సాక్షి, వికారాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఈజీఎస్)లో అత్యుత్తమ సేవలకు గాను తెలంగాణ నుంచి రెండు జిల్లాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. వివిధ కేటగిరీల్లో దేశవ్యాప్తంగా 18 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా.. రాష్ట్రం నుంచి వికారాబాద్, కామారెడ్డి అవార్డు కైవసం చేసుకున్నాయి. ఉపాధి హామీ పనులు సమర్థంగా నిర్వహించడం, ఎక్కువ మంది కూలీలకు పని కల్పించడం తదితర అంశాల్లో అవార్డుకు ఈ జిల్లాలు ఎంపికయ్యాయి.
పనులపై ప్రజెంటేషన్
ఉపాధి హామీ పథకంలో ఉత్తమ సేవలకు ఆయా జిల్లాల నుంచి అవార్డులకు జాబితా పంపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించగా.. వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, నిర్మల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. జిల్లాల్లో చేసిన ఉపాధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కలెక్టర్లు పథకం ద్వారా చెపట్టిన పనులు, లబ్ధిదారుల ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందిన కేంద్రం జిల్లాలను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 11న ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా కలెక్టర్లు అవార్డు అందుకోనున్నారు.
మరింత బాధ్యతగా పని చేస్తాం
జిల్లాలోని గ్రామీణాభివృద్ధి అధికారులు, ఉద్యోగుల సహకారంతో లక్ష్య సాధనలో సఫలీకృతమయ్యాం. దీంతో కేంద్రం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఇకపై మరింత బాధ్యతగా పని చేస్తాం.
– జాన్సన్, డీఆర్‌డీఓ, వికారాబాద్ జిల్లా
‘ఉపాధి’లో భేష్
Published Sun, Sep 2 2018 3:14 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment