- సుర్రుమంటున్న ఎండలో కూలీల విలవిల
- పని స్థలాల్లో కానరాని ప్రత్యేక వసతులు
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బెంబేలు
- షామియానాలు, హెల్త్‌కిట్లు మాయం
- ఏప్రిల్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం
ముకరంపుర : పొట్టకూటి కోసం మండుటెండల్లో ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలకు ఎండవేడిమి శాపంలా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కూలీలు విలవిల్లాడుతుంటే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యంత్రాంగం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జిల్లాలో గరిష్ట ఉష్ణోగత్రలు 43 డిగ్రీలకు చేరగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తీవ్రమైన ఎండవేడిమితో వడదెబ్బలు తగిలే ప్రమాదాలు పొంచి ఉన్నా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం లేదు. వేసవిలో ఉపాధి పనులు జరిగే చోట ప్రత్యేక వసతుల కల్పించాల్సి ఉండగా అధికార యంత్రాంగం కేవలం సమీక్ష సమావేశాలకే పరిమితమవుతోంది.
జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద 6,08,934 జాబ్ కార్డులు ఉన్నాయి. మొత్తం 25,154 శ్రమశక్తి సంఘాల కింద 4,54,713 మంది నమోదై ఉన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 1,20,000 కూలీలు పనులకు వెళ్తున్నారు. 57 మండలాల్లోని 1050 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఎండకు చెరువు మట్టి గట్టిగా ఉండడంతో మిషన్ కాకతీయలో ఎంపిక కాని చెరువులలో ఉపాధిహామీ కింద పూడికతీత పనులు కూడా చేపడుతున్నారు. ఇందులో 635 చెరువులను ఎంపిక చేసుకోగా ప్రస్తుతం 135 చెరువులలో పూడికతీత పనులు జరుగుతున్నాయి.
ఏటా జనవరి నుంచి జూన్ వరకు ఉపాధి పనులు కొనసాగుతాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ మంది ఉపాధి పనులకు హాజరవుతారు. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఉపాధిపై దృష్టి సారిస్తున్నారు. పనులలో భాగంగా ఉదయం 7 గంటలకే హాజరవుతున్న కూలీలకు కొలతల ప్రామాణికంగా కేటాయించిన పనులు దాదాపు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తి చేస్తున్నారు. ఉదయం 10 దాటితేనే ఎండ తీవ్రతకు తాళలేకపోతున్నారు.
వేసవి కాలంలో ఉపాధిహామీ కూలీలకు మౌలిక సదుపాయాల కల్పన అందని దాక్ష్రగానే మారింది. ఏటా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి నిధులు కేటాయిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. వసతుల కల్పనకు అవసరమైన మెటీరియల్ కొనుగోళ్ల వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉంది.
ఉపాధి పనులకు వెళ్లే వారు పనులు చేసి కొంత సమయం సేద తీర్చుకోవడానికి, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి జిల్లాలో 2010లో దాదాపు 20 వేలకు పైగా షామియానాలు అందజేశారు. గతేడాది వరకు వీటిని ఇచ్చారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అనేక మంది వాటిని సొంత పనులకు వినియోగించడం, ఎండకు అవి చిరిగిపోవడం తదితర కారణాలతో ఇప్పుడు అవి లేకుండా పోయాయి. దీంతో కూలీలు దిక్కులేక ఎండలోనే పనిచేస్తున్నారు. వాటిని కొనుగోలు చేయకుండానే నిధులు భోం చేశారనే ఆరోపణల కూడా లేకపోలేదు. ఎండ తీవ్రతకు భయపడి అనేక మంది కూలీలు పనులకు హాజరు కావడం లేదు. వచ్చిన వారికి నిలువ నీడ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
హెల్త్ కిట్లు ఏవీ..?
ఉపాధి పనులు చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా తక్షణమే వారికి ప్రథమ చికిత్స చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి పంపించడానికి ప్రభుత్వం ఆరోగ్య కిట్లను పంపిణీ చేసేది. రెండేళ్ల నుంచి ఈ కిట్ల జాడే లేదు. ప్రతి సంవత్సరం కిట్లు కొనుగోలు చేయూలని ఆదేశాలు జారీ కావడంతో పాటు నిధులు కూడా డ్రా అవుతూనే ఉంటాయి. కానీ అవి మచ్చుకైనా లేకపోవడంతో కూలీలు నానా అవస్థలు పడుతున్నారు.
హెల్త్ కిట్లలో అయోడిన్, కాటన్, ఆయింట్‌మెంట్, ఇతర ట్యాబ్‌లెట్లు ఉంటాయి. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచాల్సినప్పటికీ ఇవేమీ కూలీలకు అందడం లేదు. కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నప్పటికీ వారినే ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాలని నిబంధన వి ధించారు. ఎండకు తగినంత నీరు లేకపోతే వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి.
ఉపాధి కూలీలు పనిచేస్తూ తనువు చాలిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఫిర్యాదు, రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగానే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిపార్సు చేస్తారు. అన్ని సక్రమంగా ఉంటేనే పరిహారం అందజేస్తారు. పనిచేసి వెళ్లి ఇంటి వద్ద మృతిచెందితే మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
ఏప్రిల్‌లో పని చేసిన కూలీల వేతనం రూ.8కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పటివరకు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలనే ఇస్తున్నారు. ఏప్రిల్‌కు సంబంధించిన నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండుటెండలో ఉపాధి
Published Sun, May 10 2015 4:07 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement