
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించి గాయపరిచిన వ్యవహారంలో తమపై అన్నమయ్య జిల్లా, ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు.
పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ టీడీపీ నేతల దాడిలో దాదాపు 30 మంది పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందువల్ల తనకు ఈ కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయిందన్నారు. పూర్తి వివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను 14కి వాయిదా వేశారు. కాగా, ఈలోపే పిటిషనర్లను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల సోమవారం వరకు పిటిషనర్లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని దేవినేని ఉమా, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని ఏఏజీ సుధాకర్‌రెడ్డికి మౌఖికంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే..ఇదే వ్యవహారంలో తనపై ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేత పులవర్తి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కూడా హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.