సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేద కూలీలకు జీవనోపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం స్వలాభం కోసం ఉపయోగించుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పథకం నిధులతో సొంత ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటినుంచి ఎన్నికలయ్యే దాకా దాదాపు 8 నెలలపాటు వందల సంఖ్యలో షార్ట్‌ఫిలింలు, పెద్దపెద్ద హోర్డింగ్‌లు, భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లు రాష్ట్రమంతటా నిండిపోనున్నాయి. పేరుకే ప్రభుత్వ పథకాలపై ప్రచారం.. వాస్తవానికి జరిగేదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ల భజన కీర్తనలే. వారిద్దరిని ప్రపంచంలోనే గొప్ప పరిపాలనాదక్షులుగా చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టడమే ఈ ప్రచారపర్వం అసలు ఉద్దేశం.
ప్రభుత్వం మనదే.. అడిగేదెవరు?
ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించడానికి నిధులు లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మరోవైపు సొంత ప్రచారం కోసం అదే పథకం నిధులను వాడుకోవాలని నిర్ణయించడం గమనార్హం. కూలీలకు దాదాపు నెల రోజులుగా డబ్బులు చెల్లించడం ప్రభుత్వం నిలిపివేసింది. రూ.542 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ, ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎన్నికల ప్రచారానికి టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలా ప్రచారానికి రూపకల్పన చేశారు. ఉపాధి హామీ పథకం అమలు విభాగానికి మంత్రిగా నారా లోకేశ్ వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పెద్దలు ఆదేశించడం.. ఈ పథకం నిధులను ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయడం.. ఆ ప్రణాళికకు మంత్రి నారా లోకేశ్ ఆమోదం తెలపడం వంటివి శరవేగంగా.. కేవలం పది రోజుల్లో పూర్తయింది.
ఇక రాష్ట్రమంతటా ప్రచార హోరు
ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.కోట్ల ఖర్చుతో 130 లఘుచిత్రాలను(షార్ట్ ఫిలింలు) చిత్రీకరించి, వాటిని 8 నెలలపాటు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను నింపేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో రిక్షాలకు అంటించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫోటోలతో కూడిన 50,000 పోస్టర్లను ముద్రించనున్నారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్ పథకం నుంచి దాదాపు రూ.20 కోట్లు వెచ్చించి, ఆర్టీసీ బస్సుల చుట్టూ చంద్రబాబు బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను అతికించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాధి హామీ పథకం నిధుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సుల చుట్టూ చంద్రబాబు బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను అతికించాలని ప్రణాళికలో పొందుపరిచారు. ప్రతి పట్టణంలో నాలుగు పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, మండల కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బకాయిలు ఎప్పుడిస్తారో?
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు గాను కూలీ డబ్బుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 660 గ్రామీణ ప్రాంత మండలాలు ఉండగా, ఇందులో 170 మండలాల్లో కూలీలకు ప్రభుత్వం రూ.కోటికి పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లోని 13,084 కుటుంబాలకు చెందిన కూలీలు గత నాలుగు నెలలుగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం రూ.2.5 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కుటుంబానికి సగటున రూ.2 వేల చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కూలీలకు రూ. 2.36 కోట్లు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని కూలీలకు రూ. 2.26 కోట్లు, శ్రీకాకుళం జిల్లా గార్ల మండలంలోని కూలీలకు రూ.1.96 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 660 మండలాల్లోని కూలీలకు ప్రభుత్వం ఆదివారం నాటికి రూ.542.80 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది.
ఉపాధి నిధులు స్వాహా
నిరుపేద కూలీలకు సొంత గ్రామాల్లోనే పనులు కల్పించి, వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఉపాధి హామీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. రూ.5,224 కోట్ల ఉపాధి నిధులను ఖర్చు పెట్టి 19,179 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. మరో రూ.570 కోట్లతో మట్టి రోడ్లు నిర్మించినట్లు సమాచారం. దాదాపు రూ.6,000 కోట్ల విలువైన పనులను ఎలాంటి టెండర్లు లేకుండా అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నామినేషన్ విధానంలో కట్టబెట్టింది. ఉపాధి హామీ పథకం పనులపై సోషల్ ఆడిట్ తూతూమంత్రంగా జరుగుతోంది. ఈ పథకం నిధులను కేవలం గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం నిబంధనలకు విరుద్ధమే. అయినా, టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో దాదాపు రూ.814 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వద్దే అట్టిపెట్టుకుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment