CVC investigation
-
సీబీఐ ‘లీక్’పై సుప్రీం ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఇచ్చిన సమాధానాలు, సీబీఐ డీఐజీ మనీశ్ సిన్హా వేసిన పిటిషన్‌లోని అంశాలు బయటకు పొక్కడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరెవరో వచ్చి తమకిష్టమొచ్చిన విషయాలను చెప్పేసి వెళ్లిపోయే స్థలం సుప్రీంకోర్టు కాదని సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. సీవీసీ తరఫు న్యాయవాది సహా ఎవ్వరి వాదనలూ ఇప్పుడు తాము వినదల్చుకోలేదనీ, అలోక్ వర్మ స్పందన, సిన్హా ఆరోపణలు బయటకు పొక్కడంపైనే మాట్లాడతామని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ‘ఈ రోజు మీరు ఒక్క పదం కూడా మాట్లాడకండి. మేం మీ వాదన వినం’ అని సీజేఐ గొగోయ్ అలోక్ వర్మ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్‌తో అన్నారు. అలోక్‌వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ ప్రాథమిక విచారణలోని అంశాలపై గోప్యత పాటించాలని గతంలోనే తాము ఈ కేసులోని కక్షిదారులను కోరామని కోర్టు గుర్తుచేసింది. సీబీఐ నైతికత, గౌరవాలను కాపాడేందుకే తాము ఆ ఆదేశాలిచ్చామనీ, కానీ ఆ విషయాలు మీడియాలో వచ్చాయంది. సీబీఐ డీఐజీ మనీశ్ సిన్హా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి లంచం తీసుకున్నారనీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై విచారణను అడ్డుకున్నారనీ, న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర మధ్యవర్తిగా వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ విషయాలు బయటకు రావడంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ గౌరవాన్ని కాపాడాలని తాము ప్రయత్నిస్తుంటే కక్షిదారులు అన్నీ బహిరంగంగా చెప్పేస్తున్నారని న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండుసార్లు విచారణ.. మంగళవారం ఉదయం తొలిసారి విచారణ ప్రారంభమైన వెంటనే ‘ద వైర్’ వెబ్సైట్లో వచ్చిన కథనం ప్రతిని అలోక్ వర్మ తరఫు న్యాయవాది ఫాలీ నారిమన్‌కు న్యాయవాదులు అందించి, ఆయన స్పంద నను కోరారు. వర్మ తరఫు మరో లాయర్ గోపాల్ శంకరనారాయణన్ సోమవారం వర్మ స్పందనను సమర్పించేందుకు మరికొంత సమయం అడగడాన్ని నారిమన్ ప్రశ్నించారు. తర్వాత కోర్టు ‘విచారణను జరిపించుకునేందుకు మీలో అర్హులున్నారని మేం అనుకోవడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొన్ని నిమిషాలకే నారిమన్ మళ్లీ కోర్టు లోపలకు వచ్చి విచారణను కొనసాగించాలని కోరడంతో కోర్టు సమ్మతించింది. నారిమన్ వాదిస్తూ ‘ఈ కథనం నవంబర్ 17న ప్రచురితమైంది. ఇది సీవీసీ విచారణలో అలోక్ ఇచ్చిన సమాధానాలకు సంబంధించినది. సీవీసీ విచారణపై స్పందన తెలపాల్సిందిగా అంతకుముందు రోజే కోర్టు వర్మను కోరింది’ అని చెప్పారు. -
అలోక్ వర్మకు సీవీసీ క్లీన్చిట్!
