సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్‌ఎస్(BNS) 101 సెక్షన్ పెట్టారు.
క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటితో మాధవి డీఎన్‌ఏ మ్యాచింగ్ కోసమే ఫోరెన్సిక్ పరీక్షలకు పోలీసులు నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్‌ఏ నివేదిక చేరనుంది. డీఎన్‌ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.
ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.
కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. డీఎన్‌ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment