ఉపాధి.. పకడ్బందీ
పంచాయతీరాజ్ చేతికి పథకం
సత్తెనపల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. ఇప్పటి వరకూ ఇది గ్రామీణాభివృద్ధి పథకం కింద అమలు జరిగింది. జిల్లాలో డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్, డివిజన్‌లలో ఏపీడీల ఆధ్వర్యంలో, మండలాల్లో ఏపీవోల పర్యవేక్షణలో ఇప్పటి వరకూ కార్యకలాపాలు సాగాయి. దీంతో సిబ్బందిపై సరైన అజమాయిషి ఉండేది కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తాజాగా పథకం అధికారులు, సిబ్బంది పంచాయతీ రాజ్ శాఖ ఆధీనంలో పనిచేయాలని నిర్దేశిస్తూ జీవో 139 జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 27న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో ప్రకారం ఉపాధి హామీ పథకం పనులు మండల స్థాయిలో మండల పరిషత్, గ్రామ స్థాయిలో పంచాయతీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. గతంలో ప్రోగ్రాం ఆఫీసర్లుగా పనిచేసి అనంతరం బాధ్యతల నుంచి తప్పుకొన్న ఎంపీడీవోలకు తిరిగి అవే బాధ్యతలు అప్పగించారు. పనుల తయారీ, క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, సిబ్బంది పనితీరును ఈవోపీఆర్డీ పర్యవేక్షిస్తారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఏఈ ఉపాధి పనులను పరిశీలిస్తారు. మండల పరిషత్ సూపరింటెండెంట్‌కు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకూ బాధ్యతలు అప్పగించారు. సూపరింటెండెంట్ పేమెంట్ రిజస్టర్, అకౌంట్లు పరిశీలిస్తాడు. ఎఫ్‌ఏ, జేఏలు కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో రికార్డు పర్యవేక్షకులుగా పనిచేస్తారు.
గ్రామ స్థాయిలో.. గ్రామ స్థాయిలో పథకాన్ని అమలు చేసే పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. గ్రామ సభల నిర్వహణ, నూతన పనుల ప్రతిపాదన, నూతన జాబ్‌కార్డుల ప్రతిపాదన వంటి వాటికి దరఖాస్తుల స్వీకరణ, పనుల కేటాయింపు వంటివి ఇకపై పంచాయతీ కార్యదర్శి చూసుకోవాలి. ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్ పూర్తిగా పంచాయతీ కార్యదర్శి అజమాయిషిలో పనిచేయాలి. ప్రస్తుతం మండల స్థాయిలో ఉపాధి ఏపీవోలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చే అధికారాలు కొనసాగుతాయి. ఎంపీడీవోకు సహాయకారిగా ఏపీవో పనిచేయాల్సి ఉంటుంది.
అలవెన్సులు ఎంపీడీవోలకే.. నూతన విధానంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులకు, సిబ్బందికి పెత్తనం, పర్యవేక్షణ కల్పించినా ఆ శాఖలో ఎంపీడీవోలకు తప్ప ఇతరులకు ఏ విధమైన ప్రయోజనం కల్పించలేదు. ఎంపీడీవోలకు కారు, ఇతర అలవెన్సులుంటాయి. తమకు అదనపు బరువు, బాధ్యతలు తప్ప, అదనపు అలెవెన్సులు లేవని పంచాయతీరాజ్ సిబ్బంది పెదవి విరుస్తున్నారు.