పరేషాన్ | People waiting for rationcards | Sakshi
Sakshi News home page

పరేషాన్

Published Mon, Aug 31 2015 2:34 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

పరేషాన్ - Sakshi

పరేషాన్

- రేషన్‌కార్డుల కోసం అర్జీదారుల ఎదురుచూపులు
- ఆధార్ పేరుతో 2 లక్షల మందికి ఎగనామం
- 1.24 లక్షల మందికిపైనే మొత్తం దరఖాస్తులు
- వెబ్‌లో అప్‌లోడ్ చేసింది 96 వేలేరేషన్‌కార్డుల కోసం జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.
- మార్పులకు సైతం తప్పని తిప్పలు
ఒంగోలు:
రేషన్‌కార్డుల కోసం జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 54 వేల మంది దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు 53 వేలకుపైగా ఉన్న కార్డులను సైతం తొలగించేశారు. జన్మభూమి కమిటీల ద్వారా దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడు కార్డులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటినా 1.24 లక్షల మంది అర్జీదారులకు కార్డులు మంజూరు చేయలేదు.  
 
ఏడాదిలోనే ఊహించని మార్పు: జిల్లాలో ఎన్నికలకు ముందు 8,89,593 బీపీఎల్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉండేవి. ఎన్నికలు వచ్చేనాటికి జిల్లాలో 20,715 రేషన్‌కార్డుదారుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అవి కాకుండా ఎన్నికలకు ముందుగా మరో 33,772 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. మొత్తంగా వాటి సంఖ్య 54,487. కానీ తెలుగుదేశం పార్టీకి అధికార పగ్గాలు చేతికి రావడంతోనే వాటన్నింటినీ పక్కన పెట్టేసింది.
 
8,89,593 కార్డుల్లో దాదాపు 26 లక్షల మంది సభ్యులు ఉండేవారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ ప్రారంభించి 2 లక్షల మందికి తిలోదకాలు ఇచ్చింది. అంతే కాకుండా 20 వేల కార్డులను కూడా ఆధార్ అనుసంధానించలేదంటూ తిరస్కరించారు. ప్రస్తుతం ఉన్న కార్డులు కేవలం 8,36,061 మాత్రమే. వీటిలో 23 లక్షల మంది సభ్యులకే ఆధార్ అనుసంధానమైంది. ఇంకా దాదాపు 70 వేల మందికి ఆధార్ అనుసంధానం కాలేదు.  
 
మిగులుపైనే దృష్టి: ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి వాటిని ఎలా అమలు చేయాలో అర్థంకాని టీడీపీ సర్కారు ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను ఏదో ఒకవిధంగా సంక్షోభంలోకి నెట్టేసేందుకు పడరాని పాట్లు పడుతోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో సైతం రేషన్ సరుకులకు కోత పడింది. అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ-పాస్ మెషీన్లు ఏర్పాటుచేసి దందాను అరికడుతున్నామని ప్రకటించారు. ఈ-పాస్ ద్వారా ఇప్పటికే నెలకు రూ.75 లక్షలు మిగులుతుందంటూ ప్రకటిస్తున్న అధికారులు కనీసం ఆ మొత్తాన్ని వెచ్చించి అయినా రేషన్ దుకాణాలలో సరుకులను పెంచి పేద కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు చర్యలు చేపట్టకపోతుండడం గమనార్హం.
 
1.24 లక్షల మందికి తిప్పలు: జిల్లాలో జన్మభూమి కమిటీల ద్వారా 1,24,713 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని భంగపడిన వారు కూడా ఉన్నారు. రెండోసారి అయినా దరఖాస్తు చేసుకుంటే కార్డు వస్తుందనుకున్న వారి ఆశలు అడియాసలుగానే ఉండిపోయాయి. అయితే వీరిలో కూడా ఇప్పటి వరకు కేవలం 96,134 కార్డులను మాత్రమే తహశీల్దార్లు వెబ్‌లో అప్‌లోడ్ చేశారు. మిగిలిన అర్జీలకు జన్మభూమి కమిటీల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో దాదాపు 28,579 దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు రావనే చెప్పవచ్చు.
 
డీలర్లపై దయ...వృద్ధులపై నిర్దయ
రేషన్ డీలర్లను ప్రభుత్వం దయతలిచింది. రేషన్ డీలర్, అతని కుటుంబ సభ్యులే కాకుండా ఇంకా అతనికి సంబంధించిన వారెవరైనా వేలిముద్రలు ఈపాస్ మెషీన్‌లో అనుసంధానం చేసే అవకాశం కల్పించింది. దీనివల్ల బినామీలు సైతం తమ వేలిముద్రలను పొందుపరుచుకున్నారు. కానీ 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నపిల్లలు వికలాంగులుగా  ఉన్న కుటుంబాలలో రేషన్ తీసుకోవాలంటే వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈపాస్ మెషీన్‌లో వారి వేలిముద్రలు తప్పనిసరి కావడంతో వయోభారంతో వారు నానా తిప్పలు పడుతున్నారు. గతంలో ఎవరో ఒకరు రేషన్ తీసుకువచ్చి ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో చాలామంది రేషన్ తీసుకోవడానికి సైతం వెళ్లలేక పోతున్నారు. కనీసం 60 ఏళ్ల వయస్సు దాటిన వారి పట్ల, వికలాంగుల పట్ల కనికరం చూపి వారి అవస్థలకు స్వస్తి చెప్పాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
మార్పులకు సైతం తిప్పలే
ఇక రేషన్ కార్డుల సంగతి అలా ఉంచి కనీసం ఉన్న కార్డులలో మార్పులకు సైతం వెబ్‌సైట్ అంగీకరించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వెబ్‌సైట్‌లో మార్పులకు అవకాశం లేకుండా పౌరసరఫరాలశాఖ కమిషన్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.
- ఒక ప్రాంతంలోని వ్యక్తి మరో ప్రాంతానికి బదిలీ అయితే చిరునామా మార్చుకోవచ్చు. కానీ వెబ్‌సైట్ అందుకు అంగీకరించడం లేదు.
- కార్డు పొరపాటున పోతే తిరిగి ఆ కార్డు పొందడానికి సైతం వెబ్‌సైట్ అంగీకరించడం లేదు. గతంలో డూప్లికేట్ కార్డులను ఈ-సేవ, మీ-సేవల ద్వారా పొందే సౌకర్యం ఉండేది.
- కొత్తగా పుట్టిన పిల్లల పేర్లను కార్డుల్లో నమోదు చేయించాలంటే అందుకు వెబ్ ఆప్షన్ అంగీకరించని పరిస్థితి. ఆధార్‌లో తప్పులు దొర్లినందువల్ల వాటిని చాలామంది ఎడిట్ చేయించుకున్నారు. అయితే వారివి గానీ, కొత్తగా దిగిన వారి వివరాలుగానీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఉండకపోతుండడంతో ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ ఫలాలను అందుకోలేని పరిస్థితి.
- మండల కార్యాలయాల్లో ఆధార్ సీడింగ్ జరగకపోతుండడంతో చాలామంది ఆధార్‌నమోదు చేయించుకోలేకపోతున్నారు. అయితే పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం ఆధార్ సీడింగ్ జరుగుతుందని, అక్కడ చేయకపోతే జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయానికి వస్తే ఫీడ్ చేస్తామని చెబుతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement