న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్ఫేసీ చట్టం 2002 (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ– సెక్యూరిటైజేషన్ అండ్ రికన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్) కింద రుణ ఖాతాలను మొండిబకాయిలుగా (ఎన్‌పీఏ) ప్రకటించడం తగదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్, ఇతర సీనియర్ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న వాదనలను సైతం అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందన్న వార్తలను మేము చదివాం’’ అని కూడా ధిక్కరణ పిటిషన్ల తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, విక్రమ్ నాథ్, హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వివరాల్లోకి వెళితే...
ఈ కేసులో కోర్టు ధిక్కరణ పిటీషనర్ల తరఫున అడ్వకేట్ విశాల్ తివారీ చేసిన వాదనల ప్రకారం 2020 ఆగస్టు 31వ తేదీ వరకూ మొండిబకాయిలుగా (ఎన్‌పీఏ) ప్రకటించని అకౌట్లను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు 2020 సెప్టెంబర్ 3న ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ బ్యాంకులు ఉద్దేశ్యపూర్వగా సర్ఫేసీ యాక్ట్ కింద అకౌంట్లు కొన్నింటిని ఏకపక్షంగా ఎన్‌పీఏలుగా మార్చాయి. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పలు ట్రేడర్లతో పాటు అజయ్ హోటెల్ అండ్ రెస్టారెంట్స్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2020 నవంబర్ 30న తమ అకౌంట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా ఎన్‌పీఏగా మార్చిందని అజయ్ హోటెల్ అండ్ రెస్టారెంట్ పేర్కొంది. బకాయిలను వడ్డీసహా చెల్లించాలని తనకు 2021 మేలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మూడవ ప్రతివాది) నోటీసులు పంపిందని పేర్కొంది. తద్వారా 2020 సెప్టెంబర్ 3న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం ఉల్లంఘించిందని వివరించింది.
ఈ పిటీషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ, ‘‘కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఎకానమీ పురోగమిస్తోందని వార్తలు చదివాం. 2020 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలోకి ఇప్పుడు ఆర్‌బీఐని లాగాలని మేము అనుకోవడం లేదు. ధిక్కరణ అనేది నేరుగా న్యాయస్థానం– ధిక్కరణదారు మధ్య వ్యవహారం. ఈ సందర్భంలో ఆర్‌బీఐ గవర్నర్‌ను అధికారులను ధిక్కరణకు పాల్పడ్డారని భావించలేం. అవసరమైతే మీరు సర్ఫేసీ చట్టం కిందే తగిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది
చదవండి: తినుబండరాలు,సబ్బుల అమ్మకాల్లో హిందుస్తాన్ పెట్రోలియం
Comments
Please login to add a commentAdd a comment