
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), జాతీయ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఏఆర్‌సీఎల్) వద్ద ఎన్‌పీఏ కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. విధానపరమైన జాప్యం, కేసుల విచారణలో వాయిదాలను సాధ్యమైన మేర తగ్గించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఆయా కేసుల పురోగతిని పర్యవేక్షించాలని కోరింది.
వసూలు కాని నిరర్థక రుణ ఖాతాలను ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు విక్రయించడం లేదంటే దివాలా పరిష్కార చర్యలు కోరుతూ ఎన్‌సీఎల్‌టీ ముందుకు బ్యాంక్‌లు తీసుకెళ్లడం తెలిసిందే. ఎన్‌సీఎల్‌టీలో కేసుల తాజా సమాచారాన్ని బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కార్పొరేట్ శాఖ ఒక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎన్‌ఏఆర్‌సీఎల్, ఎన్‌సీఎల్‌టీలో కేసుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పెంచడం, నిర్వహణ సవాళ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షతన తాజాగా సమావేశం జరిగింది.
కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే విషయమై ఇందులో చర్చించినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. రూ.95,711 కోట్ల విలువతో కూడిన 22 మొండి ఖాలాలను ఎన్‌ఏఆర్‌సీఎల్ సొంతం చేసుకోగా, రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే మరో 28 ఎన్‌పీఏ ఖాతాలను బ్యాంక్‌లు పరిష్కరించుకున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment