arrears
-
తెలంగాణ: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఇవాళ్లి నుంచి ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాలలు బంద్ చేసినట్లు యజమానులు తెలిపారు. కళాశాలు నడిపే పరిస్థితి లేక మూసివేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే కాలేజీల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలగొండ జిల్లాలో డిగ్రీ, పీజీ కాలేజీలను యజమానులు మూసివేశారు. కళాశాలల యజమానులు నిరవధిక బంద్ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.120కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు చెబుతున్నారు.ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళాశాల అసోసియేషన్ ఇవాళ్టి నుంచి బంద్ పాటిస్తోంది. కాలేజీల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. మూడేళ్లుగా రూ.2400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని యజమానలు తెలిపారు. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్‌కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్‌టేకింగ్‌లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్‌పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్‌లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్‌పై తన ట్రేడ్‌మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్‌కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్‌ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్‌కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్‌లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్‌పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్‌పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్‌రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
ధాన్యం బకాయిలివ్వరా?
సాక్షి, అమలాపురం: భారీ వర్షాలు.. వరదలతో వరి చేలు చెరువులుగా మారిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందలేదు. ఇంకోవైపు రబీకి సంబంధించి ధాన్యం బకాయిలు సైతం రెండు, మూడు నెలలుగా జమ కావడం లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు సోమవారం అమలాపురం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేశారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌కు వచి్చన జేసీ నుపూర్ అజయ్ కారును పది నిమషాల పాటు అడ్డుకున్నారు. మూడు మండలాల నుంచి తరలివచ్చి.. అల్లవరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి మండలాలకు చెందిన సుమారు 60 మంది రైతులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. మే నెలలో అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటికీ సొమ్ములు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. తమకు రావాల్సిన సొమ్ములు కోసం జిల్లా ఉన్నతాధికారులకు, గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులకు రూ.154 కోట్ల వరకు ధాన్యం సొమ్ములు చెల్లించాల్సి ఉంది. డీఆర్వో వి.వెంకటేశ్వర్లు రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కలెక్టర్ వరద పర్యటనలో ఉన్నందున జేసీ నుపూర్ కార్యాలయానికి వచ్చి ఐదుగురు రైతులు మాట్లాడాలని డీఆర్వో సూచించారు. దీంతో రైతులు వాగి్వవాదానికి దిగారు. రైతులంతా వస్తామని పట్టుబట్టారు. ఆయన వెంట ప్రధాన గేట్లును నెట్టుకుంటూ కార్యాలయం వైపు చొచ్చుకురాగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ అజయ్ రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సొమ్ములు నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. జేసీ హామీతో రైతులు వెనుదిరిగారు. ఆత్మహత్యలే శరణ్యం ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మే నెలలో ధాన్యం విక్రయించగా అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం సొమ్ము చెల్లించడానికి వీలు కాలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం అమ్మకాలు చేసి 70 రోజులు అవుతున్నా సొమ్ములు ఖాతాల్లో జమ చేయకపోవడంతో నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని, నెలాఖరు నాటికి ధాన్యం సొమ్ములు ఇవ్వకుంటే సాగు సమ్మె చేపడతామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో సకాలంలో సొమ్ములు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ములు 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమయ్యేవి. గత ఏడాది ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు చేసిన వారంలోనే సొమ్ములు పడడాన్ని రైతులు గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు సొమ్ములు కూడా మొదట్లో సకాలంలో వేశారు. అదేవిధంగా మే 24, 25 తేదీలలో రెమాల్ తుపాను సమయంలో వర్షాలు కురుస్తుండగా రైతుల వద్ద నుంచి ఏకంగా 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత ఒకసారి రూ.117 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులకు చెల్లింపులు చేయలేదు.మే మొదటి వారంలో అమ్మాం నేను మే మొదటి వారంలో ధాన్యం విక్రయించాను. రూ.1.20 లక్షల వరకు సొమ్ములు రావాల్సి ఉంది. రబీ కోతలకు మెషీన్ ఖర్చులు నుంచి కూలీలు, ఖరీఫ్ విత్తనాలు, దమ్ములు వరకు అప్పులు చేశాను. 70 రోజులు దాటుతున్నా సొమ్ములు ఇవ్వకపోవడం అన్యాయం. – చొల్లంగి రామకృష్ణ, దేవగుప్తం గ్రామంఆత్మహత్యలే శరణ్యం ధాన్యం అమ్మిన సొమ్ముల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇలాగే ఉంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. జేసీ మేడమ్ శనివారం చివరిలో సొమ్ములు మా ఖాతాలో పడతాయని చెప్పారు. అలా జరగకపోతే నిరాహార దీక్షలు చేపడతాం. – కర్రి రాములు, జనుపల్లి గ్రామం -
AP: ఆస్తి పన్ను బకాయిలుపై వడ్డీ మాఫీ
సాక్షి, విజయవాడ: ఆస్తి పన్ను బకాయిలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్‌టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తీ పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలు, ఖాలీ స్థలాలు పన్నులపై వడ్డీ మాఫీ అమలు కానుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. చదవండి: ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్ -
పైసా ఇవ్వలే...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీలో డి.సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంసెట్‌లో ఉత్తమర్యాంకు సాధించి కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న సాయికిరణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడు. కానీ రెండేళ్లుగా వ్యక్తిగతంగా ఫీజు చెల్లిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నిధులు జమ కాగానే చెక్కు రూపంలో ఫీజు వెనక్కి ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ధైర్యం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. కోవిడ్ తర్వాత నిధుల విడుదలలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులు, ఇతర అంశాలపై పడుతోంది. బకాయిలు రూ.4,043.19 కోట్లు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.4043.19 కోట్ల మేర విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు రూపంలో చెల్లించాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో పైసా విడుదల కాకపోగా, అంతకుముందు ఏడాది 40శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా అయితే విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తారు. కానీ మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. బీసీ విద్యార్థులవే అధికం ఫీజు బకాయిల్లో అత్యధికం బీసీ సంక్షేమశాఖకు చెందినవే ఉన్నాయి. ఈ మూడేళ్లకు సంబంధించి బీసీ విద్యార్థులకు రూ.2182.89 కోట్ల బకాయి లున్నాయి. ఈబీసీ కేటగిరీలో మూడేళ్ల బకాయిలు రూ.661.84 కోట్లు ఉన్నాయి. ♦ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా నిధుల సర్దుబాటు చేస్తున్నారు. ♦ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోనూ బకాయిలు 461.05కోట్లు ఉన్నాయి. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు... ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని కాలేజీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడంలోనూ తాత్సారం చేస్తోంది. గతేడాది డిసెంబర్లో దాదాపు రూ.4వందల కోట్లకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసిన అధికారులు ట్రెజరీల్లో క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారు. – గౌరి సతీశ్, కన్వినర్, కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గరున్న ఓఇంజనీరింగ్ కాలేజీలో జె.కార్తిక్ తాజాగా ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌కు ఎంపికయ్యాడు. ఒప్పందపత్రంపై సంతకంతోపాటు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్టు సమర్పించాలని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలంటూ రీయింబర్స్‌మెంట్‌కు మెలిక పెట్టింది. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించి కాలేజీకి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. -
ఎలక్ట్రిక్ టూ–వీలర్ సంస్థలకు భారీ నష్టం
న్యూఢిల్లీ: పేరుకుపోయిన బాకీలు, గతేడాది సబ్సిడీల నిలిపివేత వల్ల మార్కెట్ వాటాను కోల్పోవడం తదితర కారణాలతో విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం) నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణంగా ఏడు సంస్థలు ఏకంగా రూ. 9,000 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) మంత్రి మహేంద్ర నాథ్ పాండేకి రాసిన లేఖలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (ఎస్ఎంఈవీ) చీఫ్ ఎవాంజెలిస్ట్ సంజయ్ కౌల్ ఈ విషయాలు తెలిపారు. అసలే కష్టకాలంలో ఉంటే.. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తాలను వాపసు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు. 2022లో సదరు సంస్థలకు భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీలను నిలిపివేసినప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలు, వడ్డీ, రుణం, మార్కెట్ వాటాపరమైన నష్టం, ప్రతిష్టకు భంగం కలగడం, పెట్టుబడి వ్యయాలపరంగా కంపెనీలకు రూ. 9,075 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ఎస్ఎంఈవీ ఆడిట్లో తేలినట్లు కౌల్ తెలిపారు. ఫలితంగా కొన్ని కంపెనీలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చని, కొన్ని మూతబడవచ్చని పేర్కొన్నారు. దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 1 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో పరిశ్రమ చర్చలు జరుపుతున్న తరుణంలో దాదాపు దానికి సరిసమానమైన స్థాయిలో నష్టాలు నమోదవడం చిత్రమైన పరిస్థితి అని కౌల్ వ్యాఖ్యానించారు. రోజూ పెరిగిపోతున్న నష్టాల కారణంగా తయారీ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయండి.. ఓఈఎంలకు గత 18–22 నెలల సబ్సిడీ బాకీలు రావాల్సి ఉందని కౌల్ తెలిపారు. పైపెచ్చు పాత సబ్సిడీలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడం, కొత్త మోడల్స్‌ను ఎన్ఏబీ పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి అనుమతించకపోవడం వంటివి ఆయా సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ప్రధాన ఉద్దేశం సదరు సంస్థలను శిక్షించడం మాత్రమే అయితే, ఇలా సమస్య పరిష్కారం కాకుండా జాప్యం జరుగుతూ ఉండటం వల్ల అవి పూర్తిగా మూతబడే పరిస్థితి వస్తోందని కౌల్ తెలిపారు. ఇలాంటి శిక్ష సరికాదని పేర్కొన్నారు. మూసివేత అంచుల్లో ఉన్న ఓఈఎంలకు ఊపిరి పోసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. తక్కువ వడ్డీపై రుణాలు, గ్రాంట్లు లేదా ఆ తరహా సహాయాన్ని అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిర్దిష్ట స్కీము నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు పొందాయంటూ హీరో ఎలక్ట్రిక్ సహా ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటర్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటోపై ప్రభుత్వం విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు మేడిన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలి. అయితే, ఈ ఏడు సంస్థలు దిగుమతి చేసుకున్న పరికరాలను వినియోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంగించాయని ఆరోపణలు ఉన్నాయి. -
ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై ఆ సంస్థకు చెందిన ఉద్యో గుల సహకార పర పతి సంఘం (సీసీ ఎస్) మరోసారి కోర్టుకెక్కింది. ఉద్యోగుల కుటుంబ అవసరాలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా సీసీఎస్ నిధిని ఆర్టీసీ వాడేసుకోవడంతో సీసీఎస్ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి 7శాతాన్ని కోత పెడుతున్న ఆర్టీసీ యాజమాన్యం... ఆ సొమ్మును సీసీ ఎస్‌కు సరిగ్గా చెల్లించకపోవడం వల్ల వడ్డీతో కలిపి రూ. 903 కోట్ల మేర బకాయిలు పేరుకు పోయాయని.. అందులోంచి కనీసం రూ. 600 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది. ఆర్టీసీ తీరుతో సీసీఎస్ కొంతకాలంగా ఉద్యోగులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెల కొంది. ఫలితంగా వారు బయట నుంచి అప్పులు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతు న్నారు. మరోవైపు జూలై నుంచి రిటైరైన సుమారు వెయ్యి మంది ఉద్యోగులతోపాటు వీఆర్ఎస్ తీసుకున్న 200 మంది ఉద్యోగులు ఇంతకాలం సీసీఎస్‌లో దాచుకున్న మొత్తం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం రుణాల కోసం 6,800 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశంపై 2019లో సీసీఎస్ తొలిసారి హైకోర్టును ఆశ్రయించగా రూ. 200 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్టీసీని న్యాయస్థా నం ఆదేశించింది. అయినా ఆర్టీసీ యాజమా న్యం స్పందించకపోవడంతో సీసీఎస్ 2020 జూన్‌లో కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీంతో దిగొచ్చిన ఆర్టీసీ... ఆ మొత్తాన్ని ఆర్టీసీ చెల్లించింది. -
‘ఫీజు’కు తప్పని నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు మరింత నిరీక్షణ తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అటు సంక్షేమ శాఖల వద్ద భారీగా బిల్లులు పేరుకుపోగా.. ఇటు సంక్షేమశాఖలు ఈపాస్ ద్వారా ఆన్లైన్లో క్లియర్ చేసిన బిల్లులకూ ట్రెజరీల్లో చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. దీనితో కాలేజీల యాజమాన్యాల నుంచి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ శాఖల గణాంకాల ప్రకారం.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి రూ.1,867.66 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.460.96 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2021–22కు సంబంధించి 1,406.70 కోట్లు చెల్లించాలి. ఇక 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ మొదలుకాలేదు. ట్రెజరీలో ఆగిన రూ.560 కోట్లు పోస్ట్‌మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలతోపాటు అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ముందుగా కాలేజీ యాజమాన్యాలు పరిశీలించి ఆమోదం కోసం సంక్షేమశాఖ అధికారులకు పంపుతాయి. సంక్షేమశాఖల అధికారులు వాటిని పరిశీలించాక ఆమోదించి నిధుల విడుదల కోసం ట్రెజరీకి బిల్లులు పంపుతారు. ట్రెజరీ అధికారులు వాటిని పరిష్కరించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సుమారు రూ.560.16 కోట్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపగా.. అధికారులు ఆమోదించి టోకెన్లు జనరేట్ చేశారు. కానీ ఆర్థికశాఖ విధించిన ఆంక్షలతో నిధుల విడుదల చివరిదశలో నిలిచిపోయింది. ఆంక్షలు సడలించాకే నిధులు విడుదలవుతాయి. చెల్లింపుల్లో పెరుగుతున్న జాప్యం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చెల్లింపులు ఒక ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా విద్యా సంవత్సరం ముగియగానే.. ఆ ఏడాదికి సంబంధించిన నిధుల చెల్లింపుల ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో చెల్లింపుల్లో జాప్యం పెరిగింది. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు దాదాపు 20 శాతం చెల్లించాల్సి ఉంది. 2021–22కు సంబంధించి 50 శాతం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా చెల్లింపులు మొదలుకాలేదు. -
తక్షణమే బకాయిలు విడుదల చేయాలి
చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.33,545 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని కేంద్ర నాయకులు గొప్పలు చెబుతున్నారని, అయితే ఆ నిధులన్నీ తమకు హక్కుగా వస్తున్న విషయా న్ని గమనించాలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, విభజన చట్టంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన రూ.1,350 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రాంట్ల రూపంలో రూ.723 కోట్లు, పౌష్టికాహారం కింద రూ.175 కోట్లు, స్టేట్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ కింద ప్రతిపాదించిన రూ.3,024 కోట్లు, తెలంగాణకు బదులు పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రూ.497 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక వేళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. కృష్ణానది జలాల్లో వాటా తేల్చకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కేంద్రం అన్యా యం చేస్తోందన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ చౌటుప్పల్ మండలం పంతంగిలో బుధవారం రాత్రి మంత్రి రోడ్ షో నిర్వహించారు. -
ఏపీనే రూ.4,774 కోట్లు బాకీ
సాక్షి, హైదరాబాద్: విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ తమకు రూ.4,774 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య సమసిన విద్యుత్ బకాయిల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ దాదాపు రూ.6వేల కోట్లు బకాయి ఉందంటూ హైకోర్టులో ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీ వల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సీజే జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం.. పిటిషన్‌ను అనుమతిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఏపీ జెన్కో, పెన్షన్ అండ్ గ్రాట్యు టీ ట్రస్ట్, ఏపీ విద్యుత్ డిపార్ట్మెంట్, ఏపీ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా ప్రతివాదులంతా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, 2022 జనవరి 31 నాటికి అసలు కింద రూ.2,698 కోట్లు, వడ్డీ కింద రూ.2,076 కోట్లు.. మొత్తంగా రూ.4,774 కోట్లు ఏపీ బాకీ ఉన్నట్లు తెలంగాణ పిటిషన్లో పేర్కొంది. -
ఎన్పీఏల విక్రయానికి ఎస్బీఐ రెడీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏలు)గా మారిన 12 ఖాతాలను విక్రయించే సన్నాహాల్లో ఉంది. తద్వారా రూ. 820 కోట్ల రుణాలను రికవర్ చేసుకోవాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ ఆస్తుల విక్రయంపై బ్యాంకు విధానాల ప్రకారం నియంత్రణ సంస్థల నిబంధనలకులోబడి వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. మార్చి– ఏప్రిల్ 13 మధ్య విక్రయించేందుకు 12 ఎన్పీఏ ఖాతాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్‌సీలు), ఎన్బీఎఫ్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇవీ ఖాతాలు: ఎస్బీఐ విక్రయించనున్న ఎన్పీఏ ఖాతాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌వర్త్ ఉర్జా అండ్ మెటల్స్(దాదాపు రూ. 397 కోట్ల రుణాలు) ఖాతాను ఈ నెల 29న ఈఆక్షన్కు పెట్టనుంది. ఇందుకు రిజర్వ్ ధర రూ. 85 కోట్లుగా ప్రకటించింది. రూ. 186 కోట్ల బకాయిలుగల బాలసోర్ అలాయ్స్కు రూ. 178.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఈ బాటలో రూ. 122 కోట్ల బకాయిలుగల మరో ఆరు ఎన్పీఏ ఖాతాలను 30న ఈవేలం వేయనుంది. మిగిలిన నాలుగు ఎన్పీఏ ఖాతాలకు ఏప్రిల్ 13న వేలం నిర్వహించనుంది. వీటి మొత్తం బకాయిలు రూ. 125.3 కోట్లు. -
ఏఏఐకు ఎయిర్‌లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల నిర్వహణ సంస్థ – ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఎయిర్‌లైన్స్ సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, గోఫస్ట్, ఎయిరేషియా ఇండియా, ఎయిర్ ఇండియా, విస్తారా కలసి 2021 అక్టోబర్ చివరికి రూ.2,636 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఎయిర్ నేవిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్ తదితర రూపాల్లో ఏఏఐకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏఏఐకు అత్యధిక బకాయిలు ఎయిర్ ఇండియానే చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి 1 నాటికి రూ.2,184 కోట్ల మేర ఎయిర్ ఇండియా చెల్లించాల్సి ఉంటే.. 2021 అక్టోబర్ చివరి నాటికి రూ.2,362 కోట్లకు పెరిగినట్టు ఏఏఐ అంతర్గత పత్రాలు తెలియజేస్తున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించడం తెలిసిందే. -
వ్యాపారంలో సొంత ఖర్చులా? అయితే చిక్కులు తప్పవు!
నేను చిరు వ్యాపారం చేస్తున్నాను. జీఎస్టీ నంబర్ ఉంది. స్వంత ఇంట్లోనే వ్యాపారం. నా స్వంత ఖర్చులను కూడా వ్యాపారపు ఖర్చుల్లో కలిపివేయవచ్చా. అలా కలపడం వల్ల లాభం తగ్గుతుంది కదా – ఆర్ చిట్టిబాబు, శ్రీకాకుళం చిరు వ్యాపారం అంటున్నారు.. కానీ జీఎస్టీ నంబరు ఉందంటున్నారు. సరే, సరిగ్గా అన్ని రికార్డులు నిర్వహించండి. స్వంత ఇంట్లోనే వ్యాపారం అన్నారు. ఇల్లు మీ పేరు మీదే ఉంటే అద్దె నిమిత్తం ఏ ఖర్చూ రాయకండి. ఇల్లు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటే అద్దె ఖర్చుగా రాయవచ్చు. అది కూడా మొత్తం ఇంట్లో ఎంత భాగం అయితే వ్యాపారానికి కేటాయిస్తున్నారో, అంతకు మాత్రమే ఖర్చు చేయండి. అలాగే కరెంటు, నీరు ఖర్చు కూడా . ఇక వ్యాపార నిర్వహణలో కేవలం వ్యాపారానికి సంబంధించిన ఖర్చును మాత్రమే పరిగణిస్తారు. వ్యక్తిగత ఖర్చులు, సొంత వాడకాలు, ఇతర ఖర్చులు, క్యాపిటల్ ఖర్చులు మొదలైనవి పరిగణించరు. ఇటువంటి ఖర్చులను వ్యాపార ఖాతాలో రాయకండి. సొంత వాడకాలని కూడా విడిగా రాయాలి. ఖర్చుల విషయంలో ‘‘సమంజసం’’, ‘‘ఉచితం’’, ‘‘సంబంధం’’ అన్న సూత్రాలు వర్తిస్తాయి. పుస్తకాలు సరిగ్గా రాయండి. ఆడిట్ అవసరం కాకపోతే ఖర్చులు రాయకుండా అమ్మకాల మీద 8 శాతం కన్నా ఎక్కువ లాభం చూపించవచ్చు. అప్పుడు లెక్కల బెడద ఉండదు. ఏది ఏమైనా సొంత ఖర్చులు కలపకూడదు. నేను ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నాను. ఒక కోర్టు కేసు వల్ల గతంలో జీతం చెల్లించలేదు. 3 సంవత్సరాలకు సంబంధించిన బకాయీలు ఈ సంవత్సరం ఇస్తారు. దీని వల్ల నాకు పన్ను భారం పెరుగుతుందా? – యం. నాగమణి, రాజమండ్రి ఇలాంటి బకాయీలను ‘‘ఎరియర్స్’’ అంటారు. వీటిని ట్యాక్సబుల్ ఇన్కంగా పరిగణిస్తారు. అంటే ఈ అదాయం మీద పన్ను భారం ఉంది. అయితే, ఒక వెసులుబాటు కూడా ఉంది. ఏ సంవత్సరానికి తత్సంబంధమైన ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, మీరు తక్కువ/చిన్న శ్లాబులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ సంవత్సరానికి సంబంధించిన రాయితీలు, మినహాయింపులు తీసుకోవచ్చు. పన్నుభారం తక్కువ కావచ్చు. మీకు రెండు సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఎరియర్స్‌ని ప్రస్తుత సంవత్సరం ఆదాయంతో బాటు కలిపి పన్ను భారం లెక్కించండి. రెండో పద్ధతి ప్రకారంలో ఈ ఎరియర్స్.. ఆర్థిక సంవత్సరం ప్రకారం సర్దుబాటు చేయండి. గతంలో వచ్చిన జీతానికి ఈ ‘ఎరియర్స్’ భాగం కలిపి పన్ను భారం లెక్కించండి. అలా ఎన్ని సంవత్సరాలు వర్తిస్తుందో.. అన్ని సంవత్సరాలకు పన్నుభారం లెక్కించండి. ఆ తర్వాత అలా అన్ని సంవత్సరాల పన్ను భారం కలిపి మొత్తం పన్నుభారాన్ని కనుక్కోండి. ఇలా వచ్చిన మొత్తం పన్ను భారాన్ని ముందు/మొదట్లో లెక్కించిన పన్నుభారంతో పోల్చి చూడండి. ఏది తక్కువ ఉందో, అంతే చెల్లించండి. ఇలా తక్కువ చెల్లించడాన్ని 89 (1) రిలీఫ్ అంటారు. మీరే ఒక స్టేట్మెంట్ చేసుకుని ఫారం 10 ఉలో సమాచారాన్ని పొందుపర్చి, మీ యజమానికి ఇవ్వండి. రిలీఫ్ ఇస్తారు. ఒకవేళ ప్రస్తుత సంవత్సరంలోనే పన్నుభారం తక్కువగా ఉందనుకోండి. 10 ఉ ఇవ్వనవసరం లేదు. అన్ని రికార్డులు జాగ్రత్తగా భద్రపర్చుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూరి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ఎయిరిండియా ఇంధన బకాయిలు బదిలీ
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాట పట్టిన ఎయిరిండియాకు చెందిన ఇంధన చెల్లింపులు తదితర బకాయిలు అనుబంధ సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీకానున్నాయి. రూ. 16,000 కోట్ల విలువైన ఇంధన బిల్లులు తదితరాలు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, వెండార్లు తదితరాలకు బిల్లులు చెల్లించవలసి ఉన్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే. కంపెనీ పగ్గాలను టాటా గ్రూప్‌నకు అప్పగించేముందుగానే బకాయిల బదిలీ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఎయిరిండియాకు చెందిన కీలకంకాని ఆస్తులను ఎస్పీవీగా ఏర్పాటు చేసిన ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేసేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎయిరిండియా విక్రయానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. భవనాలు, భూములు తదితర ఆస్తులతోపాటు ఎయిరిండియా రుణాలలోనూ 75 శాతంవరకూ ఎస్పీవీకి బదిలీ చేయనుంది. డిసెంబర్‌లోగా బ్యాలెన్స్ షీట్... ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు బదిలీ చేసే ముందు డిసెంబర్ నాటికి ప్రభుత్వం బ్యాలెన్స్‌షీట్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మదింపులో ఇతర బకాయిలు(లయబిలిటీస్) ఏమైనా ఉంటే వీటిని సైతం ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయనుంది. కాగా.. ఆగస్ట్ 31కల్లా ఎయిరిండియా రుణ భారం రూ. 61,562 కోట్లు. వీటిలో టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. మిగిలిన రూ. 46,262 కోట్ల రుణాలు ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ కానున్నాయి. సంస్కరణలకు సంకేతం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై సీఐఐ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో సంస్కరణల విషయంలో మార్కెట్లు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచి్చందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బ్యాంకింగ్ విభాగంలో ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు సరైన సమయంగా అభిప్రాయపడింది. ‘‘ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎయిర్ ఇండియాను విజయవంతంగా విక్రయించడం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయమై ప్రతిష్టాత్మక ప్రణాళికకు తాజా ఉత్సాహాన్నిచి్చంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ప్రైవేటీకరణ ప్రణాళికలను ప్రభుత్వం అనుకున్నట్టుగా పూర్తి చేయగలదని, భవిష్యత్తు విక్రయాల్లో బిడ్డింగ్‌ను ప్రోత్సహించగలదన్న విశ్వాసాన్ని తాము కలిగించినట్టు చెప్పారు. -
టెల్కో కొనుగోలుపై ప్రభుత్వానికి ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: బాకీలపై వడ్డీని కంపెనీలో వాటాల రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఏ టెల్కోనూ కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని భారీ బకాయిల భారంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) ఎండీ రవీందర్ టక్కర్ తెలిపారు. టెలికం రంగంలో కనీసం మూడు ప్రైవేట్ సంస్థలైనా ఉండాలని, అవి మార్కెట్లో పోటీపడాలన్నదే కేంద్రం అభిప్రాయమని పేర్కొన్నారు. టెలికం సంస్కరణలను కేంద్రం ప్రకటించడానికి ముందు తాను ప్రభుత్వంలోని వివిధ వర్గాలతో సంభాషించానని ఆయన చెప్పారు. ఏ టెలికం కంపెనీని కొనుగోలు చేయాలని గానీ నిర్వహించాలని గానీ ప్రభుత్వానికి ఉద్దేశమేదీ లేదని ఆయా సమావేశాల్లో స్పష్టమైందని టక్కర్ తెలిపారు. -
ఆ కార్పొరేటర్ల బకాయిలు రూ. 40 లక్షలు
సాక్షి, ముంబై: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు తదితర కేసుల్లో అనర్హత వేటు పడిన పలువురు కార్పొరేటర్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి భారీగా బకాయిపడ్డారు. మొత్తం 12 మంది మాజీ కార్పొరేటర్లు రూ. 40 లక్షల మేర బకాయి పడ్డారని బీఎంసీ అకౌంట్స్ విభాగం తెలిపింది. వారిని వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. బీఎంసీకి బకాయి పడిన 12 మందిలో శివసేన పారీ్టకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందినవారు ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఎన్సీపీకి చెందిన వారు ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోటీచేసే అభ్యర్థులు టికెట్ దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి తాము గెలిచే అవకాశమున్న రిజర్వుడ్ వార్డుల నుంచి పోటీ చేసేందుకు తప్పుడు లేదా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమరి్పస్తారు. అలాంటి వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులుంటే పరిశీలిస్తారు. ఆ తరువాత ఆరోపణలు నిజమని తేలితే గెలిచిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేస్తారు. వారి స్థానంలో ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ, ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి నాలుగైదు నెలలు గడుస్తుంది. ఈ కాలవ్యవధిలో కార్పొరేటర్లు పొందిన వివిధ భత్యాలు, గౌరవ వేతనం తిరిగి బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ, గత ఎన్నికల్లో అనర్హత వేటు పడిన మొత్తం 24 మంది కార్పొరేటర్లలో 12 మంది ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. అనిల్ గల్గలే అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బీఎంసీ అకౌంట్స్ విభాగం నుంచి దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ బకాయిల విషయం బయటకు వచి్చంది. దీంతో బకాయిలు చెల్లించని ఆ 12 మంది మాజీ కార్పొరేటర్ల ఆస్తులు జప్తు చేయాలని అనిల్ గల్గలే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్‌ను డిమాండ్ చేశారు. పేరు పార్టీ పార్టీ బకాయిలు(రూ. లక్షల్లో) ముర్జీపటేల్ బీజేపీ 5.64 కేశర్బేన్పటేల్ బీజేపీ 5.64 భావన జోబన్‌పుత్ర బీజేపీ 3.49 రాజపతి యాదవ్ కాంగ్రెస్ 5.64 కిణీ మారిస్ కాంగ్రెస్ 4.84 భారతీ ధోంగడే కాంగ్రెస్ 1.81 సుగుణ నాయిక్ శివసేన 3.55 అనుషా కోడం శివసేన 0.37 సునీల్ చవాన్ శివసేన 0.93 నాజీయా సోఫీ ఎన్సీపీ 7.21 చంగేజ్ ముల్తాని ఇండిపెండెంట్ 0.79 అంజుమ్ అస్లం ఇండిపెండెంట్ 0.45 -
బకాయిల కుప్పలు .. విద్యార్థులకు తిప్పలు
►రెండు సంవత్సరాలుగా నిధులు అందకపోవడంతో రూ.5.5 లక్షల అప్పు చేసి ఫీజు చెల్లించిన చైతన్యపురికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని తండ్రి రెండు నెలలుగా హైదరాబాద్ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రభుత్వ పథకంపైనే ఆధారపడిన విద్యార్థులు అప్పులు చేసి కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. 2019–20 విద్యా సంవత్సరం బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఇక 2020–21కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.3017.41 కోట్ల బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలనూ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా జరగాల్సిన నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నిచోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక పోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని యాజమాన్యాలు అంటున్నాయి. జాడలేని నెలవారీ నిధులు మూడేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో ప్రతి విద్యా సంవత్సరం చివర్లో నిధులను మంజూరు చేసేవారు. అయితే పెద్దమొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారుతుండటంతో నెలవారీగా నిధులు విడుదల చేయాలని భావించింది. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు వేరువేరుగా పద్దుల కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టింది. తొలి రెండు మూడు నెలలు నిధుల విడుదల సాఫీగా జరిగినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పింది. దీంతో బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. దీంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు పలు కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడితో తామే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత.. చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. జూనియర్ విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇలా ఫీజులు చెల్లించినవారు సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదనే సమాధానం ఎదురవుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. వనపర్తి జిల్లా గోపాల్పేట హరిజనవాడకు చెందిన లావణ్య అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక గతనెల 19న బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. దరఖాస్తులు పరిశీలనకే పరిమితం... 2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలకు సంబంధించి 12.85 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా నూరు శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైన నెల రోజుల తర్వాత నుంచి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కావాలి. అయితే కోవిడ్–19 నేపథ్యంలో పరిశీలన ఆలస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలన ప్రారంభించిన సంక్షేమాధికారులు ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాల కోసం రూ.2,250 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు అటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గానీ, ఉపకార వేతనాలకు కానీ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రూ.767.41 కోట్ల మేర బకాయి ఉంది. వీటికి సంబంధించి సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయమై ఆర్థిక మంత్రితో సహా పలువురికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. ఇతర పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు బకాయి పడ్డ నిధులను ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దిక్కుతోచని స్థితిలో కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వాళ్లు 85 శాతం ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అప్పులు చేసి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఏకంగా కాలేజీలనే మూసేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. – గౌరి సతీష్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం -
విధాన నిర్ణయాల్లో... మా జోక్యం ఉండదు
న్యూఢిల్లీ: విధానపరమైన నిర్ణయాల్లో తమ జోక్యం ఉండబోదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకులు రుణ అకౌంట్లను మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించడాన్ని నిలుపుచేస్తూ తాను ఇచ్చిన స్టేను మార్చి 23వ తేదీన సుప్రీంకోర్టు తొలగించింది. అయితే ఎన్పీఏగా ప్రకటించడానికి సంబంధించి మరిన్ని అంశాలను సమీక్షించాలని దాఖలైన తాజా పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం ఉండబోదని పేర్కొంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఇప్పటికే వచ్చిన తీర్పులో పేర్లు, సంబంధిత పొరపాట్లు ఏదైనా జరిగితే సవరణలకు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయవచ్చు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అలాంటి అంశాలు ఏవీ లేవు. దీనిని మేము విచారించలేము’’ అని డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది. దీనితో ఈ అప్లికేషన్ ఉపసంహరణకు న్యాయవాది ధర్మాసనం అనుమతి కోరారు. దీనికి బెంచ్ అంగీకరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణ చెల్లింపులపై గత ఏడాది ఆగస్టు 31 వరకూ 6 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించింది. ఈ కాలంలో బ్యాంకింగ్ చక్రవడ్డీ వసూళ్లపై జరిగిన విచారణ సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇస్తూ, ఆగస్టు 31 వరకూ మొండిబకాయిలుగా ప్రకటించిన ఖాతాలను తన తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం ఈ స్టేను వెకేట్ చేస్తూ, ఈ ఏడాది మార్చి 23న తీర్పును ఇచ్చింది. అలాగే మారటోరియం కాలంలో చక్రవడ్డీ తగదనీ ఆదేశా లు ఇచ్చింది. దీనితో తీర్పునకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అప్పటికే వసూలు చేసిన వడ్డీ మొత్తాలను రిఫండ్ చేసేలా లేదా రుణ అకౌంట్ల తదుపరి వాయిదాల్లో సర్దుబాటు జరిగేలా బ్యాంకింగ్‌కు ఆదేశాలిచ్చింది. -
ఆ విద్యార్థులకు షాక్.. తప్పక పరీక్ష రాయాల్సిందే!
సాక్షి, చెన్నై: పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన ‘అరియర్స్’ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సైతం షాక్ ఇచ్చింది. ఆల్‌పాస్ ఉత్తర్వుల నుంచి యూటర్న్ తీసుకుంది. అరియర్స్ విద్యార్థులందరూ పరీక్షలు రాయాల్సిందేనని ప్రకటించింది. ఇందుకు తగ్గ నివేదిక గురువారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కరోనా విలయతాండవంతో గత విద్యా సంవత్సరం జరగాల్సిన ప్లస్‌టూ మినహా, తక్కిన అన్ని పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. పది విద్యార్థులకు ఆల్‌పాస్ ప్రకటించారు. అదే తరహాలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు మినహా, తక్కిన సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసి తర్వాత సంవత్సరానికి ప్రమోట్ చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా, అనేక సబ్జెక్టుల్లో ఫెయిలై ఏళ్ల తరబడి అరియర్స్‌ను భుజాన వేసుకుని ఉన్న విద్యార్థులకు ఊరట కల్గించే రీతిలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఆల్‌పాస్ ప్రకటన చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు చేరింది. విచారణ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించింది. ఇది తమ నిబంధనలకు విరుద్ధమని యూజీసీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని అరియర్స్ విద్యార్థులు ఎదురుచూశారు. ఆల్ పాస్ ప్రకటన సమయంలో పాలక వర్గాన్ని ఆకాశానికి ఎత్తేసిన ఈ విద్యార్థులకు తాజాగా షాక్ తప్పలేదు. పరీక్ష రాయాల్సిన పరిస్థితి. అయితే, ఇది నామమాత్రంగా ఉంటుందా వేచి చూడాల్సిందే.? ఆన్లైన్లో పరీక్ష.. తమ నిర్ణయాన్ని సమర్థించుకునే రీతిలో కోర్టులో వాదన వినిపిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యూటర్న్ తీసుకుంది. ఓ వైపు ఏఐసీటీఈ, మరో వైపు యూజీసీ, ఇంకో వైపు కోర్టు రూపంలో వ్యతిరేకత , అక్షింతలు ఎదురుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం తగ్గాల్సిన పరిస్థితి. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ విజయనారాయన్ హాజరై నివేదికను సమర్పించారు. అందులో అరియర్స్ విద్యార్థుల ఆల్ పాస్ ఉత్తర్వులను వెనుక్కి తీసుకుంటూ, పరీక్ష నిర్వహించన్నుట్టు ప్రకటించారు. అరియర్స్ విద్యార్థులందరికి ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నామని వివరించారు. ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులే ఉత్తీర్ణతకు అర్హులు అవుతారని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను ఆయా విశ్వవిద్యాలయాలు ప్రకటిస్తాయని పేర్కొంటూ, యూజీసీ వర్గాలతో మరో మారు సంప్రదింపులు జరిపి సజావుగా అన్ని వ్యవహరాలు సాగే రీతిలో చర్యలు తీసుకుంటామని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ, ఆన్లైన్లో పరీక్షల నిర్వహణకు ఎనిమిది వారాలు సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతలోపు అన్ని ప్రక్రియలు ముగించి కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలైకు వాయిదా వేశారు. చదవండి: ఈ వైద్యురాలు తన శ్వాసతో పసి ప్రాణాన్ని కాపాడింది -
బకాయిల బండ!
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిల భారం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి పోర్టల్ (https: //praapti.in) ప్రకారం 2019 డిసెంబర్ నాటికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,860 కోట్లు ఉండగా 2020 డిసెంబర్ నాటికి అవి రూ. 7,101 కోట్లకు ఎగబాకాయి. తెలంగాణ జెన్కోతోపాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఈ జాబితాలో పొందుపర్చలేదు. అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయడం లేదు. జెన్కో, సింగరేణిలకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే డిస్కంల మొత్తం బకాయిలు రూ. 10 వేల కోట్లకుపైనే ఉండనున్నాయి. ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ ఎన్టీపీసీ, జెన్కో వంటి ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వంటి అన్ని ఖర్చులు కలిపి విద్యుత్ సరఫరాకు అవుతున్న వాస్తవ వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్)తో పోల్చితే వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్ల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉండటంతో డిస్కంలు ప్రతి నెలా రూ. 200 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌పై 0.93 పైసల చొప్పున డిస్కంలు నష్టపోతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ‘ఉదయ్’పోర్టల్ పేర్కొంటోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విద్యుత్ సబ్సిడీలు పూర్తిస్థాయిలోఆదాయ లోటును పూడ్చటంలో విఫలం కావడంతో డిస్కంలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపలేకపోతున్నాయి. దీంతో క్రమేణ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. గత డిసెంబర్ నాటికి డిస్కంలు వివిధ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) విద్యుదుత్పత్తి కంపెనీ డిస్కంల బకాయిలు సీఎల్పీఐ 171.73 ఐటీపీసీఎల్ 9.53 ఎన్ఎల్సీఐఎల్ 492.11 ఎన్‌టీఈసీఎల్ 248.55 ఎన్టీపీసీ 1,723.97 ఎన్టీపీఎల్ 418.65 ఎస్‌ఈఎంబీ 2,532.22 సంప్రదాయ విద్యుత్ బకాయిల మొత్తం: 5,596.76 సంప్రదాయేతర విద్యుత్ బకాయిలు: 1,504.57 మొత్తం బకాయిలు: 7,101 ‘కో–ఆర్డినేషన్’కమిటీపై బకాయిల భారం.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 478.86 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 1,335.16 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) రూ. 5,287.31 కోట్లు కలిపి డిస్కంలు మొత్తం రూ. 7,101.33 కోట్లను విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిపడ్డాయి. అత్యధిక శాతం విద్యుత్ కొనుగోళ్లను టీఎస్పీసీసీ ఆధ్వర్యంలో జరుపుతుండటంతో అత్యధిక బకాయిలు సైతం దీని పేరిటే ఉన్నాయి. ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు చైర్మన్‌గా ఉన్న టీఎస్పీసీసీ డిస్కంల తరఫున విద్యుత్ కొనుగోళ్లు, జనరేటర్లకు బిల్లుల చెల్లింపుల వంటి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నెలవారీగా జనరేటర్లకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) 2020 బకాయిలు జనవరి 6,153 ఫిబ్రవరి 6,385 మార్చి 6,039 ఏప్రిల్ 6,494 మే 7,143 జూన్ 7,443 జూలై 4,755 ఆగస్టు 4,872 సెప్టెంబర్ 5,485 అక్టోబర్ 6,096 నవంబర్ 6,655 డిసెంబర్ 7,101 కేంద్రం మెట్టు దిగితేనే.. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు ఆత్మనిర్భర్ రుణాలను ప్రకటించింది. తెలంగాణ డిస్కంలకు ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 12,600 కోట్ల రుణాలు మంజూరవగా 50 శాతం రుణాలను తొలి విడత కింద విడుదల చేశారు. రెండో విడత రుణాల విడుదలకు విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదిస్తున్న సంస్కరణల అమలుకు అంగీకరిస్తేనే మిగిలిన రుణాలను విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంటోంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అమలును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మెట్టుదిగి రుణాల విడుదలకు అంగీకరిస్తేనే డిస్కంలు బకాయిల భారం నుంచి బయటపడనున్నాయి. -
ప్రభుత్వం ఆదుకోకపోతే బ్యాంకింగ్‌కు కష్టాలే..
