వసూలు చేసుకోవడం చేతకాక..
కుదవపెట్టిన డాక్యుమెంట్లే లేవనే సాకుతో మొండిబకాయిల రద్దుకు రంగం సిద్ధం
పాలకవర్గాన్ని ఏమారుస్తున్న అధికారులు
చేతులు మారిన రూ.50 లక్షలు..? డీసీసీబీలో కొత్త అవినీతి కోణం..
రూ.4కోట్ల మాఫీకి మహాజన సభలో నేడు తీర్మానంతప్పుబడుతున్న సహకార సంఘ నిపుణులు
ఏదైనా సంస్థలో మొండిబకాయిలుంటే వాటిని ఏ విధంగా వసూలు చేసు కోవాలా? అని ఆలోచిస్తారు. కుదువపెట్టిన ఆస్తులను,తనఖా పెట్టిన డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకుని రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సామ,దాన,భేద,దండోపాయాలను ఉపయోగించి ఏదో విధంగా రాబట్టేందుకు యత్నిస్తారు. అడ్డగోలుగా మాఫీ చేయాలని చూడరు. కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) తీరేవేరు. వసూలు చేసుకోవడం చేతకాక..చేతులెత్తేయడమే కాదు..వాటిని అడ్డుగోలుగా మాఫీకి సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న 42వ మహాజన సభలో ఈ మేరకు తీర్మానించనున్నారు. మొండి బకాయిదారులకు రూ.4 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఈ వ్యవహారంలో రూ.అరకోటికిపైగా చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖపట్నం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) మూడు దశాబ్దాలుగా వివిధ పథకాల కింద మంజూరు చేసిన రుణాలు అధికారుల ఉదాశీన వైఖరివల్ల వసూలుకాక నిరర్ధక ఆస్తులుగా పేరుకు పోయాయి. వీటివిషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆడిట్ కమిటీ కొత్త పాలకవర్గానికి సిఫారసు చేసింది. అంటే వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని. కానీ డీసీసీబీ అధికారులు మాత్రం వాటిని రద్దు చేసి చేతులుదులుపుకోవాలని నిర్ణయానికి వచ్చి మహాజనసభ తీర్మానం కోసం అజెండాలో పెట్టారు. ఈ మొండి బకాయిల్లో ప్రధానంగా చెప్పు కోవలసినవి భూమి అభివృద్ధి బ్యాంకు రుణాలు (ల్యాండ్‌మార్టిగేజ్ లోన్స్). తమ భూముల అభివృద్ధి కోసం వాటి డాక్యుమెంట్లను కుదవపెట్టి తీసుకునే రుణాలివి. వీటి కింద జిల్లాలోని 14 మండలాల పరిధిలో 11,702 మందికి రూ.2, 55,21,000 ఇచ్చారు. 1759 మంది మత్స్యకారులకు మంజూరు చేసిన రూ.99.5లక్షలు, రెండు చేనేత సహకార సంఘాలకు రూ.91వేల రుణాలుండగా, నగదు పరపతి రుణాల కింద విశాఖపట్నం, మహారాణిపేట బ్రాంచ్‌ల పరిధిలో సూపర్ బజార్ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్‌కు రూ.26.22లక్షలు, మాడుగుల ఏజెన్సీ ప్రొడ్యూసర్స్‌కు రూ.73వేలు, కస్తూర్బా కో- ఆపరేటివ్ స్టోర్స్‌కు రూ.1.56 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ స్టోర్స్‌కు రూ.2.18లక్షలు, టీవీ అసెంబ్లింగ్ కో- ఆపరేటివ్ సొసైటీస్‌కి రూ.65వేలున్నాయి. మధ్యకాలిక వ్యవసాయేతర ఉద్యోగ సహకారసంఘాలకు మంజూరుచేసిన రుణాల కింద గోపాలపట్నం, ద్వారకానగర్, మహారాణి పేట బ్రాంచ్‌ల పరిధిలో 14 కో-ఆపరేటివ్ సొసైటీలు, ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసిన రూ.8.42 లక్షలున్నాయి. వీటిలో మత్స్యకార, చేనేత సంఘాలకు మంజూరు చేసిన రుణాలు రద్దుచేసినా ఎవరూ ఆక్షేపించరు.
ల్యాండ్ మార్టిగేజ్,నగదు పరపతి, మధ్యకాలిక వ్యవసాయేతర ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసినరుణాలను రద్దు చేయాలని అజెండాలో చేర్చడం పట్ల సహకార సంఘ నిపుణులు తప్పుబడుతున్నారు. ల్యాండ్ మార్టిగేజ్ రుణాలంటే కుదవపెట్టిన డాక్యుమెంట్ల సంగతేమిటంటే ఏ బ్రాంచ్‌లోనూ అవి కనిపించడంలేదని అధికారులు పేర్కొనడం వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. వందకోట్ల టర్నోవర్‌లక్ష్యంగా దూసు కెళ్తున్న సూపర్ బజార్ కో- ఆపరేటివ్ సొసైటీకి ఇచ్చిన రూ.26.22లక్షల రుణాలు రద్దు చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందంటున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసిన రుణాలను వసూలు చేసుకోవాలని..లేకుంటే వీటినిమంజూరు చేసిన అధికారుల నుంచి రికవరీ చేయాలే తప్ప ఈవిధంగా రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇలా మొత్తం రూ.3.95కోట్ల మొండి బకాయిలను ‘టెక్నికల్ రైటాఫ్’కు మహాజనసభ ఆమోదం కోసం పెడుతున్నట్టు అజెండాలో పేర్కొనడం చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహా రంలో మొండిబకాయిదారుల నుంచి రూ.50లక్షల వరకు చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లనే ఇంతకాలంగా ఉన్న ఈ మొండి బకాయిలను రైటాప్ చేసేందుకు అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. ఏది ఏమైనా పాలకవర్గం ఈ మొండి బకాయిల వసూలు, మాఫీ విషయంలో పునరాలోచన చేయాల్సినఅవసరం ఎంతైనా ఉందని సహకార సంఘ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మాఫీ చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో డీసీసీబీ ద్వారా రుణాలు తీసుకున్న వారు పాలకవర్గాన్ని, అధికారులను మేనేజ్ చేసుకుంటే మాఫీ చేయించు కోవచ్చన్న భావనతో చెల్లించడం మానేస్తారన్న వాదన వ్యక్తమవుతోంది. ఇక ఎంతమాత్రం వసూలు కాదనే నిర్ణయానికి వచ్చి మాఫీ చేసేపరిస్థితి ఉంటే..ఈ రుణాలు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.
దారుణంగా మాఫీ
Published Tue, Mar 24 2015 2:46 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement