కిరణ్ కుమార్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉంది. ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇక మిగిలి ఉందని తెలుస్తోంది. ఎటువంటి షరతులు లేకుండా ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధపడితే, చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి నేతలతో కిరణ్ జరిపిన మంతనాలు ఫలించినట్లు వార్తలు వినవస్తున్నాయి.
కిరణ్ కుమార్ కాంగ్రెస్ను వీడిన తరువాత జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. ఎన్నికలలో ఆ పార్టీకి ఘోరపరాజయం ఎదురైంది. ఇక ఆ పార్టీ అవసరంలేదనే అభిప్రాయానికి ఆయన వచ్చారు. ఈ పరిస్థితులలో రాజకీయంగా యాక్టివ్ కావాలంటే ఆయనకు బిజెపిలో చేరడం తప్ప మరో మార్గంలేదు.
ఈ నేపథ్యంలో కిరణ్ అనుచరులు బిజెపికి చెందిన ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారు. కిరణ్ ఏవో పదవులు కోరినట్లు తెలుస్తోంది. అయితే బేషరతుగా పార్టీలో చేరడానికి సిద్ధమైతే అప్పుడు ఆలోచిస్తామని వారు చెప్పినట్లు సమాచారం. అందువల్ల కిరణ్ బేషరతుగానే బిజెపిలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బిజెపి అధిష్టానం నుంచి ఆమోదం లభిస్తే, కిరణ్ ఆ పార్టీలో చేరతారు.
కొద్దికాలం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి వారు కిరణ్ కుమార్ వెంట ఉన్నారు. అయితే వీరందరూ ఆయనతోపాటు బిజెపిలో చేరే అవకాశం లేదు. అందరూ కాకపోయినా కొంతమంది కిరణ్తోపాటు బిజెపిలో చేరే అవకాశం ఉంది.
**