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను బలపరిచేలా కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వారిని కేంద్రం తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడం, ఆరోపణలపై సీవీసీ విచారణ చేస్తుండటం తెలిసిందే. అలోక్ వర్మపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సీవీసీకి గడువును నిర్దేశించింది. ఈ గడువు పూర్తవ్వడంతో విచారణ నివేదికను శుక్రవారం సుప్రీంకర్టుకు సీవీసీ అందించనుంది. అయితే విచారణలో అలోక్ వర్మకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావుపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించడాన్ని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు. జాయింట్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సిఫార్సు చేసినా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆయన్ని కాపాడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేస్తానని తెలిపారు. ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం రాకేష్ అస్థానాపై 6 కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాకేష్ అస్థానాను కాపాడేం దుకు, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు జరగకుండా ఉండేందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. అయినా ఆయన్నే తాత్కాలిక డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. నాగేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదులను విచారించిన అలోక్ వర్మ.. ఆయన్ని సీబీఐ నుంచి తొలగించి ప్రాసిక్యూట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సిఫారసు చేశారు. కానీ నాగేశ్వరరావును సీవీసీ కాపాడారు’ అని ఆయన అన్నారు. -
సీబీఐలో మిడ్నైట్ డ్రామా
వర్గపోరు, అత్యున్నతాధికారులపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అర్ధరాత్రి ఆ సంస్థలో అనూహ్య మార్పులు చేపట్టింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జేడీగా ఉన్న తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. విచారణకు సహకరించకపోవడంతో సీవీసీ సిఫారసుల మేరకే అలోక్ వర్మను పదవి నుంచి తొలగించామంది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఇలా డైరెక్టర్‌ను మార్చడం ఇదే తొలిసారి. నాగేశ్వరరావు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12 మంది అధికారులను బదిలీ చేశారు. అస్థానా, అలోక్‌ల పరస్పర అవినీతి ఆరోపణలపై విచారణకు కొత్త బృందాన్ని నియమించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు కాగా అంతకుముందే తనను తొలగించడం ద్వారా సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశంలో కేంద్రం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. రఫేల్ స్కాం పత్రాలను అలోక్ వర్మ సేకరిస్తున్నందునే ఆయన్ను ప్రధాని తప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యూఢిల్లీ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గపోరుతో మొదలైన ముసలం కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావును ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది. కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) సిఫారసుల మేరకే అలోక్, అస్థానాలను సెలవుపై పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీవీసీ విచారణకు అలోక్ సహకరించకపోవడం వల్లే ఆయనను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కేసుల విచారణల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కక్షతోనే తనను పదవి నుంచి తప్పించారని అలోక్ ఆరోపించారు. ఇటు సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే విధుల్లో చేరి చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయ భవనంలోని రెండు అంతస్తులను సీజ్ చేసి, అలోక్ వర్మకు సన్నిహితులుగా పేరున్న మొత్తం 12 మంది అధికారులను ఉన్నపళంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపేందుకు అలోక్ ఆసక్తిగా ఉన్నందునే ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే సీబీఐ గౌరవాన్ని, నిబద్ధతను కాపాడేందుకు ఈ బదిలీలు కచ్చితంగా అత్యవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. వివిధ ప్రాంతాలకు బదిలీలు నాగేశ్వర రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలోక్ వర్మకు సన్నిహితులుగా ఉన్న 12 మంది అధికారులను ఉన్నపళంగా అండమాన్ నికోబార్ దీవులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు నాగేశ్వర రావు బదిలీ చేశారు. అస్థానాపై నమోదైన కేసులను విచారిస్తున్న పాత బృందంలోని సభ్యులను పూర్తిగా తొలగించి, మొత్తం కొత్త వారితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. అస్థానాపై కేసు విచారణకు సీబీఐ జేడీ మురుగేశన్ పర్యవేక్షణలో డీఐజీ తరుణ్ గౌబా, ఎస్పీ సతీశ్ దగర్‌లతో నాగేశ్వర రావు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ కేసును సతీశ్ విచారించగా, తరుణ్ గౌబా మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం దర్యాప్తులో పాలుపంచుకున్నారు. మురుగేశన్ బొగ్గు కుంభకోణం కేసును విచారించారు. అటు అస్థానాపై నమోదైన కేసును విచారిస్తున్న ఏకే బస్సీని అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు, ఆయన పై అధికారి, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్‌ను జబల్పూర్కు, అస్థానా కేసు విచారణను పర్యవేక్షిస్తున్న డీఐజీ ఎంకే సిన్హాను నాగ్‌పూర్‌కు నాగేశ్వర రావు బదిలీపై పంపారు. జేడీ (పాలసీ)గా ఉన్న అరుణ్ కుమార్ శర్మను.. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారిస్తున్న ఎండీఎంఏకు జేడీగా, సీనియర్ అధికారి సాయి మనోహర్‌ను చండీగఢ్ జోన్ జేడీగా బదిలీ చేశారు. కాగా విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు బ్యాంకులను మోసగించడం తదితర సున్నితమైన కేసులను అస్థానా నేతృత్వంలోని బృందాలే ఇన్నాళ్లూ విచారించగా, తాజా పరిణామాలతో ఆ కేసుల విచారణ తీవ్రంగా ప్రభావితం అవ్వొచ్చని సీబీఐ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణకు కొత్త బృందం మంగళవారం అర్ధరాత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, అలోక్, అస్థానాలను సెలవుపై పంపుతున్నట్లు అత్యవసరంగా ఆదేశాలు జారీచేసింది. మంత్రివర్గ సమావేశ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇరువురు అధికారులు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుందని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అలోక్, అస్థానాలు సెలవుపైనే ఉంటారని జైట్లీ తెలిపారు. సీవీసీ సిఫారసుల ఆధారంగానే ఇరువురు అధికారులను విధుల నుంచి తప్పించామని చెప్పారు. ‘దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలోని ఇద్దరు అత్యున్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో విపరీత, దురదృష్టకర పరిస్థితులకు దారితీసింది’ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఆయన ఖండించారు. సీబీఐలోని సీనియర్ అధికారులపై ఇంతటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం అత్యంత అసాధారణ విషయమనీ, విచారణకు కూడా సహకరించకపోతుండటంతోనే అలోక్‌ను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అటు అలోక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ.. తనను ఉన్నపళంగా విధుల నుంచి తప్పించడం ద్వారా సీబీఐకి ఉన్న స్వతంత్ర అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించనుంది. హెడ్‌క్వార్టర్స్‌లో హంగామా సాధారణంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రయితే సీఐఎస్ఎఫ్కు చెందిన కాపలాదారులు తప్ప ఎవరూ ఉండరు. కానీ మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7.30 గంటలకు అలోక్ వర్మ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా ఆ కార్యాలయం వద్ద అలజడి ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 10 గంటలకు 15 మంది అధికారులు కార్లలో అక్కడికి వచ్చారు. తర్వాత నాగేశ్వర రావు కూడా తన కారులో అక్కడకు చేరుకున్నారు. 11.30 గంటల సమయంలో ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అలోక్, అస్థానాల కార్యాలయాలకు సీల్ వేయించారు. ఆ తర్వాత అలోక్ వర్మ బృందంలోని అధికారులు ఏకే శర్మ, మనీశ్ సిన్హాలను కూడా సెలవుపై పంపుతూ ఆదేశాలిచ్చారు. వారి డ్రైవర్లు, ఇతర సిబ్బందిని తన కార్యాలయ పరిసరాల్లోకి కూడా రాకుండా నిలువరించారు. అంతకుముందు రాత్రి 8–8.30 సమయంలోనే అలోక్, అస్థానాలను తొలగించాల్సిందిగా సిఫారసు చేస్తూ సీవీసీ కేంద్రానికి సమాచారం పంపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నియామకాల విభాగం అధికారులను అర్ధరాత్రి కార్యాలయానికి పిలిపించి వారిచేత అలోక్, అస్థానాలకు ఉత్తర్వులు ఇప్పించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉండేలా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అలోక్ వర్మను నియమించి రెండేళ్లు కాకముందే సీవీసీ సిఫారసును కారణంగా చూపి ఆయనను పదవి నుంచి తొలగించింది. ఇంత ఉత్కంఠ నడుమ సీబీఐ డైరెక్టర్‌ను మార్చడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ, రవిశంకర్ -
బ్యాంకుల నెత్తిన మరో పిడుగు
♦ భారీ ఎన్పీఏలకు 50 శాతం కేటాయింపులు ♦ నష్టాలుగా భావించి పక్కన పెట్టాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ♦ పరిష్కారం రాకపోతే 100% కేటాయించాల్సిందే ♦ దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కోట్ల భారం ముంబై: ఆర్బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు(ఎన్పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని బ్యాంకుల చీఫ్‌లను శుక్రవారం రాత్రి ఆదేశించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్బీఐ గోప్యంగా జారీ చేసిన ఈ ఆదేశాల గురించి బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇన్సాల్వెన్సీ చర్యలు చేపట్టబోయే కేసులకు సంబంధించిన రుణాల్లో 50 శాతాన్ని నష్టాలుగా ప్రకటించి నిధులు కేటాయింపులు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ తాజాగా కోరడం గమనార్హం. అంతేకాదు, అంతిమంగా రుణదాతలు, రుణగ్రహీతలు ఓ పరిష్కారానికి రాలేకపోతే... ఆస్తుల లిక్విడేషన్‌కు ఎన్సీఎల్టీ ఆదేశిస్తే బ్యాంకులు ఆయా కేసుల్లో 100 శాతం కేటాయింపులు చేయాల్సిందేనని వాణిజ్య బ్యాంకుల సీఈవోలకు పంపిన లేఖలో ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే, ఈ కేటాయింపులకు మూడు త్రైమాసికాలు సమయం (2018 మార్చి వరకు) ఇవ్వడం కొంచెం ఊరటగా ఓ బ్యాంకర్ పేర్కొన్నారు. నిజానికి ఈ ఆదేశాలు బ్యాంకులు ఊహించనివే. ఐబీసీ కింద చర్యలు చేపట్టే చాలా కేసుల్లో నిర్ణీత సమయంలోగా పరిష్కారం లభించకపోవచ్చని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకపోతే నూరు శాతం కేటాయింపులు చేయాలని ఆర్బీఐ ఆదేశించడంతో... వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రెట్టింపు స్థాయిలో నిధుల కేటాయింపులు చేయాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. కేటాయింపులు ఏ మేరకు...? ఆర్బీఐ ఇన్సాల్వెన్సీ చర్యలకు ఆదేశించిన కేసుల్లో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు), ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ.10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కోట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంకుల మొత్తం మొండి బాకాయిల్లో ఇవి 25 శాతం. ప్రస్తుతం ఈ ఎన్పీఏ ఖాతాలకు కేటాయింపులు 30–40 శాతం స్థాయిలో ఉన్నట్టు బ్యాంకర్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం(2017–18) చివరికి మరో రూ.30,000–50,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందుకు వెళ్లే ఇతర కేసులకూ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని ఓ బ్యాంకర్ తెలిపారు. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు మొండి బకాయిల కేసులను ఎస్సీఎల్టీకి నివేదించే విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఇందుకు అధిక కేటాయింపులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2017 మార్చి నాటికి లిస్టెడ్ వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏల కోసం చేసిన కేటాయింపులు రూ.1.95 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు తమకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్ టీఎం భాసిన్ మీడియాకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం – 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అధికారులు సైతం ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేటు బ్యాంకైనా ప్రజలకు సంబంధించిన విధుల్లోనే ఉన్నారని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల (ప్రభుత్వ రంగ బ్యాంకులు) ఉద్యోగుల అవినీతి కేసులను విచారించే అధికారం సీవీసీకి ఉంది. ఇకపై ప్రైవేటు రంగ బ్యాంకులు, వాటి యాజమాన్యాలపై వచ్చే అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు చేయనున్నట్టు భాసిన్ తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగాలు నిబంధనల్లో మార్పులు చేసినట్టు చెప్పారు. ఎన్పీఏల కోసం 25శాతం అదనపు కేటాయింపులు: క్రిసిల్ ముంబై: ఎన్పీఏల పరిష్కారానికి ఆర్బీఐ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఎన్పీఏ కేసుల్లో బ్యాంకులు 60 శాతం వరకు హేర్‌కట్ (రుణంలో నిర్ణీత మేర నష్టం)ను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. టాప్ 50 ఎన్పీఏ కేసుల్లో 60 శాతం హేర్‌కట్ అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు అదనంగా 25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. భారీ హేర్‌కట్ నేపథ్యంలో ఎన్పీఏలకు కేటా యింపులకు గాను బ్యాంకులకు ఆరు నుంచి ఎనిమిది క్వార్టర్ల సమయం ఇస్తే వాటికి ఉపశమనంగా ఉంటుందని సీతారామన్ అన్నారు.