Nallari kishore kumar reddy
-
టీడీపీ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతల ప్రోద్బలంతో జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సమాజానికే ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలను అడ్డుకోకుంటే విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఘటనల వల్ల సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అంగళ్లులో విధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ సీనియర్ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసు నమోదు చేయాలంటే అతను మరొకరిని గాయపరచాల్సిన అవసరం లేదని, చంపాలన్న ఉద్దేశం ఉంటే సరిపోతుందని వివరించారు. అంగళ్లులో చంద్రబాబు తరమండిరా.. చంపండిరా.. అంటూ తన పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలపై, సామాన్యులపై ఉసిగొల్పారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అధికార పార్టీకి చెందిన వారే కాక సామాన్యులు కూడా గాయపడ్డారన్నారు. అందుకే చంద్రబాబు, ఇతర నేతలపై పెట్టిన హత్యాయత్నం కేసు చెల్లుబాటవుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై టీడీపీ నేతలు కొందరు స్టే తెచ్చారని, దీంతో ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ చంద్రబాబును అభ్యర్థించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. టీడీపీ నేతల విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. విధ్వంస ఘటనల వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. పులివర్తి నానిపై 16 కేసులు ఉన్నాయన్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా యుద్ధభేరిలో పాల్గొన్న నేతలందరూ వారి నియోజకవర్గాల నుంచి మనుషులను తెచ్చుకుని, విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు నుంచి పుంగనూరు వరకు అప్రతిహతంగా విధ్వంసం కొనసాగించారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించారు. పిటిషనర్లకు బెయిల్ ఇస్తే ఏదైనా చేసి బెయిల్ తెచ్చుకోవచ్చన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అనంతరం టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, విచారణ నుంచి పారిపోబోమని, ఏ షరతులు విధించినా లోబడి ఉంటామని తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలు వేర్వేరని, రెండింటినీ కలిపి పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ నేతలే చంద్రబాబు తదితరులపై రాళ్లు రువ్వారని చెప్పారు. వారి దాడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే గాయపడ్డారని తెలిపారు. పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని ఏఏజీకి స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించి గాయపరిచిన వ్యవహారంలో తమపై అన్నమయ్య జిల్లా, ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ టీడీపీ నేతల దాడిలో దాదాపు 30 మంది పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందువల్ల తనకు ఈ కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయిందన్నారు. పూర్తి వివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను 14కి వాయిదా వేశారు. కాగా, ఈలోపే పిటిషనర్లను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల సోమవారం వరకు పిటిషనర్లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని దేవినేని ఉమా, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని ఏఏజీ సుధాకర్‌రెడ్డికి మౌఖికంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే..ఇదే వ్యవహారంలో తనపై ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేత పులవర్తి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కూడా హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. -
నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి : నకిలీ పట్టాలతో నిరుపేదలకు కుచ్చుటోపీ
ఓట్ల కోసం విలువలను వదిలేశారు.. ఇంటి స్థలం కోసం ఆశపడిన నిరుపేదలను నకిలీ పట్టాలతో నయవంచన చేశారు.. పేదలకు ఇచ్చినట్లు చూపిన భూములను టీడీపీ నేతలే కబ్జా చేసుకున్నారు. అడుగులకు మడుగులొత్తే అనుచరులకు మాత్రం రూ.కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టేశారు.. ఇదేమని ప్రశ్నించిన వారికి బురద అంటించేందుకు ప్రయతి్నస్తున్నారు.. వాస్తవాలను తొక్కిపెట్టి గోబెల్స్ ప్రచారానికి తెరతీస్తున్నారు.. టీడీపీ హయాంలో పీలేరు నియోజకవర్గంలో బట్టబయలైన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అండ్ కో అవినీతి అక్రమాలను చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. సాక్షి, తిరుపతి: గత టీడీపీ ప్రభుత్వంలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పీలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా పెత్తనం చెలాయించారు. అనుచరులతో కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వందలాది ఎకరాలను ఆక్రమించుకున్నారు. చెరువు, కుంట, కాలువ, పోరంబోకు భూములను యథేచ్ఛగా కబ్జా చేశారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ఇంటి పట్టాలను నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తన అనుచరులు 500 మందికి కట్టబెట్టారు. అదే సమయంలో నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని సుమారు 10వేల మంది నోట్లో మట్టికొట్టారు. ఇంటి స్థలాలు ఇస్తామని ఆశచూపి తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో కొందరు రెవెన్యూ సిబ్బంది సాయంతో నకిలీ పట్టాలను సృష్టించారు. ఓట్ల కోసం కక్కుర్తి పడి వందలాది మంది పేదలకు పంచి ఈ నకిలీ పట్టాలను పెట్టేశారు. ఈ క్రమంలోనే ఆర్థిక స్థోమత ఉన్న వారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసుకుని నకిలీ పట్టాలు అంటగట్టేశారు. ఆ పట్టాల్లో ఉన్న సర్వే నంబర్లలో ఉన్న స్థలం పట్టణంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. దీంతో లబి్ధదారులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారు. అక్రమాలు వెలుగులోకి.. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ, జర్నలిస్టు కాలనీ, రజకుల కాలనీ, ఎన్టీఆర్ కాలనీలో సుమారు 200 నకిలీ పట్టాలు బయటపడ్డాయి. తమకు పట్టా ఇచ్చినా స్థలం చూపించలేదని బాధితులు తహసీల్దార్‌ను కలవడంతో వాస్తవం వెలుగు చూసింది. దీనిపై 22 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేవలం ఆరు కాలనీల్లోనే ఈ స్థాయిలో నకిలీ పట్టాలు ఉంటే, మొత్తం నియోజకవర్గంలో ఇంకెన్ని ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అండ్ కో సాగించిన ఆక్రమణల పర్వంపై గతంలోనే ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నల్లారి భూదందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండడం గమనార్హం. -
నల్లారి వారి ‘భూ మాయ’.. అక్రమాలకు లెక్కేలేదు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో అధికారం దన్నుతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి భూదందాలకు లెక్కలేకుండా పోయింది. ఆయన అనుచరులు చెట్టు, పుట్ట, గుట్ట, వాగు, వంక, దేవుడిమాన్యం అనే తేడా లేకుండా ఏది కంటికి కనబడితే అది బినామీ పేర్లతో స్వాహా చేసేశారు. పీలేరు పట్టణంతో పాటు బోడుమల్లువారిపల్లె, ముడుపులవేముల, గూడరేవుపల్లె, యర్రగుంటపల్లె, దొడ్డిపల్లె, వేపులబైలు పంచాయతీలలో ప్రభుత్వ భూములు టీడీపీ నేతల పరమయ్యాయి. ► అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అసెంబ్లీలోనే నేరుగా పీలేరులో జరుగుతున్న భూదందా లను ప్రస్తావించారు. ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో అసెంబ్లీలో అధికారపక్షం సమాధానమిస్తూ కేవలం ఏడెకరాల భూమి మాత్రమే ఆక్రమణకు గురైందని స్పష్టం చేసింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తీసిన పక్కా లెక్కల్లో వందల ఎకరాల భూములు ఆక్రమణల చెర నుంచి బయటపడ్డాయి. వాటిల్లో కొన్ని భూములను పేదల ఇళ్లకు ప్రభుత్వం కేటాయించింది. అదే ఇప్పుడు టీడీడీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో నల్లారి బ్యాచ్ ఎదురుదాడికి దిగుతోంది. కానీ వాస్తవాలు ఇలా ఉన్నాయి. ► పీలేరు మండలం గూడరేవుపల్లె సర్వేనంబరు 198 లో 106.86 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమి గతంలో ఆక్రమణకు గురైంది. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆ భూమి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జగనన్న కాలనీలకు కేటాయించింది. ► పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీలో సర్వే నంబర్ 906లో 23ఎకరాలు, సర్వేనంబరు 908లో 10.14ఎకరాలు, 909/2లో 96సెంట్ల భూమి అన్యాక్రాంతమైంది. ప్రస్తుత ప్రభుత్వం వీటిల్లో కూడా చాలా వరకు ఆక్రమణలు తొలగించింది. ఇంకా ఇప్పటికీ నల్లారి అండ్ కో ఆదీనంలోనే.. ► పీలేరు మండలం దొడ్డిపల్లె, కాకులారంపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో గతంలో ఇందిరమ్మ గృహాల కోసం సుమారు 90ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 2,322 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అయితే 1,750మందికి మాత్రమే ఇచ్చి మిగిలిన 572 పట్టాలు, 6.80ఎకరాల భూమిని ఇప్పటికీ టీడీపీ నేతలు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అదేవిధంగా సర్వేనంబరు 1136/1లో 10.32ఎకరాల ప్రభుత్వ భూమి నల్లారి అనుచరుల ఆక్రమణలో ఉందని అక్కడ ఎవరినడిగినా చెబుతారు. ► పీలేరు పట్టణంలోని బోడుమల్లువారిపల్లి, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీల్లో అప్పట్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అండతో ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముకున్న సంగతి అందరికీ తెలిసిందే. ►అప్పట్లో అసైన్మెంట్ ఆమోదం లేకుండానే పీలేరు మండలంలో డీకేటీ పట్టాలను సొంతం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం డీకేటీ పట్టాలు జారీ చేస్తే అందుకు సంబంధించిన వివరాలను ఏ రిజిష్టరులో నమోదు చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా అడ్డగోలుగా డీకేటీ భూములు పంచేసుకున్నారు. ► అదే విధంగా అప్పట్లో కలికిరిలో సర్వే నంబర్ 547–ఎ, 549 –2ఎ పరిధిలో పంచాయతీ అనుమతులు లేకుండానే లే అవుట్లు వేసి విక్రయించి సొమ్ముచేసుకున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరితే ఖబడ్దార్
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. కలికిరి మండలం బాలయ్యకుంట వడ్డిపల్లి గ్రామంలో 70 కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలన్నీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా ఉంటూ వచ్చాయి. ఆయన తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరడం వారికి నచ్చలేదు. ఆ గ్రామంలోని దాదాపు 40 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాయి. దీనికోసం 45 రోజులుగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని సంప్రదిస్తున్నారు. శనివారం (22వ తేదీన) ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేర్చుకుంటామని గ్రామస్తులకు ఆయన చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పీలేరు టీడీపీ ఇన్చార్జి కిశోర్‌కుమార్‌రెడ్డి గ్రామస్తులను బెదిస్తున్నారు. ‘‘మీరు ఎలా వైఎస్సార్సీపీలో చేరుతారో చూస్తా’’ అంటూ బెదిరిస్తున్నారు. మీ ఇళ్లను ధ్వంసం చేయడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. దీంతోపాటు 22నే గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఆశ్రయించారు. ఆయన గ్రామస్తులను వెంటబెట్టుకొని చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను శుక్రవారం కలిశారు. ‘ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరేందుకు స్వేచ్ఛ ఉంది. ప్రశాంతగా ఉన్న గ్రామంలో చిచ్చు రేపొద్దు’ అని ఎస్పీ సూచించారు. రంగంలోకి ఎక్సైజ్ పోలీసులు ఎస్పీ న్యాయంగా వ్యవహరించడంతో కిశోర్‌కుమార్‌రెడ్డి ఎక్సెజ్ పోలీసులను రంగంలోకి దింపారు. గ్రామంలో చెరకు గానుగ ఆడిస్తుంటారు. వడ్డెపల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ నల్లబెల్లం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని వైఎస్సార్సీపీలో చేరాలనుకున్నవారి ఇళ్లపై ఎక్సైజ్ పోలీసులతో దాడి చేయించారు. నల్లబెల్లంతో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారనే నెపంతో నాగన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎవరూ లేని సమయంలో తమ ఇంటి తాళం పగలగొట్టడం ఏంటని ప్రశ్నించింనందుకు నాగయ్య భార్యపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఎక్సైజ్ పోలీసులు వడ్డిపల్లిలో దాడులు నిర్వహిస్తారని తెలిసింది. -
కిషోర్‌కు బ్రేకులు
కాంగ్రెస్‌తో టీడీపీ తాజా చెలిమి పీలేరు రాజకీయాలను వేడెక్కిస్తోంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్ కుటుంబీకుల మధ్య చిచ్చు రాజేస్తోంది. కిరణ్ సోదరుల మధ్య అంతరం పెంచుతోంది. జిల్లాలో నామమాత్ర ప్రభావమున్న కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గాన్ని కోరుతున్నట్లు అందుతున్న సమాచారం మాజీ సీఎం సోదరుడు కిషోర్ వర్గానికి కునుకు పట్టనీయడం లేదని తెలుస్తోంది. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన పీలేరులో తన కుమారుడిని పోటీ చేయించాలని కిరణ్‌కుమార్ భావిస్తున్నారు. తాజాగా టీడీపీలో చేరి ఇక్కడి నుంచి పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్న కిషోర్‌కుమార్ ఆశలపై ఈ పరిణామం నీల్లు చల్లుతోంది. సాక్షి,చిత్తూరు, తిరుపతి: తెలంగాణలో కాంగ్రెస్‌తో చెట్టపట్టా లేసుకున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో అదేతీరు కొనసాగిస్తుందనే ఊహాగానాలు బలం పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు వాస్తవానికి జిల్లాలో పట్టులేదు. మాజీ సీఎం నల్లారి కిరణ్ గతంలో ప్రాతినిథ్యం వహించిన పీలేరులో అంతో ఇంతో ఈ పార్టీకి ఉనికి ఉందని ఆయన సన్నిహితుల అంచనా. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సీటును ఒప్పందం కుదిరితే అడగాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలు స్తోంది. టీడీపీ కూడా ఇందుకు అంగీకరిస్తుందనే సంకేతాలందినట్లు హస్తం పార్టీ నాయకులు చెబు తున్నారు. ఈ ఆకస్మిక రాజకీయ మార్పు కిరణ్ సోదరుడు కిషోర్‌కు మింగుడుపడటంలేదు. సోదరుడి మాట పెడచెవినబెట్టి టీడీపీలోకి వచ్చారని చెబు తున్న ఈయనకు తీవ్రమైన భంగపాటు ఎదురవుతోంది. వచ్చే ఎన్నికల్లో పీలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ తనయుడు నల్లారి నిఖిలేష్‌రెడ్డి పేరు ఖరారు చేయనున్నారని జరుగుతున్న ప్రచారం అనూహ్యమైన షాక్. ఇప్పటివరకూ తానే టీడీపీ అభ్యర్థినని ప్రకటిస్తున్న కిషోర్‌కు ఎదురుదెబ్బ తగులుతోందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కిరణ్ 2014 ఎన్నికల తరువాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తమ్ముడు కిషోర్ వైఖరి ఇందుకు కారణమని మాజీ సీఎం వర్గీయుల భావన. టీడీపీలో చేరిన కిషోర్ తరువాత అన్నను దూరంగా పెడుతూ వచ్చారు. అన్న సీఎంగా ఉన్నప్పుడు అన్నీ అనుభవించి... అధికారం పోయాక ఆయన్ను పట్టించుకోలేదు. ఇటీవల సొంతూరు నగరిపల్లి వచ్చినా వీరిద్దరూ కలుసుకోలేదు. తండ్రి సమాధి వద్ద ఎదురుపడ్డా అన్నను పలుకరించకుండా వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి పొత్తు ఖరారు చేసుకున్నారు. పొత్తు పొసగేనా.. ఇటీవల కిరణ్ మళ్లీ సొంత గూడు కాంగ్రెస్‌లో చేరిపోయారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ పార్టీతో టీడీపీకి సఖ్యత కుదిరింది. పొరుగున ఉన్న తెలంగాణాలో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా రాహుల్‌తో చంద్రబాబు రాసుకు పూసుకు తిరుగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు కాంగ్రెస్‌కు చేరాయి. ఈ నేపథ్యంలోనే పీలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి ఒత్తిడి మేరకు కిరణ్ కుమార్‌రెడ్డి కుమారుడు నిఖిలేష్‌ను బరిలో దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలి సింది. సీఎంగా పనిచేసిన వ్యక్తి పీలేరు అసెంబ్లీ స్థానం అడగటంతో అధిష్టానం కూడా కిరణ్ ప్రతిపాదనను ఓకే చేసినట్లు సమాచారం. చంద్రబాబు నిర్ణయం పీలేరులో టీడీపీలో కలవరం రేపుతోంది. 2014 ఎన్నికల్లో పీలేరు నుంచి త్రిముఖ పోటీ జరిగింది. జై సమైక్యాంధ్ర పక్షాన కిషోర్ ఓడిపోయారు. టీడీపీ తరఫున ఇంతియాజ్ అహ్మద్ ఓటమి పాలయ్యారు. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఓడిపోయినా పార్టీ భరోసా ఇస్తుందని ఆశించిన ఇంతియాజ్‌కు నిరాశ మిగిలింది. కిషోర్‌ను పార్టీలో చేర్చుకుని రంగంలోకి దించడంతో ఈయన ఖంగుతిన్నారు. టికెట్ తనకే వస్తుందని కిషోర్ వర్గం చెబుతుండటంతో ఇప్పటికే వీరిద్దరి మధ్య అంతరం పెరిగింది. తాజాగా ఈ సీటు కాంగ్రెస్‌కు కేటాయిస్తారని తెలియడంతో కిషోర్ డీలా పడిపోయారు. -
‘సోనియాని ఎదిరించడం వల్లే జగన్‌పై కేసులు’
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి మాట్లాడడంతో ఆమెకు కోపమొచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న (గురువారం) సాయంత్రం విజయవాడ గాయత్రినగర్‌లోని మెట్రోపాలిటన్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషోర్ కుమార్ రెడ్డికి, నల్లారి అమర్నాథ్రెడ్డి (కిషోర్ కుమార్ రెడ్డి కుమారుడు)కి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కిషోర్‌కుమార్‌రెడ్డి తండ్రి నల్లారి అమర్‌నాథ్‌రెడ్డితోపాటు తాను ఎమ్మెల్యేగా పనిచేశానని చెప్పారు. నల్లారి కుటుంబం ప్రజాసేవ కోసం నిబద్దతతో పనిచేస్తోందన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని విభజించవద్దని అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పోరాడారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించి జిల్లాను అభివృద్ధి చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టీడీపీలో చేరిన మాజీ సీఎం సోదరుడు
సాక్షి, అమరావతి: నల్లారి కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, తన కుమారుడు అమర్ నాథ్ రెడ్డితో కలిసి గురువారం టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారని అన్నారు. నల్లారి అమర్ నాధ్ రెడ్డితో తాను కలిసి పని చేశానని ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర నల్లారి కుటుంబానికి ఉందని గుర్తు చేశారు. నల్లారి కుటుంబం సేవలు పీలేరు నియోజకవర్గానికి ఎంతో అవసరమన్నారు. హేతుబద్దత లేని రాష్ట్ర విభజన జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో పోరాడారని ప్రశంసించారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. కిషోర్ కుమార్ రెడ్డి అనునిత్యం ప్రజలతోనే ఉంటారని, పీలేరు ఇంచార్జిగా ఆయనను నియమిస్తున్నట్టు ప్రకటించారు. కుప్పంతో పోటీపడి పీలేరులో కూడా మంచి మెజారిటీ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. -
టీడీపీలో ‘నల్లారి’ చేరికకు రంగం సిద్దం!
కలికిరి: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలలో జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే గత మూడు సంవత్సరాలుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీలో చేరుతారని పుకార్లు షికార్లు చేశాయి. ఏడాది కాలంగా ఏదో ఒక పార్టీలో చేరుతారని, నేడో రేపో ప్రకటన చేస్తారంటూ ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఇంతలో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇటీవల టీడీపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరనాధరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్ గీర్వాణీ చంద్రప్రకాష్ తదితర ప్రముఖులు ఆదివారం సాయంత్రం నగిరిపల్లిలో నల్లారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ తంతులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే కిషోర్‌కుమార్‌రెడ్డి సైతం టీడీపీలో చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో తాను పార్టీలో చేరుతానని అయితే తనకు రాజంపేట ఎంపీ టికెట్‌తో పాటు, టీటీడీ చైర్మన్ పదవి అడిగినట్లు సమాచారం. ఎంపీ టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా తన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై మాజీ ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేయనట్లు విశ్వసనీయ సమాచారం.