‘‘అప్పుడెప్పుడో కాటన్‌దొర అని ఓ ఆసామి ఉండేవాడు. ఆయన నూరూ, నూటాయాభై ఏళ్ల కిందట కట్టిన బ్యారేజ్‌లు చెక్కుచెదర...’’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో విమర్శించబోతుంటే..రాబోతున్న గుగ్లీ బంతేమిటో తెలిసి, మధ్యలోనే దాన్ని కట్ చేస్తూ...
‘‘ఏయ్... ఎవల్లో ఎప్పుడో ఆంధ్రోల్ల కోసం, ఆంధ్ర ఏరియాల కట్టిన ప్రాజెక్టులతోని పోల్చి..తెలంగాణను తక్కువ చేస్తూ మాట్లాడతరెందుకురా?’’ అంటూ దాన్ని కవర్‌డ్రైవ్ వైపు నెట్టేశారు బీఆర్‌ఎస్ కార్యకర్తలు.
‘‘అయితే తెలంగాణ గురించే మాట్లాడదాం. ఈడ హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు ప్లానిచ్చిండు. ఇక్కడి డ్రైనేజీ సిస్టమ్‌ను చక్కబెట్టడానికి అలనాడెప్పుడో మోక్షగుండం విశ్వేశ్వర...’’ మళ్లీ మధ్యలోనే మాట కట్ చేసి, మళ్లీ ఇలా చెప్పారు. ‘‘అసలు తెలంగాణ అపరభగీరథుడు కేసీఆర్ పవరేమిటో తెల్సా? అసలాయన ఉనికేందో, ఎల్లవేళలా నీళ్లల పుట్టి నీళ్లల పెరిగిన ఆ సంగతులు తెల్సా మీకు?’’
‘‘ఏందీ... నీల్లల్ల బుట్టి నీల్లల్ల పెరిగిండా? అదెట్ల?’’ చెప్పడం మొదలుపెట్టారు బీఆర్‌ఎస్ వారు. అదేదో సిన్మాల బాహుబలి అనేటాయన ఒక పే...ద్ద జలపాతం.. దాని ఎమ్మట్నే పారే పే...ద్ద నది ఉండే..ఆ ఊళ్ల పెరిగిండు కదా. కానీ కేసీఆర్ సార్ నిజంగనే నాలుగు మూలలల్ల నాలుగు అద్భుత తటాకాలున్న పల్లెల పుట్టి, పెరిగిండు. చింతమడక అనే ఆ ఊళ్లె... ఊరికి ఉత్తరాన పెద్ద చెరువు ఉంటె, దక్షిణాన దమ్మచెరువుంది. కొద్దిగ పెడమర్ల పడమర్ల కోమటి చెరువు! తూర్పున సింగచెరువు!! కొద్దిగ దూరంల అంకపేటల ఈశాన్యాన పెద్ద చెర్వు!!
కోమటిచెరువుల ఈదిండు. పెద్ద చెరువుల తొక్కునీల్ల కాడ దునికి కాకరాల్ల దాక పొయ్యి... అక్కడ మత్తడి దాంక ఈతగొట్టిండు. చింతచెర్వు మొత్తం ఈదిండు. దమ్మచెర్వుకింద ఒక బాయి ఉండె. దాంట్లెకు మోటచిమ్ములెక్కి దునికేది. ఎత్తు సరిపోక మర్రిచెట్టుకొమ్మలెక్కి కూడ దునికేది. అసలు వాళ్ల ఊళ్లె వాళ్లింటి పాటకు ముందునుంచే మూణ్ణెల్లు జాలు నీళ్లు జాలుబారుతుంటే, ఆ నీళ్లల కాయితప్పడవలేసి, ఆడిండు. ఇగ రాజకీయాలల్లకు వచ్చినంక గూడ.. కార్ల పొయ్యేటప్పుడు ఏడ్నన్న బిడ్జి కనబడితే సాలు... ఆగి దాంట్లెకు ఓ రూపాయో, రెండో, ఐదురూపాల బిళ్లను ఇసిరేటోడు. అది బుడుంగన మునిగేదాంక ఆగి చూసి, అప్పుడు కదలేటోడు.
నీళ్లతోని ఇంత అనుభవం, ఇంత నైపుణ్యం ఉండి, జాలునీళ్లల్ల కాయితప్పడవలతోటి ఫ్లోటాలజీ, నీళ్లు పారే తీరు తెలిసిన ‘ఫ్లోవాలజీ’, మునిగే కాయిన్లతోని తెలుసుకున్న ‘బుడుంగాలజీ’, వాటర్ల నీటిశాతం, బురదల జిగటశాతం, ఉస్కెతోని రేణుశాస్త్రం.. ఇయన్నీ తెలుసుగాబట్టే.. తెల్లారితె బాహుబలి జలపాతాన్ని ఎక్స్‌ప్లోర్ చేసినట్టే... కేసీఆర్ సారు గూడ పొద్దుందాక నీళ్లతత్వం అధ్యయనం చేసి, తెలుసుకునేది. ఆ అనుభవంతోని వచ్చినయే ఈ మేడిగడ్డలూ, అన్నారాలు... ఈ ప్రాజెక్టులన్నీ.
ఆ సిన్మాల బాహుబలి వాళ్ల అమ్మగారు బాధపడ్డట్టే... తెలంగాణ తల్లి కూడ బుగులుబడతాంది. కానీ..బక్కపానమైనా మాసారు బాహుబలికంటె ఎక్కువ బలమూ, సంకల్ప బలమూ ఉన్నోడు. ‘జటాకటాహ సంభ్రమ భ్రమ్మన్నిలింప నిరఝరీ, విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ.. ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే..కిశోర ‘‘చంద్రశేఖరే’’..అని మాసారు పేరు తోని బ్యాక్‌గ్రౌండ్‌ల పాట వినిపిస్తుండంగా...
ఎవ్వరంట ఎవ్వరంటా
పిల్లరెత్తుకుందీ?
తెలంగాణ తల్లికీ ముద్దులకొడుకీ నందీ.
ఉస్కెలో డస్కిందీ..బురదలో కుంగిందీ
పిల్లరెత్తుకున్నాక
భుజమ్మీద పెట్కోనీ పైకెత్తేనండీ...
ఇట్లా మునపటి లెవల్‌కు తెల్చి... తల్లితో ‘‘అమ్మా ఒప్పేనా?’’ అంటూ అడిగాడు. అప్పుడామె ‘‘నాకేమి తెలుసు? ఓటరు దేవరనడుగు?’’ అనగానే ఇటు తిరిగి... ఆయన ఓటరు దేవరనడిగాడు. అప్పుడు... ‘‘ఏమో శివుడి మనసులో ఏముందో... శివుడేటనుకుంటున్నాడో మనకేమి తెల్సు’’ అంటూ అప్పటికి గడుసుగా బదులిచ్చాడు ఓటరు దేవర.
అపర బాహుబలి మా కల్వకుంట్ల కేసీఆరయ్య!!
Published Wed, Nov 8 2023 4:58 AM | Last Updated on Wed, Nov 8 2023 4:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment