబీఐ గౌరవాన్ని, నిబద్ధతను కాపాడేందుకు ఈ బదిలీలు కచ్చితంగా అత్యవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది.

వివిధ ప్రాంతాలకు బదిలీలు
నాగేశ్వర రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలోక్‌ వర్మకు సన్నిహితులుగా ఉన్న 12 మంది అధికారులను ఉన్నపళంగా అండమాన్‌ నికోబార్‌ దీవులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు నాగేశ్వర రావు బదిలీ చేశారు. అస్థానాపై నమోదైన కేసులను విచారిస్తున్న పాత బృందంలోని సభ్యులను పూర్తిగా తొలగించి, మొత్తం కొత్త వారితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. అస్థానాపై కేసు విచారణకు సీబీఐ జేడీ మురుగేశన్‌ పర్యవేక్షణలో డీఐజీ తరుణ్‌ గౌబా, ఎస్పీ సతీశ్‌ దగర్‌లతో నాగేశ్వర రావు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ కేసును సతీశ్‌ విచారించగా, తరుణ్‌ గౌబా మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం దర్యాప్తులో పాలుపంచుకున్నారు. మురుగేశన్‌ బొగ్గు కుంభకోణం కేసును విచారించారు.

అటు అస్థానాపై నమోదైన కేసును విచారిస్తున్న ఏకే బస్సీని అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు, ఆయన పై అధికారి, అదనపు ఎస్పీ ఎస్‌ఎస్‌ గుర్మ్‌ను జబల్‌పూర్‌కు, అస్థానా కేసు విచారణను పర్యవేక్షిస్తున్న డీఐజీ ఎంకే సిన్హాను నాగ్‌పూర్‌కు నాగేశ్వర రావు బదిలీపై పంపారు. జేడీ (పాలసీ)గా ఉన్న అరుణ్‌ కుమార్‌ శర్మను.. రాజీవ్‌ గాంధీ హత్య కేసును విచారిస్తున్న ఎండీఎంఏకు జేడీగా, సీనియర్‌ అధికారి సాయి మనోహర్‌ను చండీగఢ్‌ జోన్‌ జేడీగా బదిలీ చేశారు. కాగా విజయ్‌ మాల్యా, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌  కేసులు, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు బ్యాంకులను మోసగించడం తదితర సున్నితమైన కేసులను అస్థానా నేతృత్వంలోని బృందాలే ఇన్నాళ్లూ విచారించగా, తాజా పరిణామాలతో ఆ కేసుల విచారణ తీవ్రంగా ప్రభావితం అవ్వొచ్చని సీబీఐ సీనియర్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

విచారణకు కొత్త బృందం
మంగళవారం అర్ధరాత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, అలోక్, అస్థానాలను సెలవుపై పంపుతున్నట్లు అత్యవసరంగా ఆదేశాలు జారీచేసింది. మంత్రివర్గ సమావేశ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాకు వివరించారు. ఇరువురు అధికారులు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతుందని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అలోక్, అస్థానాలు సెలవుపైనే ఉంటారని జైట్లీ తెలిపారు. సీవీసీ సిఫారసుల ఆధారంగానే ఇరువురు అధికారులను విధుల నుంచి తప్పించామని చెప్పారు. ‘దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలోని ఇద్దరు అత్యున్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో విపరీత, దురదృష్టకర పరిస్థితులకు దారితీసింది’ అని అన్నారు.

కాంగ్రెస్‌ ఆరోపణలను ఆయన ఖండించారు. సీబీఐలోని సీనియర్‌ అధికారులపై ఇంతటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం అత్యంత అసాధారణ విషయమనీ, విచారణకు కూడా సహకరించకపోతుండటంతోనే అలోక్‌ను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అటు అలోక్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తూ.. తనను ఉన్నపళంగా విధుల నుంచి తప్పించడం ద్వారా సీబీఐకి ఉన్న స్వతంత్ర అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించనుంది.

హెడ్‌క్వార్టర్స్‌లో హంగామా
సాధారణంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రయితే సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన కాపలాదారులు తప్ప ఎవరూ ఉండరు. కానీ మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7.30 గంటలకు అలోక్‌ వర్మ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా ఆ కార్యాలయం వద్ద అలజడి ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 10 గంటలకు 15 మంది అధికారులు కార్లలో అక్కడికి వచ్చారు. తర్వాత నాగేశ్వర రావు కూడా తన కారులో అక్కడకు చేరుకున్నారు. 11.30 గంటల సమయంలో ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అలోక్, అస్థానాల కార్యాలయాలకు సీల్‌ వేయించారు. ఆ తర్వాత అలోక్‌ వర్మ బృందంలోని అధికారులు ఏకే శర్మ, మనీశ్‌ సిన్హాలను కూడా సెలవుపై పంపుతూ ఆదేశాలిచ్చారు. వారి డ్రైవర్లు, ఇతర సిబ్బందిని తన కార్యాలయ పరిసరాల్లోకి కూడా రాకుండా నిలువరించారు.

అంతకుముందు రాత్రి 8–8.30 సమయంలోనే అలోక్, అస్థానాలను తొలగించాల్సిందిగా సిఫారసు చేస్తూ సీవీసీ కేంద్రానికి సమాచారం పంపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ నియామకాల విభాగం అధికారులను అర్ధరాత్రి కార్యాలయానికి పిలిపించి వారిచేత అలోక్, అస్థానాలకు ఉత్తర్వులు ఇప్పించారు. సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలం రెండేళ్లు ఉండేలా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అలోక్‌ వర్మను నియమించి రెండేళ్లు కాకముందే సీవీసీ సిఫారసును కారణంగా చూపి ఆయనను పదవి నుంచి తొలగించింది. ఇంత ఉత్కంఠ నడుమ సీబీఐ డైరెక్టర్‌ను మార్చడం గతంలో ఎన్నడూ జరగలేదు.  


ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు


మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ, రవిశంకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement