ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ  | Chandrababu Naidu Approaches Supreme Court In Andhra Pradesh Skill Development Scam Case | Sakshi
Sakshi News home page

ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ 

Published Sun, Sep 24 2023 5:33 AM | Last Updated on Sun, Sep 24 2023 4:08 PM

Chandrababu Naidu Approaches Supreme Court In Andhra Pradesh Skill Development Scam Case - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్‌ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది.

ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్‌ జడ్జి.. 
మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్‌ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్‌ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. 

‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్‌లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ తరఫు న్యాయవాది వరుణ్‌ బైరెడ్డి గడువు కోరారు.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ స్పందిస్తూ.. సిట్‌ పరిధిలో ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్‌ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్‌ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్‌లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌  స్పష్టంచేశారు.  

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు..
దీంతో.. జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement