దళితులకు జరుగుతున్న అవమానంపై చంద్రగిరి మండలం పనపాకంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో నాని ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ దళిత యువకులు
ప్రభుత్వం బుధవారం నిర్వహించిన చివరి జన్మభూమి– మా ఊరు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరసనలు.. నిలదీతలతో ప్రారంభమైంది. తాము గతంలో ఇచ్చిన అర్జీల మాటేంటని జనం అడుగడుగునా నిలదీశారు. అధికారులు.. ప్రజాప్రతినిధులు బిక్కముఖం వేశారు. జనం నిరసన సెగనుంచి తప్పించుకోడానికి ముచ్చెమటలు పట్టేశాయి. పుంగనూరు లాంటి చోట్ల నియోజక ఇన్‌చార్జిలే నేరుగా వేదికపై కూర్చున్నారు. కనీస ప్రొటోకాల్ పాటించకపోవడంతో జనం ప్రశ్నించారు. చాలాచోట్ల విద్యార్థులే పెద్దలుగా సభలో కూర్చోవాల్సి వచ్చింది. వీకోట మండలంలో తాగునీటి వసతి కల్పించాకే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ రోడ్డుపై బిందెలుంచి వినూత్న రీతిలో మహిళలు ఆగ్రహం వెళ్లగక్కారు. కొన్నిచోట్ల ప్లకార్డులు చూపి నిరసన తెలిపారు.
సాక్షి, తిరుపతి: జన్మభూమి– మా ఊరు కార్యక్రమం నిరసనలతో హోరెత్తింది. కుప్పం నియోజక వర్గంలో నిర్వహించిన గ్రామసభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మంత్రి అమరనాథ్‌రెడ్డి వి కోట మండలం గోనుమాకులపల్లిలో హాజరయ్యారు. మంత్రిని గ్రామస్తులు నిలదీశారు. ‘గత జన్మభూమి అర్జీల మాటేంటి? అర్జీలు తీసుకొంటారు –ఆఫీసులో ఏరిపారేస్తారు. పేదలు పూరి పాకల్లోనే మగ్గాల్సిందేనా..?’ అంటూ వాగ్వాదానికి దిగారు. నాగిరెడ్డిపల్లికి చెందిన శ్రీరామప్ప పక్కా ఇంటికోసం ఐదు విడతలలోనూ అర్జీలు ఇచ్చామని ప్రశ్నించారు.
♦ కృష్ణాపురం గ్రామసభలో అధికారులు, నాయకులను మంచినీటి సమస్యపై జనం అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి తాగునీటి సదుపాయం లేదని, తాగు నీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు. ఖాళీ బిందెలను రోడ్డు పై అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.
♦ చంద్రగిరి పరిధిలో పనబాకంలో టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానికి చుక్కెదురైంది. దళితవాడకు స్మశానవాటిక లేదని, ఎవరైనా చనిపోతే ఎక్కడ పూడ్చాలో అర్థం కాక... పాతిపెట్టిన గుంతలనే తవ్వి అందులో పూడ్చిపెడుతున్నామని ఆయన్ను నిలదీశారు. టీడీపీలో ఏళ్ల తరబడి సేవచేస్తున్నా దళితవాడుకు చెందిన వారిలో ఎంతమందికి కార్పొరేషన్ రుణాలు ఇచ్చారని టీడీపీ కార్యకర్తలే నిలదీశారు.
♦ పుంగనూరు పరిధిలోని కల్లూరు గ్రామసభలో అధికారపార్టీ నేతలు ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎంపీటీసీలకు ఆహ్వానం లేకపోవటంతోవారు బైఠాయించారు. వేదికపై టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ అనీషారెడ్డి, మంత్రి అమరనాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి కూర్చొవటంపై వైఎస్సార్‌సీపీ నాయకులు పోకల అశోక్‌కుమార్, తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ హోదాతో వేదికపై కూర్చొన్నారని ప్రశ్నించారు. వీరు బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం కల్లూరు నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.
♦ చిత్తూరు 27వ వార్డులో జరిగిన గ్రామ సభను స్థానికులు బహిష్కరించారు. పింఛన్లు ఇవ్వలేదని, కాలనీలో ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ స్థానికులు ధర్నా చేసి సభను బహిష్కరించారు.
♦ మదనపల్లి పరిధిలోని రామసముద్రం, నిమ్మనపల్లిలో జరిగిన గ్రామసభలో స్థానికులు అధికారులు, నాయకులను నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా అర్జీలు ఇస్తూనే ఉన్నామని, సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
♦ నిమ్మనపల్లి మండలం వెంగంవారిపల్లిలో రేషన్ కార్డులు, పక్కాగృహాల మంజూరులో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
♦ వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో స్థానికులు ‘ గత అర్జీలకే స్పందన లేదు. జన్మభూమి మా ఊరు మాకొద్దు’ అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలియజేశారు.
♦ తంబళ్లపల్లి నియోజక వర్గం పెద్దమండ్యం మండలం మందలవారిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు స్పందన కరువైంది. సభకు హాజరైన వారు అధికారులను వెంటబెట్టుకుని గ్రామంలో తిష్టవేసిన సమస్యలను చూపించి నిలదీశారు.
♦ ఏర్పేడు మండలం చింతలపాలెంలో అధికారులు, టీడీపీ నాయకులను షికారీలు నిలదీశారు. తమ భూములను అప్పజెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
♦ పల్లం గ్రామసభలో స్కూలు స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
♦ కాణిపాకంలో గ్రామసభకు టీడీపీ ఇన్‌చార్జ్ లలితకుమారి ఆలస్యంగా హాజరయ్యారు. ఆమె వచ్చే వరకు గ్రామసభ ప్రారంభం కాకపోవటంతో ఎండ తీవ్రతకు చిన్నపాపమ్మ (82) సృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు.
♦ ఎస్సార్‌పురం మండలం ముదికుప్పంలో గత జన్మభూమిలో సమస్యలపై ఇచ్చిన వినతులే పరిష్కారం కాలేదంటూ నిలదీశారు.
తిరుపతి సభలో ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. పెద్దకాపు లేఅవుట్‌లో సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తే... కనీసం చూడకుండా అధికారులకు ఇవ్వటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతి పత్రంలో ఏమి ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అధికారులకు ఇవ్వటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రజలు హాజరు కాకపోవటంతో పాఠశాల విద్యార్థులతో కానిచ్చేశారు.
♦ గ్రామసభలో ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని అన్ని చోట్ల అధికారులు చదివి వినిపిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని పాఠం ఉండటం గమనార్హం.
సీఎం సభకు రాకుంటే జరిమానా
గుడుపల్లె:కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశానికి హాజరుకాకపోతే రూ.200 నుంచి రూ.500 వరకూ జరిమానా కట్టాలా.. అవునంటున్నారు వెలుగు అధికారులు. ఈ మేరకు వారు స్థానికంగా మహిళలను బెదిరించారు కూడా. బుధవారం గుడుపల్లె మండలంలోని పలు గ్రామాలకు వచ్చిన బస్సులలో మహిళలు ఎక్కలేదు. దీంతో వెలుగు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ ఎక్కలేదో ఆయా గ్రామాలకు వెళ్లి జరిమానా కట్టాలని, లేకుంటే బ్యాంకు రుణాలకు సంతకాలు పెట్టేదిలేదని, వెలుగు రుణాలు కూడా ఇచ్చేది లేదని వెలుగు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మహిళలు సీఎం సభలకు వెళ్లారు. వారిలో మరి కొంతమంది మొక్కుబడిగా హాజరు వేయించుకుని వెంటనే తిరిగి ఆటోల్లో తిరుగు ముఖం పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment