janmabhoomi Committees
-
పింఛన్లపై పెత్తనం.. మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో 94 మంది లబ్ధిదారులకు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదుతో ఈ నెల ఫించన్లు నిలిచిపోయాయి. ఇన్నాళ్లూ ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటివద్దే నిశ్చింతగా కోవిడ్ కష్టకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిన ఫించన్లు ఈసారి కొన్నిచోట్ల ఉదయం 8 గంటలు దాటుతున్నా చేతికి అందకపోవడంతో పలుచోట్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్ల మంజూరు మొదలు పంపిణీ దాకా రాజకీయాలకు అతీతంగా, ఎవరి సిఫారసులు అవసరం లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లను అందచేసిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి భిన్నంగా తాజాగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. గ్రామాల్లోనూ, వార్డులోనూ సచివాలయాల ఉద్యోగుల వెంట స్థానిక టీడీపీ, జనసేన నాయకులు మోహరించారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందచేస్తూ పోటాపోటీగా నేతలు ఫోటోలు దిగారు. విజయనగరం తదితర చోట్ల తమ అధిపత్యం నిరూపించుకునేందుకు జనసేన – టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగిన ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూటమి నేతలు కొన్ని చోట్ల తమ ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో పలువురు పింఛన్లను తొలగించినట్లు వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో పెదంచలలో వైఎస్సార్ సీపీకి ఓటు వేసినందుకు తమ పింఛన్లు నిలిపివేశారంటూ కొందరు లబ్ధిదారులు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. కాగా నంద్యాలలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 29వ వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి (32) సోమవారం రాత్రి తన ఇంట్లో బాత్రూమ్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. వారం క్రితం స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాతో పాటు సచివాలయ ఉద్యోగులను బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సుధారాణి సోమవారం టీడీపీ నేతలతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న అనంతరం అనుమానాస్పద రీతిలో మరణించారు.తొలిరోజు 95 శాతం.. మొత్తం 64.75 లక్షల మంది లబ్ధిదారులకుగానూ తొలి రోజు సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి 61 లక్షల మంది (దాదాపు 95 శాతం)కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వలంటీర్లతో సంబంధం లేకుండా పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వలంటీర్లు వారి వెంట వెళ్లి పంపిణీలో పాల్గొన్నారు. ఉదయం కొద్దిసేపు సాంకేతికపరమైన అవాంతరాలు తల్తెత్తడంతో వాటిని సరిదిద్ది ప్రక్రియ కొనసాగించారు.జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నేతల దాడిపింఛన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొన్నివార్డుల్లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్ నగర్‌లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పింఛన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. చాలాసేపు సద్దుమణగకపోవడంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు నిరాశతో వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పింఛను అందించారని గుర్తు చేసుకున్నారు.వృద్ధులు ఉసూరు..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని వార్డుల్లో లబ్ధిదారులను నిర్దేశిత ప్రాంతానికి రావాలని ఆదేశించడంతో వృద్ధులు, దివ్యాంగులు నానా పాట్లు పడి అక్కడకు చేరుకున్నారు. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో ఐరిస్‌తో ప్రయత్నించారు. చివరకు సరిపోలడం లేదని, ఫించన్ ఇవ్వలేమని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పలువురు వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మరికొన్ని వార్డుల్లో సచివాలయాలకు తాళం వేసి సిబ్బంది పింఛన్ల పంపిణీకి వెళ్లి పోవడంతో సమాచారం తెలియక పలువురు అక్కడకు చేరుకుని ఇబ్బందులు పడ్డారు.మొదటి నెలలోనే చుక్కలు...– సత్యనారాయణ, 5వ వార్డు, తాడేపల్లిగూడెంఅధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మా వార్డులో పంపిణీకి ఇంటికి రాలేదు. ఎక్కడ ఇస్తున్నారో తెలియదు. సచివాలయానికి వెళితే తాళం వేసి ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.సచివాలయాలకు పరుగు ఉదయం 8 గంటలు దాటుతున్నా సచివాలయ సిబ్బంది జాడ లేకపోవడం, పింఛన్ తీసుకోకుంటే వెనక్కి వెళ్లిపోతుందనే ఆందోళనతో విజయనగరంలో లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు తీశారు. సర్వర్ సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. విజయనగరంలోని తోటపాలెం సచివాలయంలో ఈ పరిస్థితి కనిపించింది. ఫించన్లపై ఫిర్యాదులు..శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.ప్రకాశంలో పడిగాపులు..ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన పింఛన్లను ప్రకాశం జిల్లాలో ఆలయాలు, స్కూళ్లు, ప్రైవేటు స్థలాల వద్దకు రప్పించడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరకు సర్వర్ పనిచేయడంలేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎక్కువ చోట్ల గ్రామాల్లో రచ్చబండ వద్ద కూర్చొని పింఛన్లు పంపిణీ చేశారు.కష్టాలు మొదలయ్యాయిఇన్నాళ్లూ జగనన్న ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే ప్రతి నెలా 1వ తేదీ ఉదయం పింఛన్ అందుకున్నాం. ఈసారి మాకు పింఛన్ అందలేదు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల తరువాత గాని మాకు అందే పరిస్థితి లేదు. మాకు కష్టాలు మొదలయ్యాయి.పుట్టా ఫిర్యాదుతో 94 మందికి ఆగిన ఫించన్లువైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో గత నెల వరకు పింఛన్లు పొందిన 94 మంది లబ్ధిదారులకు ఈదఫా డబ్బులు అందలేదు. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదులే దీనికి కారణం. మడూరులో 40, అన్నవరంలో 28, టీఓపల్లెలో 26 మందికి పించన్లపై పునర్విచారణ చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 94 మందికి పింఛన్లను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తమ పింఛన్లను ఆపారని, వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే ఇలా చేశారని, విచారణ జరిపి అర్హత ఉంటేనే తమకు పింఛన్ ఇవ్వాలని బాధితులు పేర్కొన్నారు.ఒంటరి మహిళ ఇక్కట్లు..భర్తకు పొగొట్టుకుని వితంతు పింఛన్ పొందుతున్నా. గత ఐదేళ్లుగా టంఛన్‌గా ఇచ్చారు. ఈసారి రాలేదు. డబ్బుల కోసం పంచాయతీ అధికారి వద్దకు వెళితే నీ పింఛన్ ఆపమన్నారని చెప్పారు. అర్హత పత్రాలు పరిశీలించిన తర్వాత అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పింఛన్ డబ్బులే నాకు జీవనాధారం.కారు వద్దే పింఛన్ల పంపిణీఓ సచివాలయ ఉద్యోగి తన కారు వద్దకే లబ్ధిదారులను రప్పించుకుని పింఛన్ పంపిణీ చేపట్టిన ఘటన రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది. 16వ డివిజన్ పరిధిలోని 41వ వార్డు సచివాలయం ఎమినిటీ సెక్రటరీ వీవీడీ ప్రసాద్‌కు వాంబే కాలనీలో పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించారు. బ్లాక్–1 వద్ద దివ్యాంగులు, వృద్ధులు, వితంతవులు తన కారు వద్దకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక లబ్ధిదారులు అక్కడ బారులు తీరారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు, వైఎస్సార్ సీపీ నేత సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి దీన్ని వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు గంటల తరువాత ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.సాయంత్రం వరకు ఇవ్వలేదు..గతంలో వలంటీర్లు వేకువజామునే మా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్ నగదు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే మీకు ఇప్పుడే ఇవ్వమన్నారని చెప్పారు. ఎందుకయ్యా? అని అడిగితే.. ఏమో టీడీపీ వాళ్లు చెప్పారని అంటున్నారు. గత ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, ప్రాంతం ఇవేమీ చూడకుండా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు. ఎలాంటి కక్షసాధింపులు ఉండేవి కావు. – రాజేంద్రరెడ్డి, మల్లారెడ్డికండ్రిగ గ్రామం, విజయపురం మండలం, నగరి నియోజకవర్గం. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇవ్వొద్దుఅనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వెంగన్నపల్లె, పుప్పాల గ్రామాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందితో కలసి పింఛన్ల పంపిణీ చేపట్టిన పంచాయతీ కార్యదర్శి వసుంధరను అడ్డగించారు. పుప్పాల గ్రామంలో 35, వెంగన్నపల్లెలో 50 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకూడదంటూ టీడీపీ సర్పంచులు దేవన్న, నాగమునిరెడ్డి తమ వర్గీయులతో కలసి అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ జరగలేదు. టీడీపీలో ఆధిపత్య పోరుపింఛన్ల పంపిణీ టీడీపీలో వర్గ పోరుకు వేదికగా మారింది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో సుగవాసి సుబ్రమణ్యం వర్గం పంపిణీ చేపట్టగా అదే ప్రాంతంలో పార్లమెంటరీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహనరాజు వర్గీయలు కూడా దీన్ని ప్రారంభించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా దుద్యాల గ్రామంలో టీడీపీ నాయకుడు కోటేశ్వర్ రెడ్డి మీ అంతు చూస్తానంటూ సచివాలయ సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. పంచేందుకు కుమ్ములాట..కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పచ్చ కండువాతో మెప్మా ఆర్పీ..రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్(ఆర్పీ) పచ్చ కండువా మెడలో ధరించి పింఛన్లు పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రామారావు కాలనీకి చెందిన మెప్మా ఆర్పీ జాఫరున్నీసా టీడీపీ నాయకురాలిలా మెడలో పచ్చ కండువా వేసుకుని పింఛన్లు పంపిణీ చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీనిపై శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని టీఎంసీ రవి తెలిపారు. -
మృతుల పేరుతో పింఛన్ స్వాహా చేసిన జన్మభూమి కమిటీలు
అధికారం ఉన్న ఐదేళ్లూ సంపాదన కోసం అడ్డమైన గడ్డీ తిన్న టీడీపీ నేతలు ఆఖరుకు మృతులను వదల్లేదు. దాదాపు 59 మంది మృతుల పేరుతో రూ.14.20 లక్షలు స్వాహా చేసినట్లు వెలుగుచూసింది. ఇందులో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యుల ఘనకార్యమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలకు సహకరించిన ఎనిమిది మందిపై కమిషనర్ వేటు వేశారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: టీడీపీ ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ ఛోటా నాయకులు అందినకాడికి దోచుకున్నారు. సంపాదనే పరమావధిగా అధికారులనూ పక్కదారి పట్టించారు. చివరకు మరణించిన వారి పేరుతోనూ పింఛన్లు తీసుకుని రూ.లక్షలు స్వాహా చేశారు. ఎమ్మెల్యే ‘అనంత’ చొరవతో ... ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగరంలోని అక్రమ పింఛన్లు తొలగించి అర్హులకు పింఛన్లు అందించాలని కమిషనర్ పి. ప్రశాంతిని కోరారు. దీంతో ఆమె ఈ నెల 18 నుంచి 21 వరకు 9 మంది కూడిన సోషల్ ఆడిట్ బృందం సభ్యులు నగరంలోని 18 డివిజన్లలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. వారు 638 మంది పింఛన్లను (పీడీఓ అథెంటికేషన్) తనిఖీ చేయగా అందులో 273 పింఛన్‌దారుల ఆధార్, రేషన్‌కార్డు తదితర వివరాలు సరిగా నమోదు కాలేదు. ఈ క్రమంలోనే మృతి చెందిన 56 మంది పేరున పింఛన్లు డ్రా చేస్తున్నట్లు తేల్చారు. ఇలా మృతి చెందిన వారు పేరుతో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు రూ.14,20,800 స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఎనిమిది మందిపై వేటు ... అక్రమ పింఛన్ల బాగోతంపై ఇప్పటికే కమిషనర్ ప్రశాంతికి కొన్ని ఫిర్యాదులందాయి. వాటిపై విచారణ జరిపిన కమిషనర్ అక్రమాలు నిజమని తేలడంతో ఎనిమిదిమంది నగరపాలక సంస్థ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా సోషల్ ఆడిట్లో 56 మంది మృతుల పేరుతో పింఛన్లు తీసుకున్నట్లు స్పష్టంగా తెలిసింది. ఈ అక్రమ పింఛన్లలో టీడీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అప్పటి ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూపలకు తెలిసే ఈ అక్రమ బాగోతం జరిగిందని నగరపాలక సంస్థ అధికారులు వాపోతున్నారు. దీంతో అక్రమ బాగోతానికి సహకరించిన వారిపైనా వేటుపడే అవకాశం ఉంది. ఇప్పటికి కేవలం 18 డివిజన్లలోనే సోషల్ ఆడిట్ జరగ్గా...మిగతా డివిజన్లలోనూ ఆడిట్ జరిగితే భారీగా అక్రమ పింఛన్లు తేలే అవకాశం ఉందని, అదే జరిగితే ఇంకా ఎంతమందిపై వేటు పడుతుందోనని అధికారుల్లో వణుకు పుడుతోంది. రికవరీ చేస్తాం బీకేఎస్ సోషల్ ఆడిట్ టీం ద్వారా సర్వే చేసేలా చర్యలు తీసుకున్నాం. 56 మంది మృతుల పేరుతో పింఛన్ సొమ్మును అక్రమంగా డ్రా చేశారు. పీడీఓల నుంచి డ్రా చేసిన మొత్తాన్ని రికవరీ చేయిస్తాం. దీంతో పాటుగా క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తా. ఇంకా రెండ్రోజుల పాటు ఆడిట్ జరుగుతుంది. అన్ని డివిజన్లలో సోషల్ ఆడిట్ చేసి అక్రమ పింఛన్లుంటే వెలికితీస్తాం. – పి. ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ -
నిరసన.. నిలదీత
ప్రభుత్వం బుధవారం నిర్వహించిన చివరి జన్మభూమి– మా ఊరు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరసనలు.. నిలదీతలతో ప్రారంభమైంది. తాము గతంలో ఇచ్చిన అర్జీల మాటేంటని జనం అడుగడుగునా నిలదీశారు. అధికారులు.. ప్రజాప్రతినిధులు బిక్కముఖం వేశారు. జనం నిరసన సెగనుంచి తప్పించుకోడానికి ముచ్చెమటలు పట్టేశాయి. పుంగనూరు లాంటి చోట్ల నియోజక ఇన్‌చార్జిలే నేరుగా వేదికపై కూర్చున్నారు. కనీస ప్రొటోకాల్ పాటించకపోవడంతో జనం ప్రశ్నించారు. చాలాచోట్ల విద్యార్థులే పెద్దలుగా సభలో కూర్చోవాల్సి వచ్చింది. వీకోట మండలంలో తాగునీటి వసతి కల్పించాకే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ రోడ్డుపై బిందెలుంచి వినూత్న రీతిలో మహిళలు ఆగ్రహం వెళ్లగక్కారు. కొన్నిచోట్ల ప్లకార్డులు చూపి నిరసన తెలిపారు. సాక్షి, తిరుపతి: జన్మభూమి– మా ఊరు కార్యక్రమం నిరసనలతో హోరెత్తింది. కుప్పం నియోజక వర్గంలో నిర్వహించిన గ్రామసభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మంత్రి అమరనాథ్‌రెడ్డి వి కోట మండలం గోనుమాకులపల్లిలో హాజరయ్యారు. మంత్రిని గ్రామస్తులు నిలదీశారు. ‘గత జన్మభూమి అర్జీల మాటేంటి? అర్జీలు తీసుకొంటారు –ఆఫీసులో ఏరిపారేస్తారు. పేదలు పూరి పాకల్లోనే మగ్గాల్సిందేనా..?’ అంటూ వాగ్వాదానికి దిగారు. నాగిరెడ్డిపల్లికి చెందిన శ్రీరామప్ప పక్కా ఇంటికోసం ఐదు విడతలలోనూ అర్జీలు ఇచ్చామని ప్రశ్నించారు. ♦ కృష్ణాపురం గ్రామసభలో అధికారులు, నాయకులను మంచినీటి సమస్యపై జనం అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి తాగునీటి సదుపాయం లేదని, తాగు నీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు. ఖాళీ బిందెలను రోడ్డు పై అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. ♦ చంద్రగిరి పరిధిలో పనబాకంలో టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానికి చుక్కెదురైంది. దళితవాడకు స్మశానవాటిక లేదని, ఎవరైనా చనిపోతే ఎక్కడ పూడ్చాలో అర్థం కాక... పాతిపెట్టిన గుంతలనే తవ్వి అందులో పూడ్చిపెడుతున్నామని ఆయన్ను నిలదీశారు. టీడీపీలో ఏళ్ల తరబడి సేవచేస్తున్నా దళితవాడుకు చెందిన వారిలో ఎంతమందికి కార్పొరేషన్ రుణాలు ఇచ్చారని టీడీపీ కార్యకర్తలే నిలదీశారు. ♦ పుంగనూరు పరిధిలోని కల్లూరు గ్రామసభలో అధికారపార్టీ నేతలు ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎంపీటీసీలకు ఆహ్వానం లేకపోవటంతోవారు బైఠాయించారు. వేదికపై టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జ్ అనీషారెడ్డి, మంత్రి అమరనాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి కూర్చొవటంపై వైఎస్సార్సీపీ నాయకులు పోకల అశోక్‌కుమార్, తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ హోదాతో వేదికపై కూర్చొన్నారని ప్రశ్నించారు. వీరు బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం కల్లూరు నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ♦ చిత్తూరు 27వ వార్డులో జరిగిన గ్రామ సభను స్థానికులు బహిష్కరించారు. పింఛన్లు ఇవ్వలేదని, కాలనీలో ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ స్థానికులు ధర్నా చేసి సభను బహిష్కరించారు. ♦ మదనపల్లి పరిధిలోని రామసముద్రం, నిమ్మనపల్లిలో జరిగిన గ్రామసభలో స్థానికులు అధికారులు, నాయకులను నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా అర్జీలు ఇస్తూనే ఉన్నామని, సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ నిమ్మనపల్లి మండలం వెంగంవారిపల్లిలో రేషన్ కార్డులు, పక్కాగృహాల మంజూరులో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో స్థానికులు ‘ గత అర్జీలకే స్పందన లేదు. జన్మభూమి మా ఊరు మాకొద్దు’ అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలియజేశారు. ♦ తంబళ్లపల్లి నియోజక వర్గం పెద్దమండ్యం మండలం మందలవారిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు స్పందన కరువైంది. సభకు హాజరైన వారు అధికారులను వెంటబెట్టుకుని గ్రామంలో తిష్టవేసిన సమస్యలను చూపించి నిలదీశారు. ♦ ఏర్పేడు మండలం చింతలపాలెంలో అధికారులు, టీడీపీ నాయకులను షికారీలు నిలదీశారు. తమ భూములను అప్పజెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ పల్లం గ్రామసభలో స్కూలు స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ♦ కాణిపాకంలో గ్రామసభకు టీడీపీ ఇన్చార్జ్ లలితకుమారి ఆలస్యంగా హాజరయ్యారు. ఆమె వచ్చే వరకు గ్రామసభ ప్రారంభం కాకపోవటంతో ఎండ తీవ్రతకు చిన్నపాపమ్మ (82) సృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ♦ ఎస్సార్‌పురం మండలం ముదికుప్పంలో గత జన్మభూమిలో సమస్యలపై ఇచ్చిన వినతులే పరిష్కారం కాలేదంటూ నిలదీశారు. తిరుపతి సభలో ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. పెద్దకాపు లేఅవుట్లో సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తే... కనీసం చూడకుండా అధికారులకు ఇవ్వటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతి పత్రంలో ఏమి ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అధికారులకు ఇవ్వటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రజలు హాజరు కాకపోవటంతో పాఠశాల విద్యార్థులతో కానిచ్చేశారు. ♦ గ్రామసభలో ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని అన్ని చోట్ల అధికారులు చదివి వినిపిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని పాఠం ఉండటం గమనార్హం. సీఎం సభకు రాకుంటే జరిమానా గుడుపల్లె:కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశానికి హాజరుకాకపోతే రూ.200 నుంచి రూ.500 వరకూ జరిమానా కట్టాలా.. అవునంటున్నారు వెలుగు అధికారులు. ఈ మేరకు వారు స్థానికంగా మహిళలను బెదిరించారు కూడా. బుధవారం గుడుపల్లె మండలంలోని పలు గ్రామాలకు వచ్చిన బస్సులలో మహిళలు ఎక్కలేదు. దీంతో వెలుగు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ ఎక్కలేదో ఆయా గ్రామాలకు వెళ్లి జరిమానా కట్టాలని, లేకుంటే బ్యాంకు రుణాలకు సంతకాలు పెట్టేదిలేదని, వెలుగు రుణాలు కూడా ఇచ్చేది లేదని వెలుగు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మహిళలు సీఎం సభలకు వెళ్లారు. వారిలో మరి కొంతమంది మొక్కుబడిగా హాజరు వేయించుకుని వెంటనే తిరిగి ఆటోల్లో తిరుగు ముఖం పట్టారు. -
రుణమా.. రణమా?
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అలా అతనొక్కడే కాదు జిల్లాలో వేలాది మంది కోరుకునేదీ అదే! కానీ అలా జరిగితే జన్మభూమి కమిటీలు ఊరుకుంటాయా? ఊహూ... టీడీపీ అనుకూలమా? ఏమైనా కమీషను ముట్టజెబుతున్నాడా? మనోడా కాదా? ఇలా అన్నీ చూసుకున్న తర్వాతే దరఖాస్తులు ముందుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి. లేదంటే గత నాలుగేళ్లు మాదిరిగానే ఈ ఏడాదీ ఆశాభంగం తప్పదు మరి! వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం యువతకు ప్రకటించిన రాయితీ రుణాలకు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వారిలో చాలామంది గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జన్మభూమి కమిటీలు సిఫారసు చేయకపోవడంతో నిరాశ తప్పలేదు. రుణాలు పొందే అవకాశం చేజారిపోయింది. దీంతో వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, ఎంబీసీ తదితర వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లింకేజీలతో రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా గడువు ముగిసిన సమయానికి బీసీ రుణాలకు 40 వేల వరకూ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎస్సీ రుణాలకు 11,420 వరకూ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మిగతా కార్పొరేషన్లకు కూడా దరఖాస్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. పచ్చచొక్కాలు, దళారులదే హవా... రాయితీ రుణాలంటే జన్మభూమి కమిటీలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకే కాసుల సంద డి. నిరుద్యోగుల నుంచి కమీషన్లు భారీగానే నొక్కేస్తున్నారు. కానీ దాఖలైన దరఖాస్తుల సంఖ్యకు, మంజూరైన యూనిట్ల సంఖ్యకు భారీ తేడా ఉంటోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను ప్రభుత్వం జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టడంతో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదు. రాయితీ రుణం వస్తుందని జన్మభూమి కమిటీలకు నిరుద్యోగులు కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. తీరా జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపించట్లేదు. దీంతో యూనిట్లు గ్రౌండ్ కావడంలేదు. ఒక్కో యూని ట్ విలువ రూ.2 లక్షలు. దీన్ని ఒక్కో లబ్ధిదారుడికే మంజూరు చేయాలి. కానీ ఎక్కువ మందిని ముగ్గులోకి దింపడానికి వీలుగా టీడీపీ నాయకులు ఒక్కో యూనిట్‌ను ఇద్దరికి, ముగ్గురికి, కొన్ని చోట్ల నలుగురిని లబ్ధిదారులుగా ఎంపిక చేసిన దాఖలాలు ఉన్నాయి. అంతేకాదు చాలాచోట్ల బినామీ పేర్లతో రుణాలను వారే దక్కించుకుం టున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద జన్మభూమి కమిటీల పెత్తనం, బ్యాంకుల్లో దళారుల జోక్యం కారణంగా రుణాల మంజూ రు ప్రక్రియ గందరగోళంగా తయారైంది. మూడేళ్లుగా మంజూరు ముచ్చట.. బీసీ రుణాలు: 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లా లక్ష్యం 2,174 యూనిట్లు. రుణాల కింద రూ.38.98 కోట్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇద్దరు ముగ్గురికి పంచడంతో యూనిట్ల సంఖ్య 3,086కి చేరింది. తీరా మంజూరైన రుణాల మొత్తం రూ. 31.63 కోట్లు మాత్రమే. రూ. 7.35 కోట్ల మేర నిధులు మిగిలిపోయాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 5,449 యూనిట్లకు రూ. 108.98 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యం కాగా 7,769 మందికి రూ. 97.06 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈసారి కూడా రూ.11.91 కోట్లు మిగిలిపోయాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 5,063 యూనిట్లకు రూ. 101.26 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేదీ లక్ష్యం. కాగా గడువు ముగిసే సమయానికి 40,365 దరఖాస్తులు వచ్చాయి. కాపు రుణాలు : 2016–17 ఆర్థిక సంవత్సరంలో యూనిట్లు 1,147 కాగా రూ. 21 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యం. కానీ 993 మందికి రూ. 14.06 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. సుమారు రూ. 7 కోట్ల నిధులు మిగిలిపోయాయి. 2017–18లో 1200 యూనిట్లకు రూ. 24 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేదీ లక్ష్యం. కానీ 1371 మందికి రూ. 19.56 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. రూ. 4.44 కోట్లు నిధులు మిగిలిపోయాయి. ఈ 2018–19 ఆర్థిక సంవత్సరానికి వెయ్యి యూనిట్లకు రూ. 20 కోట్లు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ 4,538 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈబీసీ రుణాలు: 2017–18 ఆర్థిక సంవత్సరానికి 638 యూనిట్లుకు రూ. 12.76 కోట్లు రుణాలు లక్ష్యం కాగా, 217 యూనిట్లుకు రూ. 4.32 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 471 యూనిట్లుకు రూ. 9.42 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కాగా 236 దరఖాస్తులు వచ్చాయి. ఎంబీసీ రుణాలు : మిక్కిలి వెనుకబడిన వర్గాలకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,574 యూనిట్లుకు రూ. 15.44 కోట్ల మేర రుణాలు ఇవ్వాలనేదీ లక్ష్యం. కానీ 1,641 యూనిట్లుకు రూ. 9.84 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈ 2018–19 ఆర్థిక సంవత్సరానికి 857 యూనిట్లకు రూ. 17.14 కోట్లు రుణలక్ష్యం నిర్దేశించారు. వాటి కోసం 2,640 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ రుణాలు: 2016–17 ఆర్థిక సంవత్సరంలో 1,075 యూనిట్లకు రూ. 21.02 కోట్ల రుణాలు ఇవ్వాలి. కానీ 892 యూనిట్లకు రూ. 12.13 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,413 యూనిట్లకు రూ.24.13 కోట్లు లక్ష్యం కాగా వాటిలో 1,986 యూనిట్లకు రూ. 28.75 కోట్లు మంజూరు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1,926 యూనిట్లకు రూ. 31.89 కోట్లు రుణాలు ఇవ్వాలనేదీ లక్ష్యం. గడువు సమయానికి 11,420 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
మాకు తెలియకుండా జన్మభూమి కమిటీలా?
మోపిదేవి(అవనిగడ్డ): వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాయని, టీడీపీకి చెందిన వారమైనా తమకు తెలియకుండా జన్మభూమి కమిటీలు వేసుకుని మాకు విలువలేకుండా చేస్తున్నారని పలువురు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో అధికారులు కంగుతిన్నారు. మండల పరిషత్ సమావేశంలో టీడీపీకి చెందిన వెంకటాపురం ఎంపీటీసీ తుమ్మా నాగమణి, సర్పంచ్ తుమ్మా వెంకటలక్ష్మీ అధికారుల తీరుపై మండిపడ్డారు. అర్హులందరికీ కాకుండా టీడీపీ వారికే పింఛన్లు, రుణాలు ఇవ్వమని జీవో ఏమైనా ఉందా అని ఎంపీడీవోని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తమకు తెలియకుండా జన్మభూమి కమిటీలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. మాకు ప్రాధాన్యత ఇవ్వనపుడు ప్రయోజనం ఏమిటని, తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సందర్భంగా అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంపీపీ మోర్ల జయలక్ష్మీ పలుసార్లు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ విషయమై జన్మభూమి గ్రామసభను బహిష్కరించినా తమకు న్యాయం జరగలేదని వారు మండిపడ్డారు. టీడీపీ ప్రారంభం నుంచి పార్టీలోనే ఉంటూ అభివృద్ధికి కృషిచేస్తే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తమకు తెలియకుండా జన్మభూమి కమిటీలు వేసి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జెడ్పీటీసీ ఎం. మల్లికార్జునరావు కల్పించుకుని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు నచ్చజెప్పడంతో టీడీపీ ప్రజాప్రతినిధులు శాంతించారు. -
రైతురథానికి ‘పచ్చ’బొట్టు!
ప్రభుత్వ పథకాలేవైనా.. వారికే దక్కాలి. సర్కారు అందించే అవకాశాలన్నీ... వారి అనుచరులకే దక్కాలి. ఇదీ పాలకపక్ష నాయకుల తీరు. అధికారంలోకి వచ్చింది లగాయతూ అదే ధ్యేయంతో పనిచేస్తున్నారు. తమకు అనుకూలంగా లేనివారికి పథకాలు వెళ్ల కూడదన్న భావనతో ప్రతి గ్రామంలో పార్టీ తరఫున జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగేతర శక్తులను నెలకొల్పి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అప్పగించారు. దీనివల్ల అనర్హులకే అన్నీ దక్కుతున్నాయి. అన్ని అర్హతలున్నా... వారికి అనుకూలురు కాకుంటే మొండిచెయ్యి చూపుతున్నారు. తాజాగా ప్రభుత్వం అందించిన రైతురథం పథకానిదీ అదే దారి కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి,విజయనగరం: కర్నూలు జిల్లా నంధ్యాలలో ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్కడి రైతులకు ప్రభుత్వం ‘రైతు రథం’ పథకం పేరుతో ట్రాక్టర్లను సరఫరా చేసిం ది. వైఎస్సార్ కడప జిల్లాలోనూ కొందరు రైతులకు ట్రాక్టర్లు ఇచ్చారు. కానీ విజయనగరంలో మాత్రం ఖరీఫ్ సీజన్ ముగిసినా ఇంకా అందజేయలేదు. ఈ లోగా ఈ పథ కం లబ్ధిదారుల జాబితాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిశీలిస్తే తెలుగుదేశం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందో తేటతెల్లమవుతోంది. విజయనగరం జిల్లాకు 548 ట్రాక్ట ర్లు కేటాయించారు. జిల్లాలో 34 మండలాలున్నాయి. మండలానికి 15నుంచి 16 చొప్పున కేటాయించారు. 4డబ్ల్యూడీ ట్రాక్టర్‌కు రూ.2 లక్షలు, 2 డబ్ల్యూడీ ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షలు చొప్పన రాయితీ ఇవ్వనున్నారు. అధికార పార్టీనేతల సిఫార్సులు ఉన్న వారికే ట్రాక్టర్లిస్తామని మెలిక పెడుతున్నారు. అంటే అర్హతలున్నా తమకు ట్రాక్టర్ రాదని తెలిసి చాలా మంది రైతులు దరఖాస్తు చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఇన్చార్జి మంత్రి ఆమోదానికి ప్రతిపాదనలు జిల్లాలో ట్రాక్టర్లకోసం 612 మంది దరఖాస్తు చేశారు. 15 మంది ట్రాక్టర్ల కోసం డీడీలు తీశారు. ఇప్పటి వరకు 59 మందికి మంజూరు చేసినా ఇప్పటికి ఒక్కరికైనా ట్రాక్టర్ పంపిణీ చేయలేదు. జిల్లాకు కేటాయించిన మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన జాబితాలు వ్యవసాయ శాఖకు అందాయి. దానిని ఇన్చార్జ్ మంత్రికి పంపిస్తే ఆయన తుది అనుమతులు ఇస్తారట. ఇలా జిల్లా నుంచి వెళ్లిన లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారంతా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఉండటమే విశేషం. చిన్న సన్నకారు రైతులకు అందాల్సిన ట్రాక్టర్లను పదవులు అనుభవిస్తున్న వారికి, తమ పార్టీ వారికే కట్టబెడుతూ రైతులకు మేలు చేస్తున్నట్లు టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఇవీ నిబంధనలు: రైతు రథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీసం రెండు ఎకరాలు పొలం ఉండాలి గతంలో రాయితీపై ట్రాక్టర్ తీసుకుని ఉండకూడదు. దరఖాస్తుదారుడి పేరుమీద ఇప్పటికే ట్రాక్టర్ ఉండకూడదు. ∙అధార్, పాస్ బుక్‌లను చూపించి మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. ∙దరఖాస్తు సమయంలో రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ∙వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకూ రైతు రథం కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాలో టీడీపీ వర్గీయులు: చీపురుపల్లి నియోజకవర్గం: ∙గరివిడి మండలం కుమరాం ఎంపీటీసీ సభ్యుడు గొర్లెరమేష్(శ్రీను) సోదరి వాలిపల్లి సన్యాసమ్మ, శేరీపేట గ్రామ సర్పంచ్ పిళ్ల కృష్ణవేణి, దుమ్మెద ఎంపీటీసీ సభ్యురాలైన సూరీడమ్మ తోడికోడలు యజ్జపురపు జయలక్ష్మి, కోడూరు టీడీపీ కార్యకర్త గవిడి మహాలకు‡్ష్మనాయుడు, కొండలక్ష్మీపురం ఎంపీటీసీ సభ్యురాలు శనపతి లక్ష్మి సోదరుడు శనపతి ఆదినారాయణ, కె.పాలవలస టీడీపీ నాయకుడు మీసాల రామునాయుడు, వెదుళ్లవలస ఎంపీటీసీ సభ్యుడు నడుపూరి అప్పలనాయుడు, మందిరవలస కార్యకర్త సాకేటి సూర్యనారాయణరావు, శివరాం ఎంపీటీసీకి బంధువైన గవిడి కామమ్మ, ఎం.దుగ్గివలస కార్యకర్త కలిశెట్టి శ్రీరాములు, కందిపేట టీడీపీ నాయకురాలు మీసాల విజయ సోదరుడు కంది పెంటన్నాయుడు, తాటిగూడ ఎంపీటీసీ శనపతి సన్యాసి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బలగం వెంకటరావు తల్లి బలగం సూరమ్మ ఉన్నారు. మెరకముడిదాం మండలానికి సంబంధించి మెరకముడిదాం ఎంపీటీసీ పేరిచర్ల బంగార్రాజు, సోమలింగాపురం టీడీపీ నేత బి.తమ్మారావు, ఉత్తరావల్లి మాజీ సర్పంచ్ ఎం.రమణమోహన్, రామాయవలస ఎంపీటీసీ గొర్లెఅప్పలస్వామి, యాడిక ఎంపీటీసీ జమ్ము శంకరరావు, భైరిపురం నాయకుడు కెంగువనర్సింహమూర్తి, ఇప్పలవలస మాజీ సర్పంచ్ రౌతుఆనంద్, భగీరథిపురం సర్పంచ్ చోడవరపు బంగారునాయుడు, బిల్లలవలస సర్పంచ్ భర్త తిరుమలరాజు సుబ్బరాజు, ఎంపీపీ సన్యాసినాయుడు మామ పల్లెడ సత్యం ఉన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గం... ∙శృంగవరపుకోట మండలం వేములాపల్లి మాజీ సర్పంచ్ లగుడు వెంకటరావు, చినఖండేపల్లి నాయకుడు మేడపురెడ్డి శ్రీను, కొట్టాం సర్పంచ్ తెరపల్లి సూరిబాబు, తిమిడి సర్పంచ్ రవికుమార్‌కు అనుచరుడైన గండి అప్పలనాయుడు ఉన్నారు. కురుపాం నియోజకవర్గం... ∙కురుపాం మండలం ఉదయపురం సర్పంచ్ బిడ్డిక జాంబిరి భర్త రామారావు, మరిపిల్లి సర్పంచ్ బిడ్డిక సుక్కు తండ్రి బిడ్డిక మంగి, మొండెంకల్ మాజీ సర్పంచ్ గుడారి లక్ష్మి ఉన్నారు. ∙గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ సర్పంచ్ తాడంగి రాధ, గుమ్మలక్ష్మీపురం మండల కన్వీనర్ పాడి సుధ, గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ భర్త తాడంగి లక్ష్మణ రావు ఉన్నారు. ∙జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ సర్పంచ్ ముప్పర్తి లక్ష్మి, జోగులడుమ్మ సర్పంచ్ విజయమ్మ భర్త శివ్వాల తవిటినాయుడు, వాడ సర్పంచ్ బంకురు ఉషారాణి ఉన్నారు.∙గరుగుబిల్లి మండలం ఎంపీపీ కాళీ ప్రసాద్‌కు సలహాదారులైన పెద్దూరుకు చెందిన మర్రాపు శ్రీనివాసరావు, మర్రాపు చింతాలమ్మకు మంజూరు చేశారు.∙కొమరాడ మండలం కొమరాడ ఎంపీటీసీ బొడ్డుకుమారి ఉన్నారు. ఇన్చార్జ్ మంత్రి అనుమతిస్తేనే... రైతు రథం పథకం కింద ఇప్పటి వరకు 612 దరఖాస్తులు వచ్చాయి. 59 ట్రాక్టర్లకు ఇన్చార్జ్ మంత్రి అమోదం తెలిపారు. వాటిని పంపిణీ చేయాల్సి ఉంది. మిగతా వాటిని పరిశీలిస్తున్నాం. పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఆమోదంకోసం ఇన్చార్జ్ మంత్రి వద్దకు తీసుకుని వెళతాం. ఆయన సూచించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాం. –జి.ఎస్.ఎన్.లీలావతి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, విజయనగరం. -
కర్రపెత్తనం!
జన్మభూమి కమిటీలు... రాజ్యాంగేతర శక్తులు, షాడో లీడర్లు ఇలా ఏ పేరుపెట్టినా తక్కువే అనేట్లుగా తయారయ్యాయి! జిల్లా కలెక్టరు నుంచి బిల్లు కలెక్టరు వరకూ ఎవ్వరైనా వారి మాట వినాల్సిందే! వినకపోతే పంతం నెగ్గించుకునేందుకు మంత్రి, ముఖ్యమంత్రి వరకైనా వెళ్లగలరు! అలా మాట వినని అధికారిని, చివరకు వారు ఉద్యోగ విరమణ చేసినా కక్ష సాధించే వరకూ వదిలిపెట్టరంతే! మరి అలాంటి జన్మభూమి కమిటీల్లో సభ్యుల నియామకంలో మంత్రి అచ్చెన్న మాటే వినకపోతే వదిలేస్తారా? వదలనే వదలరు! రిటైర్డ్ ఎంపీడీవో వి.రామలింగేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యల నిమిత్తం విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులే దీనికి నిదర్శనం! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న నానుడిని నిరూపిస్తూ... సంతకవిటి మండలంలో గౌరీశంకరరావు అనే పంచాయతీ కార్యదర్శిపై ఓ టీడీపీ కార్యదర్శి దాడికి పాల్పడ్డాడు. ఈ దుందుడుకు వైఖరిని నిరసిస్తూ అధికారులు గళమెత్తినా ప్రభుత్వం నుంచి స్పందనే కరువైంది! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార యంత్రాంగంపై దూకు డు పెంచారు. చివరకు దాడులకు తెగబడుతున్నారు. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిపై కర్రపెత్తనం చేయడంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముందువరసలో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పంచాయితీలన్నీ తన స్వగ్రామం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయన హెచ్చరి కలు, బెదిరింపులకు భయపడి సొమ్మసిల్లిపోయిన అధికారులు కూడా ఉన్నారంటే అవి ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోందని ప్రభుత్వ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. పైకి మాట్లాడి తే ఎక్కడ బదిలీ చేస్తారేమోననే భయంతో గొంతు పెగలట్లేదని చె బుతున్నారు. ఇక ఏడాదిన్నర ఓపిక పడితే చాలనే ఆలోచనతోనూ కొం తమంది సరిపెట్టుకుంటున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనానికే సై... గ్రామాల్లో, పట్టణాల్లో జన్మభూమి కమి టీల మాటే పైమాట అవుతోంది. సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేదీ వారే. ఈ విషయంలో మండల, జిల్లాస్థాయి అధికారులు సైతం వారి మాట వినా ల్సిందే. కాదని ముందుకెళ్లలేని పరిస్థితి. ఈ అలుసుతోనే పథకాల నిబంధనలకు సైతం గండి కొడుతున్నారు. తమకు కావాల్సిన వారికి లేదా చేయి తడిపిన వారికి అర్హత లేకపోయినా లబ్ధిదారుల జాబితాలో చోటు ఇచ్చేస్తున్నారు. వారి దుందుడుకు వైఖరి సంక్షేమ పథకాలతోనే ఆగిపోలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. లేదంటే వెంటనే జిల్లాస్థాయి నాయకులకు, కాదం టే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేయడానికి వెనుకాడట్లేదు. ఈ విషయంలో పోలాకి మండలంలోని రహిమాన్‌పురం పంచాయతీ కార్యదర్శి హెచ్ త్రివేణికి ఎదురైన అనుభవమే ఒక ఉదాహరణ. ఓ టీడీపీ కార్యకర్త మరణ ధ్రువీకరణపత్రం విషయంలో తాము చెప్పినట్లు ఇవ్వలేదనే కక్షతో జన్మభూమి కమిటీ సభ్యులు ఆమెపై మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన గత ఏడాది జనవరి 19న ఆమెను నిమ్మాడ క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించారు. అక్కడ బెదిరింపులకు ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన ఆమెను నరసన్నపేట ఆసుపత్రిలో చేర్పిస్తే తేరుకునేసరికి రాత్రి 9 గంటలైన సంగతి అందరికీ తెలి సిందే. ఇలా ఎంత దారుణంగా బెదిరించినా అధికారులు కిమ్మనకుండా వెళ్లిపోతారనే ఉద్దేశంతోనే మంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని స్వగ్రామంలో ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు మంత్రి నిమ్మాడలో ఉంటే ప్రభుత్వాధికారులంతా ఫైళ్లు పట్టుకొని అక్కడికే వెళ్లిపోతున్నారు. దీంతో పేరుకు జిల్లా కేంద్రం శ్రీకాకుళమే అయినా మంత్రి జిల్లాలో ఉన్నన్ని రోజులూ కార్యాలయాన్నీ బోసిపోతున్నాయి. నిమ్మాడలో జరిగే పంచాయతీల్లో ఎక్కువ ఫిర్యాదులు జన్మభూమి కమిటీల నుంచి వచ్చేవే. అలాంటిదే రేగిడి ఆమదాలవలస టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటవేణుగోపాలనాయుడు కూడా గత ఏడా ది మంత్రి అచ్చెన్నకు ఫిర్యాదు చేశారు. మంత్రి సిఫారసు చేసిన వ్యక్తులను సైతం మండలంలోని జన్మభూమి కమిటీల్లో నియమించలేదంటూ ఎంపీడీవో వి.రామలింగేశ్వరరావుపై ఆరోపణలు చేశారు. ఈ తర్వాత రామలింగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేసి వెళ్లిపోయినా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. యంత్రాంగంపై దాడుల పరంపర... ప్రభుత్వ సిబ్బందిపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు జిల్లాలో అనేకం చోటుచేసుకున్నాయి. వాటిలో పోలీసు ఫిర్యాదు వరకూ వచ్చినవి చాలా తక్కువ. రెండ్రోజుల క్రితం సంతకవిటి మండల పరిషత్ కార్యాలయంలో వాసుదేవపట్నం పంచాయతీ కార్యదర్శి వి.గౌరీశంకరరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి రాజు దాడి చేశాడు. ఇది ఏకంగా ఎంపీడీవో చాంబర్లోనే జరిగినా సదరు కార్యకర్తపై తగిన చర్యలు తీసుకోలేదని జిల్లా అంతటా ఆందో ళనలు చోటుచేసుకున్నాయి. పలాస మున్సిపల్ కార్యాలయంలో ఏప్రిల్ 26న ఏకంగా కమిషనర్ జగన్మోహన్రావు పై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, 18వ వార్డు కౌన్సలర్ పాతాళ ముకుంద, 12వ వార్డు కౌన్సలర్ భర్త బళ్లా శ్రీనివా స్లపై కేసు కూడా నమోదైంది. కేవలం రాజకీయ కక్షలతో ఎమ్మెల్యే గౌతు శివాజీ తనపై బనాయించారని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కోత పూర్ణచంద్రరావు చెప్పుకున్నా లాభం లేకపోయింది. వంగర మండలంలో రెండు వారాల క్రితం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావును ఆర్ఐ వెంకటగిరి అడ్డుకున్నందుకు దాడి జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదైనప్పటికీ అధికార పార్టీ నాయకులు నిందితుడివైపే మొగ్గు చూపించడం గమనార్హం. శ్రీకాకుళం మండలం శిలగాం సింగివలస గ్రామ సర్పంచ్ కె.