సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతల ప్రోద్బలంతో జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సమాజానికే ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలను అడ్డుకోకుంటే విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఘటనల వల్ల సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు.
అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అంగళ్లులో విధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ సీనియర్ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసు నమోదు చేయాలంటే అతను మరొకరిని గాయపరచాల్సిన అవసరం లేదని, చంపాలన్న ఉద్దేశం ఉంటే సరిపోతుందని వివరించారు.
అంగళ్లులో చంద్రబాబు తరమండిరా.. చంపండిరా.. అంటూ తన పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలపై, సామాన్యులపై ఉసిగొల్పారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అధికార పార్టీకి చెందిన వారే కాక సామాన్యులు కూడా గాయపడ్డారన్నారు. అందుకే చంద్రబాబు, ఇతర నేతలపై పెట్టిన హత్యాయత్నం కేసు చెల్లుబాటవుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై టీడీపీ నేతలు కొందరు స్టే తెచ్చారని, దీంతో ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ చంద్రబాబును అభ్యర్థించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు.
టీడీపీ నేతల విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. విధ్వంస ఘటనల వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. పులివర్తి నానిపై 16 కేసులు ఉన్నాయన్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా యుద్ధభేరిలో పాల్గొన్న నేతలందరూ వారి నియోజకవర్గాల నుంచి మనుషులను తెచ్చుకుని, విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు నుంచి పుంగనూరు వరకు అప్రతిహతంగా విధ్వంసం కొనసాగించారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించారు. పిటిషనర్లకు బెయిల్ ఇస్తే ఏదైనా చేసి బెయిల్ తెచ్చుకోవచ్చన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు.
అనంతరం టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్‌వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, విచారణ నుంచి పారిపోబోమని, ఏ షరతులు విధించినా లోబడి ఉంటామని తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలు వేర్వేరని, రెండింటినీ కలిపి పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ నేతలే చంద్రబాబు తదితరులపై రాళ్లు రువ్వారని చెప్పారు.
వారి దాడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే గాయపడ్డారని తెలిపారు. పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని ఏఏజీకి స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment