Single Judge
-
’మార్గదర్శి’పై పోలీసుల అప్పీళ్లను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీరాల, విశాఖపట్నం, సీతంపేట బ్రాంచీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాము మార్గదర్శి చిట్ గ్రూపుల్లో చందాదారు కాకపోయినప్పటికీ, తమ సంతకాలను ఫోర్జరీ చేసి చందాదారులుగా చూపారని, దీనివల్ల తమకు భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని, ఇలా చేసినందుకు మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు చందాదారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అలాగే చీటీ పాట పాడుకున్నా తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ మరో చందాదారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేరానికి సంబంధించినదని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు నోటీసులిచ్చారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాలను స్తంభింపజేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం విచారణ జరిపింది. -
ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్ జడ్జి.. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్‌లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి గడువు కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. సిట్ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు.. దీంతో.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది. -
సిట్‌కు స్వేచ్ఛ: సింగిల్ జడ్జి పర్యవేక్షణ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మెరిట్ ఆధారంగా సింగిల్ జడ్జి విచారణ కొనసాగించాలని స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తమపై కేసు కొట్టివేయాలని, సిట్ విచారణ నిలిపివేయాలంటూ నిందితులు రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్లతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. తొలుత ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. హైకోర్టులో జరిగిన పరిణామాలు వివరించారు. కింది కోర్టు బెయిల్‌ను తిరస్కరించినా నిందితులు సవాల్ చేయలేదని తెలిపారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. రిమాండు ఉత్తర్వులు, బెయిలు ఉత్తర్వులు వేర్వేరని తెలిపారు. అరెస్టు చేయడానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పడం సరికాదన్నారు. హైకోర్టు అనుమతితో నిందితులను ట్రయల్‌కోర్టులో హాజరుపరిచి రెండు రోజుల కస్టడీకి తీసుకున్నామని, దీంతో హైకోర్టు రిమాండు ఉత్తర్వులకు కాలం చెల్లిందని దుష్యంత్ దవే తెలిపారు. ‘ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అర్నేశ్‌కుమార్ తీర్పును హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పులో పలు లోపాలున్నాయని నిందితుల తరఫు న్యాయవాది తన్మయ్ మెహతా తెలిపారు. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 ప్రయోగించారని.. లంచం తీసుకున్న వారిపై దీన్ని ప్రయోగిస్తారని చెప్పారు. హైకోర్టు తీర్పు అర్నేశ్‌కుమార్ తీర్పునకు విరుద్ధంగా ఉందన్నారు. ఇవేం వ్యాఖ్యలు? హైకోర్టు తీర్పులోని పదాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘సుప్రీంకోర్టు, హైకోర్టులు సమానమే. హైకోర్టులేమీ కింది కోర్టులు కాదని చెబుతుంటాం. సింగిల్ జడ్జి పదాలు ఆక్షేపణీయంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో నాయకులను అరెస్టు చేయొచ్చు.. అధికార పార్టీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం అన్ని అంశాలు మాట్లాడతారంటూ దుష్యంత్ దవే పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసి చట్టపరమైన అంశాలపైనే మాట్లాడాలని దుష్యంత్ దవేకు సూచించింది. అన్ని పార్టీల నేతలను బెయిల్‌పై విడుదల చేస్తుంటామని పేర్కొంది. అవినీతి నిరోధక కేసులో పోలీసులు ట్రాప్ చేసి నిందితులను పట్టుకున్నారని దుష్యంత్ దవే తెలిపారు. ప్రతి కేసులోనూ నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలనడం సరికాదన్నారు. రూ.వందల కోట్లలో లంచానికి సంబంధించిన ఈ అంశం పోలీసుల సమక్షంలో జరిగిన నేరమని, ఇది దర్యాప్తు చేయదగిన కేసు అని చెప్పారు. ట్రాప్ కేసుల్లో అప్పటికప్పుడే సాక్ష్యాధారాలు సేకరించకుంటే వాటిని నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా తెలిపారు. దర్యాప్తునకు సహకరించినప్పుడు అరెస్టు అవసరం లేదని సిద్ధార్థ్ దవే చెప్పారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదని దవే బదులిచ్చారు. రాజకీయ పార్టీ పిటిషన్ లేకపోతే అదే రోజు బెయిలిచ్చే వారమని గత విచారణలో చెప్పినట్లు ధర్మాసనం పేర్కొంది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు సరిగాలేవు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలు అవసరం లేదు. నిందితులు రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలి. బెయిల్ పిటిషన్లపై విచారణ త్వరగా పూర్తి చేయాలి’ అని పేర్కొంటూ ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగించింది. సిట్ దర్యాప్తు పిటిషన్‌పై... తొలుత నిందితుల తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తును సీబీఐ లేదా న్యాయమూర్తుల నేతృత్వంలోని సిట్‌కు బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఓ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లో దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే విధించారని, తర్వాత స్టే ఎత్తివేశారని తెలిపారు. దీన్ని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయగా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తునకు ఆదేశాలిచ్చిందన్నారు. ఈ సందర్భంలో సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకొని హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి నిందితుల పిటిషన్‌పై విచారణ చేయాలని సూచిస్తామంది. ప్రభుత్వం తరఫున హాజరైన దుష్యంత్ దవే విభేదించడంతో ప్రత్యేక దర్యాప్తునకు అర్హత ఉన్న కేసా కాదా అని హైకోర్టు నిర్ణయిస్తుందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను న్యాయమూర్తి పర్యవేక్షించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. జైన్ హవాలా తదితర కేసుల్లో సుప్రీంకోర్టు కూడా పర్యవేక్షణ అదేశాలిచ్చిందని దుష్యంత్ దవే చెప్పారు. దర్యాప్తుపై స్టే విధించొద్దని కోరారు. ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! -
సీఎఫ్ఎంఎస్ చెల్లింపుల కేసులో స్టే
సాక్షి, అమరావతి: గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. పిటిషనర్‌కు చెల్లించాల్సిన రూ.5.63 లక్షలను ఇప్పటికే చెల్లించామని ప్రభుత్వం చెబుతోందని, ఈ ఒక్క కారణంతోనే సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణ వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలన్న ఆదేశాలను మాత్రమే నిలుపుదల చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అప్పీల్‌పై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు నేపథ్యమిదీ.. ప్రకాశం జిల్లా దర్శిలోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్‌కు అవసరమైన సామగ్రి సరఫరా చేసినందుకు గాను తనకు రూ.5.63 లక్షలను చెల్లించడం లేదని, ఈ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బండి సుబ్బారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల విచారణ జరిపారు. బిల్లును సంబంధిత శాఖ క్లియర్ చేసినా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయిందని పిటిషనర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. 2021లో ఆమోదించిన బిల్లును ఇప్పటివరకు ఎందుకు క్లియర్ చేయలేదో తెలుసుకునేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ వ్యక్తిగత హాజరుకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు రావత్ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఆ నిర్దిష్ట హెడ్ ఆఫ్ అకౌంట్లో నిధులు లేవని, అందుకే చెల్లింపులు జరగలేదని రావత్ వివరించారు. ఇంత చిన్న మొత్తం చెల్లించేందుకు డబ్బు లేదనడం రాష్ట్ర ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రావత్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. అత్యవసర అప్పీల్ దాఖలు చేసిన రావత్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. రావత్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 15వ తేదీనే పిటిషనర్‌కు రూ.5.63 లక్షల్ని ప్రభుత్వం చెల్లించేసిందని వివరించారు. పిటిషనర్ కేవలం తన బిల్లు చెల్లింపు కోసమే పిటిషన్ వేశారని, కానీ.. న్యాయమూర్తి మాత్రం ఆ పిటిషన్ పరిధిని దాటి సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపుల వివరాలు కోరారని తెలిపారు. కేవలం ఆ నిర్దిష్ట హెడ్ ఆఫ్ అకౌంట్లో మాత్రమే నిధులు లేవని చెప్పారే తప్ప ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం సుబ్బారెడ్డి తరఫు న్యాయవాదిని వివరాలు కోరింది. ఆయన కూడా అదే విషయం చెప్పడంతో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం.. అప్పీల్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఏ కేసులోనూ అరెస్టు చేయొద్దని ఎలా ఆదేశిస్తారు ?
సాక్షి, హైదరాబాద్: పలువురిని మోసం చేశాడంటూ నమోదైన కేసుల్లో శ్రీధర్ కన్వెన్షన్ ఎండీ ఎస్.శ్రీధర్‌రావు ఆయన భార్య సంధ్యలను హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన ఏ కేసులోనూ అరెస్టు చేయరాదంటూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తమను మోసం చేశాడంటూ అనేక మంది వీరిపై ఫిర్యాదు చేస్తున్నారని, ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడం పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. శ్రీధర్‌రావు, సంధ్యలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, దర్యాప్తు పురోగతి ఏంటో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించింది. క్రిమినల్, సివిల్, వాణిజ్య వివాదాల్లో శ్రీధర్‌రావు, సంధ్యలను అరెస్టు చేయరాదంటూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మణికొండకు చెందిన ఖుషిచంద్ వడ్డె దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని శ్రీధర్‌రావు, సంధ్యలను గతంలో ఆదేశించినా స్పందించకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వీరి తరఫు సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ అభ్యర్థించడంతో ఒక రోజు గడువునిస్తూ విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. (చదవండి: ఆఫ్‌లు ఆఫయ్యాయి!) -
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే.. నేరుగా హైకోర్టుకు రాకూడదు
సాక్షి, అమరావతి: వ్యక్తులు ఎవరైనా ఫిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 200 లేదా 156(3) కింద ప్రత్యామ్నాయం ఉందని, దాని ప్రకారం మేజిస్ట్రేట్ ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పు ఇదీ... తాము ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదంటూ పలువురు వ్యక్తులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై సింగిల్ జడ్జి జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. ఆ వ్యాజ్యాలన్నింటిలో వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నప్పుడు దానిని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఉటంకించారు. ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అందుకు చట్టంలో ప్రత్యామ్నాయాలున్నాయని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ వ్యాజ్యాలను కొట్టివేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్... సింగిల్ జడ్జి తన పిటిషన్‌ను కూడా కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ ముప్పుడి నాగమణి అనే మహిళ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. నాగమణి తరఫు న్యాయవాది సువ్వారి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి తీర్పు వల్ల పోలీసులు ఏ ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. అంతిమంగా ఇది అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఏం చేయాలనేది చట్టంలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి తీర్పులో ఏ దోషం లేదంటూ నాగమణి అప్పీల్‌ను కొట్టేసింది. -
సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది. కేసుతో సంబంధం లేని అంశాల ప్రస్తావన సింగిల్ జడ్జి తన తీర్పులో ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని, అంతర్జాతీయ ఒడంబడికలు, అవసరానికి మించి తీర్పులను ప్రస్తావించారని ఎస్ఈసీ నివేదించారు. టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి, జనసేన పిటిషన్ ఆధారంగా తీర్పు వెలువరించారన్నారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని జనసేన తన పిటిషన్లో ఎక్కడా కోరలేదని, అయినా సింగిల్ జడ్జి ఆ అంశం ఆధారంగా ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ పేర్కొన్నారు. 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని వర్ల రామయ్య కోరితే సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టివేశారన్నారు. సింగిల్ జడ్జి తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలనేకం ఉన్నాయన్నారు. సింగిల్ జడ్జి వ్యాఖ్యలు సరికాదు.. సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా తనపై వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ఓ రాజ్యాంగ సంస్థగా హైకోర్టు స్వతంత్రంగా విధులు నిర్వహిస్తున్న మాదిరిగానే ఎన్నికల కమిషనర్ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. సింగిల్ జడ్జి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరారు. ఉమ్మడిగా వర్తిస్తుంది.. స్థానిక సంస్థల కాలపరిమితి 2018–19లోనే ముగిసిందని, వాటికి సత్వరమే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్న విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు అని తన ఉత్తర్వుల్లో చెప్పిందే కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ అంటూ వేర్వేరుగా చెప్పలేదన్నారు. అందువల్ల 4 వారాల ఎన్నికల నియమావళి అమలు అన్ని ఎన్నికలకు ఉమ్మడిగా వర్తిస్తుందన్నారు. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల నియమావళి అమలు చేయలేదన్న వాదన చెల్లదన్నారు. సుప్రీం ఎన్నోసార్లు చెప్పింది.. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులిచ్చిందని, సింగిల్ జడ్జి అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ వివరించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు అయిందన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదన్నారు. -
సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబే
సాక్షి, అమరావతి: విశాఖపట్నం గీతం విద్యాసంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరపడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వ భూముల్లో తాము చేపట్టిన నిర్మాణాల నుంచి తమను ఖాళీ చేయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న గీతం అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సబబుగానే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి కట్టడాలు, కూల్చివేతలు వద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు గీతం ప్రయోజనాలను కాపాడేలా ఉన్నాయని, అలాంటప్పుడు ఆ ఉత్తర్వులు ఎలా తప్పవుతాయని ప్రశ్నించింది. తదుపరి ఏం ఉత్తర్వులు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లాలని గీతం యాజమాన్యానికి స్పష్టం చేసింది. గీతం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తూ జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిని పెద్దమొత్తంలో ఆక్రమించిన గీతం యాజమాన్యం పలు నిర్మాణాలు చేపట్టింది. కొన్నింటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీనిపై గీతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. తదుపరి ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని రెవెన్యూ అధికారులను, కూల్చివేసినచోట ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గీతం యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలపై గీతం యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై మంగళవారం జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మీకు అనుకూలంగా ఇచ్చినా అభ్యంతరమా?: గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చి తమ నిర్మాణాలను కూల్చేశారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. సింగిల్ జడ్జి మీకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు కదా, మీకు అభ్యంతరం ఏముంది అని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి కేవలం తదుపరి కూల్చివేతలు వద్దని మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారని రుద్రప్రసాద్ చెప్పగా, అంతకు మించిన సానుకూల ఉత్తర్వులు ఏం ఇవ్వగలమని మళ్లీ ప్రశ్నించింది. తమ నిర్మాణాల నుంచి తమను ఖాళీచేయించేందుకు ప్రయత్నిస్తూ థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఆ దిశగా చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలని రుద్రప్రసాద్ కోరారు. ధర్మాసనం అందుకు నిరాకరించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. తదుపరి ఏం ఆదేశాలు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ అప్పీల్‌పై విచారణ జరపాలంటే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్‌ను కొట్టేయించుకురావాలని తెలిపింది. సింగిల్ జడ్జి మంచి ఉత్తర్వులిస్తే, దానిపై అభ్యంతరం చెబుతూ అప్పీల్ దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది. తాము ఈ అప్పీల్‌ను విచారించబోమని తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ భూమిలో కట్టిన అక్రమ కట్టడాలనే కూల్చివేశామని చెప్పారు. తమ భూమిని తాము స్వాధీనం చేసుకోవడాన్ని గీతం తప్పుపడుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. -
ఫిరాయింపుల వ్యాజ్యాలు ధర్మాసనానికి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పిటిషన్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయాలంటూ తామిచ్చిన ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఇకపై ధర్మాసనం విచారించనుంది. ఇలాంటి అంశానికి సంబంధించిన కేసులను గతంలో ధర్మాసనం విచారించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను కూడా ధర్మాసనం విచారించడం సబబుగా ఉంటుందని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, చిదిపిరాళ్ల ఆదినారాయణడ్డి, అత్తార్ చాంద్‌బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కిడారి సర్వేశ్వరరావు, కలమట వెంకటరమణ, ఎం.మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, తిరివీధి జయరాములు, భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, జ్యోతుల నెహ్రూ, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు, పాశం సునీల్‌కుమార్, వరపుల సుబ్బారావు, ఎస్.వి.మోహన్‌రెడ్డి, పోతుల రామారావు, అమర్నాథ్రెడ్డి, ఎం.అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. తమ ఫిర్యాదుపై నెలలు గడుస్తున్నా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నీ గురువారం జస్టిస్ పి.నవీన్‌రావు ముందు విచారణకు వచ్చాయి. వీటిని ధర్మాసనం విచారించడం సబబుగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ఆయన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అభిప్రాయం కోరారు. ఎక్కడైనా తమకు పర్వాలేదని ఏజీ చెప్పడంతో తన ముందున్న వ్యాజ్యాలను ధర్మాసనానికి నివేదిస్తూ జస్టిస్ నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. -
అప్పటి ఉత్తర్వులు అమలు చేస్తాం
ఏపీఏటీపై హైకోర్టుకు తెలంగాణ ఏజీ హామీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీకి ముందు ఏపీఏటీ తమ రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తెలంగాణ జారీ చేసే ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా దాఖలు చేసే వ్యాజ్యాలను రోస్టర్ ప్రకారం సింగిల్ జడ్జి విచారిస్తారంది. ఒకవేళ వివాదం రెండు రాష్ట్రాలకు సంబంధించినది అయితే దానిని కూడా హైకోర్టులో సవాలు చేయవచ్చునని, ఆ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య, ఎన్.నాగరాజు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... కేంద్రం నోటిఫికేషన్ నేపథ్యంలో ఏపీఏటీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ ‘ఆర్డినెన్స్’ జారీ చేశామని తెలిపారు. పరిశీలన నిమిత్తం ఆర్డినెన్స్ కాపీని ధర్మాసనం ముందుంచారు. ట్రిబ్యునల్‌లోని కేసులను హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అలా అధికారం ఉందని ఏ చట్టంలో ఉందో చూపాలని కోరింది. మధ్యప్రదేశ్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుందని, దానిని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని రామకృష్ణారెడ్డి చెప్పారు. న్యాయస్థానాలపై పెండింగ్ కేసుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సహకారం అందుతూనే ఉంటుందని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించేంత వరకు కేంద్ర నోటిఫికేషన్ అమలును నిలిపేయవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు. నోటిఫికేషన్‌తో స్తబ్దత... ఈ సమయంలో కిరణ్‌కుమార్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనర్సింహ... మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేంద్ర నోటిఫికేషన్ వల్ల తెలంగాణ కేసుల విచారణ విషయంలో స్తబ్దత ఏర్పడిందన్నారు. ఏపీఏటీ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదన్నారు. దీనిపై ధర్మాసనం ఏజీ వివరణ కోరింది. నోటిఫికేషన్ జారీకి ముందు ఏపీఏటీ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కక్షిదారుల సౌలభ్యం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పి.వి.కృష్ణయ్య, నాగరాజుల వ్యాజ్యాల్లో తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
విస్తృత ప్రజా ప్రయోజనాలు చూడాలి..
-
విస్తృత ప్రజా ప్రయోజనాలు చూడాలి..
- ఆ బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుంది - పిల్ కాదన్న నెపంతో న్యాయమూర్తిని ఆపలేరు - స్విస్ చాలెంజ్ కేసులో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ఓ అంశానికి సంబంధించి ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాజ్యాన్ని విచారించాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కాదన్న నెపంతో న్యాయమూర్తిని తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించకుండా ఎవ్వరూ ఆపలేరని పేర్కొంది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సీఆర్డీఏలు సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. స్విస్ చాలెంజ్ కేసులో పిటిషనర్లు దాఖలు చేసింది పిల్ కాదని, వారు కోరని అంశాలపై కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారంటూ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు చేసిన సమయంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
మాది మార్వాడీ కంపెనీ కాదు
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం.. జీవో 123పై హైకోర్టులో రాష్ట్ర సర్కారు * వ్యవసాయ కూలీలకు తప్పక పునరావాసం కల్పిస్తాం * పునరావాసం కోసం ఏం చేయబోతున్నారో అఫిడవిట్ ఇవ్వండి: ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ‘‘వ్యవసాయ కూలీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని సింగిల్ జడ్జి అన్నారు. కానీ మేం ఎంత మాత్రం ఆ పనిచేయడం లేదు. మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. వ్యాపారం చేసే మార్వాడీ కంపెనీ కాదు. ప్రజల విషయంలో మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి’’ అని జీవో 123పై జరిగిన వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టంచేసింది. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న భూములపై ఆధారపడి జీవిస్తున్న వారికి తప్పక పునరావాసం కల్పిస్తామని తెలిపింది. అయితే వారి పునరావాసం కోసం ఏమి చేయబోతున్నారో వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాతే జీవో 123 విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ఉద్దేశాలను తాము అనుమానించడం లేదని, స్పష్టత కోసమే అఫిడవిట్‌ను తమ ముందుంచాలని కోరుతున్నామంది. వ్యవసాయ కార్యకలాపాలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డికి స్పష్టం చేసింది. ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి రెండ్రోజుల కిందట తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ మెదక్ ఆర్డీవో డి.శ్రీనివాసరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో అప్పీల్ చేశారు. దీనిని అత్యవసరంగా విచారిం చాలంటూ ఏజీ కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అందుకు అనుమతినిచ్చిన ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు అప్పీల్‌పై విచారణ చేపట్టింది. చట్టప్రకారం దక్కాల్సినవన్నీ ఇస్తాం ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు విని పిస్తూ.. జీవో 123 ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న భూములపై ఆధారపడి జీవిస్తున్నవారికి తప్పక పునరావాసం కల్పిస్తామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని చెప్పారు. చట్ట ప్రకారం వారికి ఏ ప్రయోజనాలు దక్కాలో వాటన్నింటినీ ఇస్తామని చెప్పారు. జీవో 123లో తొలగించిన పునరావాస క్లాజ్‌ను తిరిగి అమల్లోకి తీసుకొస్తామని కోర్టుకు నివేదించారు. పునరావాస కల్పనపై ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించబోదన్నారు. భూములను అమ్మేందుకు స్వచ్ఛందం గా ముందుకొచ్చిన రైతుల నుంచే సంతృప్తికరమైన మొత్తాలకు భూమి కొంటున్నామని చెప్పారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం ఆకర్షణీయంగా ఉండటంతో భూములమ్మేందుకు భూయజమానులు క్యూలో నిల్చున్నారన్నారు. జీవో 123 విషయంలో జోక్యానికి ఇదే హైకోర్టు ధర్మాసనం నిరాకరించిందని గుర్తు చేశారు. తమది ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే తప్ప.. వ్యాపారం చేసే మార్వాడీ కంపెనీ కాద ని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. 2013 భూ సేకరణ చట్టం వ్యవసాయ కూలీల గురించి ఏం చెబుతోందని ఏజీని ప్రశ్నించింది.వ్యవసాయ కూలీలు ‘ప్రభావిత కుటుం బం’ నిర్వచన పరిధిలోకి వస్తారా? రారా? అని అడిగింది. వస్తారని ఏజీ చెప్పడంతో.. మరి వారికి ఆ చట్ట ప్రకారం ప్రయోజనాలు దక్కి తీరాలి కదా? అని పేర్కొంది. ఆ ధర్మాసనం కేసు లోతుల్లోకెళ్లలేదు... ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. అప్పటి ధర్మాసనం కేసు లోతుల్లోకెళ్లి ఆ ఉత్తర్వులు జారీ చేయలేదని, ఆ రోజుకు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టం చేసింది. ‘పరిహారం విషయంలో ఓ విధానం తీసుకొచ్చే యోచన చేస్తున్నారని చెబుతున్నారు కదా.. ఆ విధానంతో కోర్టు ముందుకు రండి’ అని ఏజీకి ధర్మాసనం తెలిపింది. తప్పకుండా పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, అయితే జీవో 123 అమలుకు అనుమతినివ్వాలని ఏజీ కోరారు. కనీసం భూముల రిజిస్ట్రేషన్‌కైనా అనుమతినివ్వాలన్నారు. పునరావాసం విషయంలో ఏజీ స్పష్టమైన హామీ ఇస్తున్నారు కదా.. మరి ఇంకేం అభ్యంతరమని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పరిహారం, పునరావాసం వారి హక్కు పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి వాదిస్తూ.. వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం నుంచి దాతృత్వం కింద పరిహారం పొందాల్సిన పరిస్థితి లేదని, పరిహారం, పునరావాసం వారి హక్కులని తెలిపా రు. చట్ట ప్రకారం వారికి మెరుగైన పరిహారం దక్కాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలని, ఇందుకు గ్రామ సభలు నిర్వహించాలని, అవేమీ చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతినిస్తే వాటి యజమానులు వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించరని, ఫలితంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువవుతుందన్నా రు.ధర్మాసనం స్పందిస్తూ.. పునరావాసం విషయంలో వ్యవసాయ కూలీల తోపాటు ఇతరుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంది. పునరావాస కల్పన కోసం ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందించాలంది. మీరూ మీరూ.. హ్యాపీ.. మరి వారి సంగతేంటి? ‘‘జీవో 123 ద్వారా మీరు భూ యజమానుల నుంచి కొంటున్నారు. 2013 భూ సేకరణ చట్టం కింద ఇచ్చే మొత్తం కంటే ఎక్కువే భూ యజమానులకు ఇస్తున్నారు. అటు మీరూ, ఇటు భూయజమానులు సంతోషంగా ఉన్నారు. మరి ఈ వ్యవసాయ భూ ములపై ఆధారపడి బతికే వారి పరిస్థితేమి టి? మీరూ మీరూ సంతోషంగా ఉంటే సరి పోతుందా? వ్యవసాయ కార్మికులు బతికేదెలా? వారి పునరావాసం సంగతేంటి? 2013 భూ సేకరణ చట్టం సెక్షన్ 108 ప్రకా రం వీరి బాగోగుల విషయంలో ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలి. దాని మాటేమిటి?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏజీ బదులిస్తూ.. వారికి తప్పక పునరావాసం కల్పిస్తామన్నారు. భూములు లేనంత మాత్రాన జీవోనోపాధి పోయినట్లు కాదని, ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా వారికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చే యోచన కూడా చేస్తోందన్నారు. సింగిల్ జడ్జి 214 జీవోను కొట్టేశారని, వాస్తవానికి పిటిషనర్లు ఆ జీవోను సవాలు చేయలేదని, అయినా కూడా సింగిల్ జడ్జి దాన్ని కొట్టేస్తూ తీర్పునిచ్చారని ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కౌంటర్ దాఖలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా, విచారణకు స్వీకరించే దశలోనే సింగిల్ జడ్జి తుది తీర్పు వెలువరించారన్నారు. -
అప్పీల్‌పై సోమవారం విచారణ
♦ ఏఏజీ అభ్యర్థనను అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం ♦ మీరు ఉత్తర్వులిచ్చినా సభకు అనుమతించడం లేదు ♦ సింగిల్ జడ్జి ముందు ప్రస్తావించిన రోజా తరపు న్యాయవాది సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై శాసన సభా వ్యవహారాలశాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. తమ అప్పీల్ గురించి శుక్రవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ముందు ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రస్తావించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల గురించి వివరించారు. ఈ అప్పీల్‌పై సోమవారం విచారణ చేపట్టాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ సోమవారం విచారణ చేపట్టాలంటే ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని, ఆ రోజున ప్రస్తావిస్తే సరిపోతుంది కదా? అని ప్రశ్నించింది. సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించే రోజు కావడంతో ఆ రోజున తమ అప్పీల్‌ను కేసుల జాబితాలో చేర్చడం సాధ్యం కాదని రిజిస్ట్రీ చెబుతోందని, అందువల్ల ఇప్పుడు ప్రస్తావిస్తున్నానని శ్రీనివాస్ చెప్పారు. దీంతో ధర్మాసనం అప్పీల్‌ను సోమవారం విచారించేందుకు అంగీకరించింది. మీ ఉత్తర్వులను అమలు చేయడం లేదు.. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని ఆమె తరఫు న్యాయవాది నర్మద శుక్రవారం ఉదయం న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీ వర్గాలు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఆమె తెలిపారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు స్పందిస్తూ, దీని గురించి సోమవారం ప్రస్తావించాలని ఆమెకు సూచించారు. -
మాజీ డీజీపీ అరవిందరావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: మాజీ డీజీపీ అరవిందరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఐపీఎస్ అధికారి సుందర కుమార్ దాస్ ఫిర్యాదు ఆధారంగా అరవిందరావుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎస్.వి.భట్టీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అరవిందరావు అదనపు డీజీగా ఉన్న సమయంలో.. తాను ఎస్సీని కావడంతో సరైన పోస్టింగ్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటూ దాస్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అరవిందరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అరవిందరావు గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
దుబ్బాక నగర పంచాయతీ కేసులో మలుపు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా, దుబ్బాకను నగర పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలోని ధర్మాజీపేట, లచ్చపేట, చెర్వపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లయ్యపల్లి గ్రామ పంచాయతీలను కలిపి దుబ్బాక నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 31న జీఓ జారీ చేసింది. ఈ జీఓను సవాలు చేస్తూ దుబ్బాకకు చెందిన గుండబోయిన ఆంజనేయులు, కూరపాటి బంగారయ్య మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఈ ఏడాది జూన్ 27న తీర్పునిస్తూ.. గ్రామ పంచాయతీల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం నగర పంచాయతీని ఏర్పాటు చేసిందని, అందువల్ల జీఓను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మెదక్‌కు చెందిన వి.సుభద్ర ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, గురువారం మరోసారి విచారించింది. సుభద్ర తరఫున ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లు ఆ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు పిటిషన్ దాఖలు చేశారని, విభజన తర్వాత పిటిషన్‌కు సవరణలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని, అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదని వివరించారు. దీనికి రిట్ పిటిషనర్ల తరఫు న్యాయవాది సమాధానమిస్తూ, సవరణలు చేస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సింగిల్ జడ్జి తీర్పులో ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఉన్నట్లు లేకపోవడాన్ని ధర్మాసనం గుర్తించింది. శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. వారంలోపు రిట్ పిటిషనర్లు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని, ఒకవేళ అలా దాఖలు చేయకపోతే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని తెలిపింది. కొస మెరుపు.. ఇదిలా ఉంటే నగర పంచాయతీ జీఓను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ రిట్ పిటిషనర్లు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి, అధికారుల చర్యలను సమోటోగా కోర్టు ధిక్కారంగా పరిగణించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు పురపాలకశాఖ, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. తాజాగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార ఉత్తర్వులు కూడా రద్దయినట్లే.