మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తోంది
రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నడుపుతోంది
మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు
రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ‘మద్దతు’ లభించడంలేదు
14–17 శాతం తేమ ఉన్నా మద్దతు ధర ఇవ్వడంలేదు
కొనే నాథుడులేక రెండు వారాలుగా రోడ్ల మీదే ధాన్యం రాశులు
మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోని కిందిస్థాయి అధికారులు
ధాన్యం కొనుగోలు కోసం అన్నదాతల ఆందోళన ఉధృతం
విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున రైతుల నిరసన
ధాన్యం రాశులు చూపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వం ధాన్యం దళారీగా మారింది. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యం ఇచ్చేయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర దక్కడంలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు’.. అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు.
తేమశాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన రెండ్రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్బీకేలు, రైతుక్షేత్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశుల ఎదుట నిరసనలు వ్యక్తంచేసిన రైతులు బుధవారం విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, వివిధ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..
మంత్రి చిటికలేసినా ధాన్యం కదల్లేదు..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికి కల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని నాలుగు రోజుల క్రితం అధికారులకు చిటకలేసి మరీ చెప్పారు.
రోజులు గడుస్తున్నా గింజ ధాన్యం కూడా కాటా వేయలేదు. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. వాళ్లు పర్యటించిన చోట కూడా ధాన్యం కాటా వేయడం కానీ, మిల్లులకు తోలడంగానీ జరగడంలేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ‘మద్దతు’ దక్కడంలేదు..
తేమ శాతం ఎంతున్నా కొంటామంటున్నారు. ఆ తర్వాత 17 శాతం దాటితే ఐదు కేజీల కోత వేసి మిగిలిన ధాన్యాన్ని కొంటామన్నారు. పూర్తిస్థాయి మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వమే తరుగు మినహాయించి కొంటామని చెప్పడం దారుణం. తుపాను, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేమ శాతం 20 నుంచి 24 శాతం వస్తోంది.
రెండు శాతమో, ఐదు శాతమో కట్ చేసి మిగిలిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం లెక్కిస్తే 75 కేజీల బస్తాకు రూ.1,670 చొప్పున ఇవ్వాలి. కానీ, రూ.1,470–1,500కు మించి ఇవ్వడంలేదు. పైగా.. ధాన్యం బాగోలేదంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఎంటీయూ 1,262, 1,318 వంటి ఫైన్ వెరైటీ ధాన్యానికి కూడా మద్దతు లభించని దుస్థితి ఏర్పడింది.
రైతులకు–మిల్లర్లకు మధ్య బ్రోకర్లుగా మారారు..
నిజానికి.. రైతుసేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించాలి. అక్కడ నిర్ధారించే దానినే ప్రామాణికంగా తీసుకుని ధరను నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ఎక్కడా ఆ పరిస్థితిలేదు. ఆర్‌ఎస్‌కేలకు వెళ్తుంటే తేమ శాతం కూడా చూడడంలేదు. ఏ మిల్లుకు వెళ్తారని అడిగి అక్కడకు పంపించేస్తున్నారు.
మిల్లు వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది రైతాంగాన్ని మిల్లర్లు దోచుకునేందుకు ఉపయోగపడే పద్ధతే తప్ప రైతులకు మేలుచేసే విధానం కాదు. ఇక వాట్సప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో మీ ధాన్యం కొనేస్తామంటున్నారు. కానీ, ఆచరణలో ఇదెక్కడా అమలుకు నోచుకోవడంలేదు.
ఒక్క ప్రైవేటు వ్యాపారిపైనైనా కేసు పెట్టారా?
ఇక ప్రైవేటు వ్యాపారులు కొనే ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో అర్థం కావడంలేదు. తక్కువ ధరకు కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని చెప్పారుగానీ.. రాష్ట్రంలో ఒక్క ధాన్యం వ్యాపారిపైనైనా కేసు పెట్టారా? ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోనీ ప్రభుత్వమైనా కొంటుందా అంటే అదీలేదు.
గతేడాది కోసిన ధాన్యాన్ని కోసినట్లుగానే తీసుకెళ్లారు.. ప్రతీ రైతుకూ మద్దతు ధర లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలేదు. ధర్నాలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ లక్ష్మణస్వామి, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. శివనాగేంద్ర, పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావాలి..
ఏడెకరాల్లో వరి వేశాం. పంట కోసి 15 రోజులైంది. తేమ 17 శాతం ఉంది. 20 శాతమైనా తీసుకుంటామన్నారు. కానీ తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు రూ.1,450 ఇస్తామన్నారు. మా రైతు రూ.1,740 చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి.
పైగా పంటను కాపాడుకునేందుకు పరదాలకు రోజుకు రూ.2వేలు ఖర్చవుతోంది. డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావడం తప్ప వేరే దారిలేదు.– పొద్దుటూరు ప్రసాద్, గొడవర్రు. కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా
ఇలా అయితే కౌలు రైతులు బతికేదెలా?
నేను మూడెకరాల్లో వరి వేశాను. గతేడాదితో పోలిస్తే ఎకరాకు ఐదు బస్తాలు తగ్గింది. తేమ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రకం ధాన్యాన్ని కొనడంలేదు. ఆర్బీకేల్లోనే 20–25 శాతం ఉంటే 1,450 ఇస్తామంటున్నారు.
బయట వాళ్లు కొనడం లేదు. పంటను కాపాడుకునేందుకు పరదాల కోసం రోజుకు ఎకరాకు రూ.300–500 చొప్పున చెల్లిస్తున్నాం. ఇలా అయితే కౌలురైతులు బతికేదెలా? కోసూరి శివనాగేంద్ర, గడ్డిపాడు, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లా
గతేడాది మద్దతు ధర వచ్చింది..
ఎనిమిది ఎకరాల్లో వరికోసి 10 రోజులైంది. తేమ 15.5 శాతం ఉంది. మిల్లుకు పంపిస్తామన్నారు. కానీ ఎవరూ రాలేదు. మళ్లీ వెళ్లి అడిగితే మిల్లు దగ్గరకు వెళ్లండి అంటున్నారు.
బేరగాళ్లు రూ.1,400 ఇస్తామంటున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదు. గతేడాది కోసిన వెంటనే 75 కేజీల బస్తాకు రూ.1,630కు కొన్నారు. ఈ ఏడాది కొనేవాడులేడు. 10 రోజులుగా రోడ్డుపైనే ధాన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గెద్దా నరేంద్ర, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా
నష్టానికి తోలాల్సి వస్తోంది..
ఐదెకరాల్లో వరివేసా. ఎకరాకు 30 బస్తాలొచ్చింది. గొడవర్రు ఆర్‌ఎస్‌కు తీసుకెళ్తే 15.4% తేమ వచ్చింది. రేటు చెప్పలేదు. 90 బస్తాలు మిల్లుకు తోలారు. అక్కడ 75 కేజీల బస్తాకు రూ.1,600 కు మించి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆర్‌ఎస్‌కే సిబ్బందికి చెబితే పట్టించుకోలేదు. చేసేది లేక బస్తాకు రూ.130 చొప్పున నష్టానికి మిల్లుకు తోలాల్సి వచ్చింది.– గెడ్డం రాజా, గొడవర్రు, కృష్ణాజిల్లా
Comments
Please login to add a commentAdd a comment