సాక్షి, అమరావతి: విశాఖపట్నం గీతం విద్యాసంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరపడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వ భూముల్లో తాము చేపట్టిన నిర్మాణాల నుంచి తమను ఖాళీ చేయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న గీతం అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సబబుగానే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి కట్టడాలు, కూల్చివేతలు వద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు గీతం ప్రయోజనాలను కాపాడేలా ఉన్నాయని, అలాంటప్పుడు ఆ ఉత్తర్వులు ఎలా తప్పవుతాయని ప్రశ్నించింది. తదుపరి ఏం ఉత్తర్వులు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లాలని గీతం యాజమాన్యానికి స్పష్టం చేసింది.
గీతం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తూ జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిని పెద్దమొత్తంలో ఆక్రమించిన గీతం యాజమాన్యం పలు నిర్మాణాలు చేపట్టింది. కొన్నింటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీనిపై గీతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. తదుపరి ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని రెవెన్యూ అధికారులను, కూల్చివేసినచోట ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గీతం యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలపై గీతం యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై మంగళవారం జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
మీకు అనుకూలంగా ఇచ్చినా అభ్యంతరమా?: గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చి తమ నిర్మాణాలను కూల్చేశారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. సింగిల్ జడ్జి మీకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు కదా, మీకు అభ్యంతరం ఏముంది అని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి కేవలం తదుపరి కూల్చివేతలు వద్దని మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారని రుద్రప్రసాద్ చెప్పగా, అంతకు మించిన సానుకూల ఉత్తర్వులు ఏం ఇవ్వగలమని మళ్లీ ప్రశ్నించింది. తమ నిర్మాణాల నుంచి తమను ఖాళీచేయించేందుకు ప్రయత్నిస్తూ థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఆ దిశగా చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలని రుద్రప్రసాద్ కోరారు.
ధర్మాసనం అందుకు నిరాకరించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. తదుపరి ఏం ఆదేశాలు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ అప్పీల్‌పై విచారణ జరపాలంటే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్‌ను కొట్టేయించుకురావాలని తెలిపింది. సింగిల్ జడ్జి మంచి ఉత్తర్వులిస్తే, దానిపై అభ్యంతరం చెబుతూ అప్పీల్ దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది. తాము ఈ అప్పీల్‌ను విచారించబోమని తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ భూమిలో కట్టిన అక్రమ కట్టడాలనే కూల్చివేశామని చెప్పారు. తమ భూమిని తాము స్వాధీనం చేసుకోవడాన్ని గీతం తప్పుపడుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబే
Published Wed, Nov 4 2020 3:45 AM | Last Updated on Wed, Nov 4 2020 3:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment