బీసీసీఐతో రూ.158 కోట్ల వివాదం పరిష్కారం
ఎన్‌సీఎల్‌టీ దివాలా ఉత్తర్వు్య కొట్టేసిన అప్పీలేట్ ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్‌సీఎల్‌టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్‌కు ఊరట లభించినట్లయింది.
బీసీసీఐ స్పాన్సర్‌షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్‌టేకింగ్‌లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్‌పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది.
అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది.
రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ...
ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్‌టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు.
వివాదమేమిటీ?
బీసీసీఐ, బైజూస్‌లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్‌పై తన ట్రేడ్‌మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్‌కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్‌ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్‌కు అందుబాటులో ఉంటాయి.
ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు సంబంధించి బైజూస్ ఒక ఇన్‌వాయిస్‌పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్‌వాయిస్‌లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది.
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్‌లు, టూర్‌లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్‌షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్‌పై ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్‌పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జులై 16న అనుమతిస్తూ, ఎన్‌సీఎల్‌టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్‌పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్‌పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.
కష్టాల కడలిలో...
బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్‌టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్‌రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్‌లైన్‌లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి.
ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.
భారీ విజయమిది: బైజూస్
ఎడ్‌టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment