సర్కారు తీరుపై అన్నదాత ఆగ్రహం.. కోనసీమ కలెక్టరేట్ ముట్టడి
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ధాన్యం సొమ్ములు వారంలో చెల్లించకుంటే దీక్షలకు దిగుతామని హెచ్చరిక
సాక్షి, అమలాపురం: భారీ వర్షాలు.. వరదలతో వరి చేలు చెరువులుగా మారిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందలేదు. ఇంకోవైపు రబీకి సంబంధించి ధాన్యం బకాయిలు సైతం రెండు, మూడు నెలలుగా జమ కావడం లేదు.
దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు సోమవారం అమలాపురం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేశారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌కు వచి్చన జేసీ నుపూర్ అజయ్ కారును పది నిమషాల పాటు అడ్డుకున్నారు.
మూడు మండలాల నుంచి తరలివచ్చి..
అల్లవరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి మండలాలకు చెందిన సుమారు 60 మంది రైతులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. మే నెలలో అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటికీ సొమ్ములు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. తమకు రావాల్సిన సొమ్ములు కోసం జిల్లా ఉన్నతాధికారులకు, గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులకు రూ.154 కోట్ల వరకు ధాన్యం సొమ్ములు చెల్లించాల్సి ఉంది. డీఆర్వో వి.వెంకటేశ్వర్లు రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది.
కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కలెక్టర్ వరద పర్యటనలో ఉన్నందున జేసీ నుపూర్ కార్యాలయానికి వచ్చి ఐదుగురు రైతులు మాట్లాడాలని డీఆర్వో సూచించారు. దీంతో రైతులు వాగి్వవాదానికి దిగారు. రైతులంతా వస్తామని పట్టుబట్టారు. ఆయన వెంట ప్రధాన గేట్లును నెట్టుకుంటూ కార్యాలయం వైపు చొచ్చుకురాగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ అజయ్ రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సొమ్ములు నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. జేసీ హామీతో రైతులు వెనుదిరిగారు.
ఆత్మహత్యలే శరణ్యం
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మే నెలలో ధాన్యం విక్రయించగా అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం సొమ్ము చెల్లించడానికి వీలు కాలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం అమ్మకాలు చేసి 70 రోజులు అవుతున్నా సొమ్ములు ఖాతాల్లో జమ చేయకపోవడంతో నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని, నెలాఖరు నాటికి ధాన్యం సొమ్ములు ఇవ్వకుంటే సాగు సమ్మె చేపడతామని హెచ్చరించారు.
జగన్ ప్రభుత్వంలో సకాలంలో సొమ్ములు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ములు 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమయ్యేవి. గత ఏడాది ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు చేసిన వారంలోనే సొమ్ములు పడడాన్ని రైతులు గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు సొమ్ములు కూడా మొదట్లో సకాలంలో వేశారు. అదేవిధంగా మే 24, 25 తేదీలలో రెమాల్ తుపాను సమయంలో వర్షాలు కురుస్తుండగా రైతుల వద్ద నుంచి ఏకంగా 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత ఒకసారి రూ.117 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులకు చెల్లింపులు చేయలేదు.
మే మొదటి వారంలో అమ్మాం
నేను మే మొదటి వారంలో ధాన్యం విక్రయించాను. రూ.1.20 లక్షల వరకు సొమ్ములు రావాల్సి ఉంది. రబీ కోతలకు మెషీన్ ఖర్చులు నుంచి కూలీలు, ఖరీఫ్ విత్తనాలు, దమ్ములు వరకు అప్పులు చేశాను. 70 రోజులు దాటుతున్నా సొమ్ములు ఇవ్వకపోవడం అన్యాయం. – చొల్లంగి రామకృష్ణ, దేవగుప్తం గ్రామం
ఆత్మహత్యలే శరణ్యం
ధాన్యం అమ్మిన సొమ్ముల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇలాగే ఉంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. జేసీ మేడమ్ శనివారం చివరిలో సొమ్ములు మా ఖాతాలో పడతాయని చెప్పారు. అలా జరగకపోతే నిరాహార దీక్షలు చేపడతాం. – కర్రి రాములు, జనుపల్లి గ్రామం
Comments
Please login to add a commentAdd a comment