బ్యాంకుల నెత్తిన మరో పిడుగు | NPA resolution: Banks may have to take 60% haircut on 12 large bad loan accounts, says Crisil | Sakshi
Sakshi News home page

బ్యాంకుల నెత్తిన మరో పిడుగు

Published Tue, Jun 27 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

బ్యాంకుల నెత్తిన మరో పిడుగు

బ్యాంకుల నెత్తిన మరో పిడుగు

భారీ ఎన్‌పీఏలకు 50 శాతం కేటాయింపులు
నష్టాలుగా భావించి పక్కన పెట్టాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు
పరిష్కారం రాకపోతే 100% కేటాయించాల్సిందే
దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కోట్ల భారం


ముంబై: ఆర్‌బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు(ఎన్‌పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) చేయాలని బ్యాంకుల చీఫ్‌లను శుక్రవారం రాత్రి ఆదేశించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్‌బీఐ గోప్యంగా జారీ చేసిన ఈ ఆదేశాల గురించి బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇన్‌సాల్వెన్సీ చర్యలు చేపట్టబోయే కేసులకు సంబంధించిన రుణాల్లో 50 శాతాన్ని నష్టాలుగా ప్రకటించి నిధులు కేటాయింపులు చేయాలని బ్యాంకులను ఆర్‌బీఐ తాజాగా కోరడం గమనార్హం.

అంతేకాదు, అంతిమంగా రుణదాతలు, రుణగ్రహీతలు ఓ పరిష్కారానికి రాలేకపోతే... ఆస్తుల లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆదేశిస్తే బ్యాంకులు ఆయా కేసుల్లో 100 శాతం కేటాయింపులు చేయాల్సిందేనని వాణిజ్య బ్యాంకుల సీఈవోలకు పంపిన లేఖలో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అయితే, ఈ కేటాయింపులకు మూడు త్రైమాసికాలు సమయం (2018 మార్చి వరకు) ఇవ్వడం కొంచెం ఊరటగా ఓ బ్యాంకర్‌ పేర్కొన్నారు. నిజానికి ఈ ఆదేశాలు బ్యాంకులు ఊహించనివే. ఐబీసీ కింద చర్యలు చేపట్టే చాలా కేసుల్లో నిర్ణీత సమయంలోగా పరిష్కారం లభించకపోవచ్చని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకపోతే నూరు శాతం కేటాయింపులు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడంతో... వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రెట్టింపు స్థాయిలో నిధుల కేటాయింపులు చేయాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

కేటాయింపులు ఏ మేరకు...?
ఆర్‌బీఐ ఇన్‌సాల్వెన్సీ చర్యలకు ఆదేశించిన కేసుల్లో భూషణ్‌ స్టీల్‌ (రూ.44,478 కోట్లు), ఎస్సార్‌ స్టీల్‌ (రూ.37,284 కోట్లు), భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ (రూ.37,248 కోట్లు), అలోక్‌ ఇండస్ట్రీస్‌ (రూ.22,075 కోట్లు), ఆమ్‌టెక్‌ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్‌ ఇస్పాత్‌ (రూ.12,115 కోట్లు), ల్యాంకో ఇన్‌ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్‌ స్టీల్స్‌ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్‌ఫ్రా (రూ.10,065 కోట్లు), జైపీ ఇన్‌ఫ్రాటెక్‌ (రూ.9,635 కోట్లు), ఏబీజీ షిప్‌ యార్డ్‌ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్‌ (రూ.5,165 కోట్లు) ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంకుల మొత్తం మొండి బాకాయిల్లో ఇవి 25 శాతం.

 ప్రస్తుతం ఈ ఎన్‌పీఏ ఖాతాలకు కేటాయింపులు 30–40 శాతం స్థాయిలో ఉన్నట్టు బ్యాంకర్లు తెలిపారు. ఆర్‌బీఐ ఆదేశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం(2017–18) చివరికి మరో రూ.30,000–50,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముందుకు వెళ్లే ఇతర కేసులకూ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని ఓ బ్యాంకర్‌ తెలిపారు. ఆర్‌బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు మొండి బకాయిల కేసులను ఎస్‌సీఎల్‌టీకి నివేదించే విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఇందుకు అధిక కేటాయింపులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2017 మార్చి నాటికి లిస్టెడ్‌ వాణిజ్య బ్యాంకులు ఎన్‌పీఏల కోసం చేసిన కేటాయింపులు రూ.1.95 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ప్రైవేటు బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు తమకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్‌ టీఎం భాసిన్‌ మీడియాకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం – 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అధికారులు సైతం ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేటు బ్యాంకైనా ప్రజలకు సంబంధించిన విధుల్లోనే ఉన్నారని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల (ప్రభుత్వ రంగ బ్యాంకులు) ఉద్యోగుల అవినీతి కేసులను విచారించే అధికారం సీవీసీకి ఉంది. ఇకపై ప్రైవేటు రంగ బ్యాంకులు, వాటి యాజమాన్యాలపై వచ్చే అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు చేయనున్నట్టు భాసిన్‌ తెలిపారు. ఈ మేరకు ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగాలు నిబంధనల్లో మార్పులు చేసినట్టు చెప్పారు.

ఎన్‌పీఏల కోసం 25శాతం అదనపు కేటాయింపులు: క్రిసిల్‌
ముంబై: ఎన్‌పీఏల పరిష్కారానికి ఆర్‌బీఐ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ పేర్కొంది. ఎన్‌పీఏ కేసుల్లో బ్యాంకులు 60 శాతం వరకు హేర్‌కట్‌ (రుణంలో నిర్ణీత మేర నష్టం)ను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. టాప్‌ 50 ఎన్‌పీఏ కేసుల్లో 60 శాతం హేర్‌కట్‌ అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు అదనంగా 25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుందని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు. భారీ హేర్‌కట్‌ నేపథ్యంలో ఎన్‌పీఏలకు కేటా యింపులకు గాను బ్యాంకులకు ఆరు నుంచి ఎనిమిది క్వార్టర్ల సమయం ఇస్తే వాటికి ఉపశమనంగా ఉంటుందని సీతారామన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement