టీడీపీలో ‘నల్లారి’ చేరికకు రంగం సిద్దం!
కలికిరి: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలలో జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
అయితే గత మూడు సంవత్సరాలుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సీపీలో చేరుతారని పుకార్లు షికార్లు చేశాయి. ఏడాది కాలంగా ఏదో ఒక పార్టీలో చేరుతారని, నేడో రేపో ప్రకటన చేస్తారంటూ ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. ఇంతలో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే ఇటీవల టీడీపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరనాధరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్ గీర్వాణీ చంద్రప్రకాష్ తదితర ప్రముఖులు ఆదివారం సాయంత్రం నగిరిపల్లిలో నల్లారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ తంతులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
ఇప్పటికే కిషోర్‌కుమార్‌రెడ్డి సైతం టీడీపీలో చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో తాను పార్టీలో చేరుతానని అయితే తనకు రాజంపేట ఎంపీ టికెట్‌తో పాటు, టీటీడీ చైర్మన్ పదవి అడిగినట్లు సమాచారం. ఎంపీ టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా తన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై మాజీ ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేయనట్లు విశ్వసనీయ సమాచారం.