బిల్లు రూ.300 కోట్లు.. ‘టిప్పు’ రూ.43 కోట్లు..?
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌లో మరో దోపిడీ పర్వం
ఈసారి జవహర్‌నగర్ ప్రాజె క్టు వంతు
నిర్మాణ సంస్థకు బకాయిలు చెల్లించే పేరిట అవినీతి దందా
హైదరాబాద్: అసలే దివాలా తీసిన ప్రాజెక్టు.. ఆపై అంతంత మాత్రంగా మారిన ప్రభుత్వ పర్యవేక్షణ.. ఇదే అదనుగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌లో మరో దోపిడీ పర్వానికి తెర లేచింది. తెల్ల ఏనుగులా మారిన జవహర్‌నగర్‌లోని ప్రాజెక్టును ఎలా అమ్మాలనే విషయంలో కసరత్తు కూడా కనిపించని తరుణంలో.. దాని బిల్లుల చెల్లింపులో హస్తలాఘవం ప్రదర్శించేందుకు తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బడా నిర్మాణ సంస్థ ఈ భవనాలను నిర్మించింది. అయితే ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో ప్రాజెక్టు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో రెండేళ్లుగా ఇక్కడ పనులు జరగటం లేదు. 14 అంతస్తులతో కూడిన బ్లాకుల్లో 2,858 ఫ్లాట్లను నిర్మించారు. నిర్మాణ సంస్థకు రూ.300 కోట్లకుపైగా ప్రభుత్వం బకాయిపడింది.
ఈ బిల్లుల కోసం ఆ సంస్థ ప్రతినిధులు కొన్ని నె లలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. నిధులు లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని చెల్లించటం లేదు. ఈ తరుణంలో రంగంలోకి దిగిన కొందరు నేతలు.. ఆ సంస్థకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇక్కడే రాష్ట్ర విభజనకు పూర్వం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో బండ్లగూడ ప్రాజెక్టులో జరిగిన ఓ దందాను వీరు కాపీ కొట్టేశారు. ఎస్కలేషన్ పేరిట అప్పట్లో నేతలు, కొందరు అధికారులు వంద కోట్ల వరకు కొల్లగొట్టేశారు. టీఆర్‌ఎస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అప్పటి గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. రెండో విడతలో ఇదే తరహాలో లూటీ చేసేందుకు సిద్ధమైన కుట్రను భగ్నం చేశారు. అయితే ఇప్పుడు కొందరు నేతలు అదే విధానాన్ని జవహర్‌నగర్ ప్రాజెక్టుకు అన్వయించి రూ.43 కోట్లను స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు.
ఆ జీవో.. ఓ దోపిడీ: నిర్మాణ సామగ్రి ధరలు పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ చేసే విధానాన్ని సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుకలు తదితరాలకు వర్తించేలా ఐదేళ్ల క్రితం నాటి ప్రభుత్వం ఉత్తర్వు నం.35ను జారీ చేసింది. కానీ ఇది స్వగృహకు వర్తించదు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో దీనిని స్వగృహకు వర్తించేలా కొందరు ఉత్తర్వు ఇప్పించారు. బండ్లగూడ ప్రాజెక్టుకు దీన్ని వర్తింపజేసి రూ.100 కోట్లు స్వాహా చేశారు. ఇప్పుడు అదే ఉత్తర్వును జవహర్‌నగర్ ప్రాజెక్టుకు వర్తింపచేసి.. ఎస్కలేషన్ రూపంలో రూ.43 కోట్లు కొల్లగొట్టాలని కొందరు నేతలు చూస్తున్నారు. నిర్మాణ సంస్థకు రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉన్నందున.. రూ.43 కోట్లు అందులో చేర్చి విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా రు. నిర్మాణ సంస్థ ఫైనల్ బిల్లులను దాఖలు చేస్తేనే బకాయిలు వచ్చే అవకాశం ఉండటంతో స్వగృహలో పనిచేస్తున్న కొందరు విశ్రాంత అధికారులు, ఓ ముఖ్య అధికారి ఈ తంతును పూర్తి చేయిస్తున్నట్టు తెలుస్తోంది.