సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన జోగిపేట, గజ్వేల్, చేగుంట నగర పంచాయతీల్లో ఆస్తిపన్నులు పేరుకుపోయాయి. పట్టణ వాసుల నుంచి ఆస్తి, కుళాయి పన్నులు మొత్తం రూ. 12.7 కోట్ల మేర బకాయిలున్నట్టు అంచనా. వీటిని వసూలు చేసేందుకు ఇప్పటికీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించకపోవడం గమనార్హం. ఆర్థిక మాసం ముంచుకొస్తుండటంతో మున్సిపాలిటీల బకాయిలు వసూళ్లు అవుతాయో లేదో అన్న సందేహం వ్యక్తమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు మున్సిపల్ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేశారు.
ఫలితంగా 40 శాతం వరకు మొండి బకాయి వసూలయ్యాయి. బకాయిదారులకు నోటీసులు అందజేసినా స్పందించని వారి ఇళ్ల ఎదుట దండోర వేస్తూ నిరసన తెలుపుతామని గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ ప్రకటించడంతో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నులు చెల్లించారు. ప్రధానంగా ఆస్తిపన్ను, కులాయి పన్నులు రూ. 12.7 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసేందుకు కేవలం మరో 50 రోజుల గడువు ఉండటంతో బకాయి వసూళ్లు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నిధుల పై ఆధారపడిన అభివృద్ధిపనులు ముందుకు సాగడంలేదు. దీనికి తోడు ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో మున్సిపల్ సిబ్బంది సైతం ఎన్నికల విధుల్లో బిజీ కానున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం పన్ను బకాయిల వసూళ్లు సాధ్యమయ్యేలా కన్పించడం లేదు.
వివిధ మున్సిపాలిటీలలో పేరుకు పోయిన బకాయిలను వసూలు చేసి కొంత భారమైనా తగ్గించుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు మున్సిపాలిటీలలో విద్యుత్ సంస్థకు రూ.16.40 కోట్లు చెల్లించాల్సింది. దీంతో ట్రాన్స్‌కో సిబ్బంది ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండటంతో ఎలాగైన వసూలు చేయాలన్న ఉద్దేశంతో సంబంధిత మున్సిపల్ కమిషనర్‌లకు ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రత్యేక బృందాలతో పన్నువసూలు చేపడితే కొంత మేరకైనా విద్యుత్ బకాయిలు చెల్లించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
బకాయి వసూళ్లకు ప్రత్యేక చర్యలు
వివిధ మున్సిపాలిటీలలో పేరుకు పోయిన బకాయిలను వసూలు చేసేందుకు అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశామని ప్రాంతీయ మున్సిపల్ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. డిమాండ్‌ను అనుసరించి రోజు వారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించామన్నారు. ప్రతివారం మొండి బకాయిల వసూళ్లకై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. పన్నుల వసూళ్ల లక్ష్యాలను సాధించేందుకు మున్సిపల్ కమిషనర్‌తో సహ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సత్యనారాయణ తెలిపారు.
మున్సిపాలిటీల్లో బకాయిలు రూ.12.7 కోట్లు
Published Sun, Feb 9 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement