నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం | Demolition the drainage encroaches | Sakshi
Sakshi News home page

నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం

Published Thu, Sep 29 2016 12:33 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

కూల్చివేతల పర్యవేక్షిస్తున్న మేయర్‌ నరేందర్ - Sakshi

కూల్చివేతల పర్యవేక్షిస్తున్న మేయర్‌ నరేందర్

  • కూల్చివేతలు షురూ
  • అక్టోబరు 3 వరకు కూల్చివేతలు
  • పైలట్‌ ప్రాజెక్టుగా భద్రకాళీ, వడ్డేపల్లి నాలాలు
  • చెరువుల కబ్జాలపై నజర్, నోటీసుల జారీ
  • ప్రభుత్వ ఆదేశాలు అమలు : మేయర్‌ నరేందర్‌
  • సాక్షి, హన్మకొండ : నాలాల విస్తరణపై గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ గట్టి చర్యలు ప్రారంభించింది. నాలాల వెంట అడ్డదిడ్డంగా ఉన్న∙అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించింది. వడ్డేపల్లి నాలా వెంబడి నయింనగర్‌ పెద్దమోరీ దగ్గర వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం భారీ యంత్రాల సహయంతో ఈ పనులు నిర్వహిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది.
     
    నగరంలో ఉన్న వడ్డేపల్లి, భద్రకాళీ చెరువులు ఉప్పొంగాయి. ఈ చెరువుల కింద ఉన్న నాలాలు అక్రమ నిర్మాణాల కారణంగా కుచించుకుపోవడంతో వరద నీరు ముందుకు పోక జనావాసాలను ముంచెత్తింది. దీంతో నాలాల వెంబడి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు  గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ పాలకవర్గం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. తొలివిడతగా బుధ, గురువారాల్లో భద్రకాళీ, వడ్డేపల్లి నాలాల వెంబడి సర్వేలు చేపట్టి, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గురువారం చేపట్టిన కార్యక్రమంలో వడ్డేపల్లి నాలాపై నయీంనగర్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి చైతన్య కాలేజి వరకు మొత్తం 18 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించగా 13 నిర్మాణాలు కూల్చివేశారు. ఇందులో ప్రహరిగోడలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పశువుల దొడ్ల వంటివి ఉన్నాయి. మిగిలిన ఐదు అక్రమ నిర్మాణాలను నేడు కూల్చివేయనున్నారు. అక్టోబరు 3 నుంచి రెండోవిడత అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం తిరిగి కొనసాగించనున్నారు. 
     
    సర్వేల ఆధారంగా...
    రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్‌ నుంచి నగరంలో ఉన్న నాలాల వెడల్పు, ఆక్రమణలు, నగరంలో ఉన్న చెరువుల పూర్తి నీటి సామర్థ్యం (ఫుల్‌ టాంక్‌ లెవల్, ఎఫ్‌టీఎల్‌), బఫర్‌జోన్‌ల వివరాలు తెప్పించారు. వీటి ఆధారంగా బుధ, గురువారాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉపక్రమించారు. ఈ నివేదిక ప్రకారం నగరంలో ఉన్న వడ్డేపల్లి, భద్రకాళి వంటి ప్రధాన నాలాలతో పాటు ఏడు చెరువుల దగ్గర ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్రమ భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల తర్వాత వీటిపై చర్యలు తీసుకోనున్నారు. భవిష్యత్తులో నాలాలు, చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగాల సహకారంతో సంయుక్త సర్వేను చేపట్టనున్నారు. 
     
    బడా షాక్‌...
    గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థ బుధవారం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు నగరంలో సంచలనం రేపింది. తొలిదశలో అధికారులు బడా విద్యా సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.  నయీంనగర్‌ పెద్దమోరి వంతెన సమీపంలో ఉన్న వాగ్దేవి ఉన్నత పాఠశాల (నాలను ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టిన) ప్రహరిని జెసీబీతో కూల్చివేశారు. గురువారం ఉదయం 9:30 గంటలకు చైతన్య విద్యాసంస్థలకు చెందిన ప్రహరి, భవనాల నిర్మాణాలపై సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలకు తేలిన భవనాలను కూల్చివేయనున్నారు. బడా విద్యాసంస్థలకు చెందిన సంస్థలపైనే తొలి వేటు వేయడంతో అక్రమ నిర్మాణాలపై గ్రేటర్‌ వైఖరి స్పష్టంగా తేటతెల్లమైంది. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. కూల్చివేతలో పాల్గొన్న సిబ్బంది, అధికారుల్లో మనోసై్థర్యం నింపేందుకు నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ దగ్గరుండి పనులు పర్యవేక్షించారు.  
     
    పైరవీలకు తావులేదు - మేయర్‌ నన్నపునేని నరేందర్‌
    రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మార్గనిర్దేశనం మేరకు ఆక్రమణలకు గురైన నాలాలు, చెరువులను కబ్జాదారుల కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తున్నాం. ఇటీవల 22 సెంటిమీటర్ల వర్షం కురిస్తే, ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పలుచోట్ల ఆస్తినష్టం జరిగింది. నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలకు గురవ్వడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దన్న ఉద్దేశ్యంతో 44 సెంటిమీటర్ల వర్షం కురిసినా నగరం ముంపు బారిన పడవద్దనే ఉద్దేశ్యంతో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టాం. ఈ ఆపరేషన్‌కు పూర్తి సహకారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.  భవిష్యత్తులో గ్రేటర్‌ వరంగల్‌లో ఎంత పెద్ద వర్షం కురిసినా నగరం ముంపునకు గురికావద్దన్న లక్ష్యంతో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎలాంటి పైరవీలకు తావులేదు. గతంలో మాదిరి కాకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలో పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలను ముందుగా టార్గెట్‌ చేస్తున్నాం. వీరి నిర్మాణాలు కూల్చివేత అనంతరమే ఇతర నిర్మాణాల జోలికి వెళ్తాం. పేద వాళ్ల ఇళ్లు కూల్చివేయడం తప్పనిసరి అయితే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతాం. అందులో భాగంగా రెండు పడకగదుల ఇళ్లు కేటాయిస్తాం. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement