కరకట్ట ఆక్రమణలైనా కూల్చాల్సిందే | Andhra Pradesh High Court On illegal structures Govt Lands | Sakshi
Sakshi News home page

కరకట్ట ఆక్రమణలైనా కూల్చాల్సిందే

Published Wed, Sep 14 2022 4:26 AM | Last Updated on Wed, Sep 14 2022 4:26 AM

Andhra Pradesh High Court On illegal structures Govt Lands - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని కరకట్టపై అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు, చెరువులు, నీటి కుంటలు, ఇతర నీటి వనరులు, శ్మశానాలు తదితరాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను కూడా కూల్చి వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. 30–40 సంవత్సరాల క్రితమే భూములను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను సైతం తొలగించాలంది. తమకు ఎవరైనా ఒక్కటేనని, ఈ విషయంలో నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, నీటి వనరులు తదితరాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల సంగతి తేలుస్తామన్న హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా మలిచిన విషయం తెలిసిందే. ఈ తరహా ఆక్రమణలన్నింటిపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ ఈ సుమోటో పిల్‌కు జత చేసిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం.. వీటిపై మంగళవారం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ, కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుని కరకట్ట వద్ద నిర్మాణాలు చేపట్టారని, వాటికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ నిర్మాణాల సంగతి కూడా చూస్తామని, తమకు ఎవరైనా ఒకటేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ) పోతిరెడ్డి సుభాష్‌ రెడ్డి స్పందిస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే చేపట్టిన నిర్మాణాల సంగతి ఏమిటని అడిగారు.

అలాంటి నిర్మాణాలను సైతం కూల్చి వేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని వ్యాజ్యాల్లో ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించాల్సిందేనని, ప్రభుత్వం తీసుకొచ్చిన క్రమబద్దీకరణ పథకం ద్వారా క్రమబద్దీకరణ చేసుకున్న వారు మినహా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మిగిలిన వారంతా ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఈ సమయంలో న్యాయవాది యలమంజుల బాలాజీ జోక్యం చేసుకుంటూ, వినుకొండలో మునిసిపాలిటీయే డిగ్రీ కాలేజీ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని మునిసిపల్‌ కార్పొరేషన్‌ తరఫు న్యాయవాదిని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

..ఇలా కుమ్మక్కవుతారు 
తామిచ్చిన ఆదేశాల ప్రకారం ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు మొదలు పెట్టగానే, కొందరు హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేస్తారని, తామిచ్చిన ఉత్తర్వుల సంగతి సింగిల్‌ జడ్జికి చెప్పకుండా స్టే ఉత్తర్వులు పొందుతారని ధర్మాసనం తెలిపింది. అధికారులు సైతం తమ ఉత్తర్వుల సంగతిని సింగిల్‌ జడ్జి దృష్టికి తీసుకురారని, ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల సంగతి తెలియని సింగిల్‌ జడ్జి.. పిటిషనర్లకు అనుకూలంగా స్టే ఉత్తర్వులు ఇస్తారని వివరించింది. ఇలా పిటిషనర్లు, రెవిన్యూ అధికారులు కలిసి కుమ్మక్కవుతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

రాజ్యాంగం ఆక్రమించుకోమని చెప్పిందా?
గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేపట్టారని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇస్తే అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా ఆ నిర్మాణాలను కూల్చేస్తారని న్యాయవాది విద్యావతి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కూల్చి వేతలకు ముందు అధికారులు తప్పక వాదనలు వినిపించుకునే అవకాశం ఇస్తారని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.

తమ జీవనాధారాన్ని కూడా చూడాలని, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును పరిగణనలోకి తీసుకోవాలని విద్యావతి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోమని చెప్పిందా? అని ప్రశ్నించింది.

రెవిన్యూ అధికారుల వల్లే ఆ పరిస్థితి 
ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌ స్పందిస్తూ.. దాదాపు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో రెవిన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని తెలిపింది. రెవిన్యూ అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని  స్పష్టం చేసింది. ఈ సమయంలో ఓ న్యాయవాది స్పందిస్తూ, గుంటూరులో శ్మశాన వాటికను ఆక్రమించుకుని షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

శ్మశానంలో షాపింగ్‌ కాంప్లెక్సా అంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కాగా, వివిధ రకాల ఆక్రమణలపై దాఖలైన 55 పిటిషన్లకు సంబంధించి   తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా వ్యాజ్యాలను ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, శ్మశానాల ఆక్రమణ, తదితర అంశాల వారీగా ధర్మాసనం విభజించింది. వీటిపై తదుపరి విచారణ నిమిత్తం కొన్నింటిని బుధవారం, మరి కొన్నింటిని గురువారానికి, ఇంకొన్నింటిని సోమవారానికి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement