non-performing assets
-
ఎగవేతదారులతో సెటిల్మెంట్
ముంబై: మొండిపద్దుల నుంచి బ్యాంకులు సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టుకునేందుకు వీలు కల్పించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. ఉద్దేశపూర్వక ఎగవేతలు, మోసపూరిత ఖాతాల విషయంలో రాజీ కుదుర్చుకుని, మొండిబాకీలను సెటిల్ చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం రాజీ సెటిల్మెంట్లను చేపట్టే క్రమంలో ఉద్దేశపూర్వక ఎగవేతలు, సాంకేతిక రైటాఫ్‌ల అంశాల్లో పాటించాల్సిన ప్రక్రియలకు సంబంధించి బోర్డు ఆమోదిత పాలసీలను నియంత్రిత సంస్థలన్నీ (ఆర్ఈ) అమలు చేయాల్సి ఉంటుంది. ఏయే పరిస్థితుల్లో రాజీ యత్నాలు చేయవచ్చనేది వాటిలో నిర్దిష్టంగా పేర్కొనాలి. కనీస బాకీ వ్యవధి, తనఖా పెట్టిన ఆస్తుల విలువ కరిగిపోవడం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. నోటిఫికేషన్ అంశాలు.. ► ఇలాంటి కేసుల్లో ఉద్యోగుల జవాబుదారీతనాన్ని పర్యవేక్షించేందుకు తగు వ్యవస్థ ఉండాలి. బాకీ పరిమాణం, కాలపరిమితులు మొదలైనవి బోర్డు నిర్ణయిస్తుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసపూరిత ఖాతాలంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో, రుణదాతలపై క్రిమినల్ చర్యలతో సంబంధం లేకుండా, ఆర్ఈలు రాజీ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ► రాజీ సెటిల్మెంట్ విషయంలో తనఖా ఉంచిన ఆస్తి (ఏదైనా ఉంటే) నుంచి ప్రస్తుతం రాబట్టుకోగలిగే మొత్తాన్ని సముచిత రీతిలో మదింపు చేసి, ఎంత మొత్తం వదులుకోవచ్చు, ఎంతకు సెటిల్ చేసుకోవచ్చు అనే నిబంధనలను పాలసీలో పొందుప ర్చాలి. తనఖా పెట్టిన వాటి నుంచి రాబట్టుకోగలికే విలువను లెక్కించే విధానాన్ని కూడా నిర్దేశించాలి. ► ఆర్ఈకి ప్రయోజనం చేకూర్చేలా మొండిబాకీల నుంచి తక్కువ ఖర్చులో, అత్యధికంగా రాబట్టాల నేది లక్ష్యంగా ఉండాలి.రాజీ సెటిల్మెంట్ చేసుకున్న రుణగ్రహీతలకు ఆర్ఈలు నిర్దిష్ట వ్యవధి తర్వాతే మళ్లీ కొత్తగా రుణాలివ్వడానికి వీలుంటుంది. -
పదేళ్ల కనిష్టానికి బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగం ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) 2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు దిగొస్తాయని అసోచామ్–క్రిసిల్ అధ్యయన నివేదిక తెలిపింది. ఇది దశాబ్ద కనిష్ట స్థాయి అని పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం తగ్గి స్థూల ఎన్‌పీలు 5 శాతంలోపుగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక రంగ కార్యకలాపాలు కోలుకోవడం, రుణాల్లో అధిక వృద్ధి ఎన్పీఏలు తగ్గేందుకు అనుకూలించినట్టు వివరించింది. ప్రధానంగా కార్పొరేట్ రుణాల వైపు ఎంతో పురోగతి ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 2 శాతంలోపు ఉంటాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి కార్పొరేట్ ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాలను ప్రక్షాళన చేసుకున్నాయి. రిస్క్ నిర్వహణ, అండర్ రైటింగ్‌ను బలోపేతం చేసుకున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉన్న రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. కార్పొరేట్ రుణ ఆస్తుల నాణ్యత అదే పనిగా మెరుగు పడుతూ రావడం అన్నది బ్యాంకుల రుణాల నాణ్యతను తెలియజేస్తోంది’’అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వివరించారు. బహుళ బ్యాలన్స్‌షీట్ సమస్య దాదాపుగా పరిష్కారమైనట్టేనని, రుణాల వృద్ధి గణనీయంగా మెరుగుపడడం మొదలైనట్టు చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన బ్యాంకింగ్ రంగం ఎంతో బలంగా ఉన్నట్టు సూద్ గుర్తు చేశారు. కరోనా వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్పీఏలు.. 2022 మార్చి నాటికి ఉన్న 9.3 శాతం నుంచి 2024 మార్చి నాటికి 10–11 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది. -
బ్యాంకులు భళా.. తగ్గిన మొండి బకాయిలు
ముంబై: భారత్ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) సెప్టెంబర్ 2022 నాటికి 5 శాతానికి తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ఒకటి తెలిపింది. ‘బ్యాంకింగ్ ఇన్ ఇండియా– ట్రెండ్స్ అండ్ పోగ్రెస్’ శీర్షికన విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. ►2017–18 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరిన స్థూల మొండిబకాయిలు అటు తర్వాత క్రమంగా దిగివచ్చాయి. 2022 మార్చిలో ఇది 5.8 శాతానికి తగ్గింది. ►చెల్లింపుల్లో వైఫల్యాలు తగ్గడం, రికవరీలు మెరుగుపడ్డం, బకాయిల మాఫీ (రైటాఫ్) వంటి అంశాలు స్థూల మొండిబకాయిలు తగ్గడానికి కారణం.ప్రస్తుతం బ్యాంకింగ్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతోంది. రుణ నాణ్యత పెరిగింది. మూలధన నిల్వలు పటిష్టంగా ఉన్నాయి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రుణ వృద్ధి రేటు మరెంతో మెరుగుపడాల్సి ఉంది. రుణ పునర్వ్యవస్థీకరణ మొత్తంగా 1.1 శాతం పెరిగితే, బడా రుణ గ్రహీతలకు సంబంధించి ఇది 0.5 శాతంగా ఉంది. వ్యక్తిగత రుణాలు, చిన్న వ్యాపాలకు సహాయం చేయడానికి సంబంధించి ప్రవేశపెట్టిన రుణ పునర్వ్యవస్థీకరణ స్కీమ్‌ల వల్ల తగిన ప్రయోజనాలు ఒనగూరుతున్నాయి. దేశీయంగా బ్యాంకుల స్థూల మొండిబకాయిలు తగ్గుముఖం పడితే, విదేశీ బ్యాంకుల విషయంలో పెరగడం గమనార్హం. 2020–21లో ప్రైవేటు బ్యాంకుల జీఎన్‌పీఏలు 0.2 శాతం ఉంటే, 2021–22లో 0.5 శాతానికి చేరాయి. బ్యాంకింగ్‌లో 2020–21 మంచి యూ టర్న్ తీసుకుంది. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. ► 2022–23 మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లో మంచి పురోగతి నెలకొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. ►వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ►ఇక గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ. 8,16,421 కోట్ల రుణ మాఫీ చేశాయి. మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్సీబీలు) విషయంలో ఈ విలువ రూ. 11,17,883 కోట్లుగా ఉంది. -
మొండి బకాయిల కట్టడి చర్యలు ఫలితాలిస్తున్నాయ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకృత నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయినట్లు ఆమె పేర్కొన్నారు. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే.. ► రెండవ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నికర లాభం భారీగా 74 శాతం ఎగసి రూ.13,265 కోట్లుగా నమోదయ్యింది. ► కెనరా బ్యాంక్ లాభం 89 శాతం వృద్ధితో రూ.2,525 కోట్లుగా నమోదయ్యింది. ► కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ లాభం 145% పెరిగి రూ.504 కోట్లుగా ఉంది. ► బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో లాభం 59 శాతం పెరిగి రూ.3,312.42 కోట్లుగా ఉంది. ► కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) లాభాల్లో ఉన్నా, ఇవి 9–63 శాతం శ్రేణిలో క్షీణించాయి. అయితే మొండిబకాయిలకు అధిక కేటాయింపులు (ప్రొవిజినింగ్) దీనికి నేపథ్యం. పీఎన్బీ ప్రొవిజనింగ్స్ భారీగా రూ.2,693 కోట్ల నుంచి రూ.3,556 కోట్లకు చేరాయి. ఇక బీఓఐ విషయంలో ఈ కేటాయింపులు రూ.894 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు ఎగశాయి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 13 నుంచి 145 శాతం శ్రేణిలో ఉన్నాయి. యుకో బ్యాంక్ అత్యధికంగా 145 శాతం పెరిగితే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 103 శాతం పెరిగింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికం ఇలా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. మొదటి త్రైమాసికంలో కూడా పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, సమీక్షా కాలంలో (2022 ఏప్రిల్–జూలై) రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
ఎకానమీ పురోగమిస్తోందన్న వార్తలు చదివాం!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్ఫేసీ చట్టం 2002 (ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ– సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్) కింద రుణ ఖాతాలను మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించడం తగదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్, ఇతర సీనియర్ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న వాదనలను సైతం అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందన్న వార్తలను మేము చదివాం’’ అని కూడా ధిక్కరణ పిటిషన్ల తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, విక్రమ్ నాథ్, హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళితే... ఈ కేసులో కోర్టు ధిక్కరణ పిటీషనర్ల తరఫున అడ్వకేట్ విశాల్ తివారీ చేసిన వాదనల ప్రకారం 2020 ఆగస్టు 31వ తేదీ వరకూ మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించని అకౌట్లను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎన్పీఏలుగా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు 2020 సెప్టెంబర్ 3న ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ బ్యాంకులు ఉద్దేశ్యపూర్వగా సర్ఫేసీ యాక్ట్ కింద అకౌంట్లు కొన్నింటిని ఏకపక్షంగా ఎన్పీఏలుగా మార్చాయి. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పలు ట్రేడర్లతో పాటు అజయ్ హోటెల్ అండ్ రెస్టారెంట్స్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020 నవంబర్ 30న తమ అకౌంట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా ఎన్పీఏగా మార్చిందని అజయ్ హోటెల్ అండ్ రెస్టారెంట్ పేర్కొంది. బకాయిలను వడ్డీసహా చెల్లించాలని తనకు 2021 మేలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మూడవ ప్రతివాది) నోటీసులు పంపిందని పేర్కొంది. తద్వారా 2020 సెప్టెంబర్ 3న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం ఉల్లంఘించిందని వివరించింది. ఈ పిటీషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ, ‘‘కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఎకానమీ పురోగమిస్తోందని వార్తలు చదివాం. 2020 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలోకి ఇప్పుడు ఆర్బీఐని లాగాలని మేము అనుకోవడం లేదు. ధిక్కరణ అనేది నేరుగా న్యాయస్థానం– ధిక్కరణదారు మధ్య వ్యవహారం. ఈ సందర్భంలో ఆర్బీఐ గవర్నర్‌ను అధికారులను ధిక్కరణకు పాల్పడ్డారని భావించలేం. అవసరమైతే మీరు సర్ఫేసీ చట్టం కిందే తగిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది చదవండి: తినుబండరాలు,సబ్బుల అమ్మకాల్లో హిందుస్తాన్ పెట్రోలియం -
ఎన్పీఏల పరిష్కారంపై కొత్త నిబంధనలు!
ముంబై: మొండిబకాయిల పరిష్కారం విషయంలో కేంద్రం, బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు కొత్త నిబంధనలను తీసుకువస్తాయని నీతిఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. రుణ పునఃచెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యం అయిన కంపెనీలపైనా దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, 180 రోజుల లోపు రుణ పరిష్కారం కాకపోతే, ఆ అకౌంట్‌ను నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్‌కు నివేదించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ కాంత్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాక్ ఎక్సే్చంజీల ప్రపంచ సమాఖ్య సదస్సులో పాల్గొన్న ఆయన పేరొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► కనీస ఆదాయ పథకాలపై ఇప్పుడు ప్రతిచోటా చర్చ జరుగుతోంది. అయితే ఇటువంటి పథకాల అమలుకు దేశం నిలకడగా అధిక వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది. ► దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల వృద్ధికి సకాలంలో రుణ పునఃచెల్లింపులు, మొండిబకాయిల సత్వర పరిష్కారం అవసరం. ► వృద్ధిలేకపోతే పునఃపంపకం ఎలా? మీరు అధిక వృద్ధి సాధించకపోతే, మిగులు ఉండదు. అలాంటప్పుడు కనీస ఆదాయం వంటి పథకాలకు నిధులు కష్టం. ప్రస్తుతం దేశం 7 శాతం వృద్ధి సాధిస్తోంది. కనీస ఆదాయం వంటి పథకాల అమలుకు కనీసం 9 నుంచి 10 శాతం వృద్ధి అవసరం. ► ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి పరుగుకు ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేకించి తయారీ రంగం వృద్ధికి కృషి చేయాలి. ఇది ఎగుమతులు భారీగా పెరగడానికి దోహదపడుతుంది. కంపెనీల మార్జిన్లు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలూ మెరుగుపడతాయి. ► దృష్టి సారించాల్సిన మరోరంగం వ్యవసాయం. సబ్సిడీలపై వ్యవసాయం పెరగదు. మార్కెట్ సంస్కరణల ద్వారానే ఇది సాధ్యం. -
మరో ఫేక్ న్యూస్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తల ప్రచారం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు నకిలీ వార్తలు రాసిన జర్నలిస్టుల పీఐబీ గుర్తింపు కార్డులను తక్షణం రద్దు చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి స్మృతి ఇరానీ సర్కులర్ జారీ చేయడం, దాన్ని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. పీఐబీ గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు రాయరని, సోషల్ మీడియా ఊపందుకున్న నేపథ్యంలో ఆకాశ రామన్నలు, అజ్ఞాతవ్యక్తులే అలాంటి వార్తలు రాస్తారని కాబోలు స్మృతి ఇరానీ సర్కులర్ విషయంలో నరేంద్ర మోదీ తక్షణం స్పందించారు. ఇప్పుడు మరో నకిలీ వార్త సంచలనం సృష్టించింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పేరుకు పోయిన 9 లక్షల కోట్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల నిరర్థక ఆస్తులు లేదా రుణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) 2016’ వసూలు చేసిందన్నది ఆ నకిలీ వార్త. ఈ వార్తను ముందుగా పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 14వ తేదీన పోస్ట్ చేయగా, ప్రధాన మంత్రి వెబ్సైట్ కూడా ఈ వార్తను మీడియా విభాగంలో ప్రముఖంగా పేర్కొంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి ‘నమో’ యాప్ విస్తతంగా షేర్ చేసింది. బీజేపీతోపాటు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ వార్త నకిలీదని తెలుసుకోగానే బీజేపీ పార్టీ, ప్రధాని వెబ్సైట్ దాన్ని తొలగించాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడమంటే మాటలు కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా దాన్ని ఆ ప్రభుత్వం ఘనతగానే పరిగణించవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈ నకిలీ వార్త ముందుగా ఎక్కడ పుట్టిందో తెలుసుకునేందుకు ‘ఆల్టర్ న్యూస్’ వెబ్సైట్ నెట్లో తూర్పార పట్టగా, ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ఏప్రిల్ నాలుగవ తేదీతో ‘4 లాక్ క్రోర్ రూపీస్ ఎన్పీఏఎస్ రిటర్న్ డ్యూ టూ ఇన్సాల్వెన్సీ సిస్టమ్: అఫీషియల్’ అనే శీర్షికతో ఓ వార్త ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక లేదా చెడ్డ రుణాల్లో సగానికి కొంచెం తక్కువగా, 4 లక్షల కోట్ల రూపాయలు ‘ఐబీసీ–2016’ కింద వసూలయ్యాయన్నది ఆ వార్త. ఆ వార్త కూడా ఓ అధికారి చెప్పినట్లు ఉంది. ఆ వార్తను ఎకనామిక్ టైమ్స్ పత్రిక ‘ఐఏఎన్ఎస్’ అనే వార్తా సంస్థ నుంచి తీసుకొంది. ‘ఇండస్ట్రీ ఛాంబర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ పరిశ్రమలు దివాలా సమస్యను ఎలా అధిగమించాలనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటీ శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారట. ఆ తర్వాత ఈ వార్తకు మరింత మసాలా అద్ది నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందిన వెబ్సైట్ ‘పోస్ట్‌కార్డ్ న్యూస్’ ప్రచురింది. ‘మాసివ్ క్రాక్‌డౌన్ బై మోదీ గవర్నమెంట్ ఆన్ ఎన్పీఎస్’ శీర్షికన ప్రచురించింది. ‘కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 9 లక్షల కోట్ల మొండి రుణాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలను అంటే, 44.44 శాతం రుణాలను ఇటీవల ప్రవేశపెట్టిన ఐబీసీ విధానం ద్వారా మోదీ వసూలు చేశారు’ అని అందులో ఉంది. పోస్ట్‌కార్డ్ న్యూస్‌ను ఎక్కువగా నమ్ముకునే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఈ వార్తను పిక్ చేశాయి. షేర్ చేశాయి. నకిలీ వార్తల కేసులో పోస్ట్‌కార్డ్ న్యూస్ ఎడిటర్ మహేశ్ విక్రమ్ హెగ్డేను మార్చి 30వ తేదీన బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం 9.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఎక్కువగా పెరిగినది 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాకే. ఏదైమైనా నాలుగు లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాలు వసూలయ్యాయంటే సాధారణ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్బీఐ ప్రకటించిన డేటాను సేకరించేందుకు ప్రయత్నించగా, రాజ్యసభలో మార్చి నెలలోనే ఆర్థిక సహాయ మంత్రి శివ ప్రసాద్ శుక్లా ఆర్బీఐ డేటాను వెల్లడించిన విషయం వెలుగుచూసింది. రిటెన్ ఆఫ్ చేసిన 2. 73 లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాల్లో 29, 343 కోట్ల రూపాయలు వసూలయ్యాయని మంత్రి తెలిపారు. బ్యాంక్ రుణాల రైటాఫ్‌కు, రుణాల వేవర్‌కు తేడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా లేకుండా సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకు వివిధ రకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ‘ఐబీసీ–2016’ విధానాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ నిరర్థక ఆస్తుల్లో వసూలు ఎప్పటిలాగే 10.77 శాతం మాత్రమే ఉందని శుక్లా వివరించారు. తుది వివరణ కోసం ‘ఆల్టర్ న్యూస్’ రిపోర్టర్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, తన వార్తను మీడియా తప్పుగా అర్థం చేసుకొందని చెప్పారు. ‘బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 50 శాతం ఆస్తులను ఐబీసీ పరిధిలోకి తెచ్చాం. 3.30 లక్షల కోట్ట రూపాయలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు అప్పగించాం, ట్రిబ్యునల్‌కు నివేదించడానికి ముందే 83,000 కోట్ల రూపాయలు సెటిల్ అయ్యాయి. వాటిని కలుపుకుంటే నాలుగు లక్షలు దాటుతుంది’ అని మాత్రమే తాను చెప్పానన్నారు. వసూలైన 83వేల కోట్ల రూపాయలను వసూలుకాని రుణాలకు ఎందుకు కలుపుకోవాలో ఆయనకే తెలియాలి. ఈ అసలు వార్త అలా, అలా నకిలీ వార్తగా మారిపోయింది. ఎకనామిక్ టైమ్స్లాగానే శ్రీనివాస్ వార్తను ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫస్ట్‌పోస్ట్ పత్రికలు ప్రచురించినప్పటికీ వసూలైన మొత్తం కచ్చితంగా అంత ఉండదని సందేహం వ్యక్తం చేశాయి. -
మొండిబకాయిలు @ రూ.506.51 కోట్లు
♦ పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులు ♦ వసూలుకు బ్యాంకర్ల తంటాలు ♦ మాఫీ హామీ వల్లే మాకీ పరిస్థితి అంటున్న బ్యాంకర్లు బడాబాబుల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయినా పట్టించుకోరు. కానీ రైతులు, డ్వాక్రాసంఘాలు, చిరువ్యాపారులు రుణాలు చెల్లించడంలో కాస్త ఆలస్యం చేస్తే చాలు... నోటీసుల మీద నోటీసులిస్తారు. ఆస్తులను జప్తు చేస్తారు. వేలం వేస్తారు. ఇదీ బ్యాంకర్ల తీరు. విశాఖపట్నం: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాఫీ హామీల మాయలో పడి ఎప్పుడూ క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే అన్నదాతలు..డ్వాక్రాసంఘాల మహిళలు తీసుకున్న అప్పులు కూడా నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిపోయాయి. వ్యవసాయ, స్వల్పకాలిక పంట రుణాల కింద 80,010 రైతుల(అకౌంట్స్)కు ఏకంగా రూ.3438 కోట్ల అవుట్‌స్టాండింగ్ (వడ్డీతో కలిసి మొత్తం బకాయిలు) ఉన్నాయి. దాంట్లో 64,978 రైతులకు రుణమాఫీ పుణ్యమాని రూ.397.78 కోట్ల మేర ఓవర్‌డ్యూస్ జాబితాలో చేరాయి. వీటిలో ఎన్పీఎ(నిరర్ధక ఆస్తుల) జాబితా కిందకు 25,628 మంది రైతులకు రూ.124.23 కోట్లు చేరాయి. ఇక 5395 డ్వాక్రా సంఘాలకు రూ.52.59 కోట్ల బకాయిలకు 310 సంఘాలకు చెందిన రూ.5.89 కోట్ల మేర ఓవర్‌డ్యూస్ జాబితాలో ఉన్నాయి. 326 సంఘాలకు చెందిన రూ.2.421 కోట్లు ఎన్పీఏ జాబితాలో చేరాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కోసం 1,91,333 మందికి రూ. 780.86 కోట్ల రుణాలిస్తే..దాంట్లో 14,617 మంది రైతులకు రూ.800 కోట్ల మేర ఓవర్ డ్యూస్గా చూపిస్తున్నారు. వీటిలో ఎన్పీఏ జాబితాలో 3916 మందికి చెందిన రూ.17.59 కోట్ల మేర చేరాయి. ఇక ఎంఎస్ఎంఈ కింద 64,195 మందికి రూ.4789.41 కోట్ల బకాయిలుంటే.. 7305 మందికి చెందిన రూ.721.62 కోట్ల ఓవర్ డ్యూస్గా మిగిలాయి. వీటిలో 3084 మందికి చెందిన రూ.118.96 కోట్ల మొండి బకాయిల(ఎన్పీఎ) జాబితాలో చేర్చారు. ఇతర ప్రాధాన్య రంగాల కింద ఇచ్చిన రుణాల్లో 78,483 మందికి రూ.4186.24 కోట్ల బకాయిలుంటే, 7393 మందికి చెందిన రూ.290.91 కోట్ల ఓవర్ డ్యూస్ జాబితాలో ఉన్నాయి. వీటిలో 5206 మందికి చెందిన రూ.53.43 కోట్ల మొండిబకాయిలుగా చూపిస్తున్నారు. ఇక ప్రాధాన్యేతర రంగాలకు ఇచ్చిన రుణాల్లో 2,30,421మందికి రూ.12,613.71 కోట్లు బకాయిలుగా పేర్కొంటుండగా, 11,595 మందికి చెందిన రూ.796.97 కోట్లు ఓవర్ డ్యూస్గా పేర్కొంటున్నారు. వీటిలో 29,457 మందికి చెందిన రూ.191.56 కోట్ల మేర మొండి బకాయిలు(ఎన్పీఎ)గా పేర్కొంటున్నారు. ఇలా మొత్తమ్మీద 67,290 అకౌంట్స్‌కు చెందిన రూ.506.51 కోట్లు ఎన్పీఏ జాబితాలో చేర్చారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఉండేది కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి వసూలు కోసం ఆయా బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. మాఫీ హామీల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బ్యాంకర్లు చెబుతున్నారు. -
రూ.1,000 కోట్ల ఎన్పీఏలు విక్రయిస్తాం
- వ్యాపారంలో 14% వృద్ధి సాధిస్తాం - దేనా బ్యాంక్ ఈడీ ఆర్.కె.టక్కర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్ పెద్ద మొత్తంలో ఎన్పీఏలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఎన్పీఏలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేనా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.కె.టక్కర్ చెప్పారు. ఇందులో భాగంగా రెండు లక్షల రూపాయలలోపు ఎన్‌పీఏలున్న 48,000 ఖాతాలను అసెట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ఖాతాల మొత్తం విలువ రూ.200 కోట్లు. దీంతో పాటు 1200 ఖాతాలకు సంబంధించి రూ.125 కోట్ల ఎన్పీఏ ఆస్తులను వేలానికి పిలిచామని, రూ. 72 కోట్ల ఎన్పీఏలను విక్రయించామని చెప్పారాయన. ప్రస్తుతం 6.20 శాతంగా ఉన్న స్థూల ఎన్పీఏలను ఈ ఏడాది చివరి నాటికి 5 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నాల్గవ త్రైమాసికం నుంచి కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాం. ఇప్పుడైతే రిటైల్, ఎస్ఎంఈ రుణాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. ఈ ఏడాది వ్యాపారంలో 14 శాతం వృద్ధి సాధించగలమని భావిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేనా బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.1.98 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 400 శాఖలను ఏర్పాటు చేయనుండగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 15 శాఖలున్నాయి. ప్రస్తుతం దేనా బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 1,762 శాఖలుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కలిపి 51 శాఖలున్నాయి. ఈ మధ్యనే కేంద్రం రూ. 407 కోట్ల మూలధనాన్ని సమకూర్చిందని, క్రెడిట్ డిమాండ్ బాగా పెరిగితే మార్చిలోగా టైర్1, టైర్2 బాండ్ల రూపంలో మరింత మూలధనాన్ని సమీకరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
మొండి బకాయిలు బాబోయ్..
ఆంధ్రా బ్యాంకు ఉద్యోగుల్లో ఆందోళన ⇒ టాప్ ఎగవేతదార్ల ఇళ్లు, ఆఫీసుల ఎదుట ప్రదర్శన ⇒ జాబితాలో టీడీపీ ఎంపీ గుండు సుధారాణి భర్త ⇒ వరంగల్‌లో ఆయన పెట్రోల్ బంకు ఎదుట నిరసన ⇒ ఇప్పటికే రూ. 6,800 కోట్లు దాటిన ఆంధ్రా బ్యాంకు మొండిబకాయిల విలువ... సాక్షి, హైదరాబాద్, విజయవాడ బ్యూరో: నిరర్ధక ఆస్తులు... ముద్దుగా ఎన్పీఏలు. అంటే బ్యాంకులు ఆశలు వదిలేసుకున్న బకాయిలు. ఈ బకాయిలు అంతకంతకూ పెరుగుతూ చివరికి బ్యాంకింగ్ వ్యవస్థనే కబళించే కేన్సర్ మాదిరి తయారయ్యాయి. ఎగవేతదార్లలో ఎక్కువ మంది రాజకీయంగా, ఇతరత్రా పలుకుబడి ఉన్నవారు కావటంతో బ్యాంకులు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. అందుకే 2013 డిసెంబర్ నాటికి దేశంలోని బ్యాంకుల ఎన్పీఏలు రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిత్రమేంటంటే దేశంలో 40 వరకూ స్టాక్మార్కెట్లో లిస్టయిన బ్యాంకులుండగా మొత్తం ఎన్‌పీఏల్లో 70 శాతం 10 బ్యాంకులవే. రూ.2.4 ల క్షల కోట్ల నిరర్ధక ఆస్తుల్లో 28 శాతంతో 69 వేల కోట్లతో ఎస్బీఐ ప్రథమ స్థానంలో ఉండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రా బ్యాంకు మనుగడకే సవాలు! ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రధానంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఆంధ్రాబ్యాంకుకు ఈ ఎన్పీఏల బెడద మరీ ఎక్కువగా ఉంది. ఈ బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు దాదాపు 6,884 కోట్లకు చేరుకున్నాయి. మిగతా బ్యాంకులతో పోలిస్తే ఆంధ్రాబ్యాంకు చిన్నది. వ్యాపారం తక్కువ. అలాంటిది ఈ బ్యాంకు స్థూల ఎన్పీఏలు ఈ స్థాయిలో ఉండటం ఉద్యోగులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్పీఏలు పెరిగిపోతున్న దృష్ట్యా ఈ బ్యాంకును మరో పేరున్న బ్యాంకులో విలీనం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుండటంతో వీరి ఆందోళన మరింత పెరుగుతోంది. దీంతో మొండి బకాయిల వసూళ్ల కోసం వారే స్వయంగా ఉద్యమించటం మొదలెట్టారు. గురువారం నాడు వినూత్న తరహాలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని మౌన ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణల్లోని 16 జోన్లతో పాటు దేశవ్యాప్తంగా 33 జోన్లలో ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు అన్ని జోన్లలోనూ మొదటి మూడు స్థానాల్లో ఉన్న మొండి బకాయిదారుల ఇళ్లు, కార్యాలయాల ముందు శాంతియుతంగా ప్రదర్శనలు చేశారు. బకాయిలు తిరిగి చెల్లించాలని ఎగవేతదారుల్ని కోరారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనే సుమారు 2200 కోట్లకు పైగా వసూలు కావాల్సిన మొండి బకాయిలున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఎగవేతదారుల్లో రాజకీయ నాయకులు... భారీగా రుణాలు తీసుకుని యూనిట్లు పెట్టని వారు, పెట్టిన యూనిట్లను నష్టాలంటూ మధ్యలో మూసేసిన వారు, లాభాలున్నా రుణాల చెల్లింపుపై ఆసక్తి చూపని వారు కోస్తా జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నారు. బాకీలు వసూలు కాకుంటే బ్యాంకు ఉనికికే ప్రమాదమని భావించిన బ్యాంకు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారు. మొండిబకాయిల జాబితాలను చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా తయారుచేసి ఎగవేతదార్ల ఇళ్లు, వ్యాపార సంస్థల ముందు ఒకోరోజు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ఆంధ్రాబ్యాంకు అవార్డు ఎంపాయీస్ యూనియన్ అంగీకరించింది. దీంతో గురువారం విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి, వరంగల్ జిల్లాల్లో ఉద్యోగులు బకాయిదారుల ఇళ్ల ముందు మౌన ప్రదర్శనలు జరిపారు. విజయవాడ జోన్ పరిధిలోనే రూ.200 కోట్ల బకాయిలున్నాయనీ, గురువారం వీనస్ ఆక్వా ఫుడ్స్, హిమజ ఫర్టిలైజర్స్, సోమనాథ్ ఇండస్ట్రీస్‌ల ఎదుట ఆందోళన నిర్వహించామని డీజీఎం కృష్ణారావు చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి భర్త గుండు ప్రభాకర్ కూడా మొండి బకాయిదార్లలో ఉండటంతో ఆయనకు చెందిన పెట్రోల్ బంకు ఎదుట ఉద్యోగులు ప్రదర్శన జరిపారు. జోన్ పరిధిలో ఉన్న మొండి బకాయిలకు సంబంధించి మొదటి స్థానంలో ఉన్న ముగ్గురిని ఎంచుకుని వాళ్ల కార్యాలయాల ముందు, నివాసాల ముందు ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించాం. ఈ హఠాత్ పరిణామంతో బకాయిదారులూ ఆశ్చర్యానికి గురయ్యారు. - జి.రవికుమార్, హైదరాబాద్ జోనల్ మేనేజర్ -
మొండి బకాయిల బండ రూ. 2.22 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు (ఎన్పీఏ) పేరుకుపోతున్నాయని ప్రభుత్వం పార్ల్లమెంటులో అంగీకరించింది. రాజ్యసభలో ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వివరాలు సంక్షిప్తంగా... 40 లిస్టెడ్ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు 2013 సెప్టెంబర్ నాటికి 2.22 లక్షల కోట్లకు చేరాయి. 2012 సెప్టెంబర్‌లో ఇవి రూ.1.62 లక్షల కోట్లు. అంటే ఏడాది వ్యవధిలో 36.9 శాతం పెరిగిపోయాయి. ఇదే కాలంలో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల ఎన్పీఏలు 160 శాతం ఎగసి రూ.2,418 కోట్ల నుంచి రూ.6,286 కోట్లకు చేరాయి. ఇండియన్ బ్యాంక్ పరిమాణం ఈ విషయంలో 110 శాతం పెరిగి రూ.1,789 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు చేరింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 109 శాతం పెరిగి రూ.1,071 కోట్ల నుంచి రూ.2,240 కోట్లకు ఎగశాయి. మూలధనానికి ఇబ్బంది ఉండదు... కాగా ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా మరో ప్రత్యేక సమాధానం ఇస్తూ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేకించి ఉత్పాదక రంగాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ లభ్యత కొరతను ప్రభుత్వం రానీయబోదని పేర్కొంది. 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమకూర్చిన మొత్తం మూలధనం విలువ రూ. 62,234 కోట్లని తెలిపారు. ఈ నిధుల వెచ్చింపు వల్ల బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. మూలధనం చెల్లింపులను పెంచడం వల్ల బ్యాంకుల రుణ సామర్థ్యం పెరగడమే కాకుండా, బ్యాంకులు పొందిన లాభాలపై డివిడెండ్, డివిడెండ్ పంపిణీ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని మంత్రి తెలిపారు. -
డిపాజిట్ రేట్లు తగ్గించం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్ల సేకరణ కష్టంగా ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించే ఆలోచన లేదని ఆంధ్రాబ్యాంక్ స్పష్టం చేసింది. ఇప్పుడు డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తే కొత్త డిపాజిట్లను సేకరించలేమని ఆంధ్రాబ్యాంక్‌కి కొత్తగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సి.వి.ఆర్. రాజేంద్రన్ స్పష్టం చేశారు. ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచడంతో డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించడం లేదని ఇదే సమయంలో రుణాలపై వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదని ‘సాక్షి’తో అన్నారు. ఇప్పటికే ఆంధ్రాబ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీరేట్లను బాగా తగ్గించడంతో ప్రస్తుతం రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గే అవకాశం లేదని, గతంలో వడ్డీరేట్లు పెంచిన కొన్ని బ్యాంకులు మాత్రమే ఇప్పుడు రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇస్తున్నాయన్నారు. అంతకుముందు ఆయన సీఐఐ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌పై ఏర్పాటు చేసిన ‘ఎస్టేట్ సౌత్ 2013’ రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో రాజేంద్రన్ మాట్లాడుతూ ఈ త్రైమాసికంతో పాటు మరో 3 నెలలు బ్యాంకింగ్ రంగం ఎన్పీఏల బెడదను ఎదుర్కొంటుందన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే కావడంతో బ్యాంకు పరిస్థితి అధ్యయనానికి కొంత వ్యవధి పడుతుందని, ఆతర్వాతే అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్న ఇళ్లపై దృష్టిపెట్టండి తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్లకు మంచి డిమాండ్ ఉందని, ఈ రంగంపై రియల్ ఎస్టేట్ సంస్థలు దృష్టిసారించాల్సిందిగా రాజేంద్రన్ కోరారు. ఖరీదైన ఇల్లకంటే అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సాధ్యమైనంత వరకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, పన్నుల భారం తగ్గించుకునే విధంగా అవసరమైతే రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక మూలధనం అవసరమైన ఈ రంగంలోకి పెన్షన్ నిధులు వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంజీరా కన్స్ట్రక్షన్స్ సీఎండీ జి.యోగానంద్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రియల్టీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.