Demolition of illegal structures
-
మీ ఆస్తులు జప్తు చేస్తే తెలిసొస్తుంది
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి, ఆ తర్వాత కొన్నేళ్లకు కూల్చివేత నోటీసులిచ్చే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తే గానీ సరిగా విధులు నిర్వహించరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నష్టపరిహారం కూడా సదరు అధికారుల నుంచే వసూలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన స్థితి వస్తుందని హెచ్చరించింది. అధికారుల ఆస్తులు జప్తు చేస్తే అప్పుడు తెలిసొస్తుందని పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో సర్కార్ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అధికారుల తప్పులకు ప్రజాధనం వెచ్చిoచడం సరికాదని అభిప్రాయపడింది. నిర్మాణం అక్రమమైనప్పుడు ఆ నిర్మాణం చేపట్టడానికి ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించింది. అవకతవకలకు పాల్పడి అనుమతులిచ్చి.. నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ అంటూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడింది.అయితే, నీటివనరుల సంరక్షణకు తాము వ్యతిరేకం కాదని, అధికారుల తీరునే తప్పుబడుతున్నామని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ గ్రామం మంగరాశి కుంట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఇళ్లను నిర్మించారంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. 15 రోజులు సమయమివ్వండి.. అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా కూలుస్తామని అధికారులు ఈ నెల 4న నోటీసులు అతికించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏడు రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని అందులో హెచ్చరించారన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. పిటిషనర్ల వాదన వినకుండా.. కూల్చివేతపై ముందుకెళ్లడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ముందుగా చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం అక్రమమని తేలితే.. చట్ట ప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేయాలని, 15 రోజుల సమయం ఇచ్చి పిటిషనర్ల వాదన కూడా వినాలన్నారు. పిటిషనర్లు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రసీదులను జతచేస్తూ వివరాలు అందజేయాలంటూ జడ్జి విచారణ ముగించారు. -
AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అటవీ, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఆరు నెలల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: (శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ) -
కరకట్ట ఆక్రమణలైనా కూల్చాల్సిందే
సాక్షి, అమరావతి: కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని కరకట్టపై అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు, చెరువులు, నీటి కుంటలు, ఇతర నీటి వనరులు, శ్మశానాలు తదితరాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను కూడా కూల్చి వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. 30–40 సంవత్సరాల క్రితమే భూములను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను సైతం తొలగించాలంది. తమకు ఎవరైనా ఒక్కటేనని, ఈ విషయంలో నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, నీటి వనరులు తదితరాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల సంగతి తేలుస్తామన్న హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా మలిచిన విషయం తెలిసిందే. ఈ తరహా ఆక్రమణలన్నింటిపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ ఈ సుమోటో పిల్‌కు జత చేసిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం.. వీటిపై మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుని కరకట్ట వద్ద నిర్మాణాలు చేపట్టారని, వాటికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ నిర్మాణాల సంగతి కూడా చూస్తామని, తమకు ఎవరైనా ఒకటేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ) పోతిరెడ్డి సుభాష్ రెడ్డి స్పందిస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే చేపట్టిన నిర్మాణాల సంగతి ఏమిటని అడిగారు. అలాంటి నిర్మాణాలను సైతం కూల్చి వేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని వ్యాజ్యాల్లో ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించాల్సిందేనని, ప్రభుత్వం తీసుకొచ్చిన క్రమబద్దీకరణ పథకం ద్వారా క్రమబద్దీకరణ చేసుకున్న వారు మినహా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మిగిలిన వారంతా ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ సమయంలో న్యాయవాది యలమంజుల బాలాజీ జోక్యం చేసుకుంటూ, వినుకొండలో మునిసిపాలిటీయే డిగ్రీ కాలేజీ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదిని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ..ఇలా కుమ్మక్కవుతారు తామిచ్చిన ఆదేశాల ప్రకారం ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు మొదలు పెట్టగానే, కొందరు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేస్తారని, తామిచ్చిన ఉత్తర్వుల సంగతి సింగిల్ జడ్జికి చెప్పకుండా స్టే ఉత్తర్వులు పొందుతారని ధర్మాసనం తెలిపింది. అధికారులు సైతం తమ ఉత్తర్వుల సంగతిని సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురారని, ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల సంగతి తెలియని సింగిల్ జడ్జి.. పిటిషనర్లకు అనుకూలంగా స్టే ఉత్తర్వులు ఇస్తారని వివరించింది. ఇలా పిటిషనర్లు, రెవిన్యూ అధికారులు కలిసి కుమ్మక్కవుతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ఆక్రమించుకోమని చెప్పిందా? గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేపట్టారని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇస్తే అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా ఆ నిర్మాణాలను కూల్చేస్తారని న్యాయవాది విద్యావతి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కూల్చి వేతలకు ముందు అధికారులు తప్పక వాదనలు వినిపించుకునే అవకాశం ఇస్తారని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తమ జీవనాధారాన్ని కూడా చూడాలని, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును పరిగణనలోకి తీసుకోవాలని విద్యావతి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోమని చెప్పిందా? అని ప్రశ్నించింది. రెవిన్యూ అధికారుల వల్లే ఆ పరిస్థితి ప్రభుత్వ న్యాయవాది సుభాష్ స్పందిస్తూ.. దాదాపు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో రెవిన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని తెలిపింది. రెవిన్యూ అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఓ న్యాయవాది స్పందిస్తూ, గుంటూరులో శ్మశాన వాటికను ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. శ్మశానంలో షాపింగ్ కాంప్లెక్సా అంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కాగా, వివిధ రకాల ఆక్రమణలపై దాఖలైన 55 పిటిషన్లకు సంబంధించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా వ్యాజ్యాలను ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, శ్మశానాల ఆక్రమణ, తదితర అంశాల వారీగా ధర్మాసనం విభజించింది. వీటిపై తదుపరి విచారణ నిమిత్తం కొన్నింటిని బుధవారం, మరి కొన్నింటిని గురువారానికి, ఇంకొన్నింటిని సోమవారానికి వాయిదా వేసింది. -
బుల్డోజర్లు, కూల్చివేతలు
లక్నో/కోల్‌కతా/రాంచీ: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రోజులుగా అల్లర్లు చెలరేగిన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రశాంతత నెలకొంటోంది. చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఎత్తేసి, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత సువేందును అధికారులు అడ్డుకున్నారు. యూపీలో అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అరెస్టులు, అనుమానితుల ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాంచీలో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌కు మహారాష్ట్రలోని భివాండీ పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం పలు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లను బీజేపీ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఖండించింది. వాటిలో పాల్గొన్న వారిని ఇస్లాం నుంచి వెలి వేయాలని మంచ్ వ్యవస్థాపకుడు, ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు, ఇస్లాం విద్వేష ఘటనలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ నేత శిశిథరూర్ అన్నారు. యూపీలో బుల్డోజర్లు యూపీలో శుక్రవారం నాటి అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సహరన్‌పూర్‌లో రాళ్లు రువ్వి న ఘటనలకు సూత్రధారిగా అనుమానిస్తూ ఇద్దరి ఇళ్లను అధికారులు శనివారం నేలమట్టం చేయడం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లో రాళ్లు రువ్విన ఘటనల్లో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జావెద్ అహ్మద్ అనుమతుల్లేకుండా కట్టిన ఇంటిని ఆదివారం బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ‘శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది. చట్ట వ్యతిరేక చర్యలకు దిగేవారు దీన్ని గుర్తుంచుకోవాలి’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. అల్లర్లకు సంబంధించి మొత్తం 316 మందిని అరెస్ట్ చేశారు. బెంగాల్లో హైడ్రామా శుక్రవారం అల్లర్లకు సంబంధించి బెంగాల్‌లోని ముర్షిదాబాద్, హౌరా జిల్లాలకు చెందిన 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్బ మేదినీపూర్ జిల్లాలోని తామ్లుక్‌లో ఆదివారం ఉదయం హైడ్రామా నడిచింది. హౌరాలోని అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంటల అనంతరం నేరుగా కోల్‌కతాకు వెళ్లాలన్న షరతుతో ఆయన్ను వదిలేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. హింసకు పాల్పడినట్లు గుర్తించిన 22 మందితోపాటు, గుర్తు తెలియని వేలాది మందిపై 25 కేసులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్ ఎత్తివేశారు. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. కశ్మీర్‌లోని పలు పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. -
కిటికీలోంచి కారం చల్లి, పెట్రోల్‌తో దాడి
సాక్షి, జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన కమిషనర్ మంగమ్మ, కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అలాగే కార్పొరేషన్ సిబ్బంది, జవహర్‌నగర్ ‘సాక్షి’ విలేకరి సురేందర్‌కు గాయాలయ్యాయి. చదవండి: భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది.. ఘటన నేపథ్యమిదీ.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్‌కుమార్ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్ కేంద్రంగా మున్సిపల్ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్‌నగర్ వాసి పూనమ్ చంద్ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్‌గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్ అధికారులను పూనమ్ చంద్ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. తీవ్ర ఉద్రిక్తత.. మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక రాజకీయ పార్టీ నేతలు పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు మద్దతు పలికారు. ‘వారు చస్తారు. లేదంటే చంపుతారు’ అంటూ రెచ్చొగొట్టేలా నినాదాలు చేశారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలైంది. సీఐ భిక్షపతి నేతృత్వంలోని పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. అయితే గది లోపల కాగడాల మంటలు ఉండటంతో పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందని సీఐ తలుపులను కాళ్లతో తన్నారు. వెంటనే ఆ గదిలో ఉన్న శాంతి కుమారి నేరుగా పెట్రోల్ చల్లడంతో సీఐ భిక్షపతిపై పడింది. కుట్ర కోణంలో విచారణ: రాచకొండ సీపీ గదిలో నుంచి పొగలు వస్తున్నాయని సీఐ భిక్షపతి తలుపు తెరిచేందుకు యత్నించాడు. తలుపు తెరుచుకున్న వెంటనే లోపలి నుంచి మంటలు వచ్చాయి. ఎవరైనా అతడి మీద దాడి చేశారా.. అనేది పోలీసు విచారణలో తేలుతుంది. ఈ ఘటనలో కుట్ర కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. గదిలో ఉన్న శాంతికుమారి, పూనమ్‌చంద్‌లకు ఏమీ జరగలేదు. కేసు విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నాం. సీఐ భిక్షపతికి చేతులు, కాళ్లు 14 నుంచి 15 శాతం వరకు కాలాయి. – రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ -
నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం
కూల్చివేతలు షురూ అక్టోబరు 3 వరకు కూల్చివేతలు పైలట్ ప్రాజెక్టుగా భద్రకాళీ, వడ్డేపల్లి నాలాలు చెరువుల కబ్జాలపై నజర్, నోటీసుల జారీ ప్రభుత్వ ఆదేశాలు అమలు : మేయర్ నరేందర్ సాక్షి, హన్మకొండ : నాలాల విస్తరణపై గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ గట్టి చర్యలు ప్రారంభించింది. నాలాల వెంట అడ్డదిడ్డంగా ఉన్న∙అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించింది. వడ్డేపల్లి నాలా వెంబడి నయింనగర్ పెద్దమోరీ దగ్గర వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం భారీ యంత్రాల సహయంతో ఈ పనులు నిర్వహిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. నగరంలో ఉన్న వడ్డేపల్లి, భద్రకాళీ చెరువులు ఉప్పొంగాయి. ఈ చెరువుల కింద ఉన్న నాలాలు అక్రమ నిర్మాణాల కారణంగా కుచించుకుపోవడంతో వరద నీరు ముందుకు పోక జనావాసాలను ముంచెత్తింది. దీంతో నాలాల వెంబడి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ పాలకవర్గం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. తొలివిడతగా బుధ, గురువారాల్లో భద్రకాళీ, వడ్డేపల్లి నాలాల వెంబడి సర్వేలు చేపట్టి, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గురువారం చేపట్టిన కార్యక్రమంలో వడ్డేపల్లి నాలాపై నయీంనగర్ పెట్రోల్ బంక్ నుంచి చైతన్య కాలేజి వరకు మొత్తం 18 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించగా 13 నిర్మాణాలు కూల్చివేశారు. ఇందులో ప్రహరిగోడలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పశువుల దొడ్ల వంటివి ఉన్నాయి. మిగిలిన ఐదు అక్రమ నిర్మాణాలను నేడు కూల్చివేయనున్నారు. అక్టోబరు 3 నుంచి రెండోవిడత అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం తిరిగి కొనసాగించనున్నారు. సర్వేల ఆధారంగా... రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్ నుంచి నగరంలో ఉన్న నాలాల వెడల్పు, ఆక్రమణలు, నగరంలో ఉన్న చెరువుల పూర్తి నీటి సామర్థ్యం (ఫుల్ టాంక్ లెవల్, ఎఫ్టీఎల్), బఫర్జోన్ల వివరాలు తెప్పించారు. వీటి ఆధారంగా బుధ, గురువారాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉపక్రమించారు. ఈ నివేదిక ప్రకారం నగరంలో ఉన్న వడ్డేపల్లి, భద్రకాళి వంటి ప్రధాన నాలాలతో పాటు ఏడు చెరువుల దగ్గర ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్రమ భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల తర్వాత వీటిపై చర్యలు తీసుకోనున్నారు. భవిష్యత్తులో నాలాలు, చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వేల్యాండ్ రికార్డ్స్ విభాగాల సహకారంతో సంయుక్త సర్వేను చేపట్టనున్నారు. బడా షాక్... గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ బుధవారం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు నగరంలో సంచలనం రేపింది. తొలిదశలో అధికారులు బడా విద్యా సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. నయీంనగర్ పెద్దమోరి వంతెన సమీపంలో ఉన్న వాగ్దేవి ఉన్నత పాఠశాల (నాలను ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టిన) ప్రహరిని జెసీబీతో కూల్చివేశారు. గురువారం ఉదయం 9:30 గంటలకు చైతన్య విద్యాసంస్థలకు చెందిన ప్రహరి, భవనాల నిర్మాణాలపై సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలకు తేలిన భవనాలను కూల్చివేయనున్నారు. బడా విద్యాసంస్థలకు చెందిన సంస్థలపైనే తొలి వేటు వేయడంతో అక్రమ నిర్మాణాలపై గ్రేటర్ వైఖరి స్పష్టంగా తేటతెల్లమైంది. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. కూల్చివేతలో పాల్గొన్న సిబ్బంది, అధికారుల్లో మనోసై్థర్యం నింపేందుకు నగర మేయర్ నన్నపునేని నరేందర్ దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. పైరవీలకు తావులేదు - మేయర్ నన్నపునేని నరేందర్ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనం మేరకు ఆక్రమణలకు గురైన నాలాలు, చెరువులను కబ్జాదారుల కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తున్నాం. ఇటీవల 22 సెంటిమీటర్ల వర్షం కురిస్తే, ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పలుచోట్ల ఆస్తినష్టం జరిగింది. నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలకు గురవ్వడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దన్న ఉద్దేశ్యంతో 44 సెంటిమీటర్ల వర్షం కురిసినా నగరం ముంపు బారిన పడవద్దనే ఉద్దేశ్యంతో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టాం. ఈ ఆపరేషన్‌కు పూర్తి సహకారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో గ్రేటర్ వరంగల్‌లో ఎంత పెద్ద వర్షం కురిసినా నగరం ముంపునకు గురికావద్దన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎలాంటి పైరవీలకు తావులేదు. గతంలో మాదిరి కాకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలో పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలను ముందుగా టార్గెట్ చేస్తున్నాం. వీరి నిర్మాణాలు కూల్చివేత అనంతరమే ఇతర నిర్మాణాల జోలికి వెళ్తాం. పేద వాళ్ల ఇళ్లు కూల్చివేయడం తప్పనిసరి అయితే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతాం. అందులో భాగంగా రెండు పడకగదుల ఇళ్లు కేటాయిస్తాం. -
మంత్రి కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ ఫోన్
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం ఫోన్ చేశారు. నగరంలో పెద్ద ఎత్తున చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్ ఆరా తీశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్‌కు ఆదేశించారు. నగరంలో రెండోరోజు కొనసాగుతున్న కూల్చివేతలపై సీఎంకు కేటీఆర్ వివరించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కేసీఆర్ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించనున్నారు.