‘పూర్‌’.. పాలికలు! | An underfunded municipal administration in Telangana | Sakshi
Sakshi News home page

‘పూర్‌’.. పాలికలు!

Published Tue, Aug 13 2024 4:18 AM | Last Updated on Tue, Aug 13 2024 8:48 AM

An underfunded municipal administration in Telangana

నిధుల్లేక నీరసించిన మునిసిపల్‌ పాలన

చిన్న పనులకు సైతం నిధుల్లేక కునారిల్లుతున్న వైనం

అత్యవసర మరమ్మతులు లేవు..మౌలిక సదుపాయాల్లేవు

డ్రైనేజీల నిర్వహణ లేదు.. 

అధ్వానంగా రోడ్లు.. ప్రజల అవస్థలు

పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మునిసిపాలిటీల వరకు అదే దుస్థితి రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మీకులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మునిసిపాలిటీలు అయోమయంలో అధికారులు..కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లు

స్మార్ట్‌ రోడ్డు పనులూ సగం వరకే!
వరంగల్‌ అభివృద్ధిలో భాగంగా రూ.44.50 కోట్లతో మునిసిపల్‌ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాలా వరకు, భద్రకాళి ఆర్చి నుంచి కాపువాడ వరకు, అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట, న్యూ శాయంపేట రోడ్డు వరకు స్మార్ట్‌ రోడ్లను ప్రతిపాదించారు. వీటికి 2017 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. నాలుగు పనుల్లో మూడు పనులు 90% మేరకు పూర్తయ్యాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట నుంచి న్యూ శాయంపేట వరకు స్మార్ట్‌ సిటీ రోడ్డు పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతోనే రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి.

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. మౌలిక సదుపాయాల ముచ్చటే లేదు. చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు. కనీసం వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటి కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు, పాడైన రోడ్ల రిపేర్లకు కూడా దిక్కులేదు. కార్మీకులకు వేతనాల్లేవు. పాత బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో చేస్తున్న పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశారు. 

ఇక కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులుండగా, చైర్మన్లు, మేయర్లు కార్యాలయాలకు రావడం మానేశారు. ఇదీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మునిసిపల్‌ శాఖకు నిధులు కరువవడమే ఇందుకు కారణం. 

అన్ని పురపాలికలదీ అదే పరిస్థితి 
మునిసిపల్‌ సాధారణ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లతో పాటు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆయా మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో స్మార్ట్‌ సిటీలు వరంగల్, కరీంనగర్‌లతో పాటు పలు పెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్లలో సైతం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. 

కాగా కరీంనగర్‌ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండగా.. ఆగస్టు 15వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్‌ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ కరీంనగర్‌ శాఖ హెచ్చరించింది. మరోవైపు బకాయిలు చెల్లించని కారణంగా రూ.2.46 కోట్లతో చేపట్టాల్సిన వనమహోత్సవానికి సంబంధించిన టెండర్, రూ.2 కోట్ల సాధారణ నిధులతో చేపట్టాల్సిన ఇతర పనుల టెండర్లను ఇక్కడి కాంట్రాక్టర్లు బహిష్కరించారు.  

ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మునిసిపాలిటీలు.. మునిసిపల్‌ పరిపాలన డైరెక్టర్‌ (సీడీఎంఏ) పరిధిలో ఉండగా, కేవలం మునిసిపాలిటీలకు సంబంధించి గత నెలాఖరు నాటికి ఆర్థిక శాఖలో రూ.508.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.345 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రావలసిన నిధులు కావడం గమనార్హం. 

ఒక్కో నెలకు రూ.115 కోట్ల చొప్పున కమిషన్‌ ద్వారా రావలసిన నిధులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 122 మునిసిపాలిటీలకు రావలసిన రెండో వాయిదా నిధులు రూ.60.65 కోట్లు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, జీపీఎఫ్, ఎలక్రి్టసిటీ, ఎడ్యుకేషన్, ఔట్‌సోర్సింగ్‌ బిల్లులతో పాటు ఈఈఎస్‌ఎల్‌ (విద్యుత్‌ సంబంధిత) పద్దు కింద 49 మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులు కూడా రూ.కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది. 

ఇవి కాకుండా పట్టణ ప్రగతి కింద వైకుంఠధామాల నిర్మాణం పనుల పెండింగ్‌ బిల్లులు రూ.19.56 కోట్లు, వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్ల బిల్లులు రూ.34.37 కోట్లు, కంటోన్మెంట్‌ బోర్డు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీకి సంబంధించి రూ 34.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్‌ ప్లాన్, జనరల్‌ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.180 కోట్లు కూడా నిలిచిపోయాయి. 

ఇక రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా గత రెండేళ్ల నుంచి సుమారు రూ.400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. వీటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.800 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.  

వేతనాలు చెల్లించని మునిసిపాలిటీలు 
ప్రభుత్వం నుంచి నిధులు రాక, సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని ముసినిపాలిటీలు చివరకు కార్మీకుల వేతనాలు సైతం చెల్లించడం లేదు. డోర్నకల్‌ మునిసిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలలకు సంబంధించి కార్మీకులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.20.43 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు రూ.68 లక్షలు పేరుకుపోయాయి. 

కామారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి గత మే నెల బాపతు రూ.3.48 లక్షలు కార్మీకులకు చెల్లించాల్సి ఉండగా, జూన్‌ నెల వేతనాలు సుమారు రూ.21 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆత్మకూర్, నందికొండ, చండూర్, నర్సంపేట, మెట్‌పల్లి, సత్తుపల్లి, వైరా, పాల్వంచ, మణుగూరు, ఆదిలాబాద్‌ మునిసిపాలిటీల్లో కూడా కార్మీకులకు వేతనాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.2.60 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత బకాయిల కింద ప్రభుత్వం ఎగ్గొడుతుందేమోనని కార్మీకులు ఆందోళన చెందుతున్నారు. 

గ్రేటర్‌కూ నిధుల షార్టేజీ 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొత్త పనులకు నిధుల్లేవు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మూసీ, మెట్రో రైలు, వాటర్‌ బోర్డు తదితరాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినా అందులో జీహెచ్‌ఎంసీకి దక్కేది రూ.3,065 కోట్లే. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్ల మేర బకాయిలున్నాయి. దీంతో వారు కొత్త పనులకు ముందుకు రావటం లేదు. ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా నిబంధనలు అనుమతించేలా లేవు. 

కేంద్రం నుండి ఇప్పటికే నాలాల అభివృద్ధి (ఎస్‌ఎన్‌డీపీ కింద) కోసం రావాల్సిన సుమారు రూ.500 కోట్ల నిధులపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. దీంతో వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సిన నాలాల విస్తరణ, డీసిలి్టంగ్‌ పనులు పూర్తవలేదు. వానాకాలంలో ప్రారంభించాల్సిన మొక్కల పెంపకానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నిధులు వస్తేనే కొన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

పరిస్థితి అధ్వానంగా ఉంది 
గత పాలకులు ప్రణాళిక లేకుండా మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాత పనుల బిల్లులు రావనే భయంతో సొంత డబ్బులు ఖర్చు చేసి కొందరు కాంట్రాక్టర్లు కొత్త పనులు చేశారు. కానీ బిల్లులు మాత్రం రాలేదు. ట్రెజరీలను ఫ్రీజ్‌ చేశారు. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక, పనులు సాగక పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. 
– వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్‌ కౌన్సిల్స్‌ చైర్మన్‌  

కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి  
రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు రావలసి ఉంది. అవి వెంటనే విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి.  
– భూక్యా రాము నాయక్, మునిసిపల్‌ కౌన్సిల్‌ ఫోరం చైర్మన్‌ 

మధ్యలో ఆగిన ‘సీఎం హామీ’రోడ్డు 
కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కోతిరాంపూర్‌ నుంచి కట్టరాంపూర్‌ వరకు (1.2 కిలోమీటర్లు) రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో అధునాతన రోడ్డు, డ్రైనేజీ, వాటర్‌ పైప్‌లైన్‌ పనులను గత ఏడాది శంకుస్థాపన చేశారు. కొత్త రోడ్డు కోసం ఉన్న పాత రోడ్డును తవ్వారు. కొత్త రోడ్డు నిర్మాణం దాదాపు 35 శాతం పూర్తి చేశారు. గత డిసెంబర్‌లో అకస్మాత్తుగా కాంట్రాకర్‌ పని నిలిపివేశారు. దీంతో 8 నెలలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధ్యలో కల్వర్టులు, డ్రైనేజీలు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లు రాకపోవడంతోనే కాంట్రాక్టర్‌ పనులు ఆపేశాడని అధికారులు చెబుతున్నారు. 

రూ.100 కోట్లు మంజూరుతోనే సరి 
నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం రెండేళ్ల క్రితం తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు కాలనీల్లో రోడ్ల మరమ్మతు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు రూ.2.30 కోట్ల పనులు చేయగా, వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దంటూ వెళ్లిపోయారు. గతంలో విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత సర్కారు నిలిపివేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement