కూలిపనులకూ కోత
- 100 పనిదినాలు ఉత్తమాటే
- ఏడాదిగా కొత్త జాబ్‌కార్డుల్లేవు
- వలస బాటలో కూలీలు
- జన్మభూమి కమిటీలదే పెత్తనం
జాతీయ ఉపాధి హామీ పథకం ఓటుబ్యాంకు రాజకీయాలకు బలైపోతోంది. ఒక ప్పుడు అడిగిన వారందరికీ ఉపాధి చూపించే ఈ పథకం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం హయాంలో నీరుగారిపోతోంది. పనులు కల్పించే వాళ్లు మన వాళ్లేనా?..పనులు చేసే వాళ్లు మన వాళ్లేనా? అని చూసి మరీ పనులు కల్పించే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది.దీంతో ఏడాదిగా ఏ ఒక్కరికి కొత్తగా జాబ్‌కార్డుల ఇవ్వక పోగా..ఉన్న కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కూడా కల్పించలేని దుస్థితి ఏర్పడింది.
సాక్షి, విశాఖపట్నం : జాతీయ ఉపాధి హామీ పథకం..జాతీయ ప్రయోజనాలతో ఏర్పడిన పథకం. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకాన్ని తమకనుకూలంగా మల్చుకునేందుకు టీడీపీ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి పథకరచన చేస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పార్టీకి అనుకూలంగా పనిచేయ లేదనే సాకుతో కొంతమందిని పని గట్టుకుని మరీ సాగనంపింది. వారి స్థానంలో తమ తాబేదార్లకు నియమించేందుకు ఎంపిక బాధ్యతను పూర్తిగా జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టింది. ఇక ఉపాధి పనుల ఎంపిక బాధ్యతను కూడా ఈ కమిటీలకే అప్పగించింది. దీంతో ఏ గ్రామంలో తమకు ఎక్కువగా ఓట్లు వచ్చాయి.. ఎక్కడ రాలేదు...అని బేరీజు వేసుకుంటూ మరీ పనుల గుర్తింపు జరుగుతోందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్ధమవుతుంది. ఇక కూలీలకు పనుల కల్పనలో కూడా ఇదే విధానం కొనసాగుతుందని కూలీలు ఆరోపిస్తున్నారు.
పొట్టనింపని ‘ఉపాధి'
విశాఖ గ్రామీణ జిల్లాలోని 39 మండలాల్లో అమలవుతోంది. ఈ పథకం కింద 5.92 లక్షల జాబ్‌కార్డులుండగా, వాటిలో 13.43లక్షల మంది కూలీలున్నారు. వీటిలో 3.34 లక్షల యాక్టివ్‌జాబ్‌కార్డ్స్ ఉంటే 6.34లక్షల మంది కూలీలున్నారు. ప్రతి ఏటా డిసెంబర్‌లో ఉపాధి పనులు ప్రారంభమవుతుంటాయి. సీజన్‌లో సరాసరిన నాలుగున్నర లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తుంటారు. ప్రతి ఏటా రెండు లక్షల వరకు పని దినాలు కల్పిస్తుంటారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు 87.32లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. ప్రతి కుటుంబానికి కేవలం 34 రోజుల పని దినాలు మాత్రమే కల్పించారు. అదే టీడీపీ సర్కార్ రాక ముందు 60 రోజులకు పైగా పనిదినాలు కల్పించే వారు. వంద రోజుల పనిదినాలు 2012-13లో 73వేల మందికి కల్పిస్తే 2013-14లో 65,922 మందికి కల్పించారు. ఇక గతేడాది 59వేల మందికి కల్పిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 1472 మందికి మాత్రమే కల్పించారు.
కూలికీ బకాయిలు...
ప్రస్తుత సీజన్‌లో సగటున కూలీలకు రూ.50లోపే వేతనం గిడితే.. గరిష్టంగా రూ.80కి మించి రావడం లేదు. మరొక పక్క కూలీలకు రూ.35కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఒక పక్క ఉపాధి పనులు, మరొక పక్క వ్యవసాయ పనుల్లేక పోవడంతో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు వలసబాట పడుతున్నారు.అనకాపల్లి మండలం కూండ్రం పరిసర ప్రాంతాలకు చెందిన 200 మంది ఉపాధి కూలీలు చెన్నైకి వలస పోయారు. నర్సీపట్నం మండలం పెదఉప్పరగూడెంలో 100 కుటుంబాలు, బుచ్చెయ్యపేట , చోడవరం, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన 500 మంది చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. నాతవరం మండలం మాధవనగరం, బుచ్చంపేట, రావాన్నపాలెం గ్రామాల నుండి 600 మంది, గొలుగొండ మండలం పేటమాలపల్లి, జోగంపేట, పాతమల్లంపేట గ్రామాల నుండి 700 మంది వరకు వలస వెళ్తున్నారు.