దశరథరావు ఇటీవల ఆ గ్రామ వీఆర్వో, వీఆర్ఏలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో అప్పటి జిల్లా కలెక్టరు లక్ష్మీనరసింహం స్వయంగా ఇరువర్గాలకు రాజీ కుదిర్చాల్సి వచ్చింది. కానీ తర్వాత సర్పంచ్‌కు అదనపు నిధులు కేటాయించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ధోరణితో విసిగిపోయి... టీడీపీ నాయకుల వేధింపులకు తాళలేక కొన్ని నెలల క్రితం నరసన్నపేట మండలం లుకలాం గ్రామ వీఆర్వో మట్ట జోగారావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి అప్పట్లో సంచలనం కలిగించింది. అతను నందిగాం వీఆర్వోగా పనిచేసినప్పుడు టీడీపీ కార్యకర్తలు దొంగ పాసుపుస్తకాల తయారీ కోసం ఒత్తిడి తెచ్చారని, ఆ మాట విననందుకే మంత్రి అచ్చెన్నాయుడికి చెప్పి నరసన్నపేట మండలానికి బదిలీ చేయించారనే ఆరోపణలు వినిపించాయి. బదిలీల వెనుక కక్షసాధింపు... ఎచ్చెర్ల ఎంపీడీవో పంచాది రాధ జిల్లా నీటి యాజమాన్య సంస్థకు డిప్యూటేషన్‌పై వచ్చారు. కానీ ఇటు జెడ్పీ చైర్‌పర్సన చౌదరి ధనలక్ష్మి వర్గం, మరోవైపు మంత్రి కళావెంకటరావు వర్గం మధ్య పోరుతో ఇరువైపుల ఒత్తిళ్లను తట్టుకోలేక బదిలీ చేయించుకున్నారు. తర్వాత పోస్టులోకి వచ్చిన నేతాజీ సైతం డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. జి.సిగడాం మండలంలో మంత్రి కళా వర్గానికి చెందిన నాయకు ల ఒత్తిళ్ల కారణంగా జిల్లా ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడుగా ఉన్న కొత్తకోట హేమసుందర్రావు పంచాయతీరాజ్ విభాగానికి డిప్యూటేషన్‌పై వెళ్లి పోయారు. రణస్థలం ఎంపీడీవో అలివేలు మంగమ్మ కూడా ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్ ఒత్తిడికి తట్టుకోలేక డిప్యూటేషన్‌పై పోలాకి వెళ్లిపోయారు. రణస్థలం ఎస్సై వినోద్‌బాబు స్థానిక టీడీపీ నాయకుడు ఈశ్వరరావు మాట వినలేదని బదిలీ చేయించారు. లావేరు తహశీల్దారు పప్పల వేణుగోపాలరావును మంత్రి కళా అనుచరులు బదిలీ చేయించారు. అప్పటికి వేణుగోపాలరావు జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం నాయకుడు కూడా. తన మాట వినలేదని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కంచిలి మండల వ్యవసాయాధికారి కె.సుకుమార్‌ను వజ్రపుకొత్తూరు మండలానికి బదిలీ చేయించారు. తహశీల్దార్ కళ్యాణచక్రవర్తిని పలాస మం డలానికి పంపిం చారు. ఆయన ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంఈవో బాలకృష్ణ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కవిటి మండలంలో హౌసింగ్ ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సత్యనారాయణ ఇలాంటి అనుభవాలతోనే బదిలీపై వెళ్లిపోయారు. మిగతా నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ నాయకుల వేధింపులు ఇదే స్థాయిలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పాత, కొత్త నేతల మధ్య బిగ్ ఫైట్ షురూ..
► రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కమిటీలు రద్దు ► త్వరలోనే కొత్త కమిటీలంటూ సీఎం ప్రకటన ► ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకే కమిటీల ఏర్పాటు ఒంగోలు: ప్రస్తుతం గ్రామస్థాయిలో ఉన్న జన్మభూమి కమిటీలను రద్దు చేసి వాటి స్థానాల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన అధికార టీడీపీలో మరింత అగ్గి రాజేస్తోంది. కొత్త కమిటీల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న జన్మభూమి కమిటీలన్నీ పాత నేతల ప్రతిపాదనల మేరకే నియమించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిస్తే పాత నేతల పవర్ కట్ అయినట్లే...! రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటిని జన్మభూమి కమిటీల ప్రతిపాదనల మేరకే చేపడుతున్న విషయం తెలిసిందే. పింఛన్లు మొదలుకొని రేషన్ కార్డులు, పక్కా గృహాలు, నీరు–చెట్టు పనులతో పాటు అన్ని రకాల పనులు జన్మభూమి కమిటీలు ద్వారానే ఎంపిక చేస్తున్నారు. దీంతో ఏడాదిన్నరగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు క్షేత్ర స్థాయిలో ఆమోదముద్ర పడటం లేదు. దీంతో వారు నేరుగా ముఖ్యమంత్రి లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్‌ల ద్వారా పింఛన్లు, పక్కా గృహాలు తదితర ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో జన్మభూమి కమిటిలన్నీ పాత నేతల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని దీంతో తమ పనులు కావడం లేదంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచారు. పైగా కమిటీల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఒత్తిడికి తలొగ్గిన ముఖ్యమంత్రి త్వరలోనే పాత జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త కమిటీలను జాబితాలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సైతం చేర్చారు. పాత నేతలు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం కొంత ఆలస్యమైనట్లు తెలుస్తోంది.ఎట్టకేలకు ముఖ్యమంత్రి జన్మభూమి పాత కమిటీలను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పాత కమిటీల స్థానంలో కొత్త కమిటీలను సైతం నెలలోపే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వర్గపోరుకు ఆజ్యం.. సీఎం ప్రకటన జిల్లా టీడీపీలో మరింత వర్గపోరుకు ఆజ్యం పోయనుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, డేవిడ్‌రాజు, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్‌లను అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని పాత నేతలు అన్నా రాంబాబు, దివి శివరాం, కరణం బలరాం, పోతుల సునీతలు ఆదిలోనే తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు కూడా చేశారు. ముఖ్యమంత్రి వీరి అభ్యంతరాలను పట్టించుకోక ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. గిద్దలూరు, అద్దంకి, చీరాలలో పాత, కొత్త నేతల మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. జన్మభూమి కమిటీలు పాత నేతల ప్రతిపాదనల మేరకు ఉండటంతో క్షేత్ర స్థాయిలో తమ వర్గీయుల పనులు కాక ఫిరాయింపు ఎమ్మెల్యేలు పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఈ వివాదం ఇరువర్గాల మధ్య మరిన్ని గొడవలకు దారి తీసింది. అయితే ముఖ్యమంత్రి ఇటీవల ఎమ్మెల్యేలకే నియోజకవర్గ అధికారాలంటూ తేల్చి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వారికే ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని పాత నేతలు జీర్ణించుకోలేకున్నారు. తాజాగా జన్మభూమి కమిటీలను సైతం ముఖ్యమంత్రి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాత నేతల్లో మరింత ఆందోళన నెలకొంది. కొత్త కమిటీలను ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకే ఎంపిక చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వారికే ప్రాధాన్యత ఉంటుంది. వారి అనుచరులకే పనులు జరుగుతాయి. ఇదే జరిగితే పాత నేతల పవర్ కట్ అయినట్లే..! ఇది జిల్లా టీడీపీలో వర్గవిభేదాలను మరింత రచ్చకెక్కిస్తుండటంలో సందేహం లేదు. -
'లంచం ఇస్తేనే అందులో పని జరుగుతోంది'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. రూ. 25వేలు లంచం ఇస్తేనే జన్మభూమి కమిటీల్లో పని జరుగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు మినహా చంద్రబాబు కొత్తగా చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని రఘువీరా రెడ్డి విమర్శించారు. -
తమ్ముళ్ల పెత్తనం ఎక్కువైంది
► అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు ► ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు ► నిరసనగా మండలమీట్ బహిష్కరణ సంజామల: తమ గ్రామాల్లో తెలుగుతమ్ముళ్ల పెత్తనం ఎక్కువైంది. అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో పాటు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా చేస్తున్నారు. ఇలా చేస్తే ఎలా’ అని అధికారపార్టీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. మీ పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిన ఎమ్మెల్యే స్థానిక టీడీపీ నేత స్వగృహానికి వెళ్లాడు. ఎంతసేపటికి ఆయన రాకపోవడంతో 11.45 గంటలకు సభ ప్రారంభమైంది. రెవెన్యూ,వ్యవసాయ శాఖలపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే సభకు వచ్చారు. గ్రామాల్లో అభివృద్ధిని తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటున్నారని, జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాలు అనర్హులకు కట్టబెడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ సమస్యలు ఉంటే సభదృష్టికి తీసుకురావాలని చెప్పగా సభ్యుల ఆమోదంతో ఎంపీపీ చేసిన తీర్మానాలనే అధికారపార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, సభకు వారు ఎక్కడ విలువ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆకుమల్లలో మండల తీర్మానంతో రూ. 8 లక్షలతో రోడ్లు వేసేందుకు పనులు ప్రారంభిస్తే పంచాయతీరాజ్ ఏఈ రామప్ప పనులు నిలుపుదల చేయాలని హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పారన్నారు. ఎమ్మెల్యే చెప్పడంతోనే పనులు నిలిపినట్లు గ్రామంలోని టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఇలా అభివృద్ధిని అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ఎంపీపీ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో కొద్దిసేపు సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారటీడీపీ తీరును నిరసిస్తూ జెడ్పీటీసీ సభ్యులు డి.చిన్నబాబు,మండల ఉపాధ్యక్షురాలు సక్ష్మివుశేనమ్మ, సభ్యులు అన్నపూర్ణాభాయి, రాజేశ్వరమ్మ,పార్వతమ్మ,శ్రీనివాసులు, కోఆప్సన్ సభ్యులు మగ్బుల్ ఉశేన్ తదితరులు సభను బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. తిరిగి గంట తర్వాత సభను ప్రారంభించగా సభ్యులెవరూ రాకపోవంతో ఎంపీపీ సభను మరుసటిరోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వ్యుహరచనతో సభకు హాజరైన ఎమ్మెల్యేకు భంగపాటు ఎదురైంది. -
జన్మభూమి కమిటీలపై బాబు అసంతృప్తి !!
విజయవాడ: జన్మభూమి కమిటీల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడలో శనివారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేసే కమిటీలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అధికారం చేపట్టిన రెండేళ్ల నుంచి అన్ని ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపికను ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు అప్పగించింది. జిల్లాల నుంచి ఆ కమిటీలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. జన్మభూమి కమిటీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదే విధంగా టీడీపీ జిల్లా ఇంఛార్జ్ ల పనితీరుపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా ఇంఛార్జ్ లు బాధ్యతలు తీసుకోవడంలేదని.. మొక్కుబడిల వ్యవహరించవద్దని నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంఛార్జ్‌లకు బాధ్యతలు అప్పగించడం వల్ల పథకాలు లబ్దిదారులకు అందుతాయని మంత్రులు చంద్రబాబుకు సూచించారు. దీంతో విపక్షాల విమర్శలు, కోర్టు కేసుల నేపథ్యంలో కమిటీలు రద్దు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. -
‘చంద్ర’గ్రహణం వీడేదెప్పుడో..!
►అందుకోసమే ఎదురుచూస్తున్నాం ► కేంద్ర పథకాల్లో జన్మభూమి కమిటీ పెత్తనమా? ► మా పార్టీని అణగదొక్కే కుట్ర జరుగుతోంది ► బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య రాయవరం : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందకూడదనే కుట్ర జరుగుతోందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తెలిపారు. గురువారం ఆయన స్థానిక పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ స్వయం సిద్ధంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు. దేవాలయ పాలక మండలిలో బీజేపీ నేతలను నామినేట్ చేయాలని స్వయంగా దేవాదాయ మంత్రి సూచించినా ఫలితం లేకపోయిందన్నారు.ఐరాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో నడుస్తున్నామన్నారు. టీడీపీలో తెగతెంపులు చేసుకుంటున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘చంద్ర’ గ్రహణం వీడే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మోదీ పాలనకు ఆకర్షితులై జిల్లాలో నాలుగు లక్షల మంది ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్నారన్నారు. రాష్ర్టంలో నిరంకుశ పాలన.. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కూడా జన్మభూమి కమిటీలు అధికారం చెలాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తుంటే కనీసం పంచాయతీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటం పెట్టక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అవసరమైతే రోడ్డెక్కక తప్పదు.. కేంద్ర ప్రభుత్వ పథకాల నిష్పాక్షిక అమలుకు అధికారులతో తాడోపేడో తేల్చుకుంటామని, అవసరమైతే రోడ్డెక్కక తప్పదన్నారు. ముద్ర రుణాల మంజూరుకు బ్యాంకులు సహకరించడంలేదన్నారు. వచ్చే నెల ఆరవ తేదీన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాట్రాతి జానకిరాంబాబు, బీజేపీ నేతలు నరాల రాంబాబు, వెలగల సత్తిరెడ్డి, గేలం సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే పదవులు తాకట్టు పెట్టారు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి వెంకటాచలం(ముత్తుకూరు) : వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులను తాకట్టుపెట్టి టీడీపీలో చేరారని, భవిష్యత్తులో ఇటువంటి ఫిరాయింపుదారులకు పుట్టగతులు ఉండవని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాచలం మండలంలోని కంటేపల్లి ఎస్టీకాలనీ, గంగిరెద్దులకాలనీల్లో రూ.16 లక్షలతో నిర్మించిన రెండు సిమెంట్ రోడ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టీకాలనీలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేస్తున్నందున టీడీపీలో చేరామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చేసే పార్టీలో ఏం అభివృద్ధి కనిపించి చేరారని ఎద్దేవా చేశారు. ప్రతిష్ట కలిగిన పార్టీలో ఉండలేక ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు తూట్లు పొడిచి టీడీపీలో చేరి పరువు పోగొట్టుకుంటున్నారన్నారు. పార్టీ మారి చేరే ఎమ్మెల్యేలకు టీడీపీలో కనీస గౌరవం ఉండదన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన టీడీపీ మునిగిపోయే నావన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఛీత్కరించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, సర్పంచ్ శాంతి, ఎంపీటీసీ సభ్యులు వెంకమ్మ, ఎంపీడీఓ సుగుణమ్మ, తహశీల్దార్ సుధాకర్, నాయకులు కనుపూరు కోదండరామిరెడ్డి, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, కరియావుల చెంచుకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
'ఆ నివేదిక తర్వాతే కాపు రిజర్వేషన్ల అంశం'
పశ్చిమ గోదావరి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రేపు (గురువారం) కాపు రుణమేళా నిర్వహిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 25వేల మందికి 192 కోట్ల రూపాయల రుణాలు అందజేస్తామని చెప్పారు. బుధవారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. మంజునాధ నివేదిక తర్వాతే కేంద్రం దృష్టికి కాపుల రిజర్వేషన్ల అంశం తీసుకెళ్తామని అన్నారు. కాపు కార్పొరేషన్ లబ్దిదారులను జన్మభూమి కమిటీలే ఎంపిక చేస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. -
జన్మభూమి కమిటీలపై న్యాయపోరాటం: బొత్స
పాలకొండ (శ్రీకాకుళం): జన్మభూమి కమిటీలపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కోర్టును ఆశ్రయించినట్టు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జన్మభూమి కమిటీల వల్ల అన్యాయానికి గురైనవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొస్తే వారి తరఫున పార్టీయే న్యాయ పోరాటం చేస్తుందన్నారు. -
‘సాగు’ సమరం!
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే గెలుపుకోసం టీడీపీ నాయకులు ఎవరి స్థాయిలో వారు వ్యూహరచన ప్రారంభించారు. సాగునీటి సంఘాల ఎన్నికల చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఏకాభిప్రాయంతో నీటిసంఘాల కార్యవర్గాన్ని ఎన్నుకునేలా సవరణ జరగడంతో ఏకాభిప్రాయం కోసం పోటీపడడం ప్రారంభమైంది. గత నెల నుంచి ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఓటర్ల జాబితాను యథాతథంగా కొనసాగించారు. చెరువు ఆయకట్టుదారుల సర్వసభ్య సమావేశాలు హడావుడిగా నిర్వహించే ప్రయత్నాలు జిల్లావ్యాప్తంగా సాగుతున్నాయి. మేజర్, మీడియం, మైనర్ సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో 753 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 8 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 4 ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1987 చట్టాన్ని సవరిస్తూ జీఓ నంబరు 528ను ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఎన్నికల నిమిత్తం లేకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి పాలక మండలి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, నలుగురు సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తమ్ముళ్ల మల్లగుల్లాలు ఓటర్ల జాబితాల నుంచి సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు జరిగే తంతుపై పట్టుకోసం తమ్ముళ్లు ప్రయత్నం సాగిస్తున్నారు. నీరు-చెట్టు పథకంలో జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం నడిపించినట్లే, ఈసారి కూడా అధికారదర్పంతో ఈ ఎన్నికలను తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసే నీటి సంఘాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, ఎన్నికలు ఏకగ్రీవం కావాలనే నిబంధనలకు తమ్ముళ్లు నీళ్లొదిలే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏకగ్రీవం పేరుతో నీటిసంఘాల్లో పూర్తిగా అధికారపార్టీ ఆధిపత్యం ప్రదర్శించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. గ్రామస్థాయిలో ఈ ఎన్నికలు మళ్లీ రాజకీయ వేడిని రేపాయి. ఈనెల 14 వరకు జిల్లావ్యాప్తంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి సంఘాల పాలకమండలిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏఈలను, తహశీల్దార్లను ఆయా ప్రాంతాల ఎన్నికల అధికారులుగా నియమించారు. ఈనెల 10వ తేదీన 361 వినియోగదారుల సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. గత 4న 300 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈనెల 14 నుంచి 19వ తేదీలోపు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఒక ప్రాజెక్ట్ కమిటీ, 8 డిస్ట్రిబ్యూటర్ కమిటీలకు, 18న రెండు ప్రాజెక్ట్ కమిటీలకు, 19న ఒక ప్రాజెక్ట్ కమిటీకి ఎన్నికలు జరుగునున్నాయి. పకడ్బందీగా ఎన్నికలు: ఎస్ఈ రెడ్డయ్య సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. 740 మంది ఏఈలను, ఆ మండల తహశీల్దార్లను ఎన్నికల అధికారులను నియమించాం. ప్రాజెక్ట్ కమిటీల ఎన్నికలను ఈఈలు, ఎస్ఈలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఈనెల 20వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తాం. -
పరేషాన్
- రేషన్‌కార్డుల కోసం అర్జీదారుల ఎదురుచూపులు - ఆధార్ పేరుతో 2 లక్షల మందికి ఎగనామం - 1.24 లక్షల మందికిపైనే మొత్తం దరఖాస్తులు - వెబ్‌లో అప్లోడ్ చేసింది 96 వేలేరేషన్కార్డుల కోసం జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. - మార్పులకు సైతం తప్పని తిప్పలు ఒంగోలు: రేషన్‌కార్డుల కోసం జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 54 వేల మంది దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు 53 వేలకుపైగా ఉన్న కార్డులను సైతం తొలగించేశారు. జన్మభూమి కమిటీల ద్వారా దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడు కార్డులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటినా 1.24 లక్షల మంది అర్జీదారులకు కార్డులు మంజూరు చేయలేదు. ఏడాదిలోనే ఊహించని మార్పు: జిల్లాలో ఎన్నికలకు ముందు 8,89,593 బీపీఎల్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉండేవి. ఎన్నికలు వచ్చేనాటికి జిల్లాలో 20,715 రేషన్‌కార్డుదారుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అవి కాకుండా ఎన్నికలకు ముందుగా మరో 33,772 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. మొత్తంగా వాటి సంఖ్య 54,487. కానీ తెలుగుదేశం పార్టీకి అధికార పగ్గాలు చేతికి రావడంతోనే వాటన్నింటినీ పక్కన పెట్టేసింది. 8,89,593 కార్డుల్లో దాదాపు 26 లక్షల మంది సభ్యులు ఉండేవారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ ప్రారంభించి 2 లక్షల మందికి తిలోదకాలు ఇచ్చింది. అంతే కాకుండా 20 వేల కార్డులను కూడా ఆధార్ అనుసంధానించలేదంటూ తిరస్కరించారు. ప్రస్తుతం ఉన్న కార్డులు కేవలం 8,36,061 మాత్రమే. వీటిలో 23 లక్షల మంది సభ్యులకే ఆధార్ అనుసంధానమైంది. ఇంకా దాదాపు 70 వేల మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. మిగులుపైనే దృష్టి: ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి వాటిని ఎలా అమలు చేయాలో అర్థంకాని టీడీపీ సర్కారు ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను ఏదో ఒకవిధంగా సంక్షోభంలోకి నెట్టేసేందుకు పడరాని పాట్లు పడుతోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో సైతం రేషన్ సరుకులకు కోత పడింది. అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ-పాస్ మెషీన్లు ఏర్పాటుచేసి దందాను అరికడుతున్నామని ప్రకటించారు. ఈ-పాస్ ద్వారా ఇప్పటికే నెలకు రూ.75 లక్షలు మిగులుతుందంటూ ప్రకటిస్తున్న అధికారులు కనీసం ఆ మొత్తాన్ని వెచ్చించి అయినా రేషన్ దుకాణాలలో సరుకులను పెంచి పేద కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు చర్యలు చేపట్టకపోతుండడం గమనార్హం. 1.24 లక్షల మందికి తిప్పలు: జిల్లాలో జన్మభూమి కమిటీల ద్వారా 1,24,713 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని భంగపడిన వారు కూడా ఉన్నారు. రెండోసారి అయినా దరఖాస్తు చేసుకుంటే కార్డు వస్తుందనుకున్న వారి ఆశలు అడియాసలుగానే ఉండిపోయాయి. అయితే వీరిలో కూడా ఇప్పటి వరకు కేవలం 96,134 కార్డులను మాత్రమే తహశీల్దార్లు వెబ్‌లో అప్లోడ్ చేశారు. మిగిలిన అర్జీలకు జన్మభూమి కమిటీల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో దాదాపు 28,579 దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు రావనే చెప్పవచ్చు. డీలర్లపై దయ...వృద్ధులపై నిర్దయ రేషన్ డీలర్లను ప్రభుత్వం దయతలిచింది. రేషన్ డీలర్, అతని కుటుంబ సభ్యులే కాకుండా ఇంకా అతనికి సంబంధించిన వారెవరైనా వేలిముద్రలు ఈపాస్ మెషీన్లో అనుసంధానం చేసే అవకాశం కల్పించింది. దీనివల్ల బినామీలు సైతం తమ వేలిముద్రలను పొందుపరుచుకున్నారు. కానీ 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నపిల్లలు వికలాంగులుగా ఉన్న కుటుంబాలలో రేషన్ తీసుకోవాలంటే వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈపాస్ మెషీన్లో వారి వేలిముద్రలు తప్పనిసరి కావడంతో వయోభారంతో వారు నానా తిప్పలు పడుతున్నారు. గతంలో ఎవరో ఒకరు రేషన్ తీసుకువచ్చి ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో చాలామంది రేషన్ తీసుకోవడానికి సైతం వెళ్లలేక పోతున్నారు. కనీసం 60 ఏళ్ల వయస్సు దాటిన వారి పట్ల, వికలాంగుల పట్ల కనికరం చూపి వారి అవస్థలకు స్వస్తి చెప్పాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్పులకు సైతం తిప్పలే ఇక రేషన్ కార్డుల సంగతి అలా ఉంచి కనీసం ఉన్న కార్డులలో మార్పులకు సైతం వెబ్సైట్ అంగీకరించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వెబ్సైట్లో మార్పులకు అవకాశం లేకుండా పౌరసరఫరాలశాఖ కమిషన్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. - ఒక ప్రాంతంలోని వ్యక్తి మరో ప్రాంతానికి బదిలీ అయితే చిరునామా మార్చుకోవచ్చు. కానీ వెబ్సైట్ అందుకు అంగీకరించడం లేదు. - కార్డు పొరపాటున పోతే తిరిగి ఆ కార్డు పొందడానికి సైతం వెబ్సైట్ అంగీకరించడం లేదు. గతంలో డూప్లికేట్ కార్డులను ఈ-సేవ, మీ-సేవల ద్వారా పొందే సౌకర్యం ఉండేది. - కొత్తగా పుట్టిన పిల్లల పేర్లను కార్డుల్లో నమోదు చేయించాలంటే అందుకు వెబ్ ఆప్షన్ అంగీకరించని పరిస్థితి. ఆధార్‌లో తప్పులు దొర్లినందువల్ల వాటిని చాలామంది ఎడిట్ చేయించుకున్నారు. అయితే వారివి గానీ, కొత్తగా దిగిన వారి వివరాలుగానీ ప్రభుత్వ వెబ్సైట్లలో ఉండకపోతుండడంతో ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ ఫలాలను అందుకోలేని పరిస్థితి. - మండల కార్యాలయాల్లో ఆధార్ సీడింగ్ జరగకపోతుండడంతో చాలామంది ఆధార్‌నమోదు చేయించుకోలేకపోతున్నారు. అయితే పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం ఆధార్ సీడింగ్ జరుగుతుందని, అక్కడ చేయకపోతే జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయానికి వస్తే ఫీడ్ చేస్తామని చెబుతుండటం గమనార్హం. -
కలగా సొంతగూడు
మచిలీపట్నం : పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనపడటం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా గృహ నిర్మాణంపై దృష్టి సారించడం లేదు. గతంలో నిర్మించిన గృహాలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకుండా ఏడాదిగా పెండింగ్‌లోనే పెట్టారు. ఒక్కొక్క పక్కా గృహం నిర్మాణ వ్యయాన్ని రూ.1.50 లక్షలకు పెంచినట్లు ప్రకటించడమే తప్ప ఈ ఏడాది కాలంలో ఒక్క ఇంటికీ అనుమతులు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైఖరితో పేదలు గుడిసెల్లోనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో నిర్మించిన ఇళ్లకైనా బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. గృహం నిర్మిం చుకున్న వారు బిల్లుల కోసం, దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం గృహనిర్మాణ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రభుత్వం కరుణించడం లేదు. గతంలో నిర్మించిన గృహాల్లో అవకతవకలు జరిగాయని, వాటిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తున్నామని చెప్పడం తప్ప నూతన గృహాల నిర్మాణానికి ఎప్పటికి అనుమతులు వస్తాయో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. గుడిసెలు లేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత నూతన గృహాల మంజూరు ఇవ్వకుండా ఏడాది కాలంగా పేదల సహనానికి పరీక్ష పెడుతున్నారు. చెల్లించాల్సిన బిల్లులు రూ.12.44 కోట్లు 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి టీడీపీ అధికారం చేపట్టే నాటికి జిల్లాలో 1,80,171 గృహాలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 1,57,231 గృహాలు పూర్తయ్యాయని నమోదయ్యాయి. వివిధ దశల్లో ఉన్న గృహాలు 22,940 ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వివిధ దశల్లో ఉన్న వాటిలో పునాదికి దిగువస్థాయిలో 3622, పునాది స్థాయిలో 11,870, లెంటల్ స్థాయిలో 1,785, రూఫ్ లెవల్లో 5,663 గృహాలు ఉన్నట్లు గృహనిర్మాణశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటికి ఆయా దశలను బట్టి బిల్లులు చెల్లిం పుల కోసం రూ.12.44 కోట్లు అవసరమవుతాయని ఈ నిధులను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ప్రభుత్వానికి చేరడమే తప్ప నగదు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇందిరా అవాస్‌యోజన ద్వారా 6,056 గృహా లను నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు. జియో ట్యాంగింగ్ పేరుతో జాప్యం జిల్లాలో గృహనిర్మాణంలో అవకతవకలు జరిగాయని, వాటిని జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి ఈ సమాచారాన్ని శాటిలైట్‌కు అనుసంధానం చేస్తున్నామని పాలకులు చెబుతూ వస్తున్నారు. ఇంకా 13,288 గృహాలకు సంబంధించిన వివరాలను జియో ట్యాగింగ్ పద్ధతికి అనుసంధానం చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2004వ సంవత్సరం నుంచి ప్రారంభమై పూర్తయిన గృహాలతో పాటు వివిద దశల్లో ఉన్న గృహాలకు సంబంధించి లబ్ధిదారుల ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా జిల్లాలో 25,922 గృహాలకు సంబంధించిన ఆధార్ నంబర్లను సీడింగ్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జియో ట్యాంగింగ్, ఆధార్ అనుసంధానం ప్రక్రియలు ఎప్పటికి పూర్తవుతాయనేది అధికారులకే తెలియాలి. జన్మభూమి కమిటీలు పరిశీలించాకే బిల్లులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గృహాల బిల్లులు చెల్లింపు ప్రకియను జన్మభూమి కమిటీలు పరిశీలించాకే చేపడతామని ప్రకటించింది. ఇందుకోసం గ్రామ, మండల, మునిసిపాటిటీ స్థాయిలో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించి నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా జాప్యం చేయడం గమనార్హం. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో, అనుమతులు ఇచ్చే అంశంలో సాచివేత ధోరణితో వ్యవ హరిస్తుండటంతో పేదలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నూతన గృహాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సంగతి ఎలా ఉన్నా గ్రామాలు, పట్టణాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు తాము సూచించిన వారికే గృహాలు మంజూరవుతాయని హడావుడి చేస్తూ దరఖాస్తుదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. -
కూలిపనులకూ కోత
- 100 పనిదినాలు ఉత్తమాటే - ఏడాదిగా కొత్త జాబ్కార్డుల్లేవు - వలస బాటలో కూలీలు - జన్మభూమి కమిటీలదే పెత్తనం జాతీయ ఉపాధి హామీ పథకం ఓటుబ్యాంకు రాజకీయాలకు బలైపోతోంది. ఒక ప్పుడు అడిగిన వారందరికీ ఉపాధి చూపించే ఈ పథకం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం హయాంలో నీరుగారిపోతోంది. పనులు కల్పించే వాళ్లు మన వాళ్లేనా?..పనులు చేసే వాళ్లు మన వాళ్లేనా? అని చూసి మరీ పనులు కల్పించే దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది.దీంతో ఏడాదిగా ఏ ఒక్కరికి కొత్తగా జాబ్‌కార్డుల ఇవ్వక పోగా..ఉన్న కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కూడా కల్పించలేని దుస్థితి ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం : జాతీయ ఉపాధి హామీ పథకం..జాతీయ ప్రయోజనాలతో ఏర్పడిన పథకం. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకాన్ని తమకనుకూలంగా మల్చుకునేందుకు టీడీపీ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి పథకరచన చేస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పార్టీకి అనుకూలంగా పనిచేయ లేదనే సాకుతో కొంతమందిని పని గట్టుకుని మరీ సాగనంపింది. వారి స్థానంలో తమ తాబేదార్లకు నియమించేందుకు ఎంపిక బాధ్యతను పూర్తిగా జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టింది. ఇక ఉపాధి పనుల ఎంపిక బాధ్యతను కూడా ఈ కమిటీలకే అప్పగించింది. దీంతో ఏ గ్రామంలో తమకు ఎక్కువగా ఓట్లు వచ్చాయి.. ఎక్కడ రాలేదు...అని బేరీజు వేసుకుంటూ మరీ పనుల గుర్తింపు జరుగుతోందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్ధమవుతుంది. ఇక కూలీలకు పనుల కల్పనలో కూడా ఇదే విధానం కొనసాగుతుందని కూలీలు ఆరోపిస్తున్నారు. పొట్టనింపని ‘ఉపాధి' విశాఖ గ్రామీణ జిల్లాలోని 39 మండలాల్లో అమలవుతోంది. ఈ పథకం కింద 5.92 లక్షల జాబ్‌కార్డులుండగా, వాటిలో 13.43లక్షల మంది కూలీలున్నారు. వీటిలో 3.34 లక్షల యాక్టివ్జాబ్కార్డ్స్ ఉంటే 6.34లక్షల మంది కూలీలున్నారు. ప్రతి ఏటా డిసెంబర్లో ఉపాధి పనులు ప్రారంభమవుతుంటాయి. సీజన్లో సరాసరిన నాలుగున్నర లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తుంటారు. ప్రతి ఏటా రెండు లక్షల వరకు పని దినాలు కల్పిస్తుంటారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు 87.32లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. ప్రతి కుటుంబానికి కేవలం 34 రోజుల పని దినాలు మాత్రమే కల్పించారు. అదే టీడీపీ సర్కార్ రాక ముందు 60 రోజులకు పైగా పనిదినాలు కల్పించే వారు. వంద రోజుల పనిదినాలు 2012-13లో 73వేల మందికి కల్పిస్తే 2013-14లో 65,922 మందికి కల్పించారు. ఇక గతేడాది 59వేల మందికి కల్పిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 1472 మందికి మాత్రమే కల్పించారు. కూలికీ బకాయిలు... ప్రస్తుత సీజన్లో సగటున కూలీలకు రూ.50లోపే వేతనం గిడితే.. గరిష్టంగా రూ.80కి మించి రావడం లేదు. మరొక పక్క కూలీలకు రూ.35కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఒక పక్క ఉపాధి పనులు, మరొక పక్క వ్యవసాయ పనుల్లేక పోవడంతో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు వలసబాట పడుతున్నారు.అనకాపల్లి మండలం కూండ్రం పరిసర ప్రాంతాలకు చెందిన 200 మంది ఉపాధి కూలీలు చెన్నైకి వలస పోయారు. నర్సీపట్నం మండలం పెదఉప్పరగూడెంలో 100 కుటుంబాలు, బుచ్చెయ్యపేట , చోడవరం, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన 500 మంది చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. నాతవరం మండలం మాధవనగరం, బుచ్చంపేట, రావాన్నపాలెం గ్రామాల నుండి 600 మంది, గొలుగొండ మండలం పేటమాలపల్లి, జోగంపేట, పాతమల్లంపేట గ్రామాల నుండి 700 మంది వరకు వలస వెళ్తున్నారు. -
కొత్త పింఛన్లకు మోకాలడ్డు
- జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేస్తేనే.. - సగానికిపైగా కోత - క్లియరెన్స్ ఇవ్వని ఆర్థికశాఖ సాక్షి, విశాఖపట్నం: ఏడాదిగా కొత్తగా ఒక్కటంటే ఒక్క పింఛన్ ప్రభుత్వం మంజూరు చేసిన పాపానపోలేదు. గతేడాది రెండు విడతల్లోనిర్వహించిన జన్మభూమి, మావూరు కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులను అధికారులు వడపోసి అర్హులను ఎంపిక చేశారు. వాటిని కమిటీల ఆమోదముద్ర కోసం పెండింగ్ ఎట్ గవర్నమెంట్ అంటూ పక్కన పెట్టేశారు. దీంతో తమకు పింఛన్లు అందుతాయో లేదో కూడా తెలియక వందలాది మంది ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం 3,03,875 పింఛన్లు ఉండగా, గతంలో తొలిగించిన పింఛన్లలో రోల్‌బ్యాక్ కింద మే నుంచి 4,725మందికి. పునరుద్ధరించగా, జూన్ నెల నుంచి మరో839రోల్‌బ్యాక్ పింఛన్లు పునరుద్ధరించనున్నారు. కాగా కొత్త పింఛన్ల కోసం రూరల్ పరిధిలోనే అత్యధికంగా 3,41,826 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో తొలి విడతలో కొత్త పింఛన్ల కోసం 36,550 మంది అర్హులుగా గుర్తించి అధికారులు అప్లోడ్ చేశారు. వీటిని తిరిగి పరిశీలనకు జన్మభూమి కమిటీలకు ప్రభుత్వం పంపింది. వీరిలో ఎవరు గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేశారు...ఎవరు తమ పార్టీకి సానుభూతిపరులు ఎవరు అన్నది వడపోసి చివరకు 17,414 మందిని లెక్కతేల్చారు. వీరికి పింఛన్లు మంజూరుచేయవచ్చునంటూ జన్మభూమి కమిటీలు ఆమోద ముద్ర వేశాయి. మిగిలిన 19,136 అర్హులే అయినప్పటికీ వారంతా టీడీపీ అనుకూలురు కాదంటూ అనర్హులుగా ప్రకటించి రిజక్ట్ చేశారు. జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన 17,414 మందికి కొత్త పింఛన్ల జారీ కోసం గతనెలలోనే ప్రభుత్వానికి నివేదించింది. ఇక జీవీఎంసీ పరిధిలో రోల్‌బ్యాక్ పింఛన్లతో కలిపి ప్రస్తుతం 62వేలు ఉండగా,13వేల మంది దరఖాస్తు చేసుకోగా,వాటిలో కొత్త పింఛన్ల కోసం 7456 మందిని అర్హులుగా అధికారులు గుర్తిస్తే జన్మభూమి కమిటీలు 6006 మందికే ఆమోద ముద్ర వేశారు. ఇలా జన్మభూమి కమిటీలు ఆమోద ముద్ర వేసిన 23,420 పింఛన్లను జూన్ ఒకతో తేదీ నుంచి పంపిణీచేయాల్సి ఉంది. కానీ రాష్ర్ట ఆర్థిక శాఖ వీటి మంజూరు విషయంలో ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో మంజూరైన వారంతా కళ్లల్లో ఒత్తులేసుకుని మరికొంతకాలం నిరీక్షించక తప్పని పరిస్థితి. ఇలా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో రూ.3.54లక్షల మంది పింఛన్ల కోసందరఖాస్తు చేసుకుంటే అధికారులు పార్టీలకతీతంగా 44వేల మంది అర్హులుగా తేలిస్తే జన్మభూమి కమిటీలు వాటిలో 20వేల మందికి కోత పెట్టి కేవలం 24వేల మందికి మాత్రమే సిఫారసు చేశారు. ఒక్క పింఛన్ల విషయంలోనే కాదు..ఈ కమిటీలు వేలుపెట్టని శాఖంటూ లేదనే చెప్పాలి. ఇలా జన్మభూమి కమిటీల వ్యవస్థ సమాంతర అధికార వ్యవస్థగా వేళ్లూను కుంటుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అధికార యంత్రాంగానికి భవిష్యత్‌లో చేష్టలుడిగే పరిస్థితి ఏర్పడుతుంది. -
జన్మభూమి కమిటీల్లో రౌడీలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం ప్రశ్నోత్తరాలతో దద్దరిల్లింది. వృద్ధాప్య, వితంతు పింఛన్ల విషయంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని, అర్హులకు వాటిని అందించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణ మండిపడ్డారు. జన్మభూమి కమిటీల్లో రౌడీ షీటర్లను నియమించారని ధ్వజమెత్తారు. మరోపక్క, ప్రభుత్వాధికారులు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వక్కర్లేదన్న విప్ రవి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే శివాజీ విరుచుకుపడ్డారు. -
గ్యాస్ కనెక్షన్ల జాతర
♦ ఎంపికలోనూ మారని తీరు ♦ జన్మభూమి కమిటీలదే పెత్తనం ♦ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి ఒకవైపు ఉచితం..మరొక వైపు దీపం..జిల్లాకు గ్యాస్ కనెక్షన్లు భారీ సంఖ్యలో మంజూరయ్యాయి. అదేస్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. కానీ వీటి ఎంపికలో మాత్రం ఒక వైపు జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తుంటే..మరొక వైపు అధికారులు, కమిటీలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాకు సామాజిక బాధ్యత పథకం(సీఎస్ఆర్) కింద 1.2లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం సంకల్పించింది. ఉచిత కనెక్షన్ల కోసం ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ,ఇతర మున్సిపాల్టీలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 1,17,171 దరఖాస్తులను ఏఎస్వో, సీఎస్డీటీలు పరిశీలించారు. ఇంకా 54,210 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. 1132 దరఖాస్తులను తిరస్కరించారు. ఏజెన్సీ పరిధిలో 42,910 దరఖాస్తులకు15,735 దరఖాస్తులను ఆమోదించారు. సాంకేతికకారణాలతో ఉన్నతాధికారులకు సిఫారసు చేసిన దరఖాస్తులు 14,347 ఉన్నాయి. ఏఎస్వో, సీఎస్డీటీలు అప్రూవ్ చేసిన 59,376 దరఖాస్తుదారులకు ఇప్పటికే వారి సెల్‌ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు కూడా పంపుతున్నారు. వారికి ఏ ఏజెన్సీ పరిధిలో గ్యాస్కనెక్షన్ మంజూరైంది..ఎప్పటిలోగా తీసుకోవాలన్నది తెలియజేస్తూ ఈ మెసేజ్‌లు వస్తున్నాయి. వీటి విషయంలో జా యింట్ కలెక్టర్ జనార్దనన్ నివాస్ ప్ర త్యేక శ్రద్ధతో 60శాతం ఎంపిక పారదర్శకంగానే సాగింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు స్థానిక అధికారులు ఆన్లైన్లో వారే స్వయంగా దరఖాస్తులను అప్లోడ్ చేసి ఆమోదించారన్న వాదన ఉంది. గ్యాస్కనెక్షన్లేకపోవడం..తెలుపుకార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండడం దీనికి ప్రామాణికంగా పెట్టారు. జిల్లాలో కార్డులు...వాటి పరిధిలో ఉన్న యూనిట్ల సంఖ్యను బట్టి చూస్తే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వేలాది మందికితెలుపుకార్డులున్నాయి. దీంతో పలువురు అధికారుల అండదండలతో ఉచిత కనెక్షన్లు పొందినట్టు తెలుస్తోంది. ఇలా సుమారు 30 శాతం పక్కదారి పట్టే పరిస్థితి చోటుచేసుకుంది. నెలాఖరులోగా ఉచితగ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపికతో పాటుమంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం జిల్లాకు 25వేల దీపం కనెక్షన్లను మంజూరు చేసింది. నర్సీపట్నానికి 3,500, అనకాపల్లి, చోడవరానికి 1500 చొప్పున, యలమంచలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాలకు వెయ్యేసి చొప్పున అదనంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత కనెక్షన్ల జారీ కొంత వరకు పారదర్శకంగా జరిగిన ప్పటికీ దీపం కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక మాత్రం అంతాలోపభూయిష్టంగా సాగుతోంది. ఇది తెలుగుతమ్ముళ్లకు వరంగా మారింది. పేరుకు ఏఎస్వో,రెవెన్యూఅధికారులకు ఎంపిక బాధ్యత ఇచ్చినప్పటికీ జన్మభూమి కమిటీల ఆమోదంతోనే ఎంపిక చేయాలన్న మెలికతో పెత్తనమంతా వారి చేతిలో పెట్టినట్టయింది. మార్చి నెలాఖరులోగానే వీటి ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ఎంపికలో చోటు చేసుకుంటున్న రాజకీయాల వల్ల తీవ్ర జాప్యంజరుగుతోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలకు జన్మభూమికమిటీలు ఆమోద ముద్ర వేస్తుండడంతో అధికారుల ఎంపిక చేసిన జాబితాలు బుట్టదాఖలవుతున్నాయి. జన్మభూమి కమిటీల మితిమీరిన జోక్యం వల్ల అధికారులుతీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్హత ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే చెప్పారు.. చేయాల్సిందే దోరణిలో ఈ కమిటీలు పెత్తనంతో ఎంపికలో అధికారులు మిన్నకుండిపోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలన్న పట్టుదలతో అధికారులు పనిచేస్తున్నప్పటికీ కమిటీలు గంటకో జాబితాతో గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు అధికారులు ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పరిహారం పంపిణీ పర్యవేక్షణాధికారం జన్మభూమి కమిటీలకు పై చర్చ
-
పరిహారం పంపిణీ పర్యవేక్షణాధికారం జన్మభూమి కమిటీలకు