ఎంత ప్రొఫెషనల్ నేరగాడైనా నేరానికి సంబంధించి ఏదో ఒక క్లూ వదులుతాడంటారు. అది నిజమేనని మరోసారి నిరూపించిన ఉదంతమిది. అప్పుడెప్పుడో 1984లో జరిగిన ఓ హత్య మిస్టరీని 2014లో చేధించారు. హంతకుడు తాగి పడేసిన సిగరెట్ పీకే అతని పీకకు చుట్టుకుంది. అత్యాధునికమైన డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ మనవాన్ని
పట్టించింది. 2021లో అతనికి శిక్ష పడింది.
బ్రిటన్‌లో గ్లాస్గోకు చెందిన 58 ఏళ్ల మేరీ మెక్ లాఫ్లిన్‌కు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొత్తం 11 మంది పిల్లలున్నారు. వారు వేర్వేరు నగరాల్లో ఉంటడంతో ఒక్కతే ఉంటోంది. కొడుకు మార్టిన్ కలెన్ (24) వారానికోసారి తల్లిదగ్గరకు వచ్చేవాడు. 1984 అక్టోబర్ 2న తల్లిని చూసేందుకు వచ్చినప్పుడు ఫ్లాట్ నుంచి భయంకరమైన వాసన వచ్చింది. లోపల మేరీ శవమై, మంచం మీద పడుంది. ఐదు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోస్టుమార్టంలో తేలింది. సెప్టెంబర్ 26న ఆమె పబ్‌లో గడిపిందని, తర్వాత నడుచుకుంటూ ఇంటికెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
దారిలో ఆగి సిగరెట్ కొనుక్కుందని కూడా చెప్పారు. బూట్లు చేతబట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించడం చూసినట్టు ఓ ట్యాక్సీ డ్రైవర్ వాంగ్మూలమిచ్చాడు. అయినా కేసు ఎటూ తేలలేదు. ఒకానొక దశలో ఆమె పిల్లలపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏడాది దర్యాప్తు తర్వాత కేసును మూసేశారు. తర్వాత మరో నాలుగుసార్లు దర్యాప్తు చేసినా లాభం లేకపోయింది. 30 ఏళ్ల తరువాత 2014లో ఈ హత్యకు సంబంధించిన సాక్షాధారాలను మరోసారి సమీక్షించాల్సిందిగా స్కాటిష్ క్రైమ్ క్యాంపస్‌లో పనిచేస్తున్న జోవాన్ కోక్రాన్‌ను మేరీ కుమార్తె గినా మెక్ గావిన్ అడిగారు.
1984ల్లో డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ గురించి అంతగా తెలియకపోయినా అన్ని సాక్ష్యాలనూ భద్రపరిచారు. వాటిలోని మేరీ జుట్టు, గోరు వంటివాటిని డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ చేశారు. లివింగ్ రూమ్‌లో కాఫీ టేబుల్ మీది యాష్ ట్రేలోని ఉన్న సిగరెట్ పీక కీలక క్లూగా మారింది. పీకకు అంటిన డీఎన్‌ఏ గ్రాహం మెక్ గిల్ అనే నేరస్తుని డీఎన్‌ఏతో సరిపోలింది. అతను పలు లైంగిక నేరాల కేసుల్లో తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నాడు. సరే, కేసు వీడింది కదా అనుకుంటే మరో చిక్కు వచ్చి పడింది. మేరీ హత్యకు గురైన సమయంలో మెక్ గిల్ ఖైదీగా ఉన్నట్టు రికార్డులు చూపించాయి. జైల్లో ఉంటే హత్య ఎలా చేయగలడా అని అధికారులు తల పట్టుకున్నారు.
నేషనల్ రికార్డ్స్ ఆఫ్ స్కాట్లాండ్‌లో విచారించిన మీదట చిక్కు ముడి వీడింది. మేరీ హత్య జరిగిన సమయంలో మెక్ గిల్ ఐదు రోజులు పెరోల్‌పై బయట ఉన్నట్టు తేలింది. దాంతో 2019లో మెక్‌గిల్‌ను అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారించి 2021లో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మేరీ హత్య సమయంలో మెక్‌గిల్‌కు 22 ఏళ్లు. 59 ఏళ్ల వయసులో అతనికి శిక్ష పడింది. ‘‘తల్లి హంతకుడిని జీవితకాలంలో చూస్తామనుకోలేదు. ఆశే మమ్మల్ని నడిపించింది. మొత్తానికి ఉపశమనం కలిగింది’’అని గినా అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment