అది 1997. అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో మాకినాక్ కౌంటీ. ఓ డ్రైనేజ్ కాలువలో నవజాత శిశువు మృతదేహం దొరికింది. పోలీసులు ఎంత విచారించినా ఆ చిన్నారిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో కనిపెట్టలేకపోయారు. తనకు ‘బేబీ గార్నెట్’గా నామకరణం చేసి స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ పుణ్యమా అని ఏకంగా పాతికేళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. ఓ యువతి సరదాగా చేసుకున్న డీఎన్‌ఏ టెస్ట్ ఈ కేసులో ఆమె అమ్మమ్మను జైలుపాలు చేసింది.
క్రిస్మస్ సందర్భంగా డీఎన్‌ఏ కిట్లు కానుకగా ఇవ్వడం అమెరికాలో ఆనవాయితీ. అలా మిషిగాన్‌లోని న్యూబెర్రీలో పూల దుకాణంలో పనిచేసే జెన్నా గెర్వాటోవ్‌స్కీకి డీఎన్‌ఏ కిట్ అందింది. ఆమె సరదాకు టెస్ట్ చేసుకుని అక్కడితో మరిచిపోయింది. అయితే, ‘బేబీ గార్నెట్’ కేసు గురించి విన్నారా?’ అంటూ 2022లో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అవునని చెప్పింది జెన్నా. తన డీఎన్‌ఏ బేబీ గార్నెట్ డీఎన్‌ఏతో సరిపోయిందని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయింది.
1997లో చనిపోయిన శిశువుకు, తనకు సంబంధమేమిటో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాక తల్లి కారాకు చెబితే స్పామ్ కాల్ అయి ఉంటుందని కొట్టిపారేసింది. కానీ వారం తరువాత షాప్‌లో ఉండగా అర్జెంటుగా ఇంటికి రమ్మంటూ తల్లి ఫోన్ చేసింది. వెళ్లి చూస్తే ఇంట్లో పోలీసులున్నారు. బేబీ గార్నెట్ తనకు పిన్ని అవుతుందని వారు చెప్పడంతో జెన్నా ఆశ్చర్యపోయింది.
పోలీసులు తల్లితో మాట్లాడి ఆమెనూ డీఎన్‌ఏనూ పరీక్షలకు ఒప్పించారు. కారాకు బేబీ గార్నెట్ స్వయానా సోదరి అని తేలింది. కారాను లోతుగా ప్రశ్నించగా తన తర్వాత తల్లి నాన్సీకి ఓ పాప పుట్టిందని, ఊపిరాడక మరణించిందని చెప్పింది. కానీ ఆ పాపను పుట్టగానే సంచిలో పెట్టి పడేశారన్నది పోలీసుల వాదన. నాన్సీపై నవజాత శిశువు హత్యాభియోగం మోపారు. రుజువైతే ఆమెకు జీవిత ఖైదు పడవచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment