మొండిబకాయిలు @ రూ.506.51 కోట్లు
♦ పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులు
♦ వసూలుకు బ్యాంకర్ల తంటాలు
♦ మాఫీ హామీ వల్లే మాకీ పరిస్థితి అంటున్న బ్యాంకర్లు
బడాబాబుల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయినా పట్టించుకోరు. కానీ రైతులు, డ్వాక్రాసంఘాలు, చిరువ్యాపారులు రుణాలు చెల్లించడంలో కాస్త ఆలస్యం చేస్తే చాలు... నోటీసుల మీద నోటీసులిస్తారు. ఆస్తులను జప్తు చేస్తారు. వేలం వేస్తారు. ఇదీ బ్యాంకర్ల తీరు.
విశాఖపట్నం: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాఫీ హామీల మాయలో పడి ఎప్పుడూ క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే అన్నదాతలు..డ్వాక్రాసంఘాల మహిళలు తీసుకున్న అప్పులు కూడా నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిపోయాయి. వ్యవసాయ, స్వల్పకాలిక పంట రుణాల కింద 80,010 రైతుల(అకౌంట్స్)కు ఏకంగా రూ.3438 కోట్ల అవుట్‌స్టాండింగ్ (వడ్డీతో కలిసి మొత్తం బకాయిలు) ఉన్నాయి. దాంట్లో 64,978 రైతులకు రుణమాఫీ పుణ్యమాని రూ.397.78 కోట్ల మేర ఓవర్‌డ్యూస్ జాబితాలో చేరాయి. వీటిలో ఎన్‌పీఎ(నిరర్ధక ఆస్తుల) జాబితా కిందకు 25,628 మంది రైతులకు రూ.124.23 కోట్లు చేరాయి. ఇక 5395 డ్వాక్రా సంఘాలకు రూ.52.59 కోట్ల బకాయిలకు 310 సంఘాలకు చెందిన రూ.5.89 కోట్ల మేర ఓవర్‌డ్యూస్ జాబితాలో ఉన్నాయి. 326 సంఘాలకు చెందిన రూ.2.421 కోట్లు ఎన్‌పీఏ జాబితాలో చేరాయి.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కోసం 1,91,333 మందికి రూ. 780.86 కోట్ల రుణాలిస్తే..దాంట్లో 14,617 మంది రైతులకు రూ.800 కోట్ల మేర ఓవర్ డ్యూస్‌గా చూపిస్తున్నారు. వీటిలో ఎన్‌పీఏ జాబితాలో 3916 మందికి చెందిన రూ.17.59 కోట్ల మేర చేరాయి. ఇక ఎంఎస్‌ఎంఈ కింద 64,195 మందికి రూ.4789.41 కోట్ల బకాయిలుంటే.. 7305 మందికి చెందిన రూ.721.62 కోట్ల ఓవర్ డ్యూస్‌గా మిగిలాయి. వీటిలో 3084 మందికి చెందిన రూ.118.96 కోట్ల మొండి బకాయిల(ఎన్‌పీఎ) జాబితాలో చేర్చారు. ఇతర ప్రాధాన్య రంగాల కింద ఇచ్చిన రుణాల్లో 78,483 మందికి రూ.4186.24 కోట్ల బకాయిలుంటే, 7393 మందికి చెందిన రూ.290.91 కోట్ల ఓవర్ డ్యూస్ జాబితాలో ఉన్నాయి. వీటిలో 5206 మందికి చెందిన రూ.53.43 కోట్ల మొండిబకాయిలుగా చూపిస్తున్నారు. ఇక ప్రాధాన్యేతర రంగాలకు ఇచ్చిన రుణాల్లో 2,30,421మందికి రూ.12,613.71 కోట్లు బకాయిలుగా పేర్కొంటుండగా, 11,595 మందికి చెందిన రూ.796.97 కోట్లు ఓవర్ డ్యూస్‌గా పేర్కొంటున్నారు.
వీటిలో 29,457 మందికి చెందిన రూ.191.56 కోట్ల మేర మొండి బకాయిలు(ఎన్‌పీఎ)గా పేర్కొంటున్నారు. ఇలా మొత్తమ్మీద 67,290 అకౌంట్స్‌కు చెందిన రూ.506.51 కోట్లు ఎన్‌పీఏ జాబితాలో చేర్చారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఉండేది కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి వసూలు కోసం ఆయా బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. మాఫీ హామీల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బ్యాంకర్లు చెబుతున్నారు.