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్పీఏ) భారం మోస్తున్న భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్రం సహాయక చర్యలు అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్ హౌస్– రోలీ బుక్స్ ఆవిష్కరించనున్న పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్ బందోపాధ్యాయ నలుగురు గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు. అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ బ్యాంకింగ్ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం గమనార్హం. విలీనాలు, భారీ బ్యాంకింగ్ ఏర్పాటుతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు గవర్నర్లూ ఏమన్నారంటే... అత్యుత్సాహమూ కారణమే కంపెనీల భారీ పెట్టుబడులు, రుణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం మొండిబకాయిల తీవ్రతకు ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ఉండాలి. – డాక్టర్ రఘురామ్ రాజన్ (గవర్నర్‌గా.. 2013–2016) అతి పెద్ద సమస్య అవును. భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారితో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది. – దువ్వూరి సుబ్బారావు (బాధ్యతల్లో.. 2008–2013) ఇతర ఇబ్బందులకూ మార్గం బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. రుణాల పెంపునకు వచ్చిన ఒత్తిడులు కూడా మొండిబకాయిల భారానికి కారణం. 2015–16 రుణ నాణ్యత సమీక్ష తరువాత ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, రుణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనార్హం. – వై. వేణుగోపాల్ రెడ్డి (విధుల్లో.. 2003–2008) పెద్ద నోట్ల రద్దు... సంక్షోభం! బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్రమయ్యాయి. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. – సీ. రంగరాజన్ (పదవీకాలం..1992–1997) -
బాకీ మొత్తం కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. స్వీయ మదింపులు, బకాయిల పునఃసమీక్ష లాంటివి కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాకీల చెల్లింపునకు టెలికం సంస్థలకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా తో కూడిన బెంచ్ బుధవారం తిరస్కరించింది. రెండు వారాల తర్వాత దీన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ‘20 ఏళ్ల వ్యవధి ఇవ్వడమనేది అసమంజసం. తీర్పులో పేర్కొన్నట్లుగా టెలికం కంపెనీలు బాకీలన్నీ తీర్చాల్సిందే‘ అని స్పష్టం చేసింది. వడ్డీలు, జరిమానాలపై టెలికం కంపెనీలు, ప్రభుత్వం వాదోపవాదాలన్నీ విన్న మీదటే ఏజీఆర్ బాకీలపై తీర్పునిచ్చామని, అన్ని పక్షాలు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. ఆ అధికారులను పిలిపిస్తాం.. ఏజీఆర్ బాకీలపై టెలికం కంపెనీలు స్వీయ మదింపు చేపట్టడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి కలలో కూడా ఊహించలేనివంటూ వ్యాఖ్యానించింది. స్వీయ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు టెల్కోలను అనుమతించిన టెలికం శాఖ కార్యదర్శి, డెస్క్ ఆఫీసర్లను పిలిపిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వీయ మదింపు పేరుతో టెలికం కంపెనీలు తీవ్రమైన మోసానికి పాల్పడుతున్నాయని ఆక్షేపించింది. ఏజీఆర్ బాకీల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పే అంతిమమని, దాన్ని తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. టెల్కోల చీఫ్‌లకు హెచ్చరిక.. టెల్కోలు తమకు అనుకూలంగా వార్తాపత్రికల్లో కథనాలు రాయించుకుంటున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలాంటి కథనాలు తమ తీర్పును ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. ఏజీఆర్ బాకీలపై సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ’తప్పుడు వార్తలు’ ప్రచురిస్తే టెలికం కంపెనీల ఎండీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్వీయ మదింపుతో భారీ వ్యత్యాసం.. ఏజీఆర్ బాకీలకు సంబంధించి డాట్ చెబుతున్న దానికి టెల్కోల స్వీయ మదింపునకు మధ్య ఏకంగా రూ. 82,300 కోట్ల వ్యత్యాసం ఉంది. డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్, టెలినార్‌వి కలిపి రూ. 43,980 కోట్లు, వొడాఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ సంస్థలు రూ. 16,798 కోట్లు చెల్లించాలి. అయితే, ఆయా టెల్కోలు జరిపిన స్వీయ మదింపు లెక్కల ప్రకారం.. భారతి గ్రూప్ రూ.13,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.21,533 కోట్లు, టాటా గ్రూ ప్ సంస్థలు రూ.2,197 కోట్లు కట్టాల్సి ఉంటుంది. -
నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రాష్ట్రానికి రావలసిన రూ.2,246 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ఆయన మాట్లడుతూ... ఏడాదిలో వంద రోజులపాటు వేతనంతో కూడిన పని కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన వేలాది కుటుంబాలకు జీవనోపాధి భద్రత కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ప్రధానమైన ఆదాయ వనరుగా మారిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కొన్ని నెలలపాటు దుర్బిక్షం వెంటాడింది. ఆ తర్వాత అంతే స్థాయిలో ఎడతెగని వర్షాలు ముంచెత్తాయన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు నెలల తరబడి వరదలతో సతమతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ఆదాయమే దిక్కయిందని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి ఈ పథకం కింద విడుదల కావలసిన నిధులు సకాలంలో అందకపోవడంతో ఈ పథకం కింద డిమాండ్‌కు తగిన విధంగా పనులు కల్పించేలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ కింద పని చేసే కూలీలకు వేతనం 100 శాతం కేంద్ర నిధుల నుంచే చెల్లిచడం జరుగుతుంది. మెటీరియల్ ఖర్చుతో పాటు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్ల వేతనాల కింద చేసే ఖర్చులో కేంద్రం 75 శాతం భరిస్తుంది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్, పాలనా చెల్లింపుల పద్దు కింద చెల్లించాల్సిన రూ. 2,246 కోట్ల రూపాయలను విడుదల చేయలేదన్నారు. ఈ నిధులను కేంద్రం బకాయి పెట్టడం వలన ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు పనులు కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు మొత్తాన్ని సత్వరమే విడుదల చేయవలసిందిగా విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. -
మా డబ్బెక్కడ సీఎంసారూ!
ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5,000 కోట్ల దాకా బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఫీజుల పథకానికి అర్హులైన విద్యార్థుల సంఖ్య 16 లక్షల దాకా ఉంది. పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి దిక్కు తోచటం లేదు. రాష్ట్రంలో అంగన్వాడీలకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో దాదాపు రూ.50 కోట్ల దాకా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు మరో రూ.10 కోట్ల దాకా కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. సాక్షి, అమరావతి: ఒకపక్క సొంత ప్రచారం, ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానాలు, ఓట్ల పథకాల కోసం డబ్బులు కుమ్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అత్యవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ డబ్బులను కూడా ఇవ్వకపోవడంతో పిల్లల చదువులు, వివాహాలు, ఇంటి కొనుగోలు లాంటివి తలపెట్టిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టార్జితం డబ్బులను చెల్లించకుండా అవస్థలకు గురి చేస్తున్న టీడీపీ సర్కారు ఓట్ల పథకాలు, ప్రచారం కోసం నిధులను మళ్లిస్తుండటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత నెల రోజులుగా అన్ని రకాల బిల్లులను నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించిన ఓట్ల పథకాలు, ఇతర కమీషన్లు వచ్చే వాటికి మాత్రమే చెల్లింపులు చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికశాఖ రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన బిల్లులను కూడా చెల్లించకుండా ముఖ్యమంత్రి చెప్పినట్లు రాజకీయ అవసరాలకే నిధులు విడుదల చేయడం ఎప్పుడూ చూడలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అన్ని రకాలకు చెందిన దాదాపు రూ.15,000 కోట్ల మేరకు బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జీవోలతో సరి.. ఉద్యోగుల భవిష్య నిధికి ప్రతి నెలా వారి వేతనాలను నుంచి కొంత మొత్తాన్ని జమ చేస్తారు. దీన్ని పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ఉద్యోగులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు ఆర్థికశాఖ అనుమతితో జీవోలు జారీ చేస్తారు. అయితే జీవోలు జారీ అవుతున్నా ఈ బిల్లులను ట్రెజరీల్లో పాస్ చేయకపోవడంతో అత్యవసరాల కోసం దాచుకున్న డబ్బులు అక్కరకు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బిల్లులు వందల సంఖ్యలో ఉంటాయని ఒక్కో బిల్లు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటికి చెల్లింపులను నిలిపివేస్తూ ఎన్నికల ముందు ప్రకటించిన ఓట్ల పథకాలకు అప్పులు చేసి మరీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల వాటా డబ్బులు మళ్లింపు! ప్రభుత్వ ఉద్యోగులకు వందల సంఖ్యలో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులను కూడా ఆర్థికశాఖ నిలిపివేసింది. మరోపక్క నగదురహిత వైద్య చికిత్స కోసం తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన రూ.400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇన్సూరెన్స్ సంస్థకు జమ చేయలేదు. ఉద్యోగుల వాటా సొమ్ముతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా మరో రూ.400 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల వాటా సొమ్మును జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో నగదు రహిత వైద్య సేవలు అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులకు అత్యవసర మందుల కోసం ఇవ్వాల్సిన రూ.180 కోట్లను కూడా పెండింగ్‌లో పెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏకంగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పలుకుబడి కలిగిన వారికి మాత్రమే ఈ బిల్లులను చెల్లిస్తున్నారు. పేదలకు చిల్లిగవ్వ కూడా విదల్చకపోవడంతో వైద్య ఖర్చులు పెనుభారంగా పరిణమించాయి. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల బకాయిలను కూడా ఇవ్వకుండా ఆర్థికశాఖ నిలుపుదల చేసింది. ఉపాధి కూలీలకు బకాయి రూ.360 కోట్లు కేంద్ర నిధులతో అమలయ్యే ఉపాధిహామీ పథకం కింద పనిచేసే కూలీలకు కూడా రోజు వారీ కూలీ డబ్బులను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం గమనార్హం. ఉపాధి హామీ కూలీలకు రూ.360 కోట్ల మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కూలీలకు వేతనాలు చెల్లించేందుకు నిధులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్టు లెక్చరర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పోలీసులకు మొండిచెయ్యి...యూనివర్శిటీ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిలిపివేశారు. అసెంబ్లీలో ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న ఉద్యోగులకు కూడా గత మూడు నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. పోలీసులకు టీఏ, డీఏ బిల్లులతోపాటు ఆర్జిత సెలవుల బిల్లులను కూడా చెల్లించకుండా నిలుపుదల చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి చెందిన వస్తువులకు బిల్లులను కూడా ఇవ్వకుండా నిలుపుదల చేశారు. ‘పసుపు–కుంకుమ ఈవెంట్’కు రూ.32 కోట్లు! డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ పేరుతో ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన పోస్ట్ డేటెడ్ చెక్కుల పంపిణీ ఈవెంట్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.32 కోట్లు వ్యయం చేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. రోజువారీ కూలీలకు వేతనాలు ఇవ్వకుండా నిలిపివేస్తూ ఈవెంట్ల పేరుతో కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎలా బతకాలి? మూడు నెలలుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆయాలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు సుమారు రూ. 50 కోట్ల దాకా వేతన బకాయిలున్నాయి. కిరాణా సరుకుల బిల్లులు ఏడాదిగా రూ.కోట్లలోనే పెండింగ్‌లో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సుమారు రూ.10 కోట్ల వరకు అద్దె బకాయిలు చెల్లించాలి. అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత డబ్బులతో అద్దెలు కడుతున్నారు. వాళ్లంతా ఎలా బతకాలి? వెంటనే జీతాల బకాయిలు చెల్లించకుంటే మరోసారి ఆందోళన చేపడతాం. – కె.సుబ్బరావమ్మ (అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి) సెప్టెంబర్ నుంచి పెన్షన్ రావాలి... నేను గత జూలైలో రిటైర్ అయ్యా. పెన్షన్ ఆగస్టు నెలకు సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు వచ్చింది. సెప్టెంబర్ నుంచి పెన్షన్ మంజూరు కావాల్సి ఉంది. – నాగభూషణం (రిటైర్డ్ తహసీల్దార్, విశాఖపట్నం) కూలీల పొట్టకొడుతోంది.. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీల వేతనాలను చెల్లించకుండా పెడింగ్‌లో పెట్టింది. రాయలసీమతోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 90 శాతం కరువు మండలాలున్నాయి. ఇక్కడ 150 రోజులు పని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు నెలలుగా రూ.360 కోట్ల మేర కూలీ బకాయిలను చెల్లించకపోవడంతో పొట్టకూటి కోసం 12 లక్షల మంది వలస వెళ్లారు. ఉపాధి హామీ నిధులను ఏకంగా స్టేడియంల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం దారుణం. – వి.వెంకటేశ్వర్లు (రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి) నెల రోజులైనా పీఎఫ్ డబ్బులు అందలేదు.. చిత్తూరు జిల్లా సవరంబాకం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నా. అనారోగ్యంతో ఉన్న మా చిన్నమ్మ వైద్య చికిత్స కోసం పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు అందలేదు. – ఎన్ లింగయ్య, హెచ్ఎం, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా. దాచుకున్న డబ్బులపైనా ఆంక్షలా అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందుకు వీలుగా ఉద్యోగులు దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణం. ఆరు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాఖలు చేసుకున్న దరఖాస్తులను నిలిపివేయడంతో తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. వైద్య సేవల కోసం ఉద్యోగులు ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా బీమా కంపెనీకి కట్టకుండా దారి మళ్లించడంతో ఆస్పత్రుల్లో చికిత్స అందడం లేదు. –వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు) ఫ్రీజింగ్‌తో ఆగాయంటున్నారు.. కుటుంబ పరిస్థితుల వల్ల దాదాపు ఏడేళ్ల సర్వీసును వదులుకుని గతేడాది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా. గ్రాట్యూటీ, పెన్షన్ బిల్లు పాస్ అయ్యాయి. మిగిలిన బిల్లులు పాస్ కాలేదు. ఫ్రీజింగ్ వల్ల ఆగిపోయాయంటున్నారు. నాకు దాదాపు రూ.ఐదారు లక్షల వరకు రావాల్సి ఉంది. – సూర్యప్రకాశరావు (రిటైర్డ్ ఏఓ, విశాఖపట్నం) -
రీడ్ అండ్ టేలర్ లిక్విడేషన్ నిలిపివేత
ముంబై: ఖరీదైన సూట్లు, జాకెట్లు విక్రయించే రీడ్ అండ్ టేలర్ కంపెనీ లిక్విడేషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిలిపేసింది. రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తామని, దానిని తమకు అప్పగించాలని ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనను ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం మన్నించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ కంపెనీ బకాయిలు రూ.4,100 కోట్ల మేర ఉన్నాయని, కానీ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు మాత్రమేనని, లిక్విడేషన్ చేపడితే రుణ దాతలకేమీ రాదని, ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత, అధిక ధరలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సంఘానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొంది. కంపెనీలో మొత్తం 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మైసూర్లో ప్లాంట్ ఉంది. ఈ కంపెనీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు జేమ్స్‌బాండ్ పాత్రధారి పియర్స్ బ్రాస్నన్, అమితాబ్ బచ్చన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఎడెల్వీస్ వ్యాజ్యంతో ఎన్సీఎల్టీకి కస్లివాల్ కుటుంబానికి చెందిన ఎస్ .కుమార్ గ్రూప్ రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఖరీదైన సూట్లు, జాకెట్లు, ట్రౌజర్లు, షర్ట్లు, టి–షర్ట్‌లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ బ్యాంక్‌లకు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.4,100 కోట్ల మేర బకాయిలు పడటంతో వీటి వసూళ్లకు గాను ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఎడెల్వీజ్ ఏఆర్సీ ఎన్సీఎల్టీలో ఒక కేసు వేసింది. ఎనిమిది కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలను సమర్పించినప్పటికీ, అవేవీ సంతృప్తికరంగా లేకపోవడంతో రుణదాతల కమిటీ లిక్విడేషన్‌కు సిఫార్సు చేసింది. ఫైన్‌క్వెస్ట్‌కే అధిక భారం... రీడ్ అండ్ టేలర్ కంపెనీ నుంచి ఫైన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీకి అధికంగా రూ.800 కోట్ల మేర రావలసి ఉంది. యూనియన్ బ్యాంక్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ తదితర సంస్థలకు ఈ సంస్థ భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.